మోషే గ్రంథము
నుండి ఎంపిక చేయబడిన భాగములు
1830 జూన్–1831 ఫిబ్రవరి మధ్య ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ నకు బయలుపరచబడిన బైబిలు అనువాదము యొక్క సంగ్రహణము.
1వ అధ్యాయము
(1830 జూన్)
దేవుడు మోషేకు తననుతాను ప్రత్యక్షపరచుకొనును—మోషే రూపాంతరము చెందెను—అతనికి సాతాను ఎదుటపడెను—జనసంచారముగల అనేక ప్రపంచములను మోషే చూచెను—కుమారునిచే అసంఖ్యాక లోకములు సృష్టించబడినవి—నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే దేవుని కార్యము, మహిమయైయున్నది.
1 మోషే ఒక ఎత్తైన పర్వతమునకు కొనిపోబడినప్పుడు దేవుడు మోషేతో పలికిన వాక్యములు,
2 అతడు దేవునిని ముఖాముఖీగా చూచెను మరియు ఆయనతో మాట్లాడెను, దేవుని మహిమ మోషేమీద ఉండెను; కాబట్టి మోషే ఆయన సన్నిధిని సహింపగలిగెను.
3 దేవుడు మోషేతో ఇలా పలికెను: ఇదిగో, సర్వశక్తిగల దేవుడైన ప్రభువును నేనే, నా నామము అంతములేనిది; ఏలయనగా నా దినములకు ఆరంభమైనను, నా సంవత్సరములకు అంతమైనను లేదు; మరియు ఇది అంతములేనిది కాదా?
4 ఇదిగో, నీవు నా కుమారుడవు; కాబట్టి చూడుము, నా హస్తకృత్యములను నేను నీకు చూపెదను; కానీ అన్నిటిని కాదు, ఏలయనగా నా కార్యములకు, అలాగే నా మాటలకు అంతము లేదు, ఏలయనగా అవి ఎన్నటికీ ఆగవు.
5 కాబట్టి, నా మహిమనంతటిని చూడకుండా ఏ మనుష్యుడును నా కార్యములన్నింటిని చూడలేడు; మరియు నా మహిమనంతటిని చూచిన తరువాత ఏ మనుష్యుడును శరీరముతో భూమి మీద నిలిచియుండలేడు.
6 నా కుమారుడా మోషే, నేను నీ కొరకు ఒక కార్యమును కలిగియున్నాను; నీవు నా అద్వితీయ కుమారుని పోలియున్నావు; నా అద్వితీయ కుమారుడు రక్షకుడైయున్నాడు మరియు ఉండును, ఏలయనగా ఆయన కృపాసత్య సంపూర్ణుడైయున్నాడు; కానీ నేను తప్ప ఏ దేవుడును లేడు, మరియు అన్ని విషయములు నాతోనున్నవి, ఏలయనగా వాటన్నిటిని నేను యెరిగియున్నాను.
7 నా కుమారుడైన మోషే, నేనిప్పుడు ఈ ఒక్క విషయమును నీకు చూపెదను, ఏలయనగా నీవు లోకములో ఉన్నావు, మరియు నేనిప్పుడు దానిని నీకు చూపెదను.
8 అప్పుడు మోషే చూచెను మరియు అతడు సృష్టించబడిన లోకమును వీక్షించెను; మోషే లోకమును, దాని అంతమును, సృష్టించబడియున్న, సృష్టించబడుతున్న నరుల సంతానమునంతటిని చూచెను; దానిని గూర్చి అతడు మిక్కిలి ఆశ్చర్యపడి, విస్మయమొందెను.
9 దేవుని సన్నిధి మోషేనుండి వెడలిపోయి, ఆయన మహిమ మోషేమీద లేకుండెను; మరియు మోషే ఒంటరిగా విడిచిపెట్టబడెను. అతడు ఒంటరిగా విడిచిపెట్టబడగా, అతడు నేలమీద పడెను.
