కోరిక
మన నిత్య గమ్యాన్ని సాధించడానికి, ఒక నిత్యజీవిగా కావడానికి అవసరమైన లక్షణాలను మనం కోరుకుంటాము మరియు వాటికోసం పనిచేస్తాము.
నేను కోరిక యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడటానికి ఎంచుకున్నాను. మనం నిజంగా ఏమి కోరుకుంటున్నామో మరియు మన అతి ముఖ్యమైన కోరికలను ఎలా వర్గీకరిస్తున్నామో తెలుసుకోవడానికి మనలో ప్రతి ఒక్కరూ మన హృదయాలను వెదకుతారని నేను ఆశిస్తున్నాను.
కోరికలు మన ప్రాధాన్యతలను నిర్దేశిస్తాయి, ప్రాధాన్యతలు మన ఎంపికలను రూపొందిస్తాయి మరియు ఎంపికలు మన చర్యలను నిర్ణయిస్తాయి. కార్యరూపం దాల్చే మన కోరికలు మనం మారడాన్ని, మనం సాధించేదానిని మరియు మనం ఏమి కానున్నామో నిర్ణయిస్తాయి.
ముందుగా నేను కొన్ని సాధారణమైన కోరికల గురించి మాట్లాడతాను. మర్త్య జీవులుగా మనం కొన్ని ప్రాథమిక భౌతిక అవసరాలను కలిగియున్నాము. ఈ అవసరాలను తీర్చాలనే కోరికలు మన ఎంపికలను బలవంతం చేస్తాయి మరియు మన చర్యలను నిర్ణయిస్తాయి. మనం కొన్ని ముఖ్యమైనవిగా భావించే ఇతర కోరికలతో కొన్నిసార్లు ఈ కోరికలను ఎలా అధిగమిస్తామో మూడు ఉదాహరణలు చూపిస్తాయి.
మొదటిది, ఆహారము. మనకు ఆహారం కోసం ప్రాథమిక అవసరం ఉంది, కానీ కొంతకాలం ఉపవాసం ఉండాలనే బలమైన కోరిక ద్వారా ఆ కోరికను అధిగమించవచ్చు.
రెండవది, ఆశ్రయం. 12 ఏళ్ళ బాలుడిగా నేను అడవుల్లో ఒక రాత్రి గడపడానికి బాయ్ స్కౌట్ అర్హతను నెరవేర్చాలనే నా గొప్ప కోరిక కారణంగా ఆశ్రయం కొరకు నా కోరికను అడ్డుకున్నాను. సౌకర్యవంతమైన గుడారాలను విడిచిపెట్టి, ఆశ్రయం నిర్మించడానికి మరియు మేము కనుగొనగలిగే సహజ సామాగ్రి నుండి ఒక ప్రాచీన పడకను చేయడానికి ఒక మార్గాన్ని కనుగొన్న అనేక మంది అబ్బాయిలలో నేను ఒకడిని.
మూడవది, నిద్ర. ఈ ప్రాథమిక కోరిక కూడా మరింత ముఖ్యమైన కోరిక ద్వారా తాత్కాలికంగా అధిగమించబడవచ్చును. యుటా నేషనల్ గార్డ్‌లో ఒక యువ సైనికుడిగా, నేను ఒక యుద్ధ అనుభవజ్ఞుడైన అధికారి నుండి ఒక మాదిరిని నేర్చుకున్నాను.
కొరియన్ యుద్ధం ప్రారంభ నెలల్లో, రిచ్‌ఫీల్డ్ యూటా నేషనల్ గార్డ్ ఫీల్డ్ ఫిరంగిదళం క్రియాశీల సేవకు పిలవబడింది. కెప్టెన్ రే కాక్స్ చేత ఆదేశించబడే ఈ దళంలో దాదాపు 40 మంది మోర్మన్ పురుషులు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రత్యేకించబడిన వారిచే అదనపు శిక్షణ పొంది, బలోపేతం చేయబడిన తరువాత, వారు కొరియాకు పంపబడ్డారు, అక్కడ వారు ఆ యుద్ధం యొక్క అత్యంత తీవ్రమైన పోరాటాన్ని అనుభవించారు. ఒక యుద్ధంలో వారు వందలాది శత్రు కాల్బలము యొక్క ప్రత్యక్ష దాడిని తిప్పికొట్టవలసి వచ్చింది, ఇతర క్షేత్ర ఫిరంగిదళాన్ని జయించి, నాశనం చేసిన దాడి అది.
