లేఖనములు
ఆల్మా 42


42వ అధ్యాయము

పశ్చాత్తాపపడి, దేవుడిని సేవించుటకు మనుష్యుని సమర్థునిగా చేయుటకు మర్త్యత్వము ఒక పరిశీలనా సమయమైయున్నది—పతనము సమస్త మానవజాతిపై ఐహికమైన, ఆత్మీయమైన మరణమును తెచ్చెను—పశ్చాత్తాపము ద్వారా విమోచన వచ్చును—లోక పాపముల నిమిత్తము దేవుడు తానే ప్రాయశ్చిత్తము చేయును—పశ్చాత్తాపపడు వారి కొరకు కనికరము కలదు—మిగిలిన వారందరు దేవుని న్యాయమునకు లోబడియున్నారు—ప్రాయశ్చిత్తము మూలముగా కనికరము వచ్చును—నిజముగా పశ్చాత్తాపపడువారు మాత్రమే రక్షింపబడుదురు. సుమారు క్రీ. పూ. 74 సం.

1 నా కుమారుడా, నీ మనస్సును కలతపరచుచున్నది మరికొంత ఉన్నదని నేను చూచుచున్నాను, దానిని నీవు గ్రహించలేకయున్నావు—అది పాపిని శిక్షించుట యందు దేవుని న్యాయమును గూర్చియైయున్నది; ఏలయనగా పాపి ఒక దౌర్భాగ్యపు స్థితికి అప్పగించబడుట అన్యాయమని తలంచుటకు నీవు ప్రయత్నించుచున్నావు.

2 నా కుమారుడా, ఇప్పుడు నేను ఈ సంగతిని నీకు తెలియజేసెదను. ఏలయనగా ప్రభువైన దేవుడు మన మొదటి తల్లిదండ్రులు ఏ నేల నుండి తీయబడిరో దానిని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి వారిని పంపివేసెను—అప్పుడాయన మనుష్యుని వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను—

3 ఇప్పుడు మంచి చెడులను ఎరిగి మనుష్యుడు దేవునివలే ఆయెనని మనము చూచుచున్నాము; అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమోయని, అతడు ఆ ఫలమును తినకూడదని ప్రభువైన దేవుడు కెరూబులను, ఖడ్గజ్వాలను నిలువబెట్టెను—

4 ఆ విధముగా పశ్చాత్తాపపడుటకు మనుష్యునికి ఒక సమయము, అనగా ఒక పరిశీలనా సమయము, పశ్చాత్తాపపడి దేవుడిని సేవించు సమయము అనుగ్రహించబడినదని మనము చూచుచున్నాము.

5 ఏలయనగా ఆదాము వెంటనే తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును తినిన యెడల, దేవుని వాక్యమును బట్టి పశ్చాత్తాపపడుటకు సమయములేక అతడు నిత్యము జీవించియుండేవాడు; మరియు దేవుని వాక్యము కూడా వ్యర్థమైయుండేది; రక్షణ యొక్క గొప్ప ప్రణాళిక నిష్ఫలము చేయబడియుండేది.

6 కానీ, మరణించవలెనని మనుష్యునికి నియమించబడెను—కావున వారు జీవవృక్షము నుండి కొట్టివేయబడియున్నట్లే భూముఖము పైనుండి కూడా కొట్టివేయబడవలసియున్నది—మరియు మనుష్యులు శాశ్వతముగా తప్పిపోయిరి, అనగా వారు పతనమయిన మనుష్యులైరి.

7 దీనిని బట్టి మన మొదటి తల్లిదండ్రులు ప్రభువు యొక్క సన్నిధి నుండి ఐహికముగా, ఆత్మీయముగా కొట్టివేయబడిరని నీవు చూచుచున్నావు; ఆ విధముగా వారు తమ స్వంత చిత్తమునకు లోబడిన వారైరి అని మనము చూచుచున్నాము.

8 ఇప్పుడు మనుష్యుడు ఈ ఐహిక మరణము నుండి రక్షించబడుట ప్రయోజనకరము కాదు, ఏలయనగా అది సంతోషము యొక్క గొప్ప ప్రణాళికను నాశనము చేయును.

9 ఆత్మ ఎన్నడూ మరణించలేనందున, పతనము సమస్త మానవజాతిపై ఆత్మీయ మరియు ఐహిక మరణమును తెచ్చియున్నందున, అనగా వారు ప్రభువు యొక్క సన్నిధి నుండి కొట్టివేయబడినందున మానవజాతి ఈ ఆత్మీయ మరణము నుండి రక్షింపబడుట అవసరమైయున్నది.

