లేఖనములు
మోషైయ 14


14వ అధ్యాయము

యెషయా, మెస్సీయ వలె మాట్లాడును—మెస్సీయ యొక్క అవమానము, శ్రమలు వివరించబడినవి—ఆయన తన ప్రాణమును పాపము కొరకు ఒక అర్పణముగా చేయును మరియు తిరుగుబాటు చేసినవారిని గూర్చి విజ్ఞాపనము చేయును—యెషయా 53 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 148 సం.

1 ఇంకను యెషయా ఇట్లు చెప్పలేదా: మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ప్రభువు బాహువు ఎవనికి బయలుపరచబడెను?

2 లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన యెదుట పెరిగెను; అతనికి సురూపమైనను సొగసైనను లేదు; మనము అతని చూచి, ఆపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.

3 అతడు తృణీకరింపబడినవాడును ఆయెను; మనుష్యుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిననుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతడిని ఎన్నిక చేయకపోతిమి.

4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను; అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడిన వానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.

5 మన అతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను, మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను; మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను; అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.

6 మనమందరము గొఱ్ఱెల వలే త్రోవ తప్పిపోతిమి; మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను; ప్రభువు మన అందరి దోషమును అతనిమీద మోపెను.

7 అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు; వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని యెదుట గొఱ్ఱెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు.

8 అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను; అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను; అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు?

9 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను; ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను; నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు.

10 అతడిని నలుగగొట్టుటకు ప్రభువుకు ఇష్టమాయెను; ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను; ఆయన అతడిని అపరాధపరిహారార్థబలి చేయగా అతడు తన సంతానమును చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, ప్రభువు ఉద్దేశ్యము అతని వలన సఫలమగును.

11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును; నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.

12 కావున గొప్ప వారితో నేనతనికి పాలుపంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును; ఏలయనగా మరణమునొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను; అతిక్రమము చేయువారిలో యెంచబడినవాడాయెను; అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారిని గూర్చి విజ్ఞాపనము చేసెను.