10 అప్పుడు మోషే తిరిగి నరునివలె బలమును పొందుటకు ముందు అనేక గంటల సమయము గడిచెను; అతడు తనలోతాను ఈలాగు అనుకొనెను: ఈ హేతువు వలన నరుడు వట్టివాడు, ఈ విషయమును నేనెన్నడూ తలంచలేదు.
11 కానీ ఇప్పుడు నా నేత్రములు దేవుని చూచెను; నా సహజ నేత్రములు కాదు, కానీ నా ఆత్మీయ నేత్రములు, ఏలయనగా నా సహజ నేత్రములు చూడజాలవు; ఏలయనగా నేను ఆయన సన్నిధిని ఎండిపోయి మరణించియుండేవాడిని; కానీ ఆయన మహిమ నా మీదనుండెను; నేను ఆయన ముఖమును చూచితిని, ఏలయనగా ఆయన యెదుట నేను రూపాంతరము చెందితిని.
12 ఇప్పుడు మోషే ఈ మాటలు పలికినప్పుడు, సాతాను అతడిని శోధించుటకు వచ్చి ఈలాగు పలికెను: మనుష్య కుమారుడవైన మోషే, నన్ను ఆరాధించుము.
13 మోషే సాతానును చూచి: నీవెవడవు? అని అడిగెను. ఏలయనగా ఇదిగో, నేను ఆయన అద్వితీయ కుమారుని పోలియున్న దేవుని కుమారుడను; నిన్ను ఆరాధించుటకు నీ మహిమ ఎక్కడున్నది?
14 ఏలయనగా ఆయన మహిమ నా మీదకు వచ్చియుంటేనే తప్ప నేను దేవుని చూడజాలకపోతిని, మరియు నేను ఆయన యెదుట రూపాంతరము చెందితిని. కానీ నేను సహజ నరునిగా నిన్ను చూడగలుగుచున్నాను. ఇది నిజము కాదా?
15 నా దేవుని నామము దీవించబడును గాక, ఏలయనగా ఆయన ఆత్మ పూర్తిగా నా నుండి తీసుకొనిపోబడలేదు, లేనియెడల నీ మహిమ ఎక్కడున్నది? అది నాకు అంధకారముగానున్నది. దేవునికి మరియు నీకు మధ్య గల వ్యత్యాసమును నేను గ్రహించగలను; ఏలయనగా దేవుడు నాతో ఈలాగు చెప్పెను: దేవుని ఆరాధించుము, ఆయనను మాత్రమే నీవు సేవింపవలెను.
16 కాబట్టి సాతానా పొమ్ము; నన్ను మోసపుచ్చకుము; ఏలయనగా దేవుడు నాతో ఈలాగు చెప్పెను: నీవు నా అద్వితీయ కుమారుని పోలియున్నావు.
17 మరియు మండుచున్న పొదనుండి నన్ను పిలిచినప్పుడు—నా అద్వితీయ కుమారుని నామములో నాకు ప్రార్థించి, నన్ను ఆరాధించుము అని ఆయన నాకు ఆజ్ఞలను కూడా ఇచ్చియుండెను.
18 మరలా మోషే ఈలాగు చెప్పెను: నేను ఎడతెగక దేవుని ప్రార్థించెదను, ఆయనను అడుగవలసిన ఇతర సంగతులు కలవు: ఏలయనగా ఆయన మహిమ నా మీద ఉండెను, కాబట్టి ఆయనకు, నీకు మధ్య గల వ్యత్యాసమును నేను చెప్పగలను. సాతానా వెళ్ళిపొమ్ము.
19 మోషే ఈ మాటలు పలుకగా, సాతాను బిగ్గర స్వరముతో కేకవేసి, భూమిపై ఉగ్రస్వరముతో ఈలాగు ఆజ్ఞాపించెను: నేనే ఏకైక కుమారుడను, నన్ను ఆరాధించుము.