నిద్ర కోసం కోరికను అధిగమించడానికి దీనికి గల సంబంధం ఏమిటి? ఒక క్లిష్టమైన రాత్రి సమయంలో, శత్రు కాల్బలము ముందు వరుసల గుండా మరియు ఫిరంగిదళాలు ఆక్రమించిన వెనుక ప్రాంతాలలోకి ప్రవేశించినప్పుడు, కెప్టెన్ యుద్ధభూమి టెలిఫోన్ లైన్లను తన గుడారంలోకి వేయించుకొని, రాత్రంతా ప్రతి గంట గంటకు అతనికి వ్యక్తిగతంగా ఫోన్ చేయమని అతని అనేకమంది సరిహద్దు కాపలాదారులను ఆదేశించాడు. ఇది కాపలాదారులను మేల్కొని ఉంచుతుంది, కానీ కెప్టెన్ కాక్స్ నిద్రకు అనేక ఆటంకాలు కలిగాయని కూడా దీని అర్థం. “నీవు దానిని ఎలా చేయగలిగావు?” అని నేను అతనిని అడిగాను. అతని జవాబు కోరికను అధిగమించే శక్తిని చూపుతుంది.
“మేము ఒకవేళ ఇంటికి తిరిగివస్తే, మా చిన్న పట్టణ వీధుల్లో ఉన్న ఆ అబ్బాయిల తల్లిదండ్రులను నేను కలుస్తానని నాకు తెలుసు, మరియు నేను అతని కమాండర్‌గా పనిచేయడంలో విఫలమవ్వడం వలన వారి కుమారుడు ఇంటికి రాకపోతే నేను వారిలో ఎవ్వరినీ ఎదుర్కోవాలనుకోవడం లేదు.”1
ప్రాధాన్యతలు మరియు చర్యల పై అధిగమించే కోరిక యొక్క శక్తికి ఎటువంటి మాదిరి! తల్లిదండ్రులు, సంఘ నాయకులు మరియు ఉపాధ్యాయులు—ఇతరుల శ్రేయస్సు కోసం బాధ్యత వహించే మనందరికీ ఎంత శక్తివంతమైన ఉదాహరణ!
ఆ దృష్టాంతానికి ముగింపుగా, తన దాదాపు నిద్రలేని రాత్రి తరువాత ఉదయాన్నే, కెప్టెన్ కాక్స్ తన మనుషులను శత్రు కాల్బలముపై ఎదురుదాడికి నడిపించాడు. వారు 800 మందికి పైగా ఖైదీలను పట్టుకున్నారు మరియు ఇద్దరు మాత్రమే గాయపడ్డారు. ధైర్యం కొరకు కాక్స్ పతకమివ్వబడ్డాడు, మరియు దాని అసాధారణమైన వీరత్వం కొరకు అతని ఫిరంగిదళం ప్రెసిడెన్షియల్ యూనిట్ సైటేషన్ అవార్డును పొందింది. హీలమన్ యొక్క యౌవన యోధులు వలె ( ఆల్మా 57:25–26 చూడుము), వారందరు ఇంటికి చేరుకున్నారు.2
మోర్మన్ గ్రంథము కోరిక యొక్క ప్రాముఖ్యతపై అనేక బోధనలను కలిగి ఉంది.
ప్రభువుతో అనేక గంటలు వేడుకున్న తర్వాత, అతడి పాపములు క్షమించబడ్డాయని ఈనస్‌కు చెప్పబడెను. అతడు తరువాత “[తన] సహోదరులైన నీఫైయుల క్షేమము నిమిత్తము కోరిక కలిగియుండుట మొదలుపెట్టెను” (ఈనస్ 1:9). అతడు ఇలా వ్రాసెను, “నేను పూర్ణ శ్రద్ధతో ప్రార్థించి శ్రమపడిన తరువాత, ప్రభువు నాతో చెప్పెను: నీ విశ్వాసమును బట్టి నేను నీ కోరికల ప్రకారము నీకు దయచేయుదును” (వచనము 12). వాగ్దానం చేయబడిన ఆశీర్వాదానికి ముందు ఉన్న మూడు ముఖ్యమైన అంశాలను గమనించండి: కోరిక, శ్రమ మరియు విశ్వాసం.