10 కావున, స్వభావసిద్ధముగా వారు శరీరసంబంధులు, కామాతురులు మరియు అపవాది సంబంధులైనందున, ఈ పరిశీలనా స్థితి వారి కొరకు సిద్ధపాటు సమయమైయుండెను; అది ఒక సిద్ధపాటు స్థితి ఆయెను.

11 నా కుమారుడా జ్ఞాపకముంచుకొనుము, విమోచన ప్రణాళిక లేని యెడల (లేదని భావించిన యెడల) వారు మరణించిన వెంటనే వారి ఆత్మలు ప్రభువు యొక్క సన్నిధి నుండి కొట్టివేయబడినవై, దీనస్థితిలో ఉండేవి.

12 తన అవిధేయతను బట్టి మనుష్యుడు తనపై తెచ్చుకొనిన ఈ పతనస్థితి నుండి మనుష్యులను రక్షించుటకు ఏ మార్గము లేకుండెను.

13 కావున న్యాయమును బట్టి ఈ పరిశీలనాస్థితి, అనగా ఈ సిద్ధపాటు స్థితి యందు మనుష్యుల పశ్చాత్తాపము యొక్క షరతులపై ఆధారపడి విమోచన ప్రణాళిక పనిచేయును; ఏలయనగా ఈ షరతులు లేనియెడల, న్యాయము యొక్క పనిని నాశనము చేయుట తప్ప కనికరము ఏ ఫలితమునివ్వదు. ఇప్పుడు న్యాయము యొక్క పని నాశనము చేయబడజాలదు. అట్లయిన దేవుడు, దేవునిగా ఉండుట మానును.

14 ఆ విధముగా సమస్త మానవజాతి పతనమాయెనని మరియు వారు న్యాయము, అనగా ఆయన సన్నిధి నుండి శాశ్వతముగా కొట్టివేయబడుటకు వారిని అప్పగించిన దేవుని న్యాయము యొక్క ఆధీనములో ఉండిరని మనము చూచుచున్నాము.

15 ఇప్పుడు ప్రాయశ్చిత్తము చేయబడితే తప్ప కనికరము యొక్క ప్రణాళిక ప్రభావము చూపలేదు; కావున కనికరము యొక్క ప్రణాళిక ప్రభావము చూపుటకు, న్యాయము యొక్క అక్కరలను సంతృప్తిపరచుటకు, దేవుడు పరిపూర్ణమైన, న్యాయవంతుడైన మరియు కనికరము గల దేవునిగా ఉండునట్లు దేవుడు తానే లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయును.

16 శిక్ష ఉంటే తప్ప మనుష్యులకు పశ్చాత్తాపము రాజాలదు, ఆ శిక్ష కూడా ఆత్మ యొక్క జీవమువలే నిత్యమై, సంతోషము యొక్క ప్రణాళికకు వ్యతిరేకముగా ఉంచబడెను, ఆ సంతోషము ఆత్మ యొక్క జీవమువలే శాశ్వతమైయుండెను.

17 పాపము చేయనిదే ఒక మనుష్యుడు ఎట్లు పశ్చాత్తాపపడగలడు? ఏ ధర్మశాస్త్రము లేనియెడల అతడెట్లు పాపము చేయగలడు? శిక్ష లేకుండా, ధర్మశాస్త్రము ఎట్లుండగలదు?

18 ఇప్పుడు ఒక శిక్ష విధించబడినది మరియు న్యాయమైన ధర్మశాస్త్రము ఇవ్వబడినది, అది మనిషి యొక్క మనస్సాక్షికి విచారము కలిగించినది.

19 ఇప్పుడు ఒక మనుష్యుడు హత్యచేసిన యెడల అతడు మరణించవలెనని ఏ చట్టము ఇవ్వబడనట్లైతే, అతడు హత్యచేసిన యెడల మరణించునని అతడు భయపడునా?

20 ఇంకను పాపమునకు వ్యతిరేకముగా ఏ ధర్మశాస్త్రము ఇవ్వబడని యెడల, పాపము చేయుటకు మనుష్యులు భయపడరు.

21 ఏ ధర్మశాస్త్రము ఇవ్వబడనట్లైతే, మనుష్యులు పాపము చేసిన యెడల, న్యాయము లేదా కనికరము ఏమి చేయగలుగును? ఏలయనగా అవి ప్రాణిపై ఎట్టి ప్రభావము చూపలేవు.

