హృదయములు ముడివేయబడునట్లు
సాంకేతికపరంగా కూడా మీరు ఇతరులపట్ల దయ, శ్రద్ధ, కనికరంతో వ్యవహరించినప్పుడు, మీరు వడలిన చేతులను పైకెత్తి, హృదయాలను స్వస్థపరుస్తారని నేను వాగ్దానం చేస్తున్నాను.
పరిచయము
కొన్నిసార్లు చెట్టు నుండి యాపిల్ రాలడం వంటి సాధారణ సంఘటనల నుండి ప్రముఖ శాస్త్రీయ ఆవిష్కరణలు ప్రేరేపించబడడం ఎంతో మనోహరంగా ఉంటుంది కదా.
ఈ రోజు ఒక కుందేళ్ళ గుంపు మూలంగా జరిగిన శాస్త్రీయ ఆవిష్కరణ గురించి నేను చెప్తాను.
1970లలో, గుండె ఆరోగ్యంపై ఆహారం యొక్క ప్రభావాలను పరీక్షించడానికి పరిశోధకులు ఒక ప్రయోగాన్ని చేసారు. చాలా నెలలపాటు వారు తమ ఆధీనంలో ఉన్న కుందేళ్ళ గుంపుకు అధిక క్రొవ్వుగల ఆహారాన్నిచ్చి, వాటి రక్తపోటు, గుండె వేగం మరియు కొలెస్ట్రాల్‌ను పర్యవేక్షించారు.
ఆశించినట్లుగానే, కుందేళ్ళలో చాలామట్టుకు వాటి ధమనులలో క్రొవ్వు నిక్షేపాలను వృద్ధిచేసినట్లు చూపాయి. అయినా, అంతా ఇదే కాదు! ఒక తెలివైన విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. కుందేళ్ళన్నీ క్రొవ్వు నిక్షేపాలను వృద్ధిచేసినప్పటికీ, ఒక గుంపు ఆశ్చర్యకరంగా మిగతా వాటికంటే 60 శాతం తక్కువగా కలిగియుంది. వారు రెండు వేర్వేరు కుందేళ్ళ గుంపులను పరిశీలిస్తున్నట్లు అనిపించింది.
ఇటువంటి ఫలితాలు శాస్త్రజ్ఞులకు నిద్రలేకుండా చేస్తాయి. ఇది ఎలా సాధ్యం? కుందేళ్ళన్నీ న్యూజిలాండ్ నుండి వచ్చిన ఒకే జాతికి, వాస్తవంగా ఒకే వంశక్రమానికి చెందినవి. వాటిలో ప్రతిది సమాన పరిమాణంలో ఒకేరకమైన ఆహారాన్ని తీసుకున్నాయి.
దీని అర్థం ఏమైయుండవచ్చు?
ఈ ఫలితాలు అధ్యయనాన్ని పనికి రాకుండా చేస్తాయా? ప్రయోగ రచనలో తప్పులున్నాయా?
అనుకోని ఈ ఫలితాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రజ్ఞులు వృధాగా శ్రమించారా!
చివరకు, వారు పరిశోధక బృందం వైపు దృష్టిసారించారు. ఫలితాలను ప్రభావితం చేయడానికి పరిశోధకులు ఏదైనా చేయడం సాధ్యమా? వారు దీనిని అన్వేషిస్తున్నప్పుడు, కొద్దిగా క్రొవ్వు నిక్షేపాలున్న ప్రతి కుందేలు ఒకే పరిశోధకురాలి ఆధ్వర్యంలో ఉన్నట్లు కనుగొన్నారు. ఆమె ఇతరుల మాదిరిగానే తన కుందేళ్ళకు అదే ఆహారాన్నిచ్చింది. కానీ ఒక శాస్త్రజ్ఞుడు నివేదించినట్లు, “ఆమె అసాధారణమైన దయ మరియు జాగ్రత్తగల వ్యక్తి.” కుందేళ్ళకు ఆహారమిచ్చినప్పుడు, “ఆమె వాటితో మాట్లాడింది, ప్రేమగా నిమిరింది, వాటిని ఆదరించింది. … ఆమె ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ఆమె స్వభావం అలాంటిది.”1
కుందేళ్ళకు కేవలం ఆహారం పెట్టడం కంటే ఎక్కువ చేసిందామె. ఆమె వాటికి ప్రేమను అందించింది.
