3వ అధ్యాయము
(1830 జూన్–అక్టోబరు)
భూమి మీద భౌతికముగా జీవించుటకు ముందు సమస్తమును దేవుడు ఆత్మీయముగా సృజించెను—భూమి మీద ఆయన మొదటి శరీరుడైన పురుషుని సృజించెను—పురుషునికి స్త్రీ సాటియైన సహాయము.
1 ఆవిధంగా ఆకాశము భూమియు వాటిలోనున్న సమస్త సమూహము సంపూర్తి చేయబడెను.
2 దేవుడైన నేను నా పనిని, నేను చేసిన సమస్తమును ఏడవదినములోగా పూర్తి చేసితిని; నేను చేసిన పనియంతటినుండి ఏడవ దినమున విశ్రమించితిని, మరియు నేను చేసిన సమస్తము పూర్తి చేయబడెను, అవి మంచివైనట్టు దేవుడైన నేను చూచితిని;
3 దేవుడైన నేను ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచితిని; ఏలయనగా దేవుడైన నేను దానిలో నేను చేసినట్టియు, సృజించినట్టియు నా పని అంతటినుండి విశ్రమించితిని.
4 ఇప్పుడు నేను నిశ్చయముగా నీతో చెప్పునదేమనగా, దేవుడైన నేను భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.
5 అదివరకు పొలమందలి ఏ చెట్టును భూమి మీద మొలవలేదు, పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు. ఏలయనగా దేవుడును ప్రభువునైన నేను పలికిన సమస్తమును భూమి మీద భౌతికముగా సృజింపకమునుపు, సమస్తమును ఆత్మీయముగా సృజించితిని. దేవుడును ప్రభువునైన నేను భూమి మీద వాన కురిపించలేదు. దేవుడును ప్రభువునైన నేను నరుల సంతానమునంతటిని సృజించితిని; భూమిని సేద్యపరచుటకు నరుడు లేడు; ఏలయనగా పరలోకమందు నేను వారిని సృజించితిని; ఇంకను భూమి మీదను, నీటియందును, ఆకాశమందును ఏ జీవియు లేదు;
6 కానీ దేవుడును ప్రభువునైన నేను పలుకగా ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను.
7 దేవుడును ప్రభువునైన నేను నేలమంటితో నరుని నిర్మించి, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదితిని; భూమి మీద మొదటి జీవి, మొదటి మానవుడైన నరుడు జీవాత్మ ఆయెను; అయినప్పటికీ, సమస్తము ముందే సృష్టించబడెను; కానీ నా వాక్కును బట్టి అవి సృష్టించబడి, చేయబడినవి.
8 దేవుడును ప్రభువునైన నేను ఏదేనులో తూర్పుదిక్కున ఒక తోటవేసి, నేను నిర్మించిన నరుని దానిలో ఉంచితిని.
9 దేవుడును ప్రభువునైన నేను చూపునకు రమ్యమైన ప్రతి వృక్షమును నేలనుండి మొలిపించితిని; నరుడు వాటిని చూడగలిగెను. మరియు అవి కూడా జీవాత్మలాయెను. ఏలయనగా వాటిని నిర్మించిన దినమున అవి ఆత్మీయముగానుండెను; దేవుడైన నేను సృజించిన గోళములో అవియు, నరుని ఉపయోగము నిమిత్తము నేను సిద్ధపరచిన సమస్తమును ఉండెను; అవి ఆహారమునకు మంచివని నరుడు చూచెను. మరియు దేవుడును ప్రభువునైన నేను ఆ తోటమధ్యన జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును మొలిపించితిని.
10 దేవుడును ప్రభువునైన నేను ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరునట్లు చేసితిని; అది అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను.
11 దేవుడును ప్రభువునైన నేను మొదటి దానికి పీషోను అని పేరుపెట్టితిని, అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ దేవుడును ప్రభువునైన నేను ఎక్కువ బంగారమును సృజించితిని;
12 ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది, అక్కడ బోళమును గోమేధికములును దొరుకును.
13 రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది.
14 మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు.
15 దేవుడును ప్రభువునైన నేను నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచితిని.
16 దేవుడును ప్రభువునైన నేను నరుని ఈవిధముగా ఆజ్ఞాపించితిని: ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును,
17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను నీవు తినకూడదు, అయినప్పటికీ నీకు స్వేచ్ఛ ఇవ్వబడెను గనుక నీకు నీవే ఎంచుకొనుము; కానీ వాటిని నేను నిషేధించితిని, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.
18 మరియు నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; కాబట్టి వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదునని దేవుడును ప్రభువునైన నేను నా అద్వితీయ కుమారునితో చెప్పితిని.
19 దేవుడును ప్రభువునైన నేను ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించితిని; ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు రావలెనని వాటిని ఆజ్ఞాపించితిని; అవి కూడా జీవాత్మలే; ఏలయనగా దేవుడైన నేను వాటియందు జీవ వాయువును ఊదితిని, మరియు జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలుగునని ఆజ్ఞాపించితిని.
20 ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను; అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేకపోయెను.
21 అప్పుడు దేవుడును ప్రభువునైన నేను ఆదామునకు గాఢనిద్రను కలుగజేసితిని; అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసితిని;
22 దేవుడును ప్రభువునైన నేను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చితిని.
23 అప్పుడు ఆదాము ఇట్లనెను—నా యెముకలలో ఒక యెముక, నా మాంసములో మాంసము; ఆమె నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.
24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
25 అప్పుడు నరుడు అతని భార్యయు దిగంబరులుగానుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగకయుండిరి.