లేఖనములు
ఆల్మా 45


అతని దినములయందు హీలమన్‌ భద్రపరచిన వృత్తాంతమును బట్టి, హీలమన్‌ కాలములో నీఫై జనులు, వారి యుద్ధములు మరియు అభిప్రాయ భేదముల యొక్క వృత్తాంతము.

45 నుండి 62 అధ్యాయములు కలిగియున్నవి.

45వ అధ్యాయము

ఆల్మా మాటలను హీలమన్‌ విశ్వసించును—నీఫైయుల నాశనమును ఆల్మా ప్రవచించును—అతడు దేశమును ఆశీర్వదించును మరియు శపించును—మోషే వలే ఆల్మా కూడా ఆత్మ ద్వారా తీసుకొనిపోబడి యుండవచ్చును—సంఘమందు అభిప్రాయ భేదములు పెరుగును. సుమారు క్రీ. పూ. 73 సం.

1 ఇప్పుడు ప్రభువు వారిని వారి శత్రువుల చేతులలో నుండి తిరిగి విడిపించినందున నీఫై యొక్క జనులు మిక్కిలి ఆనందించిరి; కావున, వారు ప్రభువైన తమ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి; వారు అధికముగా ఉపవాసముండిరి, అధికముగా ప్రార్థించిరి మరియు మహదానందముతో దేవుడిని ఆరాధించిరి.

2 నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క పంతొమ్మిదవ సంవత్సరమందు ఆల్మా తన కుమారుడైన హీలమన్‌ యొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను: భద్రపరచబడియున్న ఆ గ్రంథములను గూర్చి నేను నీతో చెప్పిన మాటలను నీవు నమ్ముచున్నావా?

3 అవును, నేను నమ్ముచున్నాను అని హీలమన్‌ అతనితో చెప్పెను.

4 రాబోవు యేసు క్రీస్తు నందు నీవు విశ్వసించుచున్నావా? అని ఆల్మా తిరిగి అడిగెను.

5 అవును, నీవు పలికిన మాటలన్నిటినీ నేను నమ్ముచున్నాను అని అతడు చెప్పెను.

6 మరలా ఆల్మా—నీవు నా ఆజ్ఞలను పాటించెదవా? అని అతడిని అడిగెను.

7 అవును, నా హృదయపూర్వకముగా నేను నీ ఆజ్ఞలను పాటించెదను అని అతడు చెప్పెను.

8 అప్పుడు ఆల్మా అతనితో ఇట్లు చెప్పెను: నీవు ధన్యుడవు. ప్రభువు నిన్ను ఈ దేశమందు వర్ధిల్లజేయును.

9 కానీ ఇదిగో నేను నీకు కొంత ప్రవచించవలసియున్నది; కానీ నేను నీకు ప్రవచించినది నీవు తెలియజేయరాదు; నేను నీకు ప్రవచించు ప్రవచనము నెరవేరువరకు దానిని తెలియజేయరాదు; కావున నేను చెప్పబోవు మాటలను వ్రాయుము.

10 ఇవే ఆ మాటలు: ఇదిగో, యేసు క్రీస్తు తనను వారికి ప్రత్యక్షపరచుకొను సమయము నుండి సరిగ్గా నాలుగు వందల సంవత్సరములలో ఈ నీఫైయులు తమ విశ్వాసమందు క్షీణించిపోవుదురని నాయందున్న బయల్పాటు ఆత్మను బట్టి నేను చూచుచున్నాను.

11 అప్పుడు నీఫై యొక్క జనులు అంతరించిపోవునంత వరకు యుద్ధములు, తెగుళ్ళు, కరువులు మరియు రక్తపాతమును వారు చూచెదరు.

12 ఇదంతయు వారు విశ్వాసమందు క్షీణించి అంధకార క్రియలు, కాముకత్వము మరియు అన్నివిధములైన దుర్ణీతులలో పడిపోయినందు వలననే జరుగునని నేను నీతో చెప్పుచున్నాను; అంత గొప్ప వెలుగు మరియు జ్ఞానమునకు వ్యతిరేకముగా వారు పాపము చేసినందున, ఆ దినము నుండి నాలుగవ తరము గతించిపోక ముందే ఈ గొప్ప దుర్నీతి వచ్చునని నేను నీతో చెప్పుచున్నాను.

13 ఆ గొప్ప దినము వచ్చినపుడు, ఇప్పుడు నీఫై జనుల మధ్య లెక్కింపబడుచున్నవారు లేదా వారి సంతానము ఇకపై నీఫై జనుల మధ్య లెక్కింపబడని సమయము చాలా త్వరగా వచ్చును.

