7వ అధ్యాయము
(1830 డిసెంబరు)
హనోకు తన జనులకు బోధించి, నడిపించి, పర్వతములను కదిలించును—సీయోను పట్టణము స్థాపించబడెను—హనోకు మనుష్య కుమారుని రాకను, ఆయన ప్రాయశ్చిత్త త్యాగమును, పరిశుద్ధుల పునరుత్థానమును ముందుగా చూచును—అతడు పునఃస్థాపనను, కూడివచ్చుటను, రెండవ రాకడను, సీయోను తిరిగి వచ్చుటను ముందుగా చూచును.
1 హనోకు తన ప్రసంగమును కొనసాగించి ఈలాగు చెప్పెను: ఇదిగో మన తండ్రియైన ఆదాము ఈ సంగతులను మనకు చెప్పెను, అనేకులు నమ్మి దేవుని కుమారులైరి, అనేకులు నమ్మక, తమ పాపములందు నశించిరి, భయముతోను, బాధతోను వారిపై క్రుమ్మరించబడబోవు దేవుని ఉగ్రత యొక్క తీవ్రమైన కోపము కొరకు ఎదురు చూచుచుండిరి.
2 ఆ సమయము నుండి హనోకు జనులతో ఈలాగు చెప్పుచు ప్రవచించుట మొదలుపెట్టెను: నేను ప్రయాణము చేయుచు మహుయ అను స్థలముపైన నిలబడి, ప్రభువుకు మొరపెట్టగా, పరలోకమునుండి ఒక స్వరము—నీవు వెనుదిరిగి సిమ్యోను పర్వతము పైకి వెళ్ళుమనెను
3 అప్పుడు నేను వెనుదిరిగి పర్వతము పైకి వెళ్ళితిని; నేను పర్వతముపైన నిలుచుండగా, పరలోకము తెరువబడుటను నేను చూచితిని మరియు నాకు మహిమ వస్త్రము ధరింపజేయబడెను;
4 నేను ప్రభువును చూచితిని; ఆయన నా యెదుట నిలబడెను, ఒక మనుష్యుడు మరియొకనితో మాట్లాడునట్లు ఆయన నాతో ముఖాముఖిగా మాట్లాడెను; ఆయన నాతో—చూడుము, ఈ లోకమును అనేక తరముల వరకు నేను నీకు చూపెదనని చెప్పెను.
5 అప్పుడు నేను షూము లోయలో చూడగా, ఇదిగో గుడారములలో నివసించుచున్న గొప్ప జనులైన షూము జనులను చూచితిని.
6 ప్రభువు నాతో—చూడుము అని పలికెను; నేను ఉత్తర దిశగా చూచితిని, గుడారములలో నివసించు కనాను జనులను చూచితిని.
7 ప్రభువు నాతో—ప్రవచింపుము అని చెప్పెను మరియు నేను ఈలాగు చెప్పుచూ ప్రవచించితిని: ఇదిగో విస్తారముగానున్న కనాను జనులారా, మీరు షూము జనులకు విరోధముగా యుద్ధము చేయుటకు సిద్ధపడి వెళ్ళి, వారు బొత్తిగా నాశనము చేయబడునట్లు వారిని చంపెదరు; కనాను జనులు ఆ దేశములో గుంపులుగా విడిపోవుదురు మరియు నేల నిస్సారముగాను, ఫలరహితముగాను అగును, కనాను జనులు తప్ప ఏ ఇతర జనులు అక్కడ నివసించరు.
8 ఏలయనగా ప్రభువు అధిక వేడిమితో నేలను శపించును, అది ఎప్పటికీ నిస్సారమగును; కనాను సంతానమంతటి మీద చీకటికమ్మెను, అందువలన వారు సమస్త జనులమధ్య అపహాస్యము చేయబడిరి.
9 ప్రభువు నాతో—చూడుము అని పలికెను; నేను కన్నులెత్తి షారోను దేశమును, హనోకు దేశమును, ఓమ్నెర్ దేశమును, హెని దేశమును, షేము దేశమును, హనేరు దేశమును, హననియ దేశమును వాటిలోనున్న నివాసులందరిని చూచితిని;
10 ప్రభువు నాతో ఈలాగు సెలవిచ్చెను: ఈ జనుల యొద్దకు వెళ్ళి—పశ్చాత్తాపపడుడి, లేనియెడల నేను వచ్చి వారిని శపించెదను, వారు చచ్చెదరని వారితో చెప్పుము.
11 తండ్రి యొక్కయు, కృపాసత్య సంపూర్ణుడైన కుమారుని యొక్కయు, తండ్రిని కుమారుని గూర్చి సాక్ష్యమిచ్చు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నేను బాప్తిస్మము ఇయ్యవలెనని ఆయన నాకొక ఆజ్ఞనిచ్చెను.
12 అప్పుడు హనోకు కనాను జనులను తప్ప మిగిలిన జనులందరిని పశ్చాత్తాపపడమని వేడుకొనుచుండెను;
13 హనోకు విశ్వాసము బహుగొప్పది గనుక అతడు దేవుని జనులను నడిపించెను మరియు వారి శత్రువులు వారితో యుద్ధము చేయుటకు వచ్చిరి; అతడు ప్రభువు వాక్యము పలుకగా అతని ఆజ్ఞ ప్రకారము భూమి కంపించెను, పర్వతములు తొలగిపోయెను; జలములుగల నదులు తమ గమనము నుండి తొలగిపోయెను; అరణ్యమునుండి సింహముల గర్జన వినబడెను; సమస్త రాజ్యములు మిక్కిలి భయపడెను, హనోకు వాక్కు చాలా శక్తివంతముగానుండెను, దేవుడు అతనికిచ్చిన భాష యొక్క ప్రభావము బహు గొప్పదిగానుండెను.
14 అంతేకాక సముద్ర గర్భమునుండి నేల పైకివచ్చెను, దేవుని జనుల యొక్క శత్రువులు మిక్కిలి భయపడి, పారిపోయి దూరముగా నిలబడి సముద్ర గర్భమునుండి వచ్చిన ఆ నేలపైకి వెళ్ళిరి.
15 ఆ దేశము యొక్క యోధులు కూడా దూరముగా నిలబడిరి; దేవునికి విరోధముగా పోరాడు వారందరిపై ఒక శాపము బయలువెళ్ళెను;
16 అప్పటినుండి వారిమధ్య యుద్ధములు, రక్తపాతము బయలుదేరెను; కానీ ప్రభువు వచ్చి తన జనులతో నివసించెను, వారు నీతియందు జీవించిరి.
17 ప్రభువును గూర్చిన భయము సమస్త రాజ్యములపై ఉండెను, ఆయన జనులపై ఉన్న ప్రభువు మహిమ బహు గొప్పదిగానుండెను. ప్రభువు ఆ దేశమును దీవించెను, పర్వతములపై ఉన్నవారు దీవించబడిరి, ఎత్తైన స్థలములలో ఉన్నవారు దీవించబడి అభివృద్ధి చెందిరి.
18 ప్రభువు తన జనులను సీయోను అని పిలిచెను, ఎందుకనగా వారు ఏక హృదయమును, ఏక మనస్సును కలిగియుండి, నీతియందు జీవించిరి; వారి మధ్య బీదవారెవరును లేరు.
19 హనోకు దేవుని యొక్క జనులకు నీతియందు తన ప్రసంగమును కొనసాగించెను. అతని దినములలో అతడు ఒక పట్టణమును నిర్మించెను, అది పరిశుద్ధ పట్టణము అనగా సీయోను అని పిలువబడెను.
20 హనోకు ప్రభువుతో మాట్లాడెను; అతడు ప్రభువుతో—నిశ్చయముగా సీయోను నిరంతరము క్షేమకరముగా జీవించునని చెప్పెను. కానీ ప్రభువు హనోకుతో—నేను సీయోనును దీవించితిని, కానీ మిగిలిన జనులను నేను శపించితినని చెప్పెను.
