లేఖనములు
ఆల్మా 15


15వ అధ్యాయము

ఆల్మా, అమ్యులెక్‌లు సైడమ్‌కు వెళ్ళి, సంఘమును స్థాపించుదురు—ఆల్మా, జీజ్రొమ్‌ను స్వస్థపరచును, అతడు సంఘమందు చేరును—అనేకులు బాప్తిస్మము పొందుదురు మరియు సంఘము వృద్ధిచెందును—ఆల్మా, అమ్యులెక్‌లు జరహేమ్లకు వెళ్ళుదురు. సుమారు క్రీ. పూ. 81 సం.

1 ఆల్మా, అమ్యులెక్‌లు ఆ పట్టణము నుండి బయటకు వెడలిపోవలెనని ఆజ్ఞాపించబడిరి; వారు వెడలిపోయి, సైడమ్ దేశములోనికి వచ్చిరి; అక్కడ, ఆల్మా మాటలయందు విశ్వసించినందుకు బయటకు త్రోసివేయబడి, రాళ్ళతో కొట్టబడి, అమ్మోనైహా దేశము నుండి బయటకు వెడలిపోయిన జనులందరినీ వారు కనుగొనిరి.

2 వారి భార్యాపిల్లలకు జరిగినదానంతటిని మరియు తమను గూర్చి, తమ విడుదల యొక్క శక్తిని గూర్చి కూడా వారికి తెలియజేసిరి.

3 మరియు జీజ్రొమ్ తీవ్రమైన జ్వరముతో సైడమ్ వద్ద పడియుండెను, అది అతని దుష్టత్వమును బట్టి, అతని మనస్సు పడిన గొప్ప శ్రమల వలన కలిగెను, ఏలయనగా ఆల్మా, అమ్యులెక్‌లు ఇక లేరని అతడు తలచెను; తన దుర్నీతి వలన వారు సంహరింపబడిరని అతడు తలచెను. ఈ ఘోర పాపము మరియు అతని ఇతర పాపములు ఎట్టి విడుదల లేకుండా మిక్కిలి తీవ్రమగు వరకు అతని మనస్సును వేధించెను; కావున అతడు తీవ్ర జ్వరముతో కాలిపోసాగెను.

4 ఇప్పుడు ఆల్మా, అమ్యులెక్‌లు సైడమ్ దేశమందు ఉన్నారని వినినప్పుడు, అతని హృదయము ధైర్యము తెచ్చుకోసాగెను; వారు అతని యొద్దకు రావలెనని కోరుచూ, అతడు వెంటనే వారికి ఒక సందేశమును పంపెను.

5 అతడు వారికి పంపిన సందేశమునకు లోబడి వారు వెంటనే వెళ్ళిరి; వారు జీజ్రొమ్ ఇంటిలోనికి వెళ్ళిరి; మంచముపై ఒక రోగిగా, తీవ్రమైన జ్వరముతో అతడు చాలా బలహీనముగా ఉన్నట్లు వారు కనుగొనిరి; అతని దోషముల కారణముగా అతని మనస్సు కూడా అధికముగా బాధింపబడెను; వారిని చూచినపుడు అతడు తన చేతిని చాపి, అతడిని స్వస్థపరచవలెనని వారిని కోరెను.

6 ఆల్మా అతని చేతిని పట్టుకొని—రక్షణ నిమిత్తము క్రీస్తు యొక్క శక్తి యందు నీవు నమ్ముచున్నావా? అనెను.

7 అతడు సమాధానమిస్తూ—అవును, నీవు బోధించిన మాటలన్నిటినీ నేను నమ్ముచున్నాను అనెను.

8 నీవు క్రీస్తు యొక్క విమోచన యందు విశ్వాసముంచిన యెడల స్వస్థపడగలవని ఆల్మా చెప్పెను.

9 మరియు అతడు—నీ మాటలను బట్టి నేను విశ్వసించుచున్నానని చెప్పెను.