విశ్వాసమును గూర్చిన తన ప్రసంగములో, మనము “ఈ కోరికను [మన]లో పనిచేయనిచ్చినట్లైతే” “విశ్వసించుటకుఆశించుట తప్ప మరేమియు చేయనియెడల” (ఆల్మా 32:27) విశ్వాసము మొదలు కాగలదని ఆల్మా బోధిస్తున్నాడు.
కోరికపై మరొక గొప్ప బోధన, ప్రత్యేకించి మన అంతిమ కోరిక ఏమై ఉండాలనే దాని గురించి, లేమనీయుల రాజు సువార్తికుడైన అహరోను ద్వారా బోధించబడిన అనుభవంలో సంభవిస్తుంది. అహరోను బోధన అతని ఆసక్తిని ఆకర్షించినప్పుడు, రాజు ఇలా అడిగాడు, “నేను దేవుని ద్వారా జన్మించుటకు” మరియు “ఈ నిత్యజీవమును నేను పొందుటకు నేనేమి చేయవలెను?” (ఆల్మా 22:15). అహరోను ఇలా సమాధానమిచ్చాడు, “నీవు ఈ విషయమును కోరి, … నీ పాపములన్నిటి విషయమై నీవు పశ్చాత్తాపము పొంది, దేవుని యెదుట వంగి నమస్కరించి, నీవు పొందుదువని నమ్ముచూ విశ్వాసముతో ఆయన నామమున ప్రార్థన చేసిన యెడల, అప్పుడు నీవు కోరిన నిరీక్షణను నీవు పొందుదువు” (వచనము 16).
రాజు అలా చేసి, బలమైన ప్రార్థనలో ఇలా ప్రకటించాడు,“అంత్యదినమున రక్షింపబడునట్లు … నిన్ను తెలుసుకొనుటకు నేను నా పాపములన్నిటినీ వదిలివేసెదను” (వచనము 18). ఆ నిబద్ధత మరియు అతని అంతిమ కోరిక యొక్క గుర్తింపుతో, అతని ప్రార్థన అద్భుతంగా సమాధానం ఇవ్వబడింది.
ప్రవక్తయైన ఆల్మా ప్రజలందరికి పశ్చాత్తాపం ప్రకటించాలనే గొప్ప కోరికను కలిగి ఉన్నాడు, కానీ దీనికి అవసరమైన బలవంతపు శక్తిని తాను కోరుకోకూడదని అతడు అర్థం చేసుకోగలిగాడు, ఎందుకంటే అతడు ఈవిధంగా ముగించాడు, “మరణమునకు లేదా జీవమునకు వారి కోరికను బట్టి ఆయన మనుష్యులకు అనుగ్రహించునని నేను ఎరుగుదును” (ఆల్మా 29:4). అదేవిధంగా, ఆధునిక బయల్పాటులో ప్రభువు “మనుష్యులందరికి వారి క్రియలను బట్టి, వారి హృదయ వాంఛలను బట్టి తీర్పుతీర్చును” అని ఆయన ప్రకటించెను (సి మరియు ని 137:9).
మన నిత్య న్యాయమూర్తి మనం నిజంగా కోరుకునే దానికి ఈ అపారమైన ప్రాముఖ్యతను జోడించడానికి మనము నిజంగా సిద్ధంగా ఉన్నామా?