22 కానీ ఒక ధర్మశాస్త్రము ఇవ్వబడినది, ఒక శిక్ష విధించబడినది మరియు పశ్చాత్తాపము అనుగ్రహించబడినది; ఆ పశ్చాత్తాపముపై కనికరము ప్రభావము చూపును, లేని యెడల న్యాయము ప్రాణిపై హక్కు కలిగియుండి ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చును; మరియు ధర్మశాస్త్రము శిక్ష విధించును. అట్లు కాని యెడల, న్యాయము యొక్క పనులు నాశనము చేయబడును; మరియు దేవుడు దేవునిగా ఉండుట మానును.

23 కానీ దేవుడు, దేవునిగా ఉండుట మానడు మరియు పశ్చాత్తాపపడు వారిపై కనికరము హక్కు కలిగియుండును; ప్రాయశ్చిత్తము మూలముగా కనికరము వచ్చును; ప్రాయశ్చిత్తము మృతుల పునరుత్థానమును తెచ్చును; మృతుల పునరుత్థానము మనుష్యులను తిరిగి దేవుని సన్నిధిలోకి తెచ్చును; ఆ విధముగా వారు ధర్మశాస్త్రము మరియు న్యాయము ప్రకారము వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబడుటకు ఆయన సన్నిధిలోకి పునఃస్థాపించబడిరి.

24 ఏలయనగా న్యాయము తన అక్కరలన్నిటినీ వినియోగించును మరియు కనికరము కూడా తన స్వంతమైన వాటన్నిటినీ హక్కుగా కోరును; ఆ విధముగా నిజముగా పశ్చాత్తాపపడినవారు తప్ప ఎవరూ రక్షింపబడరు.

25 ఏమి, కనికరము న్యాయమును దోచుకొనునని నీవనుకొనుచున్నావా? లేదు, రవ్వంత కూడా కాదని నేను నీతో చెప్పుచున్నాను; అట్లయిన దేవుడు, దేవునిగా ఉండుట మానును.

26 ఆ విధముగా లోకము పునాది వేయబడినప్పటి నుండి సిద్ధము చేయబడిన ఆయన యొక్క గొప్ప, నిత్య సంకల్పములను దేవుడు జరిగించును. ఆ విధముగా మనుష్యుల రక్షణ మరియు విమోచన, వారి నాశనము మరియు దౌర్భాగ్యము కూడా వచ్చును.

27 కావున నా కుమారుడా, వచ్చువాడు వచ్చి జీవజలములను ఉచితముగా పుచ్చుకొనవచ్చును మరియు రానివాడు వచ్చుటకు బలవంతము చేయబడడు; కానీ అంత్యదినమున అతని క్రియలను బట్టి అతనికి పునఃస్థాపించబడును.

28 అతడు చెడును చేయగోరి, అతని దినముల యందు పశ్చాత్తాపపడని యెడల, దేవుని యొక్క పునఃస్థాపన ప్రకారము అతనికి చెడు జరుగును.

29 ఇప్పుడు, నా కుమారుడా, ఈ సంగతులు ఇకపై నిన్ను కష్టపెట్టనియ్యకుమని, నీవు పశ్చాత్తాపపడునట్లు చేయు కష్టముతో నీ పాపములు మాత్రమే నిన్ను కష్టపెట్టనివ్వమని నేను కోరుచున్నాను.

30 ఓ నా కుమారుడా, నీవు ఇకపై దేవుని న్యాయమును తిరస్కరించరాదని నేను కోరుచున్నాను. దేవుని న్యాయమును తిరస్కరించుట ద్వారా నీ పాపముల విషయమై అతి చిన్న అంశములో కూడా నిన్ను సమర్థించుకొనుటకు ప్రయత్నించవద్దు; కానీ దేవుని న్యాయము, కనికరము మరియు ఆయన దీర్ఘ శాంతము నీ హృదయమందు పూర్తి అధికారమును కలిగియుండనిమ్ము; అది నిన్ను మిక్కిలి వినయము గలవానిగా చేయనిమ్ము.

31 ఓ నా కుమారుడా, ఈ జనులకు వాక్యమును బోధించుటకు నీవు దేవుని వలన పిలువబడితివి. నా కుమారుడా, నీ మార్గమున వెళ్ళి నీవు ఆత్మలను పశ్చాత్తాపపడునట్లు చేసి, కనికరము యొక్క గొప్ప ప్రణాళిక వారిపై హక్కు కలిగియుండునట్లు సత్యముతో నిశ్చలముగా వాక్యమును ప్రకటించుము. నా మాటల ప్రకారము దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్‌.