లియహోనా
తరచుగా ప్రార్థనతో మీ ఆత్మను పోషించండి
2024 ఏప్రిల్


“తరచుగా ప్రార్థనతో మీ ఆత్మను పోషించండి ,” లియహోనా, 2024 ఏప్రి.

లియహోనా నెలవారీ సందేశము, 2024 ఏప్రిల్

తరచుగా ప్రార్థనతో మీ ఆత్మను పోషించండి

మన పరలోక తండ్రితో సంభాషించే ఆత్మీయ పోషణ మనకు అవసరం, ఇది మనకు ప్రతిచోటా మరియు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఆశీర్వాదం.

చిత్రం
ప్రార్థిస్తున్న ఈనస్

మాట్ రీయర్ చేత ఈనస్ పాత్రను పోషిస్తున్న నటుడి ఛాయాచిత్రము

మనమందరం ఇంతకు ముందు ఆకలిని అనుభవించాము. ఆకలి దప్పికలు శరీరానికి పోషణ అవసరమని చెప్పే విధానం. మరియు మనం ఆకలితో ఉన్నప్పుడు, మనం ఏమి చేయాలో మనకు తెలుసు—తినాలి.

మనకు ఆత్మీయ పోషణ ఎప్పుడు అవసరమో తెలియజేసే విధానాలు మన ఆత్మలకు కూడా ఉన్నాయి. కానీ శారీరక ఆకలి కంటే ఆత్మీయ ఆకలిని విస్మరించడం మనకు సులభం అని అనిపిస్తుంది.

మనం ఆకలితో ఉన్నప్పుడు తినగలిగే అనేక రకాల ఆహారాలున్నట్లే, మన ఆత్మీయ ఆకలిని నింపడానికి మనం చేయగల అనేక విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు, మనం లేఖనాల్లో మరియు ప్రవక్తల మాటల ద్వారా “క్రీస్తు యొక్క మాటలను విందారగించగలము” (2 నీఫై 32:3). మనం క్రమం తప్పకుండా సంఘానికి హాజరవ్వచ్చు మరియు సంస్కారములో పాల్గొనవచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 59:9 చూడండి). మనం దేవునికి మరియు ఆయన పిల్లలకు సేవ చేయవచ్చు (మోషైయ 2:17 చూడండి)

కానీ మన పరిస్థితులతో సంబంధం లేకుండా, మన జీవితంలోని ప్రతి క్షణంలో, అన్ని సమయాల్లో మనకు ఆత్మీయ పోషణకు మరొక మూలాధారం అందుబాటులో ఉంది. ప్రార్థన ద్వారా మనం ఎల్లప్పుడూ పరలోక తండ్రితో సంభాషించవచ్చు.

“నా ఆత్మ ఆకలిగొనెను”

ప్రవక్త ఈనస్ అడవులలో మృగములను వేటాడుటకు వెళ్ళినపుడు, “తరచుగా నిత్యజీవము మరియు పరిశుద్ధుల సంతోషమును గూర్చి [తన] తండ్రి చెప్పగా [అతను] వినిన మాటలు” గురించి ఆలోచించాడు. ఈ మాటలు “[అతని] హృదయములో లోతుగా నాటుకున్నవి” (ఈనస్ 1:3).

ఈనస్ ఈ ఆత్మీయ మానసిక స్థితిలో ఉన్నందున, అతనికి ఒక బలమైన అవసరం ఉందని భావించాడు: “నా ఆత్మ ఆకలిగొనెను,” అని అతను చెప్పాడు (ఈనస్ 1:4; ఉద్ఘాటన జోడించబడింది).

ఈ ఆత్మీయ ఆకలి, ఈ ఆత్మీయ పోషణ అవసరాన్ని అతడు భావించినప్పుడు ఈనస్ ఏమి చేశాడు? “నేను నా సృష్టికర్త యెదుట మోకాళ్ళూని,” అని అతను చెప్పాడు, “మరియు నా స్వంత ఆత్మ నిమిత్తము బలమైన ప్రార్థనయందు, విన్నపమందు ఆయనకు మొరపెట్టితిని” (ఈనస్ 1:4).

ఈనస్ యొక్క ఆత్మీయ ఆకలి ఎంత గొప్పది అంటే, అతడు “దినమంతయు … మరియు రాత్రి వచ్చినప్పుడు [అతడు] పరలోకములకు చేరునట్లు [తన] స్వరమును ఎలుగెత్తెను” (ఈనస్ 1:4). చివరికి, దేవుడు అతని ప్రార్థనకు సమాధానమిచ్చారు మరియు అతని పాపాలను క్షమించారు. ఈనస్ తన అపరాధము తొలగించబడిట్లు భావించెను. కానీ అతని ఆత్మీయ పోషణ అక్కడితో అంతం కాలేదు.

