శుద్ధమైన సత్యం, శుద్ధమైన సిద్ధాంతం మరియు శుద్ధమైన బయల్పాటు
దయచేసి ఈ సమావేశాన్ని ప్రభువు నుండి ఆయన సేవకుల ద్వారా వచ్చే సందేశాలపై విందారగించే సమయంగా చేయండి.
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, సర్వసభ్య సమావేశానికి స్వాగతం! మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషకరం! గత ఆరు నెలలుగా నిరంతరం నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. మీ గురించి మరియు మీ కొరకు నేను ప్రార్థించాను. ఈ సమావేశము ధ్యానించడానికి మరియు బయల్పాటు కొరకైన సమయం కావాలని ఆ దీవెనలు కోరుకొనే వారందరి కోసం ఇటీవలి వారాలలో నేను ఉద్దేశపూర్వకంగా ప్రార్థించాను.
మరొకసారి సమావేశ కేంద్రం నుండి మీతో మాట్లాడుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అధికశాతం కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, కానీ టాబర్నాకిల్ గాయకబృందం యొక్క సభ్యులలో కొందరు ఇక్కడ ఉండడం అద్భుతమైన ముందడుగు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఈ గొప్ప వర్చువల్ సమావేశానికి మీ అందరిని మేము స్వాగతిస్తున్నాము.
మనమింకా కొవిడ్-19 యొక్క విధ్వంసాలు మరియు దాని రూపాంతరాలతో వ్యవహరిస్తున్నాము. మా ఉపదేశాన్ని, వైద్య నిపుణులు మరియు మీ స్థానిక ప్రభుత్వాధికారుల సలహాను పాటించినందుకు మీకు ధన్యవాదాలు.
ప్రభువు చేత నిర్దేశించబడినట్లుగా మేము ప్రతి సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము.1 సంవత్సరాలు గడిచే కొద్దీ దాని స్వరూపం మార్పు చెందింది. నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు, సమావేశము మూడు లేదా నాలుగు రోజులు జరిగేది. తరువాత, సమావేశము రెండు రోజులకు తగ్గించబడింది. అప్పుడు మరియు ఇప్పుడు—ప్రతి సందేశము—మనఃపూర్వకమైన ప్రార్థన మరియు అధిక ఆత్మీయ సిద్ధపాటుకు ఫలితం.
ఇక్కడ మాట్లాడే సంఘ ప్రధాన అధికారులు తమ సందేశాలను మన రక్షకుడైన యేసు క్రీస్తు, ఆయన కనికరము మరియు ఆయన అనంతమైన విమోచన శక్తిపై కేంద్రీకరిస్తారు. మన రక్షకుని గూర్చిన జ్ఞానము ప్రతి మానవ ఆత్మకు వ్యక్తిగతంగా మరింత ముఖ్యము మరియు తప్పనిసరి అయిన ఈ సమయాన్ని మించినది ప్రపంచ చరిత్రలో మరేది లేదు. మనమందరం యేసు క్రీస్తును వెంబడించి, ఆయన బోధనలను ఆలకించినట్లయితే, ప్రపంచవ్యాప్తంగా—మరియు మన వ్యక్తిగత జీవితాల్లో—ఉన్న నాశనకరమైన వివాదాలు ఎంత త్వరగా పరిష్కరించబడతాయో ఊహించండి.
ఆ స్ఫూర్తితో, ఈ సమావేశంలో మూడు విషయాల గురించి వినమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను: శుద్ధమైన సత్యం, క్రీస్తు యొక్క శుద్ధమైన సిద్ధాంతం మరియు శుద్ధమైన బయల్పాటు. కొందరి సందేహాలకు విరుద్ధంగా, నిజంగా తప్పు మరియు ఒప్పు అనేది ఉంది. నిజంగా శుద్ధమైన సత్యం—నిత్య సత్యం అనేది ఉంది. సత్యం కోసం ఎటు వైపు చూడాలో తెలిసిన వారు అతి కొద్దిమందే ఉండడం మన కాలంలోని తెగుళ్ళలో ఒకటి.2 నేడు మరియు రేపు మీరు వినేది శుద్ధమైన సత్యాన్ని రూపిస్తుందని నేను మీకు అభయమివ్వగలను.
క్రీస్తు యొక్క శుద్ధమైన సిద్ధాంతము శక్తివంతమైనది. దానిని గ్రహించి, అతని లేదా ఆమె జీవితంలో దానిని అన్వయించుకోవడానికి కోరిన ప్రతి ఒక్కరి జీవితాన్ని అది మారుస్తుంది. నిబంధన మార్గాన్ని కనుగొని, దానిలో ఉండేందుకు క్రీస్తు యొక్క సిద్ధాంతము మనకు సహాయపడుతుంది. ఇరుకైనప్పటికీ బాగా స్పష్టమైన ఆ మార్గంలో నిలిచియుండడం చివరకు దేవుడు కలిగియున్న దానంతటిని పొందడానికి మనల్ని అర్హులుగా చేస్తుంది.3 మన తండ్రి కలిగియున్న దానంతటి కంటే విలువైనదేదీ ఉండజాలదు!
చివరగా, మీ హృదయంలో ఉన్న ప్రశ్నల కొరకైన శుద్ధమైన బయల్పాటు ఈ సమావేశాన్ని ప్రయోజనకరంగా మరియు మరపురానిదిగా చేస్తుంది. ఈ రెండు రోజులలో మీరు వినాలని ప్రభువు కోరుకున్న దానిని వినడానికి మీకు సహాయపడేందుకు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య కోసం మీరింకా వెదకనట్లయితే, ఇప్పడే వెదకమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఈ సమావేశాన్ని తన సేవకుల ద్వారా ప్రభువు నుండి వచ్చే సందేశాలపై విందారగించే సమయంగా చేయండి. మీ జీవితంలో వాటిని ఎలా అన్వయించాలో తెలుసుకోండి.
ఇది యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము. మనం ఆయన నిబంధన జనులము. తగిన సమయంలో తన పనిని వేగవంతం చేస్తానని ప్రభువు ప్రకటించారు4 మరియు ఆయన మునుపెన్నడూ లేనంత వేగంగా చేస్తున్నారు. మనము ఆయన పరిశుద్ధ కార్యములో పాల్గొనే విశేషాధికారాన్ని కలిగియున్నాము.
అధిక వెలుగు, జ్ఞానము మరియు సత్యాన్ని వెదుకుతున్న వారందరిపై ఒక దీవెన కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీలో ప్రతిఒక్కరి కోసం నా ప్రేమను వ్యక్తపరుస్తున్నాను, యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.