జోసెఫ్ స్మిత్—మత్తయి
1831లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు బయలుపరచబడిన బైబిలు యొక్క అనువాదమునుండి ఒక సంగ్రహణము: మత్తయి 23:39 మరియు 24వ అధ్యాయము.
1వ అధ్యాయము
త్వరలో కలుగబోవు యెరూషలేము యొక్క నాశనమును గూర్చి యేసు ప్రవచించును—మనుష్య కుమారుని రెండవ రాకడను, దుష్టుల నాశనమును గూర్చి కూడా ఆయన ప్రసంగించును.
1 ఇది మొదలుకొని—ఆకాశ మేఘారూఢుడై సమస్త దూతలతో ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పువరకు నన్ను చూడరని మరియు ప్రవక్తలచేత వ్రాయబడినది నన్ను గూర్చియేనని మీరు తెలుసుకొందురని మీతో చెప్పుచున్నాను. అప్పుడు ఆయన శిష్యులు—ఆయన మహిమపరచబడి, కిరీటము ధరించి దేవుని కుడిచేతి ప్రక్కన కూర్చొనిన తరువాత భూలోకమునకు తిరిగి వచ్చునని గ్రహించిరి.
2 యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆయన మాటలు వినుటకు ఆయన యొద్దకు వచ్చి—బోధకుడా, దేవాలయపు కట్టడములను గూర్చి—అవి పడగొట్టబడి నిర్మానుష్యము చేయబడునని నీవు చెప్పితివి గనుక వాటిని గూర్చి మాకు చెప్పుమని పలికిరి.
3 యేసు వారితో—మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా, వాటిని మీరు గ్రహింపలేదా? అనెను. రాతిమీద రాయి ఒకటియైనను ఇక్కడ ఈ దేవాలయములో నిలిచియుండకుండా పడద్రోయబడునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
4 యేసు వారిని విడిచిపెట్టి, ఒలీవల కొండ మీదకు వెళ్ళెను. ఆయన ఒలీవల కొండమీద కూర్చొనియున్నప్పుడు శిష్యులాయన యొద్దకు ఏకాంతముగా వచ్చిఇట్లనిరి: దేవాలయము నాశనము చేయబడుటను గూర్చి యూదులను గూర్చి నీవు చెప్పిన ఈ సంగతులు ఎప్పుడు జరుగును? నీ రాకడకు, ఈ యుగసమాప్తికి లేదా లోకము అంతమగుటకు, దుష్టుల నాశనమునకు సూచనలేవి?
5 యేసు వారితో ఇట్లనెను: ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి;
6 అనేకులు నా పేరిట వచ్చి—నేనే క్రీస్తునని చెప్పి—పలువురిని మోసగించెదరు;
7 అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు;
8 అనేకులు అభ్యంతరపడి, ఒకనినొకడు అప్పగించి, ఒకనినొకడు ద్వేషింతురు;
9 అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసగించెదరు;
10 దుష్టత్వము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును;
11 కానీ నిలకడగా ఉండి, కీడుచేత జయింపబడనివాడు రక్షింపబడును.
12 కాబట్టి యెరూషలేము నాశనమును గూర్చి ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు నిలుచుటను మీరు చూడగానే, పరిశుద్ధ స్థలములో మీరు నిలుచుండవలెను; చదువువాడు గ్రహించును గాక.
13 యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను;
14 మిద్దెమీద ఉండువాడు పారిపోయి తన యింటినుండి ఏదైననూ తీసుకొని పోవుటకు తిరిగి రాకూడదు;
15 పొలములో ఉండువాడు, తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు;
16 అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ;
17 కాబట్టి, మీరు పారిపోవుట చలికాలమందైనను, విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రభువుకు ప్రార్థించుడి;
18 ఏలయనగా అప్పుడు ఆ దినములలో యూదులకు, యెరూషలేము వాసులకు మహా శ్రమ కలుగును, వారి సామ్రాజ్యము స్థాపించబడినప్పటి నుండి ఇప్పటివరకు దేవుని నుండి అట్టి శ్రమ పంపబడలేదు; ఇశ్రాయేలుపై ఇక ఎన్నటికీ పంపబడబోదు.
19 వారికి సంభవించినవన్నియు వారికి కలుగబోవు వేదనలకు ఆరంభము మాత్రమే.
20 ఆ దినములు తక్కువ చేయబడకపోయిన యెడల, ఏ శరీరియు తప్పించుకొనలేడు; కానీ నిబంధన ప్రకారము ఎన్నుకోబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.