21 ప్రభువు భూలోక నివాసులందరిని హనోకుకు చూపెను; అతడు చూచెను, కొంతకాలమైన తరువాత సీయోను పరలోకమునకు కొనిపోబడెను. ప్రభువు హనోకుతో—నా నిత్య నివాసమును చూడుము అని చెప్పెను.
22 ఆదాము కుమారులలో మిగిలిన జనులను కూడా హనోకు చూచెను; వారు కయీను సంతానము కాక ఆదాము సంతానము యొక్క మిశ్రమమైయున్నారు, ఏలయనగా కయీను సంతానము నలుపుగానుండి, వారి మధ్య స్థానము కలిగియుండలేదు.
23 సీయోను పరలోకమునకు కొనిపోబడిన తరువాత హనోకు చూడగా, భూలోక రాజ్యములన్నియు అతని యెదుటనుండెను;
24 ఒక తరము తరువాత మరొక తరము వచ్చెను; తండ్రి మరియు మనుష్య కుమారుని రొమ్మున ఆనుకొనుటకు హనోకు ఎత్తైన స్థలమునుండి పైకెత్తబడెను; సాతాను యొక్క ప్రభావము భూమియంతటా ఉండెను.
25 పరలోకము నుండి దూతలు దిగుచుండగా అతడు చూచెను; అతడు—అయ్యో, భూలోక నివాసులకు శ్రమ అని బిగ్గరగా చెప్పిన ఒక స్వరమును వినెను.
26 అతడు సాతానును చూచెను; అతని చేతిలో ఒక పెద్ద గొలుసు ఉండెను, అది భూమియంతటిని అంధకారముతో కప్పెను; అతడు పైకిచూచి నవ్వగా అతని దూతలు ఆనందించిరి.
27 దూతలు క్రిందికి దిగి తండ్రిని, కుమారుని గూర్చి సాక్ష్యము చెప్పుటను హనోకు చూచెను; పరిశుద్ధాత్మ అనేకుల మీదకు రాగా వారు పరలోక శక్తిచేత సీయోనులోనికి కొనిపోబడిరి.
28 అప్పుడు పరలోక దేవుడు మిగిలిన జనులను చూచెను మరియు ఆయన కన్నీరు విడిచెను; పరలోకములు దుఃఖించి, పర్వతములమీద వానవలె వారి కన్నీరును విడుచుట ఏల? అని చెప్పుచూ హనోకు దానిని గూర్చి సాక్ష్యమిచ్చెను.
29 హనోకు ప్రభువుతో ఇట్లనెను—నీవు నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు పరిశుద్ధుడవైయుండియు, నీవు దుఃఖించుటకు గల కారణమేమి?
30 భూమి యొక్క అణువులను, ఇటువంటి లక్షలకొద్ది భూగోళములను నరుడు లెక్కించుట సాధ్యమైతే, నీవు సృష్టించిన అనేకమైన వాటికి ఇది ఆరంభము కాదు; నీ తెరలు ఇంకను చాపబడుచున్నవి; అయినను నీవు అక్కడ ఉన్నావు, నీ రొమ్మును అక్కడ ఉన్నది; నీవు నీతిమంతుడవైయున్నావు; కరుణను, దయను నీవు నిరంతరము కలిగియున్నావు;
31 నీవు సృజించిన వాటన్నిటిలో సీయోనును నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నీ రొమ్మునకు హత్తుకొనియున్నావు; శాంతి, న్యాయము, సత్యములే నీ సింహాసనమునకు ఆధారములు, మరేదియు కాదు; నీ యెదుట కరుణ బయలువెళ్ళును, దానికి అంతము లేదు; నీవు దుఃఖించుట ఏల?