మొదట ఈ అసాధారణమైన తేడాకు ఇది కారణమని నమ్మబుద్ధి కాలేదు, కానీ పరిశోధకుల బృందం మరే సంభవనీయతను చూడలేకపోయింది.
కాబట్టి, వారు మళ్ళీ ప్రయోగం చేసారు—ఈసారి ప్రతి పరిణామాన్ని బలంగా నియంత్రించారు. వారు అంతిమ ఫలితాలను విశ్లేషించినప్పుడు, అదే జరిగింది! ప్రేమగల పరిశోధకురాలి ఆధ్వర్యంలో ఉన్న కుందేళ్ళు విశేషంగా ఉత్తమ ఆరోగ్య ఫలితాలు కలిగియున్నాయి.
సైన్స్ అనే ప్రముఖ పత్రికలో ఈ అధ్యయనం యొక్క ఫలితాలను శాస్త్రజ్ఞులు ప్రచురించారు.2
చాలాకాలం తర్వాత, ఈ ప్రయోగ ఫలితాలు ఇప్పటికీ వైద్యరంగంలో ప్రభావం చూపుతున్నట్లు అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో, డా. కెల్లి హార్డింగ్, The Rabbit Effect (కుందేళ్ళ ప్రభావం) అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించింది, దాని పేరు ఈ ప్రయోగం నుండి వచ్చింది. ఆమె సిద్ధాంతము: “అనారోగ్య జీవనశైలి గల ఒక కుందేలును తీసుకోండి. దానితో మాట్లాడండి. దానిని పట్టుకోండి. దానిపై ప్రేమ చూపండి. ఈ సంబంధం తేడా చూపింది. … చివరకు,” “అత్యంత అర్థవంతమైన విధానాలలో మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేది, మనం ఒకరినొకరం ఎలా ఆదరిస్తాము, మనం ఎలా జీవిస్తాము, మనిషిగా ఉండడమంటే అర్థమేమిటనే దాని గురించి మనమెలా ఆలోచిస్తాము అనేవాటి చేత ఎక్కువగా ప్రభావితం చేయబడుతుంది” అని ఆమె ముగిస్తుంది.3
లౌకిక ప్రపంచంలో, సువార్త సత్యాలు మరియు విజ్ఞానశాస్త్రం ఒకేరకమైన సమాచారాన్ని అందిస్తాయని చూపే భావనలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అయినప్పటికీ, క్రైస్తవులుగా—యేసు క్రీస్తు అనుచరులు, కడవరి-దిన పరిశుద్ధులు—ఇటువంటి ఫలితాలు చూడాలని ఆశిస్తారు మరియు వాటిని చూసి ఆశ్చర్యపడరు. నాకైతే, ఇది ఒక ప్రాథమిక, స్వస్థపరచు సువార్త సూత్రంగా దయ యొక్క పునాదిలో మరొక ఇటుకను వేస్తుంది—ఇది హృదయాలను మానసికంగా, ఆత్మీయంగా మరియు ఇక్కడ ప్రదర్శించినట్లుగా, శారీరకంగా కూడా స్వస్థపరచగలదు.
హృదయములు ముడివేయబడునట్లు
“బోధకుడా, ధర్మ శాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది” అని అడగబడినప్పుడు “నీ పూర్ణహృదయముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెను” అని రక్షకుడు జవాబిచ్చిన తరువాత “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” అని ఆయన జవాబిచ్చెను.4 రక్షకుని జవాబు మన పరలోక కర్తవ్యాన్ని బలపరుస్తుంది. “ఒకనితో మరొకనికి ఎట్టి వివాదములు ఉండరాదనియు, ఒకరి యెడల ఒకరు ఐక్యతయందును, ప్రేమయందును (మన) హృదయములు ముడివేయబడునట్లు … (మనము) ముందుకు చూడవలెననియు”5 ప్రాచీన ప్రవక్తలు ఆజ్ఞాపించారు. లేఖనపరంగా, “శక్తి లేదా ప్రభావము … మృదుత్వముతో, సాత్వీకముతో, … దయతో, … మోసము లేకుండా అమలుపరచబడాలి”6 అని మనం బోధించబడ్డాము.
కడవరి-దిన పరిశుద్ధులు: వయోజనులు, యువత మరియు పిల్లలందరికీ ఈ సూత్రము ప్రధానంగా అన్వయిస్తుందని నేను నమ్ముతున్నాను.
దానిని మనస్సులో ఉంచుకొని, ప్రాథమిక-వయస్సున్న పిల్లలైన మీతో కొద్దిసేపు నేను సూటిగా మాట్లాడతాను.
దయగా ఉండడం ఎంత ముఖ్యమో మీరిప్పటికే అర్థం చేసుకున్నారు. మీ ప్రాథమిక పాటలలో ఒకటైన “I’m Trying to Be Like Jesus (యేసువలె ఉండేందుకు నేను ప్రయత్నిస్తున్నాను),” అనేదాని పల్లవి ఇలా బోధిస్తుంది:
యేసు నిన్ను ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించండి.
మీరు చేసే వాటన్నిటిలో దయ చూపేందుకు ప్రయత్నించండి.
క్రియలో, ఆలోచనలో మృదువుగా, ప్రేమగా ఉండండి.
ఇవే యేసు బోధించిన విషయాలు.7
అయినప్పటికీ ఇంకా కొన్నిసార్లు ఇది మీకు కష్టంగా అనిపించవచ్చు. దక్షిణ కొరియా నుండి మించన్ కిమ్ అనే పేరుగల ప్రాథమిక బాలుని కథ మీకు సహాయపడవచ్చు. ఆరు సంవత్సరాల క్రితం, అతని కుటుంబం సంఘంలో చేరింది.
“ఒకరోజు పాఠశాలలో, నా సహాధ్యాయులలో కొంతమంది మరొక విద్యార్థిని మారుపేర్లతో పిలుస్తూ ఎగతాళి చేస్తున్నారు. అది సరదాగా అనిపించి, కొన్ని వారాలు నేను కూడా వాళ్ళతో చేరాను.
“అతను పట్టించుకోనట్లు నటించినప్పటికీ మా మాటల చేత అతను బాధింపబడి, ప్రతి రాత్రి ఏడ్చాడని అనేక వారాల తర్వాత ఆ అబ్బాయి నాతో చెప్పాడు. అతను చెప్పినప్పుడు, నేను దాదాపుగా ఏడ్చేసాను. నేను చాలా బాధపడ్డాను, అతనికి సహాయపడాలని కోరుకున్నాను. మరుసటి రోజు నేను అతని దగ్గరకు వెళ్ళి, అతని భుజంపై చెయ్యి వేసి, ‘నేను నిన్ను ఎగతాళి చేసినందుకు నిజంగా బాధపడుతున్నాను’ అని చెప్తూ, క్షమాపణ అడిగాను. అతడు నా క్షమాపణను అంగీకరించాడు, అతని కళ్ళు కన్నీళ్ళతో నిండాయి.
“కానీ, వేరే పిల్లలు ఇంకా అతన్ని ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు, సరైన దానిని ఎంచుకోండని ప్రాథమిక తరగతిలో నేను నేర్చుకున్నదానిని నేను గుర్తు చేసుకున్నాను. కాబట్టి, ఆపమని నా సహాధ్యాయులను నేను అడిగాను. వారిలో చాలామంది మారకూడదని నిర్ణయించుకున్నారు, వారు నాపై కోపంతో ఉన్నారు. కానీ, వారిలో ఒక అబ్బాయి క్షమించమని అడిగాడు మరియు మేము ముగ్గురం మంచి స్నేహితులయ్యాము.
“కొద్దిమంది ఇంకా అతన్ని ఎగతాళి చేసినప్పటికీ, మేము అతనితో ఉన్నందుకు అతడు మంచిగా భావించాడు.
“అవసరంలో ఉన్న స్నేహితుడికి సహాయపడడం ద్వారా నేను సరైన దానిని ఎంచుకున్నాను.”8
యేసువలె మారడానికి ప్రయత్నించేందుకు ఇది మీకొక మంచి మాదిరి కాదా?