21 ఇదిగో యూదులను గూర్చి ఈ సంగతులను నేను మీకు చెప్పియున్నాను; యెరూషలేము మీదకు రాబోవు ఆ శ్రమ దినముల తరువాత, ఎవడైనను—ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి;
22 ఏలయనగా ఆ దినములలో అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే నిబంధన ప్రకారము ఏర్పరచబడిన వారిని సహితము మోసగించుటకై గొప్ప సూచకక్రియలను, ఆశ్చర్యకార్యములను కనబరిచెదరు.
23 ఇదిగో, ఏర్పరచబడిన వారికొరకు ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను; మీరు యుద్ధములను గూర్చియు, యుద్ధ సమాచారములను గూర్చియు వదంతులు వినబోవుదురు; మీరు కలవరపడకుండా చూచుకొనుడి; ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.
24 ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను;
25 కాబట్టి ఎవరైనను—ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి—ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి;
26 ఉదయకాలపు వెలుగు తూర్పున పుట్టి పశ్చిమము వరకు కనబడి భూమియంతట ఏలాగు వ్యాపించునో ఆలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును.
27 ఇప్పుడు మీకొక ఉపమానమును తెలిపెదను. ఇదిగో పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును; ఆవిధముగానే భూమి నలుదిక్కుల నుండి నేను ఏర్పరచుకొనిన వారు పోగుచేయబడుదురు.
28 వారు యుద్ధములను గూర్చియు, యుద్ధ సమాచారములను గూర్చియు విందురు.
29 ఇదిగో నేను ఏర్పరచుకొనిన వారి కొరకు చెప్పుచున్నాను; జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును; అక్కడక్కడ కరువులును తెగుళ్ళును భూకంపములును కలుగును.
30 మరలా, దుష్టత్వము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును; కానీ కీడుచేత జయింపబడని వాడే రక్షింపబడును.
31 ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము లేదా దుష్టుల నాశనము వచ్చును;
32 ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు నిలుచుట నెరవేరును.
33 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును.
34 నేను చెప్పిన సంగతులన్నియు నెరవేరి, ఇవన్నియు కనపరచబడు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
35 భూమియు ఆకాశమును గతించు దినములు వచ్చినను నా మాటలు ఏ మాత్రము గతింపవు గాని అవి నెరవేరును.
36 ఇదివరకు నేను చెప్పినట్లే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు; అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు;
37 నా మాటలను తన హృదయమందు భద్రపరచుకొనువాడు మోసగించబడడు, ఏలయనగా మనుష్య కుమారుడు వచ్చి, గొప్ప బూరధ్వనితో తన యెదుట దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివర వరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనిన వారి శేషమును పోగుచేతురు.
38 ఇప్పుడు అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి—అంజూరపుకొమ్మ లేతదై చిగురించునప్పుడు వసంతకాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును;
39 ఆ ప్రకారమే నేను ఏర్పరచుకొనినవారు ఈ సంగతులన్నియు చూచునప్పుడు ఆయన సమీపమున, ద్వారము దగ్గరనేయున్నాడని తెలుసుకొందురు;
40 అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే యెరుగును గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను ఎరుగరు.
41 నోవహు దినములు ఏలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును ఆలాగే ఉండును;
42 జలప్రళయమునకు ముందటి దినములలోనున్న విధముగానే వారికి జరుగును; నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసుకొనుచు పెండ్లికిచ్చుచునుండి;
43 జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగకపోయిరి; ఆలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును.
44 అప్పుడు ప్రవక్తలచేత వ్రాయబడినది నెరవేరును—అంత్య దినములలో ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును;
45 ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకతె తీసుకొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును;
46 నేను ఒకనితో చెప్పునది అందరితో చెప్పుచున్నాను; కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగానుండుడి.
47 ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండిన యెడల అతడు మెలకువగా ఉండి, తన యింటికి కన్నము వేయనియ్యడు గాని సిద్ధపడియుండునని మీరు తెలుసుకొనుడి.
48 మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధముగానుండుడి.
49 యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?
50 యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు; అతడు తన యావదాస్తిమీద వానినుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
51 అయితే దుష్టుడైన యొక దాసుడు—నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని,
52 తన తోటి దాసులను కొట్టుట మొదలు పెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె,
53 ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి,
54 వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయునుండును.
55 కాబట్టి—వారు జనులమధ్య నుండి కొట్టివేయబడుదురు గాని భూమి యొక్క అంతము వెంటనే రాదు, కొంతకాలమైన తరువాత వచ్చునని మోషే చెప్పిన ప్రవచనము ప్రకారము దుష్టుల అంతము వచ్చును.