లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 43


43వ ప్రకరణము

1831 ఫిబ్రవరి, ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ సమయములో బయల్పాటుదారులుగా అసత్య ప్రకటనలు చేయు జనుల వలన కొంతమంది సంఘ సభ్యులు కలత చెందిరి. ప్రవక్త ప్రభువును విచారించి, సంఘ పెద్దలకు నిర్దేశించబడిన ఈ సమాచారమును పొందెను. మొదటి భాగము సంఘ పరిపాలనాంశములను గూర్చి తెలియజేయును; తరువాయి భాగము భూమిపైనున్న జనములకు పెద్దలు చేయవలసిన ఒక హెచ్చరికను కలిగియున్నది.

1–7, నియమించబడిన వాని ద్వారా మాత్రమే బయల్పాటులు, ఆజ్ఞలు వచ్చును; 8–14, ప్రభువు యెదుట సంపూర్ణ పరిశుద్ధతతో నడుచుకొనుట వలన పరిశుద్ధులు పరిశుద్ధపరచబడుదురు; 15–22, పశ్చాత్తాపము ప్రకటించుటకు, ప్రభువు నియమించిన ఆ మహాదినము కొరకు మనుష్యులను సిద్ధపరచుటకు పెద్దలు ముందుకు పంపబడిరి; 23–28, ప్రభువు మనుష్యులతో తన స్వరము ద్వారా, ప్రకృతి శక్తుల ద్వారా మాట్లాడును; 29–35, వెయ్యేండ్ల పరిపాలన, సాతాను బంధించబడుట జరుగును.

1 ఓ నా సంఘ పెద్దలారా ఆలకించుడి, నేను మీతో మాట్లాడు మాటలకు చెవియొగ్గుడి.

2 నా చేతినుండి ఆజ్ఞలు, బయల్పాటులు పొందుటకు నేను మీ కొరకు నియమించిన వాని ద్వారా నా సంఘమునకు ధర్మశాస్త్రముగానుండుటకు ఒక ఆజ్ఞను మీరు పొందియున్నారని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

3 అతడు నా యందు నిలిచియుండిన యెడల, అతడు కొనిపోబడు వరకు ఆజ్ఞలు, బయల్పాటులు పొందుటకు మరెవరును మీ కొరకు నియమించబడలేదు—దీనిని మీరు నిశ్చయముగా తెలుసుకొందురు.

4 కానీ అతని ద్వారా తప్ప మరెవరును ఈ బహుమానమునకు నియమింపబడరు; ఏలయనగా అది వాని నుండి తీసివేయబడిన యెడల, వానికి మారుగా మరియొకనిని నియమించుటకే తప్ప మరిదేనికి అతడు శక్తిని కలిగియుండడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

5 ఇది మీకు ఒక నియమముగా ఉండును, అదేమనగా మీ యొద్దకు వచ్చు ఎవరి బోధనలనైనను బయల్పాటులు లేదా ఆజ్ఞలుగా మీరు స్వీకరించకూడదు;

6 మీరు మోసపోకుండుటకు, అవి నా నుండి కలుగలేదని మీరు తెలుసుకొనుటకు దీనిని నేను మీకిచ్చుచున్నాను.

7 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నా చేత నియమించబడిన వాడు ద్వారము గుండా వచ్చును, ఇంతకుముందు నేను మీకు చెప్పియున్న ప్రకారము, నేను ఏర్పరచిన వాని ద్వారా మీరు పొందియున్న మరియు పొందబోయే ఆ బయల్పాటులను బోధించుటకు అతడు నియమించబడును.

8 ఇదిగో, ఇప్పుడు నేను మీకు ఒక ఆజ్ఞనిచ్చుచున్నాను, మీరు కూడి వచ్చినప్పుడు మీరు ఒకరికొకరు ఉపదేశించుకొని, జ్ఞానాభివృద్ధిని కలుగజేయుడి, తద్వారా మీరు ఏవిధముగా ప్రవర్తించి, నా సంఘమును నడిపించవలెనో, ఏవిధముగా నేను మీకు ఇచ్చియున్న నా ధర్మశాస్త్రములోని అంశములను బట్టి ప్రవర్తించవలెనో తెలుసుకొందురు.