20 అప్పుడు మోషే మిక్కిలి భయపడసాగెను; అతనికి భయము కలుగగా, అతడు నరకపు వేదనను చూచెను. అయినప్పటికీ, దేవుడిని ప్రార్థించుచు, అతడు బలమును పొంది ఈలాగు ఆజ్ఞాపించెను: సాతానా నా నుండి వెళ్ళిపొమ్ము, ఏలయనగా ఈ ఒక్క దేవునినే నేను ఆరాధించెదను, ఆయన మహిమగల దేవుడు.
21 అప్పుడు సాతాను భయముతో వణకుట మొదలుపెట్టెను భూమి కంపించెను; మరియు మోషే బలమును పొంది, దేవునికి ఈలాగు ప్రార్థించెను: ఏకైక కుమారుని నామములో, సాతానా వెళ్ళిపొమ్ము.
22 సాతాను ఏడ్చుచు, రోదించుచు, పండ్లుకొరుకుచు బిగ్గర స్వరముతో కేకవేసెను; అతడు అక్కడినుండి అనగా మోషే సన్నిధినుండి వెళ్ళిపోగా, అతడు వానిని ఇక చూచియుండలేదు.
23 ఇప్పుడు ఈ సంగతిని గూర్చి మోషే సాక్ష్యము కలిగియుండెను; కానీ దుష్టత్వము వలన నరుల సంతానము మధ్య ఇది ఉండలేదు.
24 అప్పుడు జరిగినదేమనగా మోషే యొద్దనుండి సాతాను వెళ్ళిపోగా, తండ్రి మరియు కుమారుని గూర్చి సాక్ష్యమిచ్చు పరిశుద్ధాత్మతో నిండినవాడై మోషే ఆకాశమువైపు తన కన్నులెత్తెను;
25 దేవుని నామమున ప్రార్థించుచు ఆయన మహిమను అతడు మరలా చూచెను, అది అతని మీదకు వచ్చెను; ఈలాగు చెప్పుచున్న ఒక స్వరమును అతడు వినెను: మోషే నీవు ధన్యుడవు, ఏలయనగా సర్వశక్తిమంతుడనైన నేను నిన్ను ఎన్నుకొంటిని, మహాసముద్రముల కంటే నీవు బలవంతునిగా చేయబడుదువు; నీవు దేవుడవైనట్టు అవి నీ ఆజ్ఞను గైకొనును.
26 నీ దినముల అంతము వరకు నేను నీతో కూడా ఉన్నాను; ఏలయనగా నీవు నా జనులు అనగా నేను ఎన్నుకొనిన ఇశ్రాయేలును బానిసత్వము నుండి విడిపించెదవు.
27 ఆ స్వరము ఇంకను మాట్లాడుచుండగా మోషే తన కన్నులు త్రిప్పి భూమిని చూచెను, అవును, దానినంతటిని చూచెను; దేవుని ఆత్మవలన వివేచించుచు దానిలో ఒక రేణువునైనను అతడు చూడకయుండలేదు.
28 అతడు దాని నివాసులందరిని కూడా చూచెను, అతడు చూడని ఆత్మ ఒకటియైనను లేకుండెను; దేవుని ఆత్మవలన అతడు వారిని చూచెను; వారి సంఖ్య విస్తారముగా, సముద్రతీరమునందుండు ఇసుకవలె అసంఖ్యాకముగా ఉండెను.
29 అతడు అనేక ప్రదేశములను చూచెను; ప్రతి ప్రదేశము భూమి అని పిలువబడెను, మరియు వాటిపైన నివాసులుండెను.
30 అప్పుడు జరిగినదేమనగా మోషే దేవుడిని ఈలాగు ప్రార్థించెను: నాకు చెప్పుమని నేను నిన్ను వేడుకొనుచున్నాను, ఇవన్నియు ఎందుకు ఈవిధముగానున్నవి మరియు దేనివలన నీవు వాటిని చేసితివి?