అతడు యేసు క్రీస్తునందు విశ్వాసం యొక్క శక్తి గురించి తెలుసుకున్నాడు, మరియు అతడు తన ప్రజల తరఫున—తన శత్రువుల కోసం కూడా తన సమస్త ఆత్మనుకుమ్మరించాడు. అతడు ప్రభువుతో నిబంధనలు చేసాడు మరియు ఆయన నుండి వాగ్దానాలను పొందాడు. మరియు ఈనస్ యొక్క బలమైన ప్రార్థన తరువాత, అతడు తన ప్రజల మధ్యకు వెళ్లి తాను విన్నవి, మరియు చూసిన విషయాల గురించి ప్రవచిస్తూ సాక్ష్యమిచ్చాడు. (ఈనస్ 1:5–19 చూడండి.)

ప్రతి ప్రార్థనకు అటువంటి నాటకీయ విధానములో సమాధానం ఇవ్వబడదు, కానీ ప్రార్థనతో మన అనుభవాలు ఇప్పటికీ అర్థవంతంగా మరియు జీవితాన్ని మార్చగలిగేలా ఉండగలవు. ప్రార్థనతో ఈనస్ యొక్క అనుభవం నుండి మనం కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు:

  • సువార్తను పూర్తిగా జీవించడానికి శ్రమించడం మన ఆత్మీయ ఆకలిని గ్రహించడంలో సహాయపడుతుంది.

  • మన ఆత్మీయ ఆకలి పరలోక తండ్రి సహాయాన్ని వెదకడానికి మనల్ని మోకాళ్ళూనేలా చేయగలదు.

  • పరలోక తండ్రికి ప్రార్థించడం మన ఆత్మీయ ఆకలిని తీర్చడంలో సహాయపడుతుంది—ఆపై కొన్ని.

  • మనం ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రార్థించవచ్చు.

  • ప్రార్థన మనము పశ్చాత్తాపపడటానికి సహాయపడుతుంది.

  • ప్రార్థన యేసు క్రీస్తునందు మన విశ్వాసాన్ని బలపరుస్తుంది.

  • మన పరలోక తండ్రి మనల్ని వింటారు మరియు మనల్ని ఎరిగియున్నారని మనం వ్యక్తిగత సాక్ష్యాన్ని పొందగలము.

  • ప్రార్థన ద్వారా మనం పొందే సాక్ష్యం మరియు శక్తి ఇతరులకు సేవ చేయడానికి మరియు బలోపేతం చేయడానికి మనకు సహాయం చేస్తుంది.

చిత్రం
బాలుడిగా ఎల్డర్ సోవారెస్

ప్రార్థనా శక్తితో నా అనుభవం

ఈనస్ వలే, నేను వ్యక్తిగత అనుభవం ద్వారా ఇలాంటి పాఠాలలో కొన్నింటిని నేర్చుకున్నాను. నేను బాలుడిగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో చేరారు, మరియు నాకు ఎనిమిదేళ్ల వయసులో నేను బాప్తిస్మము తీసుకున్నాను. నా పరలోక తండ్రి గురించి మరియు యేసు క్రీస్తు గురించి, పునఃస్థాపించబడిన ఆయన సువార్త గురించి మరియు ఆయన సంఘము గురించి నా హృదయంలో ఎల్లప్పుడూ మంచి, వెచ్చని అనుభూతిని కలిగియున్నాను. కానీ దాదాపు నాకు 16 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత నేను ఈ విషయాల సత్యాన్ని గురించి ప్రార్థించాను.

నా ప్రేరేపించబడిన బిషప్పు యువకుల ఆదివారపు బడి తరగతికి బోధించమని నన్ను అడిగారు. ప్రార్థన ద్వారా సువార్తను గూర్చి సాక్ష్యాన్ని మనం ఎలా పొందవచ్చనే ఒక పాఠాన్ని నేను బోధించవలసి ఉంది. నా బిషప్పు నుండి ఈ నియామకం నా స్వంత సాక్ష్యం గురించి మరింత లోతుగా ఆలోచించేలా చేసింది. నేను మోర్మన్ గ్రంథము‌ను అధ్యయనం చేయడానికి సమయాన్ని వెచ్చించాను మరియు సంఘము నిజమని ఎల్లప్పుడూ భావించాను నేను ఎల్లప్పుడూ రక్షకుడైన యేసు క్రీస్తునందు నమ్మకముంచాను, కానీ నేను మొరోనై యొక్క వాగ్దానాన్ని ఎన్నడూ గంభీరంగా తీసుకొనలేదు మొరోనై 10:4–5. నేను సువార్త యొక్క యథార్థత గురించి ఎన్నడూ ప్రార్థించలేదు.