అనేక లేఖనాలు మనం అపేక్షించే వాటి ద్వారా మనం కోరుకునే వాటి గురించి మాట్లాడుతాయి. “త్వరగా నన్ను వెదకువాడు నన్ను కనుగొనును మరియు వాడు విడువబడడు” (సి మరియు ని 88:83). “శ్రేష్టమైన బహుమానములను ఆసక్తితో వెదకుడి” (సి మరియు ని 46:8). “శ్రద్ధగా వెదకు వాడు కనుగొనును” (1 నీఫై 10:19). “నా యొద్దకు రండి నేను మీ యొద్దకు వచ్చెదను; శ్రద్ధతో నన్ను వెదకుడి, మీరు నన్ను కనుగొందురు; అడుగుడి, మీకు ఇవ్వబడును; తట్టుడి, మరియు మీకది తెరువబడును” (సి మరియు ని 88:63).
శాశ్వతమైన విషయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడానికి మన కోరికలను తిరిగి సర్దుబాటు చేయడం అంత సులభం కాదు. మనమందరం ఆస్తి, ప్రాముఖ్యత, అహంకారం, మరియు అధికారం యొక్క ప్రాపంచిక చతుష్టయాన్ని కోరుకునేందుకు శోధించబడ్డాము. మనము వీటిని కోరుకోవచ్చు, కానీ మనము వాటిని మన అత్యధిక ప్రాధాన్యతలుగా నిర్ణయించరాదు.
ఆస్తులను సంపాదించాలనే అత్యున్నత కోరిక ఉన్నవారు భౌతికవాదం ఉచ్చులో పడతారు. “ధనమును లేదా ఈ లోకము యొక్క వ్యర్ధమైన విషయములను కోరకుము” (ఆల్మా 39:14; జేకబ్ 2:18 కూడా చూడండి), అనే హెచ్చరికను లక్ష్యముంచుటకు వారు విఫలమయ్యారు.
ప్రాముఖ్యత లేదా అధికారాన్ని కోరుకునే వారు వీరుడైన కెప్టెన్ మొరోనై యొక్క మాదిరిని అనుసరించాలి, అతడి సేవ “అధికారము” లేదా “లోకము యొక్క గౌరవము” కోసం కాదు (ఆల్మా 60:36).
మనం కోరికలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి? ఆరోన్ రాల్‌స్టన్‌ను3 ప్రేరేపించిన విషమస్థితి కొందరికే ఉంటుంది, కానీ అతని అనుభవం కోరికలను అభివృద్ధి చేయడం గురించి విలువైన పాఠాన్ని అందిస్తుంది. రాల్‌స్టన్ దక్షిణ యూటాలోని మారుమూల లోయలో పాదయాత్ర చేస్తున్నప్పుడు, 800 పౌండ్ల (360 కిలోల) రాయి అకస్మాత్తుగా స్థానభ్రంశం చెందడం వలన అతని కుడి చేయి దానిలో చిక్కుకుంది. ఐదు ఒంటరి దినాలు తనను తాను విడిపించుకోవడానికి అతడు కష్టపడ్డాడు. అతడు తన ప్రయత్నాన్ని విడిచిపెట్టి, మరణాన్ని అంగీకరించబోతున్నప్పుడు, మూడేళ్ల బాలుడు తన వైపుకు పరుగెత్తుకు వచ్చి అతని ఎడమ చేతితో తీయబడినట్లు ఒక దర్శనం అతనికి కలిగింది. దీనిని తనకు పుట్టబోయే కుమారుని యొక్క దర్శనంగా మరియు అతను ఇంకా జీవించగలడనే భరోసాగా అర్థం చేసుకున్న రాల్‌స్టన్ ధైర్యం తెచ్చుకున్నాడు మరియు అతని బలం అయిపోకముందే తన ప్రాణమును కాపాడుకోవడానికి కఠినమైన చర్య తీసుకున్నాడు. చిక్కుకున్న తన కుడి చేతిలో రెండు ఎముకలను అతను విరిచాడు మరియు ఆ చేతిని నరికివేయడానికి తన చేతిలోని కత్తిని ఉపయోగించాడు. తరువాత అతడు సహాయం కోసం ఐదు మైళ్ళు (8 కి.మీ.) నడవడానికి బలాన్ని కూడగట్టుకున్నాడు.4 తీవ్రమైన కోరిక యొక్క శక్తికి ఎటువంటి మాదిరి! మనం ఏమి కాగలము అనే ఒక దృష్టి కలిగి ఉన్నప్పుడు, మన కోరిక మరియు అమలు చేసే మన శక్తి అపరిమితంగా పెరుగుతుంది.
