2వ అధ్యాయము
ఒక వాగ్దానదేశమునకు ప్రయాణించుటకు జెరెడీయులు సిద్ధపడుదురు—అది ఒక శ్రేష్ఠమైన దేశము, అక్కడ మనుష్యులు క్రీస్తును సేవించవలెను లేదా నాశనము చేయబడవలెను—ప్రభువు, జెరెడ్ యొక్క సహోదరునితో మూడు గంటలపాటు మాట్లాడును—జెరెడీయులు పడవలను నిర్మించెదరు—పడవల లోపల వెలుతురు కొరకు ప్రతిపాదించవలెనని ప్రభువు జెరెడ్ యొక్క సహోదరుడిని అడుగును.
1 జెరెడ్, అతని సహోదరుడు, వారి కుటుంబములు, జెరెడ్ మరియు అతని సహోదరుని స్నేహితులు, వారి కుటుంబములు, వారు సమకూర్చుకొనిన వారి మందలలో ప్రతిదానిలో మగ మరియు ఆడ రెండింటితో పాటు, ఉత్తరము వైపు ఉన్న లోయలోనికి వెళ్ళిరి (ఆ లోయ పేరు నిమ్రోదు, అది ఒక బలమైన వేటగాడిని బట్టి అట్లు పిలువబడెను).
2 వారు ఉచ్చులు వేసి ఆకాశ పక్షులను పట్టుకొనిరి మరియు వారు ఒక పాత్రను తయారుచేసి, నీటిలోని చేపలను అందులో తీసుకొనిపోయిరి.
3 వారు తమతోపాటు డెసరెట్, అనగా ఒక తేనెటీగను కూడా తీసుకొనిపోయిరి; ఆ విధముగా తేనెటీగల గుంపులు, అన్ని రకముల విత్తనములతో పాటు భూముఖముపై ఉన్న వాటన్నిటిని వారు తమతోపాటు తీసుకొనిపోయిరి.
4 వారు నిమ్రోదు లోయలోనికి వచ్చినప్పుడు, ప్రభువు వచ్చి జెరెడ్ యొక్క సహోదరునితో మాట్లాడెను; ఆయన ఒక మేఘమందు ఉండెను మరియు జెరెడ్ యొక్క సహోదరుడు ఆయనను చూడలేదు.
5 వారు అరణ్యములోనికి, అనగా మనుష్యుడు ఎన్నడూ ఉండియుండని భాగములోనికి వెళ్ళవలెనని ప్రభువు వారిని ఆజ్ఞాపించెను. మరియు ప్రభువు వారి ముందు వెళ్ళెను. ఆయన మేఘమందు నిలిచియుండగా వారితో మాట్లాడి, వారు ఎక్కడకు ప్రయాణము చేయవలెనోయని సూచనలిచ్చెను.
6 వారు అరణ్యమందు ప్రయాణము చేసిరి మరియు పడవలను నిర్మించిరి; ప్రభువు యొక్క హస్తము చేత నిరంతరము నిర్దేశింపబడుచూ వాటిలో అనేక జలములను దాటిరి.
7 వారు సముద్రము అవతల అరణ్యమందు ఆగుటకు ప్రభువు అనుమతించలేదు, కానీ దేశములన్నింటిలోకెల్లా శ్రేష్ఠమైనది మరియు నీతిమంతుల కొరకు ప్రభువైన దేవుడు భద్రపరచినది అయిన వాగ్దానదేశమునకు వారు రావలెనని ఆయన కోరెను.
8 ఆ సమయము నుండి మొదలుకొని ఎన్నటికీ ఈ వాగ్దానదేశమును స్వాధీనము చేసుకొనువారు ఏకైక సత్య దేవుడైన ఆయనను సేవించవలెనని, లేని యెడల ఆయన ఉగ్రత యొక్క సంపూర్ణత వారిపై వచ్చునప్పుడు వారు నాశనము చేయబడవలెనని ఆయన తన ఉగ్రతలో జెరెడ్ యొక్క సహోదరునితో ప్రమాణము చేసెను.
9 ఇప్పుడు, ఇది ఒక వాగ్దానదేశమని ఈ దేశమును గూర్చి దేవుని యొక్క శాసనములను మనము చూడగలము; దీనిని స్వాధీనము చేసుకొను జనులు దేవుడిని సేవించవలెను, లేనియెడల ఆయన ఉగ్రత యొక్క సంపూర్ణత వారిపై వచ్చునప్పుడు, వారు నాశనము చేయబడుదురు. మరియు వారు దుర్నీతిలో పరిపక్వమైనప్పుడు, ఆయన ఉగ్రత యొక్క సంపూర్ణత వారిపై వచ్చును.