ఇప్పుడు, యువతీ యువకుల కొరకు, మీరు పెద్దవుతున్నప్పుడు ఇతరులను ఎగతాళి చేయడం చాలా ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఆందోళన, నిరాశ, చెడు అనేవి తరచు వేధింపుల వల్ల కలిగే ఫలితాలు. “వేధింపు అనేది క్రొత్త విషయం కానప్పటికీ, సామాజిక మాధ్యమం మరియు సాంకేతికత దానిని మరింతగా పెంచాయి. సైబర్ వేధింపు అనేది మరింత స్థిరంగా, నిత్యము ఉండే బెదిరింపుగా మారుతుంది.”9
స్పష్టంగా, మీ తరాన్ని బాధించడానికి అపవాది దీనిని ఉపయోగిస్తున్నాడు. మీ అంతర్జాలం, ఇరుగుపొరుగులు, పాఠశాలలు, సమూహాలు మరియు తరగతుల్లో ఏదో సరిగ్గా లేదు. ఈ ప్రదేశాలను దయగా, సురక్షితంగా చేయడానికి దయచేసి మీరు చేయగలిగినదంతా చేయండి. మీరు వీటిలో దేనినైనా నిష్క్రియాత్మకంగా గమనిస్తే లేదా పాల్గొంటే, ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ గారు గతంలో ఇచ్చిన సలహా కంటే ఉత్తమమైనది నాకు తెలియదు:
“ద్వేషించడం, చాడీలు చెప్పడం, విస్మరించడం, ఎగతాళి చేయడం, పగ పెంచుకోవడం లేదా హాని కలిగించాలనుకోవడం వంటివి వచ్చినప్పుడు, దయచేసి దీనిని వర్తింపజేయండి:
“దానిని ఆపండి!”10
దానిని మీరు విన్నారా? దానిని ఆపండి! సాంకేతికపరంగా కూడా మీరు ఇతరులపట్ల దయ, శ్రద్ధ, కనికరంతో వ్యవహరించినప్పుడు, మీరు వడలిన చేతులను పైకెత్తి, హృదయాలను స్వస్థపరుస్తారని నేను వాగ్దానం చేస్తున్నాను.
ప్రాథమిక పిల్లలు మరియు యువతతో మాట్లాడిన నేను, ఇప్పుడు సూటిగా సంఘము యొక్క వయోజనులతో మాట్లాడతాను. ఒక మాదిరిని ఏర్పరచి, దయ, చేర్చుట మరియు నాగరికతకు ఆదర్శంగా నిలిచి—మనం చెప్పేదానిలో మరియ మన ప్రవర్తనలో క్రీస్తువంటి ప్రవర్తనను యువతరానికి నిరంతరం బోధించే ప్రాథమిక బాధ్యతను మనం కలిగియున్నాము. రాజకీయాలు, సామాజిక తరగతి మరియు దాదాపుగా ప్రతి ఇతర మానవ-నిర్మిత ధర్మములో విభజన వైపు సమాజం బలంగా మార్పుచెందడాన్ని మనం చూస్తున్నప్పుడు ఇది ప్రత్యేకంగా ముఖ్యమైనది.
కడవరి-దిన పరిశుద్ధులు ఒకరిపట్ల ఒకరు మాత్రమే కాకుండా, మన చుట్టూ ఉన్న వారందరితో దయగా మెలగాలని అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ బోధించారు. ఆయన ఇలా చెప్పారు: “ఇతర మతాల వారిని పట్టించుకోకుండా, చేర్చుకోకుండా వారి మనస్సునొప్పించిన సభ్యుల గురించి అప్పుడప్పుడు నేను వింటాను. ఇది ప్రత్యేకించి మన సభ్యులు అధికసంఖ్యలో ఉన్న సమాజాల్లో సంభవించగలదు. పొరుగున ఉన్న ఒక బిడ్డతో ఆడుకోరాదని, ఎందుకంటే అతడు లేదా ఆమె కుటుంబం మన సంఘానికి చెందినది కాదని పిల్లలకు చెప్పే సంకుచిత స్వభావం గల తల్లిదండ్రుల గురించి నేను విన్నాను. ఈ విధమైన ప్రవర్తన ప్రభువైన యేసు క్రీస్తు బోధనలను అనుసరించినది కాదు. ఈ విధమైన సంఘటనలు జరిగేలా మన సంఘ సభ్యులెవరైనా ఎందుకు అనుమతిస్తారో నేను గ్రహించలేను. ఇతర మతాలకు చెందిన మన స్నేహితులు, పొరుగువారితో ప్రేమగా, దయగా, సహనంతో, కనికరంతో మెలగడం తప్ప మరేవిధంగాను ఉండమని ఈ సంఘ సభ్యులు ప్రేరేపించబడడాన్ని నేనెన్నడూ వినలేదు.”11
చేర్చుకోవడమనేది ఐక్యతకు సానుకూల సాధనమని, చేర్చుకోకపోవడం విభజనకు దారితీస్తుందని మనం బోధించాలని ప్రభువు ఆశిస్తున్నారు.