మనలో చాలా మంది అటువంటి తీవ్రమైన విషమస్థితిని ఎన్నటికీ ఎదుర్కొనరు, కానీ మన శాశ్వతమైన గమ్యం వైపు పురోగతిని నిరోధించే సాధ్యమైన ఉచ్చులను మనమందరం ఎదుర్కొంటాము. మన నీతివంతమైన కోరికలు తగినంతగా తీవ్రంగా ఉంటే, అవి మన శాశ్వత పురోగతిని నిరోధించే వ్యసనాలు, ఇతర పాపకరమైన ఒత్తిళ్ళు మరియు ప్రాధాన్యతల నుండి మనల్ని మనం వేరుపరచుకొని, మలచుకొనేటట్లు చేస్తాయి.
నీతివంతమైన కోరికలు అల్పమైనవిగా, హఠాత్తుగా లేదా తాత్కాలికంగా ఉండవని మనం గుర్తుంచుకోవాలి. అవి హృదయపూర్వకంగా, స్థిరంగా, శాశ్వతంగా ఉండాలి. చాలా ప్రేరేపించబడి, ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ వివరించిన ఆ పరిస్థితి కోసం మనము అపేక్షిస్తాము, అక్కడ మనం “[మన జీవితపు] కీడులను అధిగమించి, పాపం పట్ల ప్రతి కోరికను కోల్పోయాము.”5 అది చాలా వ్యక్తిగత నిర్ణయం. ఎల్డర్ నీల్ ఎ. మేక్స్‌వెల్ చెప్పినట్లుగా:
“ప్రజలు ‘పాపం పట్ల తమ కోరికను కోల్పోయినట్లుగా’ వర్ణించబడినప్పుడు, వారు మరియు వారు మాత్రమే, దేవునిని తెలుసుకోవడానికి బదులుగా ‘వారి [సమస్త] పాపాలను విడిచిపెట్టడానికి’ సిద్ధంగా ఉండటం ద్వారా ఆ తప్పు కోరికలను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.”
“అందువలన కాలక్రమేణా మనం పట్టువిడువక కోరుకునేది, చివరికిమనం ఏమి అవుతాము మరియు నిత్యత్వములో మనం ఏమి పొందుతామనేది.”6
పాపం పట్ల ప్రతి కోరికను కోల్పోవడం ఎంత ముఖ్యమో, నిత్యజీవానికి మరింత ఎక్కువ అవసరం. మన నిత్య గమ్యాన్ని సాధించడానికి, ఒక నిత్య జీవిగా కావడానికి అవసరమైన లక్షణాలను మనం కోరుకుంటాము మరియు వాటికోసం పనిచేస్తాము. ఉదాహరణకు, నిత్య జీవులు తమకు అన్యాయం చేసిన వారందరినీ క్షమిస్తారు. వారు తమ స్వంత శ్రేయస్సు కంటే ఇతరుల శ్రేయస్సు గూర్చి ఎక్కువ చింతను కలిగియుంటారు. మరియు వారు దేవుని పిల్లలందరినీ ప్రేమిస్తారు. ఇది చాలా కష్టంగా అనిపిస్తే—మరియు అది ఖచ్చితంగా మనలో ఎవరికీ సులభం కాదు—అప్పుడు మనం అలాంటి లక్షణాల కొరకు ఒక కోరికతో ప్రారంభించాలి మరియు మన భావాలతో సహాయం కోసం మన ప్రేమగల పరలోక తండ్రిని ప్రార్థించాలి. మనం “ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులైన వారందరి పైన ఆయన ఉంచినఈ ప్రేమతో [మనం] నింపబడవలెనని హృదయము యొక్క సమస్త శక్తితో తండ్రికి ప్రార్థన చేయుడి” అని మోర్మన్ గ్రంథము మనకు బోధిస్తుంది (మొరోనై 7:48).