32 హనోకుతో ప్రభువు ఈలాగు చెప్పెను: ఇదిగో వీరందరు నీ సహోదరులు; వారు నా హస్తకృత్యములు, వారిని సృజించిన దినమున వారికి గల జ్ఞానమును నేనిచ్చితిని; ఏదేను తోటలో నరునికి నేను స్వతంత్రతను ఇచ్చితిని;
33 వారు ఒకరికొకరు ప్రేమ కలిగియుండవలెనని, వారి తండ్రియైన నన్ను ఎన్నుకొనవలెనని నీ సహోదరులకు చెప్పి, ఆజ్ఞను కూడా ఇచ్చితిని; కానీ ఇదిగో వారు అనురాగరహితులై, తమ రక్తసంబంధులనే ద్వేషించుచున్నారు;
34 నా కోపాగ్ని వారిపై రగులుకొనెను; విచార తాపముతో వారిపై నేను జలప్రళయమును పంపెదను, ఏలయనగా తీవ్రమైన నా కోపము వారిపై రగులుకొనెను.
35 ఇదిగో నేను దేవుడను; పరిశుద్ధుడు అనునది నా పేరు; ఆలోచనకర్త అనునది నా పేరు; అంతము లేనివాడు, నిత్యుడు అని కూడా నాకు పేరు కలదు.
36 కాబట్టి, నేను నా చేతులుచాచి, నేను చేసిన సృష్టినంతటిని పట్టియుంచగలను; నా కన్ను వారిని చీల్చివేయగలదు కూడా, నీ సహోదరుల మధ్యనున్న గొప్ప దుష్టత్వము నా హస్తకృత్యములన్నిటిలో దేనియందును లేదు.
37 కానీ ఇదిగో, వారి పాపములు వారి పితరుల శిరస్సులమీద ఉండును; సాతాను వారి తండ్రియైయుండును, దుర్దశ వారి కడపటి స్థితియైయుండును; పరలోకమంతయు, నా హస్తకృత్యములన్నియు వారికొరకు దుఃఖించును; కాబట్టి వీరందరు బాధపడుచుండగా, పరలోకము దుఃఖించవలదా?
38 కానీ ఇదిగో, నీ కన్నులు చూచిన వీరందరు జలప్రళయములో నశించెదరు; వారిని నేను బంధించెదను; ఒక చెరసాలను వారి కొరకు నేను సిద్ధపరచియున్నాను.
39 నేను ఎన్నుకొనిన వాడు నా యెదుట వేడుకొనెను. కాబట్టి, ఆయన వారి పాపముల కొరకు బాధింపబడును; నేను ఎన్నుకొనిన వాడు నా యొద్దకు తిరిగివచ్చు దినమందు వారు పశ్చాత్తాపపడినంత వరకు, ఆ దినము వరకు వారు వేదనలో ఉందురు;
40 కాబట్టి, దీనికొరకు పరలోకము, నా హస్తకృత్యములన్నియు దుఃఖించును.
41 అప్పుడు ప్రభువు హనోకుతో మాట్లాడెను, నరుల సంతానము చేయు పనులన్నిటిని హనోకుతో చెప్పెను; కాబట్టి హనోకుకు తెలియును మరియు వారి దుష్టత్వమును, దుర్దశను చూచి, దుఃఖించి, తన చేతులు చాచెను, అతని హృదయము నిత్యలోకమంత ఉబ్బిపోయెను; అతని కడుపు తరుక్కుపోయెను; నిత్యలోకమంతయు కంపించెను.
42 హనోకు నోవహును అతని కుటుంబమును కూడా చూచెను; నోవహు కుమారుల సంతానమంతా భౌతిక రక్షణతో రక్షింపబడుటను చూచెను;
43 కావున నోవహు ఒక ఓడ నిర్మించుటను హనోకు చూచెను; ప్రభువు దానిని గూర్చి ఆనందించి, తన చేతితో దానిని పట్టుకొనెను; కానీ దుష్టుల శేషము మీదకు జలప్రళయము వచ్చి వారిని మ్రింగివేసెను.