9 ఆవిధముగా మీరు నా సంఘ ధర్మశాస్త్రమునందు ఉపదేశించబడిన వారగుదురు, మీరు పొందియున్న దానిచేత పరిశుద్ధపరచబడుదురు మరియు మీరు నా యెదుట సంపూర్ణ పరిశుద్ధతతో నడుచుకొనుటకు మీయంతట మీరు కట్టుబడి ఉండవలెను—

10 కాబట్టి మీరు దీనిని చేసిన యెడల, మీరు పొందియున్న రాజ్యమునకు మహిమ చేర్చబడును. మీరు దీనిని చేయని యెడల అది, అనగా మీరు పొందియున్నది కూడా తీసివేయబడును.

11 మీ మధ్యనున్న పాపమును మీరు తీసివేయుడి; నా యెదుట మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి;

12 పరలోకరాజ్య మహిమలను మీరు కోరిన యెడల, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. ను మీరు నియమించి, విశ్వాస సహితమైన ప్రార్థనతో నా యెదుట అతనికి సహాయము చేయుడి.

13 మరలా, నేను మీతో చెప్పునదేమనగా, పరలోకరాజ్య మర్మములు మీరు తెలుసుకొనగోరిన యెడల, అతనికి ఆహారమును, వస్త్రమును, నేనతనికి ఆజ్ఞాపించియున్న కార్యమును నెరవేర్చుటకు అతనికి అవసరమగు దేనినైనను సమకూర్చుడి.

14 మీరు దీనిని చేయని యెడల, అతడిని చేర్చుకొనియున్న వారితోనే అతడు నిలిచియుండును, తద్వారా నా యెదుట ఒక పవిత్ర జనమును నాకు నేను దాచుకొందును.

15 మరలా నేను చెప్పుచున్నాను, నేను నియమించియున్న నా సంఘ పెద్దలారా, మీరు ఆలకించుడి: మీరు బోధింపబడుటకు కాక, నా ఆత్మశక్తి చేత నేను మీ చేతులలో ఉంచియున్న సంగతులను నరుల సంతానమునకు బోధించుటకు పంపబడియున్నారు;

16 మీరు ఉన్నత స్థలమునుండి బోధించబడవలెను. మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి మరియు మీరు శక్తిచేత దీవించబడుదురు, తద్వారా నేను మాటలాడియున్న ప్రకారము మీరు బోధించెదరు.

17 మీరు ఆలకించుడి, ఏలయనగా ఇదిగో ప్రభువు నియమించిన ఆ మహా దినము సమీపములోనున్నది.

18 ఏలయనగా పరలోకము నుండి ప్రభువు తన స్వరమును వినిపించు దినము వచ్చుచున్నది; పరలోకములు వణకును, భూమి కంపించును, దేవుని బూర బిగ్గరగాను, దీర్ఘకాలము మ్రోగుచూ నిద్రించుచున్న జనములతో ఇట్లు చెప్పును: పరిశుద్ధులారా, లేచి జీవించుడి; పాపులారా, నేను మరలా పిలుచువరకు నిద్రలో కొనసాగుడి.

19 కాబట్టి మీరు దుష్టుల మధ్య కనుగొనబడకుండునట్లు, మీ నడుములకు దట్టీలను కట్టుకొనుడి.

20 తాళక మీ స్వరములను ఎలుగెత్తుడి. ప్రభువు నియమించిన ఆ మహాదినము కొరకు మిమ్ములను మీరు సిద్ధపరచుకొనుడి అని చెప్పుచూ పశ్చాత్తాపపడుడని జనములకు, వృద్ధులు యౌవనులు ఇరువురికి, దాసులు స్వతంత్రులు ఇరువురికి ప్రకటించుడి;

21 ఏలయనగా మనుష్యుడనైన నేను, నా స్వరమును ఎలుగెత్తి, పశ్చాత్తాపపడుడని చెప్పగా మీరు నన్ను ద్వేషించినట్లైతే—మరి పశ్చాత్తాపపడుడి, ప్రభువు నియమించిన ఆ మహాదినము కొరకు సిద్ధపడుడి అని పలుకుచూ, జీవించియున్న వారందరి చెవులలో చెప్పుచూ భూమ్యాంతముల నుండి ఉరుములు వాటి స్వరములను వినిపించు దినము వచ్చినప్పుడు మీరేమి చెప్పుదురు?