ప్రస్తుతం వివాహం చేసుకున్న మరియు ఒంటరిగా ఉన్న స్త్రీ పురుషులందరికీ ప్రధానమైన ఒక కోరిక యొక్క చివరి మాదిరితో నేను ముగిస్తాను. నిత్యత్వం కోసం వివాహాన్ని కాపాడాలని అందరూ కోరుకోవాలి మరియు తీవ్రంగా పని చేయాలి. ఇప్పటికే దేవాలయ వివాహం చేసుకున్న వారు దానిని కాపాడుకోవడానికి వారి శాయశక్తులా కృషి చేయాలి. ఒంటరిగా ఉన్నవారు ఒక దేవాలయ వివాహాన్ని కోరుకోవాలి మరియు దానిని పొందడానికి ప్రాధాన్యతగల ప్రయత్నాలు చేయాలి. యువత మరియు ఒంటరిగా యువజనులు వివాహం చేసుకోవడం మరియు పిల్లలను కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతను అగౌరవపరిచే రాజకీయంగా సరైనదే కానీ నిత్యత్వములో తప్పుడు భావనను ప్రతిఘటించాలి.7
ఒంటరి పురుషులారా, దయచేసి ఒక ఒంటరి సహోదరి రాసిన ఈ లేఖలోని సవాలును పరిగణించండి. “ఒక యోగ్యతగల సహవాసి కోసం నిజాయితీగా వెతుకుతున్న దేవుని నీతివంతులై కుమార్తెల కోసం ఆమె వేడుకుంది, అయినప్పటికీ, పురుషులు మన పరలోకపు తండ్రి యొక్క ఈ అద్భుతమైన, ఎన్నుకోబడిన కుమార్తెలను వెదకి, వివాహమాడే ఉద్దేశ్యమును వారికి తెలిపి, ప్రభువు గృహములో పవిత్ర నిబంధనలను చేయడానికి మరియు పాటించడానికి సిద్ధంగా ఉండుట వారి బాధ్యతా కాదా అవునా అనే విషయంలోవారు గ్రుడ్డివారిగా మరియు గందరగోళంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది.” ఆమె ఇలా ముగించింది, “ఇక్కడ చాలా మంది ఒంటరి కడవరి దిన పురుషులు బయటకు వెళ్ళి, డేట్ చేయడం మరియు కలిసి తిరగటాన్ని సంతోషిస్తారు, కానీ ఒక స్త్రీకు ఎలాంటి నిబద్ధత చేయాలనే కోరికను పూర్తిగా కలిగిలేరు.”8
కొంతమంది యువతులు తమ జీవనోపాధిమార్గం లేదా ఇతర మర్త్య వ్యత్యాసాల కొరకు వారికున్న కోరికల కంటే విలువైన వివాహం మరియు పిల్లలు చాలా తక్కువ ప్రాధాన్యతను కలిగి ఉన్నారని నేను చెప్పాలని ఆత్రుతగా కోరే యువకులు కొందరున్నారని నా నిశ్చయము. నిత్య జీవానికి వారిని నడిపించే న్యాయమైన కోరికలు స్త్రీ పురుషులు ఇరువురికి అవసరం.
కోరికలు మన ప్రాధాన్యతలను నిర్దేశిస్తాయని ప్రాధాన్యతలు మన ఎంపికలను రూపొందిస్తాయని మరియు ఎంపికలు మన చర్యలను నిర్ణయిస్తాయని గుర్తుంచుకోండి. అదనంగా, మన చర్యలు మరియు మన కోరికలే మనం నిజమైన స్నేహితుడిగా, ప్రతిభావంతులైన ఉపాధ్యాయుడిగా, లేదా నిత్య జీవానికి అర్హత సాధించిన వ్యక్తిగా మారడానికి కారణమవుతాయి.
యేసు క్రీస్తు గురించి నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ప్రేమ, ఆయన బోధనలు, మరియు ఆయన ప్రాయశ్చిత్తం అన్నింటిని సాధ్యము చేసెను. అన్నింటి కంటే ముఖ్యంగా మనం ఆయనవలె మారాలనే కోరిక కలిగియుండాలని, తద్వారా ఒకరోజు మనం ఆయన సంతోషం యొక్క పరిపూర్ణతను పొందడానికి ఆయన సన్నిధికి తిరిగి వెళ్లగలమని నేను ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.