10 ఏలయనగా ఇది దేశములన్నింటిలోకెల్లా శ్రేష్ఠమైన దేశము; అందువలన, దీనిని స్వాధీనము చేసుకొనువారు దేవుడిని సేవించవలెను, లేని యెడల నాశనము చేయబడవలెను; ఇది దేవుని యొక్క నిత్య శాసనము. అయితే, దేశజనుల మధ్య దుర్నీతి సంపూర్ణమగు వరకు వారు నాశనము చేయబడరు.
11 ఓ అన్యజనులారా, దేవుని శాసనములను మీరు తెలుసుకొనునట్లు—మీరు పశ్చాత్తాపపడి, మీ దుర్నీతి సంపూర్ణమగువరకు దానిలో కొనసాగకుండునట్లు, ఆ దేశ నివాసులు ఇంతవరకు చేసినట్లుగా దేవుని ఉగ్రత యొక్క సంపూర్ణతను మీపై తెచ్చుకొనకుండునట్లు ఇది మీ యొద్దకు వచ్చును.
12 ఇదిగో, ఇది ఒక శ్రేష్ఠమైన దేశము; మరియు మేము వ్రాసిన సంగతుల ద్వారా విశదము చేయబడిన యేసు క్రీస్తును, దేశము యొక్క దేవుడిని వారు సేవించిన యెడల, దీనిని స్వాధీనము చేసుకొను ఏ జనమైనను దాస్యము నుండి, చెర నుండి మరియు పరలోకము క్రిందనున్న ఇతర జనములన్నింటి నుండి స్వేచ్ఛగా ఉండును.
13 ఇప్పుడు నేను, నా వృత్తాంతమును కొనసాగించుచున్నాను; ఇదిగో, దేశములను విభజించు ఆ గొప్ప సముద్రము యొద్దకు ప్రభువు జెరెడ్ మరియు అతని సహోదరులను తీసుకువచ్చెను. వారు సముద్రము యొద్దకు వచ్చినప్పుడు తమ గుడారములను వేసుకొని, ఆ స్థలమును మోరియాంకమర్ అని పిలిచిరి; వారు గుడారములలో నివసించిరి మరియు నాలుగు సంవత్సరముల పాటు సముద్రపు ఒడ్డున వారు గుడారములలో నివసించిరి.
14 నాలుగు సంవత్సరముల అంతమున, ప్రభువు మరలా జెరెడ్ యొక్క సహోదరుని యొద్దకు వచ్చి, ఒక మేఘమందు నిలిచి అతనితో మాట్లాడెను. మూడు గంటల పాటు ప్రభువు జెరెడ్ యొక్క సహోదరునితో మాట్లాడెను మరియు ప్రభువు నామమందు ప్రార్థన చేయుటను అతడు జ్ఞాపకము చేసుకొనలేదని అతడిని గద్దించెను.
15 అప్పుడు జెరెడ్ యొక్క సహోదరుడు తాను చేసిన చెడు నిమిత్తము పశ్చాత్తాపపడి, అతనితో ఉన్న అతని సహోదరుల కొరకు ప్రభువు నామమందు ప్రార్థన చేసెను. మరియు ప్రభువు అతనితో ఇట్లనెను: నిన్ను, నీ సహోదరులను వారి పాపముల విషయమై నేను క్షమించెదను. కానీ, నీవిక ఏ మాత్రము పాపము చేయరాదు, ఏలయనగా నా ఆత్మ ఎల్లప్పుడు నరునితో పోరాడదని నీవు జ్ఞాపకము చేసుకొనవలెను; అందువలన పూర్తిగా పరిపక్వమగువరకు మీరు పాపము చేసిన యెడల, మీరు ప్రభువు యొక్క సన్నిధి నుండి కొట్టివేయబడుదురు మరియు నేను మీకు స్వాస్థ్యముగా ఇవ్వబోవు దేశమును గూర్చి నా తలంపులు ఇవే. ఏలయనగా, ఇది దేశములన్నింటిలోకెల్లా శ్రేష్ఠమైన దేశముగా ఉండును.
16 ఇప్పుడు మీరు పనికి వెళ్ళి, ఇంతవరకు నిర్మించిన మాదిరిగా పడవలను నిర్మించుడి అని ప్రభువు చెప్పెను. జెరెడ్ యొక్క సహోదరుడు మరియు అతని సహోదరులు పనికి వెళ్ళి, వారు ఇంతకుముందు నిర్మించిన మాదిరిగా ప్రభువు యొక్క ఆదేశముల ప్రకారము పడవలను నిర్మించిరి. అవి చిన్నవైయుండి, నీటిపై పక్షి తేలికగా ఉన్నట్లే, అవి కూడా నీటిపైన తేలికగా ఉండెను.
