100వ ప్రకరణము
1833, అక్టోబరు 12న పెర్రిస్ బర్గ్, న్యూయార్క్లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్, సిడ్నీ రిగ్డన్లకు ఇవ్వబడిన బయల్పాటు. ఇద్దరు సహోదరులు, అనేక దినములు వారి కుటుంబములకు దూరముగా ఉండుట వలన, వారిని గూర్చి కొంత కలవరపడిరి.
1–4, జోసెఫ్ మరియు సిడ్నీ ఆత్మల రక్షణ కొరకు సువార్తను ప్రకటించవలెను; 5–8, వారేమి చెప్పవలెనో ఆ గడియలోనే వారికది ఇవ్వబడును; 9–12, సిడ్నీ మాట్లాడువానిగా, జోసెఫ్ బయల్పాటుదారునిగా, సాక్ష్యమందు బలముగా ఉండవలెను; 13–17, ప్రభువు నిర్మలమైన జనులను పుట్టించును, విధేయులు రక్షింపబడుదురు.
1 మీతో నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా స్నేహితులైన సిడ్నీ మరియు జోసెఫ్, మీ కుటుంబములు కుశలముగానున్నవి; వారు నా చేతులలోనున్నారు, నా దృష్టికి ఏది మంచిదో వారికది చేయుదును; ఏలయనగా నా యందు సర్వశక్తి ఉన్నది.
2 కాబట్టి నన్ను వెంబడించుడి, నేను మీకిచ్చు ఉపదేశమును ఆలకించుడి.
3 ఇదిగో చూడుడి, ఈ ప్రదేశములోను, చుట్టుప్రక్కల ప్రాంతములలోను నాకు అనేక జనులు కలరు; ఈ తూర్పు దేశములో చుట్టుప్రక్కల ప్రాంతములలో కార్యానుకూలమైన ద్వారము తెరువబడును.
4 కాబట్టి, ప్రభువైన నేను ఈ ప్రదేశమునకు వచ్చుటకు మిమ్ములను అనుమతించితిని; ఏలయనగా ఆత్మల రక్షణ కొరకు ఇది నా యందు యుక్తమైయుండెను.
5 కాబట్టి, ఈ జనులకు మీ స్వరములనెత్తుడి; మీ హృదయములలో నేనుంచు తలంపులను పలుకుడి, మనుష్యుల యెదుట మీరు గద్దింపబడరని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను;
6 ఏలయనగా, ఆ గడియలోనే మీకది ఇవ్వబడును, మీరేమి మాట్లాడవలెనో ఆ క్షణమందే ఇవ్వబడును.
7 కానీ నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా నా నామమున మీరు ప్రకటించునదేదైనను అన్ని విషయములలో హృదయశుద్ధితోను, సాత్వీకమైన మనస్సుతోను మీరు ప్రకటించవలెను.
8 మీకు నేను ఈ వాగ్దానమును ఇచ్చుచున్నాను, అదేమనగా మీరు దీనిని చేసిన యెడల మీరు చెప్పువాటన్నిటికి సాక్ష్యము చెప్పుటకు పరిశుద్ధాత్మ క్రుమ్మరించబడును.
9 నా సేవకుడైన సిడ్నీ, నీవు ఈ జనుల కొరకు మాట్లాడువానిగానుండుట నా యందు యుక్తమైయున్నది; నా సేవకుడైన జోసెఫ్ కు బదులు మాట్లాడువానిగానుండుటకు కూడా ఈ పిలుపునకు నేను నిన్ను నియమించెదను.
10 సాక్ష్యమునందు బలముగానుండుటకు అతనికి నేను శక్తినిచ్చెదను.
11 లేఖనములన్నింటిని వివరించుటలో బలవంతుడగుటకు నేను నీకు శక్తినిచ్చెదను, తద్వారా నీవు అతనికి బదులు మాట్లాడువానిగా ఉండవచ్చును, అతడు నీకు బయల్పాటుదారునిగా ఉండును, తద్వారా భూమిమీద నా రాజ్యమునకు సంబంధించిన అన్ని విషయముల ఖచ్చితత్వమును నీవు తెలుసుకొందువు.
12 కాబట్టి, మీ ప్రయాణమును కొనసాగనియ్యుడి, మీ హృదయాలను సంతోషపడనియ్యుడి; ఏలయనగా ఇదిగో అంతము వరకు నేను మీతోనున్నాను.
13 ఇప్పుడు సీయోను గూర్చి నేను మీకొక మాటను తెలిపెదను. ఆమె స్వల్పకాలము శిక్షించబడినప్పటికి, సీయోను విమోచింపబడును.
14 నీ సహోదరులు, నా సేవకులైన ఓర్సన్ హైడ్, జాన్ గౌల్డ్ నా చేతులలో ఉన్నారు; వారు నా ఆజ్ఞలను పాటించిన యెడల వారు రక్షింపబడెదరు.
15 కాబట్టి, మీ హృదయములు సమాధానపడనియ్యుడి; ఏలయనగా యథార్థముగా నడుచుకొనువారికి, వారి మేలు కొరకు, సంఘము పరిశుద్ధపరచబడుటకు సమస్తము సమకూడి జరుగును.
16 ఏలయనగా నీతితో నన్ను సేవించు నిర్మలమైన జనులను నా కొరకు నేను పుట్టించెదను;
17 ప్రభువు నామమున ప్రార్థన చేయుచు, ఆయన ఆజ్ఞలను పాటించు వారందరు రక్షింపబడుదురు. అలాగే జరుగును గాక. ఆమేన్.