ప్రార్థన ద్వారా సాక్ష్యాన్ని ఎలా పొందాలో నేను ఈ యువతకు నేర్పించబోతున్నట్లయితే, నేను స్వయంగా ఒక సాక్ష్యం కోసం ప్రార్థించాలని నా హృదయంలో భావించిడం నాకు గుర్తుంది. నా ఆత్మ ఆకలిగొనెను—బహుశా ఈనస్ కంటే భిన్నంగా ఉండవచ్చు, అయినప్పటికీ నేను ఆత్మీయ అవసరాన్ని అనుభవించాను.

నేను పాఠాన్ని సిద్ధపరచినప్పుడు, నేను మోకరిల్లి, నా హృదయంలో ఉన్న సత్యాన్ని ధృవీకరించడానికి నా పరలోక తండ్రికి నా హృదయంలోని కోరికను విన్నవించాను. నేను ఏ గొప్ప ప్రత్యక్షతను ఆశించలేదు. అయితే సువార్త నిజమా కాదా అని నేను ప్రభువును అడిగినప్పుడు, నా హృదయానికి చాలా మధురమైన అనుభూతి వచ్చింది—ఇప్పటికీ, అది నిజమని మరియు నేను చేస్తున్న పనిని కొనసాగించాలని నాకు ధృవీకరించే చిన్న స్వరం.

ఆ భావన ఎంత బలంగా ఉందంటే, నేను ఆ సమాధానాన్ని ఎప్పుడూ విస్మరించలేను మరియు నాకు తెలియదని చెప్పలేను. ఆ రోజంతా నేను చాలా సంతోషంగా భావిస్తూ గడిపాను. నా హృదయంలోని అందమైన అనుభూతిని తలచుకుంటూ ఆత్మీయమైన విషయాలపై దృష్టిసారించాను.

మరుసటి ఆదివారం, నేను నా కంటే చిన్నవారైన నా ముగ్గురు లేదా నలుగురు తరగతి సహచరుల ముందు నిలబడ్డాను. వారు విశ్వాసము కలిగి ఉంటే పరలోక తండ్రి వారి ప్రార్థనకు జవాబిస్తారని నేను వారికి సాక్ష్యమిచ్చాను.

చిత్రం
ఎల్డర్ సోవారెస్

ఎల్డర్ సోవారెస్ యువకుడిగా పొందిన ఒక జవాబివ్వబడిన ప్రార్థన,—విశ్వాసంతో చేసే ప్రార్థనలకు పరలోక తండ్రి సమాధానం ఇస్తారని—ఆయన ఒక మిషనరీగా (ఆపై), తండ్రిగా, భర్తగా మరియు అపొస్తలుడుగా సాక్ష్యమివ్వడానికి అనుమతించింది.

అప్పటి నుండి, ఈ సాక్ష్యం నాలో నిలిచిపోయింది. ముఖ్యంగా నేను సవాళ్లను ఎదుర్కొన్న క్షణాల్లో, నిర్ణయాలు తీసుకోవడంలో ఇది నాకు సహాయపడింది. ఆ రోజున ఆ ప్రార్థన, సంవత్సరాలుగా నేను పొందిన అదనపు సాక్షాలతో పాటు, విశ్వాసంతో ప్రార్థిస్తే పరలోక తండ్రి నుండి సమాధానాలు వారు పొందవచ్చని విశ్వాసంతో ప్రజలకు సాక్ష్యమివ్వడానికి నన్ను అనుమతించింది. నేను ఒక మిషనరీగా, సంఘ నాయకుడిగా, తండ్రిగా మరియు భర్తగా మరియు నేటికీ అపొస్తులుడిగా సాక్ష్యమిచ్చినప్పుడు ఇది నిజం.

ప్రార్థన ఎప్పుడు మరియు ఏమిటి

నిజమే, మనకు ప్రత్యేకించి బలమైన ఆత్మీయ అవసరం అనిపించినప్పుడు మాత్రమే మనం ప్రార్థించము. అయితే, మనం ఎప్పుడు ప్రార్థించాలి? మరియు మనం దేని కొరకు ప్రార్థించాలి? సంక్షిప్త సమాధానం, ఎప్పుడైనా మరియు దేనికైనా.