వారి జాతి ఆధారంగా దేవుని పిల్లలు ఎలా నిరాదరించబడుతున్నారో వినినప్పుడు, యేసు క్రీస్తు యొక్క అనుచరులుగా మేము దిగులుపడ్డాము. ఇటీవల నల్లజాతీయులు, ఆసియన్లు, లాటినోలు లేదా ఇతర సమూహాలపై జరిగిన దాడుల గురించి విని మేము చాలా దుఃఖించాము. దురభిమానము, జాతిపరమైన ఉద్రిక్తత లేదా హింసకు మన ప్రాంతాల్లో, సమాజాల్లో లేదా సంఘములో ఎన్నడూ స్థానము ఉండకూడదు.
మన వయస్సు ఏదైనప్పటికీ, మనలో ప్రతిఒక్కరం ఉత్తమమైనది చేయడానికి ప్రయత్నిద్దాం.
మీ శత్రువులను ప్రేమించుడి
ఇతరులపట్ల మీరు ప్రేమగా, గౌరవంగా, దయగా మెలగాలని ప్రయత్నించినప్పటికీ, ఇతరుల చెడు ఎంపికల వలన నిస్సందేహంగా మీరు బాధించబడతారు లేదా ప్రతికూలంగా ప్రభావితం చేయబడతారు. అప్పుడు మనం ఏమి చేయాలి? “మీ శత్రువులను ప్రేమించుడి … మిమ్మును బాధించు వారికొరకు ప్రార్థన చేయుడి,”12 అనే ప్రభువు బోధనను మనం అనుసరిస్తాము.
అప్పుడు, మన దారిలో ఉంచబడిన ఆపదను జయించడానికి మనకు చేతనైనదంతా చేస్తాము. ప్రభువు యొక్క బాహుబలము మన పరిస్థితులను మారుస్తుందని ఎల్లవేళలా ప్రార్థిస్తూ, అంతము వరకు సహించడానికి మనం ప్రయత్నిస్తాము. మనకు సహాయం చేయడానికి మన దారిలో ఆయన ఉంచిన వారికొరకు మనం కృతజ్ఞతలు తెలుపుతాము.
దీని గురించి ఆనాటి మన సంఘ చరిత్ర నుండి ఒక మాదిరిచేత నేను ప్రేరేపించబడ్డాను. మిస్సోరి రాష్ట్రంలో కడవరి-దిన పరిశుద్ధులు బలవంతంగా వారి ఇళ్ళనుండి వెళ్ళగొట్టబడుతున్నప్పుడు, 1838–1839 నాటి చలికాలంలో జోసెఫ్ స్మిత్ మరియు ఇతర సంఘ నాయకులు లిబర్టీ చెరసాలలో నిర్బంధించబడ్డారు. పరిశుద్ధులు నిరాధారులై, నిస్సహాయులై, చలి మరియు వనరుల లేమి చేత అధికంగా బాధపడ్డారు. ఇల్లినాయ్‌లోని క్విన్సీ నివాసులు భయంకరమైన వారి కష్టకాలాన్ని చూసి, కనికరంతో, స్నేహంతో వారిని సమీపించారు.
