విశ్వాస ప్రమాణాలు
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము
1వ అధ్యాయము
1 నిత్యుడగు తండ్రియైన దేవుడిని, ఆయన కుమారుడైన యేసు క్రీస్తును, పరిశుద్ధాత్మను మేము నమ్ముచున్నాము.
2 మనుష్యులు వారి స్వంత పాపముల కొరకు శిక్షింపబడుదురు, కానీ ఆదాము యొక్క అతిక్రమము కొరకు కాదని మేము నమ్ముచున్నాము.
3 క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా సువార్త నియమములకు, విధులకు విధేయత చూపుట వలన మనుష్యజాతి యావత్తు రక్షింపబడునని మేము నమ్ముచున్నాము.
4 సువార్త యొక్క మొదటి నియమములు, విధులు: మొదటిది, యేసు క్రీస్తు నందు విశ్వాసము; రెండవది పశ్చాత్తాపము; మూడవది, పాపక్షమాపణ కొరకు ముంచుట ద్వారా బాప్తిస్మము; నాల్గవది, పరిశుద్ధాత్మ వరము కొరకు హస్తనిక్షేపణము అని మేము నమ్ముచున్నాము.
5 సువార్తను బోధించుటకు, దాని విధులను నిర్వహించుటకు ఒక మనుష్యుడు దేవుని వలన, మరియు ప్రవచనముచేత మరియు అధికారములోనున్న వారి హస్తనిక్షేపణముచేత పిలువబడవలెనని మేము నమ్ముచున్నాము.
6 అపొస్తలులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, సువార్తికులు మొదలైనవారిగా పిలువబడి, ప్రాచీన సంఘములో ఉన్న ఆ వ్యవస్థనే మేము నమ్ముచున్నాము
7 భాషలు మాట్లాడు వరము, ప్రవచనము, బయల్పాటు, దర్శనములు, స్వస్థత, భాషల అనువాదము మొదలగు వాటిని మేము నమ్ముచున్నాము.
8 తప్పులులేకుండా అనువదించబడినంత వరకు బైబిలు దేవుని వాక్యమని మేము నమ్ముచున్నాము; మోర్మన్ గ్రంథము కూడా దేవుని వాక్యమని మేము నమ్ముచున్నాము.
9 దేవుడు బయలుపరచిన సమస్తమును, ఇప్పుడు ఆయన బయలుపరచు సమస్తమును మేము నమ్ముచున్నాము, దేవుని రాజ్యమునకు సంబంధించిన గొప్ప మరియు ముఖ్యమైన సంగతులనేకము ఆయన ఇంకా బయలుపరచునని మేము నమ్ముచున్నాము.
10 ఇశ్రాయేలీయులు వాస్తవముగా సమకూర్చబడుటను, పది గోత్రముల పునఃస్థాపనను; సీయోను (నూతన యెరూషలేము) అమెరికా ఖండములో నిర్మింపబడునని; భూమి మీద క్రీస్తు స్వయముగా పరిపాలించునని; భూమి నూతనపరచబడి, పరదైసు మహిమను పొందునని మేము నమ్ముచున్నాము.
11 మా మనస్సాక్షి నిర్దేశించిన ప్రకారం సర్వశక్తిమంతుడైన దేవుడిని ఆరాధించు విశేషాధికారమును కలిగియుండుటను మేము హక్కుగా కోరుచున్నాము, మరియు సమస్త మానవులకు ఏవిధంగానైనా, ఎక్కడనైనా, దేనినైనా ఆరాధించే అట్టి విశేషాధికారాన్ని కలిగియుండే అవకాశమివ్వబడాలని కోరుచున్నాము.
12 చట్టమును గైకొనుట, గౌరవించుట, సమర్థించుటలో రాజులకు, అధ్యక్షులకు, అధికారులకు, న్యాయాధిపతులకు లోబడియుండుటను మేము నమ్ముచున్నాము.
13 నిజాయితీగా, యథార్థముగా, పవిత్రముగా, ఉదారముగానుండి, సుగుణముతో సర్వ మానవాళికి మేలు చేయుటను మేము నమ్ముచున్నాము; నిజానికి, పౌలు ఉపదేశమును మేము అనుసరించుచున్నామని చెప్పవచ్చును—మేము అన్నిటిని నమ్ముచున్నాము, అన్నిటిని నిరీక్షించుచున్నాము, అనేకమైన వాటిని సహించియున్నాము, సమస్తమును సహించగలమని ఆశించుచున్నాము. పవిత్రమైనది, రమ్యమైనది, ఖ్యాతిగలది లేదా పొగడదగినది ఏదైనా ఉన్నయెడల, వాటిని కూడా మేము వెదికెదము.
జోసెఫ్ స్మిత్.