లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 62


62వ ప్రకరణము

1831 ఆగష్టు 13న, మిస్సోరిలోని ఛారిటన్‌లో మిస్సోరి నది ఒడ్డున ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ దినమున ఇండిపెండెన్స్ నుండి కర్ట్లాండ్‌కు వెళ్ళు మార్గములో ప్రవక్త మరియు ఆయన సమూహము లేదా పటాలము సీయోను ప్రదేశమునకు వెళ్ళుచున్న అనేకమంది పెద్దలను కలిసిరి, వారి సంతోషకరమైన అభివందనముల తరువాత ఈ బయల్పాటును పొందిరి.

1–3, సాక్ష్యములు పరలోకములో లిఖించబడును; 4–9, వివేకమును బట్టి ఆత్మ నిర్దేశించిన ప్రకారము పెద్దలు ప్రయాణము చేసి, సువార్తను ప్రకటించవలెను.

1 ఇదిగో, ఓ నా సంఘ పెద్దలారా, ఆలకించుడని దేవుడైన మీ ప్రభువు సెలవిచ్చుచున్నాడు, ఆయనే మీ న్యాయవాదియైన యేసు క్రీస్తు, ఆయన నరుని బలహీనతను మరియు శోధింపబడువారికి ఏవిధముగా సహాయము చేయవలెనో యెరిగియున్నాడు.

2 నిశ్చయముగా నా కన్నులు ఇంకను సీయోను ప్రదేశమునకు ఎక్కి వెళ్ళని వారిమీద ఉన్నవి: కాబట్టి మీ నియమితకార్యము ఇంకా సంపూర్తి కాలేదు.

3 అయినప్పటికీ మీరు ధన్యులు, ఏలయనగా దేవదూతలు చూచుట కొరకు మీరు చెప్పిన సాక్ష్యము పరలోకమందు లిఖించబడియున్నది; వారు మీ యెడల సంతోషించుచున్నారు మరియు మీ పాపములు క్షమించబడియున్నవి.

4 ఇప్పుడు మీ ప్రయాణమును కొనసాగించుడి. సీయోను ప్రదేశములో సమావేశమై, ఒక కూడికను ఏర్పాటుచేసి కలిసి సంతోషించుడి మరియు మహోన్నతునికి సంస్కారమును అర్పించుడి.

5 అప్పుడు మీరు సాక్ష్యము చెప్పుటకు తిరిగి వెళ్ళవచ్చును; మీ దృష్టికి అనుకూలమైనట్లుగా అందరు కలిసికట్టుగా లేదా ఇద్దరిద్దరుగా వెళ్ళినను అది నాకు ముఖ్యము కాదు; కేవలము విశ్వాసముగా ఉండి, భూలోక నివాసులకు లేదా దుష్ట జనసమూహముల మధ్య సంతోషకరమైన సువార్తను ప్రకటించుడి.

6 ఇదిగో ప్రభువైన నేను, వాగ్దానములు నెరవేరుటకు, మీలో విశ్వాసులు రక్షించబడి, మిస్సోరి ప్రదేశములో కలిసి సంతోషించుటకు మిమ్ములను ఒకచోటికి చేర్చితిని. ప్రభువైన నేను విశ్వాసులకు వాగ్దానము చేయుదును మరియు అబద్ధమాడలేను.

7 మీలో ఎవడైనను గుఱ్ఱములపై లేదా కంచర గాడిదలపై లేదా రథములపై స్వారీచేయుటకు కోరి, అన్నివిషయములలో కృతజ్ఞతాభావముతో దానిని ప్రభువు హస్తమునుండి స్వీకరించిన యెడల, అతడు ఈ దీవెనను పొందుటకు ప్రభువైన నేను సమ్మతించుచున్నాను.

8 ఈ సంగతులు మీ వివేకమును బట్టి ఆత్మ నిర్దేశముల ప్రకారము చేయుటకు మీ వశములోనున్నవి.

9 ఇదిగో, పరలోకరాజ్యము మీదైయున్నది మరియు నేను ఎల్లప్పుడు విశ్వాసులతో ఉన్నాను. అలాగే జరుగును గాక. ఆమేన్.