మిస్సిస్సిప్పి నది ప్రక్కన తాత్కాలిక గుడారాలలో ఆయన మొదటసారి పరిశుద్ధులను చూడడాన్ని క్విన్సీ నివాసియైన వాండెల్ మేస్ తరువాత గుర్తుచేసుకున్నారు: “కొంతమంది గాలి నుండి కాపాడుకోవడానికి దుప్పట్లు కప్పుకున్నారు, … పిల్లలు మంట చుట్టూ వణుకుతూ కూర్చున్నారు, కానీ గాలి దానిని ఎగురగొట్టడంతో పెద్దగా ప్రయోజనం లేకపోయింది. పాపం పరిశుద్ధులు భయంకరంగా బాధపడ్డారు.”13
పరిశుద్ధుల కష్టకాలాన్ని చూసిన క్విన్సీ నివాసులు సహాయమందించడానికి కలిసి కూడుకున్నారు, కొంతమంది తమ క్రొత్త స్నేహితులను నది దాటించడంలో కూడా సహాయపడ్డారు. మేస్ ఇలా కొనసాగించాడు: “[వారు] ఉదారంగా విరాళం ఇచ్చారు; ఏది చాలా ఉదారంగా ఉంటుందో… పంది మాంసం,… చక్కెర,… బూట్లు మరియు దుస్తులు, ప్రతీది ఈ పేదలకు చాలా అవసరం అని వ్యాపారులు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.”14 గొప్ప వ్యక్తిగత త్యాగంతో వారి ఇళ్ళకు ఆహ్వానించి, తమకున్న అతికొద్ది వనరులను పంచుకున్న క్విన్సీ నివాసుల సంఖ్యను అనతికాలంలోనే ఈ శరణార్థులు మించిపోయారు.15
కేవలం క్విన్సీ నివాసుల కనికరము, ఔదార్యము మూలంగా అనేకమంది కడవరి-దిన పరిశుద్ధులు తీక్షణమైన చలిని తట్టుకోగలిగారు. ఈ భూలోక దేవదూతులు తమ హృదయాలు, ఇళ్ళు తెరిచి, ప్రాణ- రక్షణ నిమిత్తం పోషణను, వెచ్చదనాన్ని ఇస్తూ—బహుశా అన్నిటికంటే ముఖ్యంగా—బాధపడుతున్న పరిశుద్ధులకు స్నేహ హస్తాన్ని అందించారు. క్విన్సీలో వారు ఉన్నది కొంతకాలమే అయినప్పటికీ, ప్రియమైన వారి పొరుగువారి పట్ల పరిశుద్ధులు తమ కృతజ్ఞతను ఎన్నటికీ మరువలేదు మరియు క్విన్సీ “ఆశ్రయమిచ్చు పట్టణం”గా పేరొందింది.16
క్లిష్టమైన, ప్రతికూలమైన, నీచమైన కార్యాల చేత మనకు ఆపదలు, శ్రమలు కలిగినప్పుడు, మనం క్రీస్తునందు నిరీక్షించడాన్ని ఎన్నుకోగలము. “సంతోషించుడి, నేను మిమ్ములను నడిపించెదను”17 మరియు ఆయన నీ బాధలను నీ ప్రయోజనము కొరకు ప్రతిష్ఠించును18 అనే ఆయన ఆహ్వానము మరియు వాగ్దానము నుండి ఈ నిరీక్షణ వస్తుంది.
మంచి కాపరి
మనము ఎక్కడ ప్రారంభించామో అక్కడే ముగిద్దాం: దయగల సంరక్షకురాలు, పోషించే ఆత్మతో సమీపిస్తుంది, మరియు దాని యొక్క ఊహించని ఫలితం—ఆమె గృహనిర్వాహకత్వము కలిగియున్న జంతువుల హృదయాలను నయం చేస్తుంది. ఎందుకు? ఎందుకు, ఎందుకంటే ఆమె స్వభావమది!
మనం మన సువార్త దృష్టితో చూసినప్పుడు, మనం కూడా కనికరముగల సంరక్షకుని రక్షణలో ఉన్నామని, ఆయన దయతో, పోషించు ఆత్మతో ప్రవర్తిస్తారని మనం గుర్తిస్తాము. మంచి కాపరి మనలో ప్రతిఒక్కరిని పేరుతో సహా ఎరుగుదురు మరియు “మనపట్ల వ్యక్తిగత ఆసక్తిని కలిగియున్నారు.”19 ప్రభువైన యేసు క్రీస్తు తానే స్వయంగా ఇలా చెప్పెను: “నేను గొఱ్ఱెల మంచి కాపరిని మరియు నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును. … మరియు నేను గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టు[దును].”20
ఈ పరిశుద్ధ ఈస్టరు వారాంతమున, “యెహోవా నా కాపరి” అని,21 మనలో ప్రతిఒక్కరిని ఆయన ఎరుగునని, మనం ఆయన దయగల సంరక్షణలో ఉన్నామని తెలుసుకోవడంలో నేను శాశ్వతమైన సమాధానాన్ని కనుగొంటాను. జీవితంలో శ్రమలను, కష్టాలను, అనారోగ్యాన్ని, గాయాలను మనం ఎదుర్కొన్నప్పుడు, ప్రభువు—మన కాపరి—మనల్ని ప్రేమతో, దయతో పోషిస్తారు. ఆయన మన హృదయాలను స్వస్థపరచి, మన ఆత్మలను పునరుద్ధరిస్తారు.
దీనిని గూర్చి—మరియు మన రక్షకునిగా, మన విమోచకునిగా యేసు క్రీస్తును గూర్చి—యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.