44 హనోకు దీనిని చూడగా అతని ఆత్మ వేదనచెంది, తన సహోదరుల గూర్చి దుఃఖించి పరలోకముతో ఇట్లనెను: నేను ఓదార్పు పొందగోరుట లేదు; కానీ ప్రభువు హనోకుతో—నీ హృదయమునెత్తికొని సంతోషించి చూడుమనెను.
45 అప్పుడు హనోకు చూచెను; నోవహు నుండి లోకములోని కుటుంబములన్నింటిని ఆతడు చూచెను; అతడు—ప్రభువు దినము ఎప్పుడు వచ్చును? దుఃఖపడువారందరు పరిశుద్ధపరచబడి నిత్యజీవమును పొందుటకు నీతిమంతుని రక్తము ఎప్పుడు చిందించబడును? అనుచూ ప్రభువును ప్రార్థించెను?
46 అందుకు ప్రభువు—మధ్యస్థకాలములో దుష్టత్వము మరియు ప్రతీకారము ఉండు దినములలో అది వచ్చునని చెప్పెను.
47 శరీరమందు మనుష్య కుమారుని రాకడ దినము వచ్చుటను హనోకు చూచెను; అతని ఆత్మ సంతోషించి—నీతిమంతుడు పైకెత్తబడెను, లోకము పునాది వేయబడినప్పటినుండి గొఱ్ఱెపిల్ల సంహరించబడెను; విశ్వాసము ద్వారా నేను తండ్రి రొమ్మును ఆనుకొనియున్నాను, ఇదిగో సీయోను నాతోనున్నది అనెను.
48 అప్పుడు హనోకు భూమిని చూచెను; దాని అంతరంగము నుండి ఒక స్వరము ఈలాగు చెప్పుటను అతడు వినెను: నరులకు తల్లినైన నాకు శ్రమ; నాకు నొప్పి పుట్టుచున్నది, నా పిల్లల యొక్క దుష్టత్వము వలన నేను అలసితిని. నేనెప్పుడు విశ్రమించి, నా నుండి వెళ్ళిన కల్మషము నుండి కడిగివేయబడుదును? నేను విశ్రమించి, కొంతకాలము వరకు నీతి నాపై నిలిచియుండుటకు నా సృష్టికర్త నన్నెప్పుడు పవిత్రపరచును?
49 భూమి ఏడ్చుటను హనోకు వినినప్పుడు అతడు దుఃఖించి—ఓ ప్రభువా! భూమి యెడల నీవు జాలిగలిగియుండవా? నోవహు కుమారులను నీవు దీవించవా? అనుచూ ప్రభువును ప్రార్థించెను.
50 ఓ ప్రభువా! నోవహు మరియు అతని సంతానముపై కరుణ కలిగియుండి, భూమి ఇక ఎప్పటికీ జలప్రళయముతో ముంచివేయబడకయుండునట్లు చేయమని నీ అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు నామములో నిన్నడుగుచున్నాను అని హనోకు ప్రభువును ప్రార్థించుట కొనసాగించెను.
51 దేవుడు అనుగ్రహించకుండా ఉండలేకపోయెను; ఆయన హనోకుతో నిబంధన చేసెను, జలప్రళయము రాకుండా ఆపెదనని, నోవహు సంతానముతో మాట్లాడెదనని ప్రమాణము చేసెను;
52 భూమి ఉన్నంతవరకు సమస్త జనముల మధ్య అతని సంతానపు శేషము కనుగొనబడునని మార్చజాలని ఒక శాసనమును ఆయన పంపెను;
53 ప్రభువు ఈలాగు సెలవిచ్చెను: ఎవని సంతానము ద్వారా మెస్సీయ వచ్చునో వాడు ధన్యుడు; ఏలయనగా ఆయన ఈలాగు చెప్పుచున్నాడు—నేను మెస్సీయను, సీయోనుకు రాజును, పరలోకము యొక్క బండ, అది నిత్యత్వమంత విశాలమైనది; ద్వారము నొద్దకు వచ్చి, నా యొద్దకు ఎక్కివచ్చువాడు ఎన్నటికీ పడిపోడు; కావున నేను ఎవరిని గూర్చి మాట్లాడితినో వారు ధన్యులు, ఏలయనగా వారు నిత్యానంద కీర్తనలతో వచ్చెదరు.