17 అవి ఏ మాదిరిగా నిర్మించబడినవనగా, ఒక గిన్నెవలే నీటిని పట్టియుంచునట్లు అవి మిక్కిలి బిగుతుగా ఉండెను; వాటి అడుగుభాగము ఒక గిన్నెవలే బిగుతుగా ఉండెను; వాటి ప్రక్క భాగములు ఒక గిన్నెవలే బిగుతుగా ఉండెను; వాటి చివరలు కొనగా ఉండెను; వాటి పైభాగము ఒక గిన్నెవలే బిగుతుగా ఉండెను; వాటి పొడవు ఒక చెట్టంత పొడవైయుండెను మరియు వాటి ద్వారము మూయబడినప్పుడు ఒక గిన్నెవలే బిగుతుగా ఉండెను.
18 ఇప్పుడు జెరెడ్ యొక్క సహోదరుడు, ఇట్లు చెప్పుచూ ప్రభువుకు మొరపెట్టెను: ఓ ప్రభువా, నీవు నాకు ఆజ్ఞాపించిన పనిని నేను నెరవేర్చితిని మరియు నీవు నాకు నిర్దేశించినట్లుగా నేను పడవలను తయారుచేసితిని.
19 ఓ ప్రభువా, వాటిలో ఎట్టి వెలుతురు లేదు; మేమెక్కడకు నడిపించవలెను? మేము నశించిపోవుదుము, ఏలయనగా వాటిలో ఉన్న గాలి తప్ప, మేము పీల్చుటకు గాలి లేదు; కావున, మేము నశించిపోవుదుము.
20 అప్పుడు ప్రభువు జెరెడ్ యొక్క సహోదరునితో ఇట్లనెను: ఇదిగో, పైభాగమందు మరియు అడుగు భాగమందు నీవు ఒక రంధ్రము చేయుము; మీరు గాలి కొరకు బాధపడునప్పుడు రంధ్రమును తెరచి, గాలిని పొందవలెను. ఒకవేళ మీ పైకి నీరు వచ్చిన యెడల, మీరు వరదలో నాశనము కాకుండునట్లు రంధ్రమును మూయవలెను.
21 మరియు ప్రభువు ఆజ్ఞాపించిన ప్రకారము జెరెడ్ యొక్క సహోదరుడు చేసెను.
22 మరలా అతడు ప్రభువుకు ఇట్లు మొరపెట్టెను: ఓ ప్రభువా, నీవు నన్ను ఆజ్ఞాపించినట్లుగా నేను చేసియున్నాను; నేను, నా జనుల కొరకు పడవలను తయారు చేసియున్నాను; అయితే, వాటిలో వెలుతురు లేదు. ఓ ప్రభువా, మేము ఈ గొప్ప జలమును చీకటిలో దాటుటకు నీవు అనుమతించెదవా?
23 అంతట ప్రభువు, జెరెడ్ యొక్క సహోదరునితో ఇట్లనెను: మీ పడవలలో మీరు వెలుతురు కలిగియుండునట్లు, నేను ఏమి చేయవలెనని మీరు కోరుచున్నారు? ఇదిగో, మీరు కిటికీలను కలిగియుండలేరు, ఏలయనగా అవి ముక్కలుగా కొట్టబడును; లేదా మీరు అగ్నిని మీతో తీసుకొనిపోలేరు, ఏలయనగా మీరు అగ్ని యొక్క వెలుగు ద్వారా వెళ్ళరాదు.
24 ఇదిగో, మీరు సముద్రము మధ్యలో ఒక తిమింగలము వలే ఉండెదరు; ఏలయనగా, పర్వతముల వంటి అలలు మీపైన కొట్టును. అయినప్పటికీ, సముద్రపు లోతులలో నుండి నేను మిమ్ములను తిరిగి పైకి తెచ్చెదను; ఏలయనగా, గాలులు నా నోటి నుండి బయటకు వెళ్ళినవి; వర్షములు మరియు వరదలను నేను ముందుకు పంపియున్నాను.
25 ఇదిగో, నేను మిమ్ములను ఈ సంగతుల కొరకు ముందుగా సిద్ధము చేయుచున్నాను; ఏలయనగా సముద్రపు అలలు, వీచే గాలులు మరియు రాబోవు వరదల కొరకు నేను మిమ్ములను సిద్ధపరచని యెడల, మీరు ఈ గొప్ప అగాధమును దాటలేరు. కావున సముద్రపు లోతులలో మీరు మ్రింగివేయబడినప్పుడు, మీరు వెలుతురు కలిగియుండునట్లు మీ కొరకు నేను ఏమి సిద్ధము చేయవలెనని మీరు కోరుచున్నారు?