14 కానీ భయంకరమైన ఆ మహాదినమున నాశనము చేయబడకుండా నిలిచియుండు వారు లేమనీయుల మధ్య లెక్కింపబడుదురు మరియు ప్రభువు యొక్క శిష్యులని పిలువబడు కొద్దిమంది తప్ప, అందరు వారి వలే ఉందురు; వారు కూడా అంతరించిపోవునంత వరకు లేమనీయులు వారిని తరిమెదరు. ఇప్పుడు దుర్నీతి నిమిత్తము ఈ ప్రవచనము నెరవేరును.

15 ఆల్మా ఈ సంగతులను హీలమన్‌కు చెప్పిన తరువాత, అతడు అతడిని మరియు అతని ఇతర కుమారులను ఆశీర్వదించెను; నీతిమంతుల నిమిత్తము భూమిని కూడా అతడు ఆశీర్వదించెను.

16 మరియు అతడిట్లనెను: దుర్మార్గము జరిగించు ప్రతి జనము, జాతి, భాష మరియు జనుల నిమిత్తము, వారి పాపము పూర్తిగా పండినప్పుడు నాశనమగునంతగా ఈ దేశము శపించబడునని ప్రభువైన దేవుడు సెలవిచ్చెను; మరియు నేను చెప్పిన విధముగా జరుగును; ఏలయనగా దేశముపై ఇది ప్రభువు యొక్క శాపము మరియు ఆశీర్వాదము అయ్యున్నది. ప్రభువైన నేను పాపమును ఎంత మాత్రము అంగీకరించను.

17 ఇప్పుడు ఆల్మా ఈ మాటలను చెప్పినప్పుడు, అతడు సంఘమును, ముఖ్యముగా ఆ సమయము నుండి మొదలుకొని విశ్వాసమందు నిలకడగా నిలిచియుండు వారందరినీ ఆశీర్వదించెను.

18 ఆల్మా దీనిని చేసిన తరువాత, అతడు మీలెక్ దేశములోకి వెళ్ళుటకు అన్నట్లుగా జరహేమ్ల దేశము నుండి బయటకు వెడలిపోయెను. అతడిని గూర్చి మరెన్నడూ వినలేదు; అతని మరణము లేదా సమాధిని గూర్చి మనము ఎరుగము.

19 అతడు నీతిమంతుడని మేమెరుగుదుము; అతడు ఆత్మ ద్వారా కొనిపోబడెనని లేదా మోషేవలే ప్రభువు యొక్క హస్తము ద్వారా పాతిపెట్టబడెనని సంఘమందు వార్త వ్యాపించెను. కానీ, ప్రభువు మోషేను తన వద్దకు తీసుకొనెనని లేఖనములు చెప్పుచున్నవి మరియు ఆయన ఆల్మాను కూడా ఆత్మయందు తీసుకొనియున్నాడని మేము తలంచుచున్నాము; కావున ఈ హేతువు చేత, మేము అతని మరణము మరియు సమాధిని గూర్చి ఏమియు ఎరుగము.

20 ఇప్పుడు నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క పంతొమ్మిదవ సంవత్సరమందు వాక్యమును ప్రకటించుటకు హీలమన్‌ జనుల మధ్యకు వెళ్ళెను.

21 ఏలయనగా లేమనీయులతో వారి యుద్ధములు మరియు జనుల మధ్య గల అనేక చిన్నచిన్న అభిప్రాయ భేదములు, అలజడులను బట్టి వారి మధ్య దేవుని వాక్యము ప్రకటించబడవలసిన అవసరముండెను, అంతేకాక సంఘమంతటా ఒక క్రమము ఏర్పాటు చేయవలసియుండెను.

22 కావున హీలమన్‌ మరియు అతని సహోదరులు దేశమంతటా, అనగా నీఫై జనుల చేత స్వాధీనపరచుకొనబడిన దేశమంతటా ప్రతి పట్టణమందు సంఘమును తిరిగి స్థాపించుటకు వెళ్ళిరి. దేశమంతటా అన్ని సంఘములపై వారు యాజకులను, ఉపదేశకులను నియమించిరి.

23 ఇప్పుడు హీలమన్‌ మరియు అతని సహోదరులు సంఘములపై యాజకులను, ఉపదేశకులను నియమించిన తరువాత, సంఘ సభ్యుల మధ్య అభిప్రాయ భేదము కలిగెను, వారు హీలమన్‌ మరియు అతని సహోదరుల మాటలను లక్ష్యపెట్టలేదు;

24 కానీ, అమితమైన వారి సంపదలను బట్టి వారి హృదయముల యందు హెచ్చింపబడిన వారై వారు గర్విష్ఠులైరి; కావున వారు, తమ దృష్టిలో ఐశ్వర్యవంతులైరి మరియు దేవుని యెదుట యథార్థముగా నడువవలెనన్న వారి మాటలను లక్ష్యపెట్టలేదు.