దేవుడు మన పరలోక తండ్రి. ఇది తెలుసుకోవడం మన ప్రార్థించే విధానాన్ని మారుస్తుంది. ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇలా బోధించాడు: “దేవుని గురించిన జ్ఞానం కలిగి, ఆయనను ఎలా సమీపించాలో, మరియు ఒక సమాధానం పొందేందుకు ఎలా అడగాలో మనం తెలుసుకోవడం ప్రారంభిస్తాము. … మనం ఆయన దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆయన మన దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉంటారు.”1

మన పరలోక తండ్రి మన మాట వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మరియు మనం ఆయనకు క్రమం తప్పకుండా మరియు తరచుగా ప్రార్థించాలని కోరుకుంటున్నారు. మనం “[మన] కార్యములన్నిటిలో ప్రభువుతో ఆలోచన చేయాలి” (ఆల్మా 37:37) మరియు ఉదయమందు, మధ్యాహ్నమందు మరియు రాత్రియందు ప్రార్థన చేయాలి. మనం ఇంట్లో, పనిలో, పాఠశాలలో—మనం ఎక్కడ ఉన్నా మరియు మన ప్రయత్నాలలో దేనికొరకైనా ప్రార్థించాలి (ఆల్మా 34:17–26 చూడండి).

మన కుటుంబాలలో మనం ప్రార్థన చేయాలి (3 నీఫై 18:21 చూడండి). “మనము స్వరముతో మరియు [మన] హృదయములో, బహిరంగముగా మరియు అంతరంగముగా ఎల్లప్పుడు” ప్రార్థించాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 81:3). మరియు “[మనము] ప్రభువుకు మొరపెట్టనప్పుడు, [మన] క్షేమము కొరకు మరియు [మన] చుట్టూ ఉన్నవారి క్షేమము కొరకు నిరంతరము ప్రార్థనయందు [మన] హృదయములలో ఆయన పట్ల కృతజ్ఞత కలిగియుండాలి” (ఆల్మా 34:27). మరియు మనం ఎల్లప్పుడూ యేసు క్రీస్తు నామంలో తండ్రికి ప్రార్థించాలి (3 నీఫై 18:19–20 చూడండి).

చిత్రం
యువకుడిగా జోసెఫ్ స్మిత్

వాల్టర్ రానే చేత జోసెఫ్ స్మిత్ యొక్క వివరణ, అనుకరించబడదు

మన పరలోక తండ్రిని సమీపించడం

పరలోకమందున్న మన తండ్రి మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. మనం అడిగితే—ఆయన ఆశీర్వదిస్తారు. ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇలా బోధించాడు, “అడగకుండా మనం ఏమీ పొందలేమని గుర్తుంచుకోండి; కాబట్టి, విశ్వాసంతో అడగండి, మరియు దేవుడు మీకు అనుగ్రహించడానికి తగిన ఆశీర్వాదాలను మీరు పొందుతారు.”2

మన ఆకలితో ఉన్న ఆత్మలకు ఆత్మీయ పోషణ యొక్క సమతుల్య ఆహారంలో మనం క్రమం తప్పకుండా మరియు తరచుగా చేసే ప్రార్థనలు చాలా ముఖ్యమైన భాగం. ప్రార్థన ద్వారా పరలోక తండ్రితో సంభాషించుట అందుబాటులో ఉంది, ప్రతిచోటా మరియు ఎల్లప్పుడూ స్వాగతం.

మనము మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు మన పరలోక తండ్రిని ఎలా చేరుకోవాలో నాకు ఇష్టమైన లేఖనాలలో ఒకటి బోధిస్తుంది: “నిన్ను నీవు తగ్గించుకొనుము; నీ దేవుడైన ప్రభువు నిన్ను చేయి పట్టుకొని నడిపించును, నీ ప్రార్థనలకు సమాధానమిచ్చును.”సిద్ధాంతము మరియు నిబంధనలు 112:10 మనం వినయంగా మరియు విధేయతతో ఉన్నప్పుడు, పరలోక తండ్రి మనతో ఉంటారు. ఆయన మనలను చేయి పట్టుకొని నడిపిస్తారు. ఎక్కడికి వెళ్లాలి, ఏమి చేయాలనే విషయంలో ఆయన మనల్ని ప్రేరేపిస్తారు. ఆయన చిత్తం, మార్గం, సమయం మరియు మనకు ఏది మంచిదో దాని గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని బట్టి ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తారు.

మనం దీనిని గుర్తుంచుకోవాలి మరియు దేవుని సింహాసనాన్ని చేరుకోవడానికి మరియు ఆయన చేతిలో ఆశీర్వాదాలు పొందే అవకాశాలను మనం ఎంతో ఆదరించాలి.

వివరణలు

  1. Teachings of Presidents of the Church: Joseph Smith (2011), 4041.

  2. Teachings: Joseph Smith, 131.

ముద్రించు