31 ఇదిగో, దేవుని మహిమ మోషేమీద ఉండెను, అందువలన మోషే దేవుని సన్నిధిని నిలిచి, ఆయనతో ముఖాముఖీగా మాట్లాడెను. మరియు దేవుడైన ప్రభువు మోషేతో చెప్పెను: నా స్వంత ఉద్దేశ్యము నిమిత్తము నేను వీటిని చేసితిని. ఇందులో జ్ఞానము కలదు మరియు అది నాయందు నిలిచియుండును.
32 నా శక్తిగల వాక్యము అనగా నా అద్వితీయ కుమారుని ద్వారా వారిని నేను సృష్టించితిని, ఆయన కృపాసత్యసంపూర్ణుడైయున్నాడు.
33 అసంఖ్యాకమైన ప్రపంచములను నేను సృష్టించితిని; నా స్వంత ఉద్దేశ్యము కొరకు కూడా వాటిని నేను సృష్టించితిని; కుమారుని ద్వారా అనగా నా అద్వితీయ కుమారుని ద్వారా వాటిని సృష్టించితిని.
34 మనుష్యలందరిలో మొదటి మనుష్యుని ఆదాము అని నేను పిలిచితిని, అది అనేకులను సూచించును.
35 కానీ ఈ భూమి మరియు దాని నివాసులను గూర్చిన వృత్తాంతమును మాత్రమే నేను నీకిచ్చుచున్నాను. ఏలయనగా ఇదిగో, నా శక్తిగల వాక్యమువలన అనేక ప్రపంచములు గతించినవి. ఇప్పుడు నిలిచియున్నవి అనేకము కలవు, అవి మనుష్యునికి అసంఖ్యాకముగానున్నవి; కానీ నాకు అన్నియు లెక్కించబడినవి, ఏలయనగా అవి నావి మరియు నేను వాటిని యెరిగియున్నాను.
36 మరలా మోషే ఈలాగు ప్రభువుతో మాట్లాడెను: ఓ దేవా! నీ సేవకుని యెడల కరుణచూపి, ఈ భూమిని గూర్చి, దాని నివాసులను గూర్చి, అదేవిధముగా పరలోకములను గూర్చి నాకు చెప్పుము, అప్పుడు నీ సేవకుడు సంతోషించును.
37 ప్రభువు మోషేతో ఈలాగు మాట్లాడెను: పలోకములు అనేకము కలవు, అవి మనుష్యునిచే లెక్కింపజాలవు; కానీ వాటిని నేను లెక్కించితిని, ఏలయనగా అవి నావి.
38 ఒక భూమియు దాని ఆకాశములు ఏవిధముగా గతించునో అదేవిధముగా మరియొకటి వచ్చును; నా కార్యములకైనను, నా మాటలకైనను అంతము లేదు.
39 ఏలయనగా నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే నా కార్యమును మహిమయైయున్నది.
40 ఇప్పుడు మోషే నా కుమారుడా, నీవు నిలిచియున్న భూమిని గూర్చి నేను నీతో మాట్లాడుదును; నేను మాట్లాడు సంగతులను నీవు వ్రాయవలెను.
41 మనుష్య కుమారులు నా మాటలను వ్యర్థమైనవిగా యెంచి, నీవు వ్రాయు గ్రంథమునుండి వాటిలో అనేకమును తీసివేయు దినమున, నీ వంటి యొక ప్రవక్తను నేను ఎంచుకొందును; మరియు నరుల సంతానము మధ్య ఎంతమంది విశ్వసించెదరో వారందరు వాటిని మరలా కలిగియుందురు.
42 (ఈ మాటలు పర్వతముపైన మోషేతో మాట్లాడబడెను, దాని పేరు నరుల సంతానమునకు తెలియకుండును. మరియు ఇప్పుడు అవి నీకు చెప్పబడినవి. విశ్వసించువారికి తప్ప మరెవరికిని వాటిని చూపకుము. అవును గాక. ఆమేన్.)