లేఖనములు
ఆల్మా 6


6వ అధ్యాయము

జరహేమ్ల యందున్న సంఘము శుద్ధిచేయబడి, క్రమపరచబడెను—బోధించుటకు ఆల్మా గిడియన్‌కు వెళ్ళును. సుమారు క్రీ. పూ. 83 సం.

1 ఇప్పుడు జరహేమ్ల పట్టణమందు స్థాపించబడిన సంఘ జనులతో ఆల్మా మాట్లాడుట ముగించిన తర్వాత సంఘముపై అధ్యక్షత వహించి, పర్యవేక్షించుటకు దేవుని క్రమము చొప్పున హస్తనిక్షేపణము ద్వారా అతడు యాజకులను, పెద్దలను నియమించెను.

2 సంఘమునకు చెందని వారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడినప్పుడు, పశ్చాత్తాపము నిమిత్తము బాప్తిస్మము పొంది సంఘమందు చేర్చుకొనబడిరి.

3 మరియు సంఘమునకు చెందియుండి తమ దుష్టత్వము నిమిత్తము పశ్చాత్తాపపడక దేవుని యెదుట తమనుతాము తగ్గించుకొనకుండా ఉన్నవారు—అనగా తమ హృదయముల గర్వమందు పైకెత్తబడిన వారని నా ఉద్దేశ్యము—వారు తిరస్కరించబడి, వారి పేర్లు నీతిమంతుల పేర్ల మధ్య లెక్కింపబడకుండునట్లు తొలగించబడెను.

4 ఆ విధముగా వారు జరహేమ్ల పట్టణమందున్న సంఘము యొక్క క్రమమును స్థాపించుట మొదలుపెట్టిరి.

5 ఇప్పుడు దేవుని వాక్యము అందరికీ ధారాళముగా ఇవ్వబడెనని, దేవుని వాక్యము వినుటకు తమను సమకూర్చుకొను అవకాశము నుండి ఎవరు నిరోధించబడలేదని మీరు గ్రహించవలెనని నేను కోరుచున్నాను.

6 అయినప్పటికీ, వారు తరచుగా సమకూడవలెనని, దేవుడిని ఎరుగని వారి ఆత్మల సంక్షేమము నిమిత్తము ఉపవాసము మరియు బలమైన ప్రార్థన యందు చేరవలెనని దేవుని సంతానము ఆజ్ఞాపించబడెను.

7 ఇప్పుడు ఆల్మా ఈ సూచనలను చేసిన తర్వాత అతడు వారి నుండి, అనగా జరహేమ్ల పట్టణములోనున్న సంఘము నుండి వెడలిపోయి, సీదోను నదికి తూర్పున ఉన్న గిడియన్‌ లోయలోనికి వెళ్ళెను; అక్కడ గిడియన్‌ పేరుతో ఒక పట్టణము కట్టబడియుండెను, అది నీహోర్‌ చేతి ద్వారా ఖడ్గము చేత హతము చేయబడిన గిడియన్‌ పేరుననుసరించి పిలువబడిన లోయనందుండెను.

8 ఆల్మా వెళ్ళి, తన పితరుల చేత పలుకబడిన వాక్యము యొక్క యథార్థతను గూర్చిన బయల్పాటును బట్టి, అతని యందున్న ప్రవచనాత్మను బట్టి, తన జనులను వారి పాపముల నుండి విమోచించుటకు రావలసియున్న దేవుని కుమారుడైన ఆ యేసు క్రీస్తు యొక్క సాక్ష్యమును బట్టి మరియు అతడు పిలువబడిన ఆ పరిశుద్ధ క్రమమును బట్టి గిడియన్‌ లోయలో స్థాపించబడిన సంఘమునకు దేవుని వాక్యమును ప్రకటించుట మొదలుపెట్టెను. మరియు అది ఆ విధముగా వ్రాయబడెను. ఆమేన్‌.