22 మరలా, మెరుపులు తూర్పున పుట్టి పడమరకు కనబడి, జీవించియున్న వారందరికి వాటి స్వరములను వినిపించునప్పుడు, వినువారందరి చెవులు గింగురుమనిపించి—మీరు పశ్చాత్తాపపడుడి, ప్రభువు నియమించిన ఆ మహాదినము కొరకు సిద్ధపడుడి అని ఈ మాటలను చెప్పునప్పుడు మీరేమందురు?

23 మరలా—ఓ భూలోక జనములారా, ఆలకించుడి, మిమ్ములను సృష్టించిన దేవుని మాటలను వినుడని చెప్పుచూ పరలోకము నుండి ప్రభువు తన స్వరమును వినిపించును.

24 ఓ, భూలోక జనములారా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును మిమ్ములను ఎన్నోమారులు చేర్చుకొనవలెననియుంటిని గాని మీరు ఒల్లకపోతిరి!

25 నా సేవకుల నోటిమాట ద్వారా, దేవదూతల పరిచర్య ద్వారా, నా స్వంత స్వరము ద్వారా, ఉరుముల స్వరము ద్వారా, మెరుపుల స్వరము ద్వారా, తుఫానుల స్వరము ద్వారా, భూకంపముల స్వరము ద్వారా, గొప్ప వడగండ్ల వానల ద్వారా, కరువులు మరియు సమస్త విధములైన తెగుళ్ళ స్వరము ద్వారా, గొప్ప బూరధ్వని ద్వారా, తీర్పుతీర్చు స్వరము ద్వారా, దినమంతయు కరుణగల స్వరము ద్వారా, మహిమ, ఘనత మరియు నిత్యజీవపు ఐశ్వర్యముల ద్వారా ఎన్నిమారులు నేను మీతో మాట్లాడితిని, నిత్య రక్షణతో మిమ్ములను రక్షింపదలచితిని, గాని మీరు ఒల్లకపోతిరి.

26 ఇదిగో, కోపముతో నా ఉగ్రతాపాత్ర నిండియుండు దినము వచ్చును.

27 ఇవి మీ దేవుడైన ప్రభువు యొక్క మాటలని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

28 కాబట్టి మీరు పనిచేయుడి, చివరిసారి నా ద్రాక్షతోటలో మీరు పనిచేయుడి—చివరిసారిగా భూలోక నివాసులకు ప్రకటించుడి.

29 ఏలయనగా నా అనుకూల సమయములో తీర్పుతీర్చుటకు భూమిపైకి నేను వచ్చెదను మరియు నా ప్రజలు విమోచింపబడి, భూమిపై నాతో పరిపాలించెదరు.

30 నా సేవకుల నోటిద్వారా చెప్పబడిన ఆ గొప్ప వెయ్యేండ్ల పరిపాలన వచ్చును.

31 అప్పుడు సాతాను బంధించబడును మరియు అతడు విడిచిపెట్టబడినప్పుడు, మరలా అతడు కొంత కాలము మాత్రమే పరిపాలించును, తరువాత భూమి అంతమగును.

32 నీతిగలిగి జీవించువాడు రెప్పపాటులో మార్పుచెందును మరియు అగ్నితో వలెనైనట్లు భూమి గతించిపోవును.

33 దుష్టులు ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోవుదరు మరియు వారు నా యెదుట తీర్పుతీర్చబడుటకు వచ్చువరకు వారి అంతము భూమిపైన ఏ మనుష్యుడు యెరుగడు, ఎన్నడూ తెలుసుకొనడు.

34 మీరు ఈ మాటలను ఆలకించుడి. ఇదిగో, లోక రక్షకుడనైన యేసు క్రీస్తును నేనే. ఈ సంగతులను మీ హృదయాలలో భద్రపరచుకొనుడి మరియు నిత్యత్వపు పవిత్ర సత్యములను గూర్చి మీ మనస్సులలో ఆలోచన చేయుడి.

35 స్వస్థబుద్ధి కలిగియుండుడి. నా సమస్త ఆజ్ఞలను పాటించుడి. అలాగే జరుగును గాక. ఆమేన్.