10 అప్పుడు ఆల్మా ప్రభువుకు ఎలుగెత్తి—మా దేవుడవైన ఓ ప్రభువా, ఈ మనుష్యునిపై కనికరము చూపుము, క్రీస్తు యందున్న అతని విశ్వాసమును బట్టి అతడిని స్వస్థపరచుము అని చెప్పెను.

11 ఆల్మా ఈ మాటలను చెప్పినప్పుడు, జీజ్రొమ్ తన కాళ్ళపై నిలబడి నడవనారంభించెను; ఇది జనులందరిని గొప్ప ఆశ్చర్యమునకు గురిచేసెను; ఈ సమాచారము సైడమ్ యొక్క దేశమంతటా వ్యాపించెను.

12 ఆల్మా, జీజ్రొమ్‌కు ప్రభువు నామమున బాప్తిస్మమిచ్చెను; ఆ సమయము నుండి అతడు జనులకు బోధించుట ప్రారంభించెను.

13 ఆల్మా, సైడమ్ దేశమందు ఒక సంఘమును స్థాపించి, బాప్తిస్మము పొందగోరిన వారందరికి బాప్తిస్మమిచ్చుటకు దేశమందు యాజకులను, బోధకులను ప్రతిష్ఠించెను.

14 వారు అనేకమంది ఉండిరి; ఏలయనగా సైడమ్ చుట్టూ ఉన్న ప్రాంతమంతటి నుండి వారు గుంపులుగా వచ్చి, బాప్తిస్మము పొందిరి.

15 కానీ అమ్మోనైహా దేశములో ఉన్న జనులు ఇంకను కఠిన హృదయులుగా, మెడబిరుసు జనులుగా నిలిచియుంటిరి; ఆల్మా, అమ్యులెక్‌ల శక్తియంతయు అపవాదిదని చెప్పుచూ వారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడలేదు; ఏలయనగా వారు నీహోర్‌ యొక్క విశ్వాసమునకు చెందినవారు, వారి పాపములను గూర్చి పశ్చాత్తాపపడుట యందు వారు విశ్వసించలేదు.

16 ఆల్మా మరియు అమ్యులెక్—అమ్యులెక్ తన బంగారమును వెండిని అమ్మోనైహా దేశమందున్నట్టి తన ప్రశస్థ వస్తువులన్నిటిని దేవుని వాక్యము నిమిత్తము వదిలివేసిన వాడై ఒకప్పటి తన స్నేహితులు, తన తండ్రి మరియు తన బంధువుల చేత కూడా తిరస్కరించబడెను;

17 కావున ఆల్మా, సైడమ్ వద్ద ఒక సంఘమును స్థాపించిన తరువాత ఒక గొప్ప నియంత్రణను చూచియుండి, జనులు తమ హృదయముల యొక్క గర్వము విషయములో నియంత్రణ చేయబడిరని, దేవుని యెదుట తమనుతాము తగ్గించుకొనుట మొదలుపెట్టిరని, సాతాను నుండి, మరణము నుండి మరియు నాశనము నుండి విడిపించబడునట్లు నిరంతరము మెలకువగానుండి ప్రార్థించుచూ బలిపీఠము యెదుట దేవుడిని ఆరాధించుటకు పరిశుద్ధాలయముల వద్ద సమకూడుట మొదలుపెట్టిరని చూచెను—

18 ఇప్పుడు నేను చెప్పినట్లు, ఆల్మా ఈ విషయములన్నిటినీ చూచిన తరువాత అతడు అమ్యులెక్‌ను తీసుకొని జరహేమ్ల దేశమునకు వచ్చెను; అతడిని తన ఇంటికి తీసుకొనివెళ్ళి, అతని శ్రమల యందు అతనికి పరిచర్య చేసి ప్రభువు నందు అతడిని బలపరిచెను.

19 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదియవ సంవత్సరము ముగిసెను.