2వ అధ్యాయము
(1830 జూన్–అక్టోబరు)
దేవుడు భూమ్యాకాశములను సృష్టించెను—అన్ని రూపములు గల జీవులు సృష్టించబడెను—దేవుడు నరుని సృష్టించి అన్నిటిమీద అతనికి అధికారమిచ్చెను.
1 అప్పుడు ప్రభువు మోషేతో ఈలాగు పలికెను: ఇదిగో ఈ ఆకాశము, ఈ భూమిని గూర్చి నేను నీకు బయలుపరచెదను; నేను చెప్పు మాటలను వ్రాయుము. ఆదియు అంతమును, సర్వశక్తిగల దేవుడను నేనే; నా అద్వితీయ కుమారుని ద్వారా వీటిని నేను సృజించితిని; ఆదియందు నేను నీవు నిలిచియున్న భూమిని ఆకాశమును సృజించితిని.
2 భూమి నిరాకారముగా, శూన్యముగానుండెను; చీకటి అగాధ జలముపైన కమ్మియుండునట్లు నేను చేసితిని; మరియు నా ఆత్మ జలములపైన అల్లాడుచుండెను; ఏలయనగా నేను దేవుడను.
3 దేవుడైన నేను వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
4 వెలుగు మంచిదైనట్టు దేవుడైన నేను చూచితిని. దేవుడైన నేను వెలుగును, చీకటిని వేరుపరచితిని.
5 దేవుడైన నేను వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రనియు పేరుపెట్టితిని; నా శక్తిగల వాక్యము ద్వారా దీనిని నేను చేసితిని, మరియు నేను పలికినట్లుగా అది చేయబడెను; అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
6 మరలా దేవుడైన నేను జలముల మధ్యనొక విశాలము కలుగమని పలుకగా ఆ ప్రకారమాయెను; అది ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను;
7 దేవుడైన నేను ఆ విశాలమును చేసి జలములను అనగా విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచితిని, మరియు నేను పలికిన ప్రకారమే జరిగెను.
8 దేవుడైన నేను ఆ విశాలమునకు ఆకాశమని పేరుపెట్టితిని; అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.
9 దేవుడైన నేను ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను; మరియు దేవుడైన నేను ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను.
10 దేవుడైన నేను ఆరిన నేలకు భూమి అని పేరుపెట్టితిని; జలరాశికి సముద్రమని పేరు పెట్టితిని; మరియు నేను చేసినవన్నియు మంచివని దేవుడైన నేను చూచితిని.
11 దేవుడైన నేను గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా నేను పలికిన ప్రకారమాయెను.
12 భూమి గడ్డిని, తమతమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించెను; నేను చేసినవన్నియు మంచివని దేవుడైన నేను చూచితిని;
13 అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.
14 దేవుడైన నేను పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగుగాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు;
15 భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులైయుండుగాకనియు పలుకగా ఆ ప్రకారమాయెను.
16 దేవుడైన నేను రెండు గొప్ప జ్యోతులను చేసితిని; పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని చేసితిని, ఆ పెద్ద జ్యోతి సూర్యుడు, ఆ చిన్న జ్యోతి చంద్రుడు; నా వాక్కు ప్రకారము నక్షత్రములును చేయబడెను.
17 దేవుడైన నేను భూమి మీద వెలుగిచ్చుటకు ఆకాశ విశాలమందు వాటినుంచితిని,
18 పగటిని ఏలుటకు సూర్యుని, రాత్రిని ఏలుటకు, చీకటినుండి వెలుగును వేరుపరచుటకు చంద్రుని ఉంచితిని; నేను చేసినవన్నియు మంచివని దేవుడైన నేను చూచితిని;
19 అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.
20 దేవుడైన నేను జీవముకలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికితిని.
21 దేవుడైన నేను వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించితిని; నేను సృష్టించినవన్నియు మంచివని దేవుడైన నేను చూచితిని.
22 దేవుడైన నేను మీరు ఫలించి, వృద్ధిపొంది సముద్ర జలములలో నిండియుండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించితిని;
23 అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయెను.
24 దేవుడైన నేను వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, ప్రాకెడి జీవులను అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను.
25 దేవుడైన నేను ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి జీవిని చేసితిని; మరియు దేవుడైన నేను ఇవన్నియు మంచివని చూచితిని.
26 దేవుడైన నేను ఆదినుండి నాతోనున్న నా అద్వితీయ కుమారునితో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడైన నేను సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును వారు ఏలుదురుగాకనియు పలికితిని.
27 దేవుడైన నేను నా స్వరూపమందు నరుని సృజించితిని, నా అద్వితీయ కుమారుని స్వరూపమందు వాని సృజించితిని; స్త్రీనిగాను, పురుషునిగాను వారిని సృజించితిని.
28 దేవుడైన నేను వారిని ఆశీర్వదించితిని; ఎట్లనగా మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి దానిని లోబరచుకొనుడి; సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పితిని.
29 దేవుడైన నేను భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ఫలవృక్షములుగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను; అవి మీకు ఆహారమగునని వారితో పలికితిని.
30 భూమి మీద నుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికితిని; మరియు నేను పలికిన ప్రకారమాయెను.
31 నేను చేసిన యావత్తును దేవుడైన నేను చూచినప్పుడు అది చాలా మంచిదిగానుండెను; అస్తమయమును, ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.