54 అప్పుడు హనోకు ప్రభువును ఈలాగు ప్రార్థించెను: మనుష్య కుమారుడు శరీరమందు వచ్చునప్పుడు భూమి విశ్రమించునా? ఈ సంగతులన్నిటిని నాకు చూపమని నేను నిన్ను ప్రార్థించుచున్నాను.
55 ప్రభువు హనోకుతో—చూడుము అని పలికెను మరియు అతడు చూడగా, నరులవలె మనుష్యకుమారుడు సిలువ వేయబడుటను వీక్షించెను;
56 అతడు ఒక బిగ్గర స్వరమును వినెను; పరలోకమునకు తెరవేయబడెను; దేవుని సృష్టియంతయు దుఃఖించెను; భూమి బాధతో మూలిగెను; రాళ్ళు పగిలిపోయెను; పరిశుద్ధులు లేచి, మనుష్య కుమారుని కుడిచేతి ప్రక్కన మహిమ కిరీటములు ధరింపజేయబడిరి;
57 చెరలోనున్న ఆత్మలు బయటకు వచ్చి, దేవుని కుడిప్రక్కన నిలబడెను; మిగిలినవి ఆ గొప్పదినము యొక్క తీర్పువరకు అంధకార బంధకములలో దాచబడెను.
58 మరలా హనోకు ఏడ్చి ప్రభువును ఈలాగు ప్రార్థించెను: భూమి ఎప్పుడు విశ్రమించును?
59 మనుష్య కుమారుడు తండ్రి యొద్దకు ఎక్కిపోవుటను హనోకు చూచెను; అతడు ప్రభువును ఈలాగు ప్రార్థించెను: భూమిపైకి నీవు తిరిగి రావా? నీవు దేవుడవు గనుక నేను నిన్ను యెరిగియున్నాను, నీవు నాతో ప్రమాణము చేసి, నీ అద్వితీయ కుమారుని నామములో అడుగవలెనని నాకాజ్ఞాపించితివి; నీవు నన్ను సృష్టించి, నీ సింహాసనమునకు హక్కుదారునిగా చేసియున్నావు, నాయంతట నేను కాదు, కానీ నీ కృపను బట్టియే; కాబట్టి, నీవు మరలా భూమిపైకి వచ్చెదవా అని నేను నిన్నడుగుచున్నాను.
60 మరియు ప్రభువు హనోకుతో ఈలాగు సెలవిచ్చెను: నేను సజీవుడను గనుక అంత్యదినములలో, దుష్టత్వము, ప్రతీకారముండు దినములలో నోవహు సంతానమును గూర్చి నీకు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు నేను వచ్చెదను;
61 భూమి విశ్రమించు దినము వచ్చును, కానీ ఆ దినమునకు ముందు ఆకాశము చీకటిగా మారును, చీకటిపొరలు భూమిని కప్పును; భూమ్యాకాశములు వణకును; మనుష్య కుమారుల మధ్య గొప్పబాధ కలుగును, కానీ నా జనులను నేను కాపాడెదను;
62 పరలోకమునుండి నీతిని నేను క్రిందకు పంపుదును; నా అద్వితీయ కుమారుని గూర్చి, మరణమునుండి ఆయన పునరుత్థానమును, సమస్త మానవుల పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు భూమి నుండి సత్యమును నేను పంపుదును; నేను సిద్ధముచేయు ఒక స్థలమునకు, నా పరిశుద్ధ పట్టణమునకు భూమి నలుమూలల నుండి నేను ఎన్నుకొనిన వారిని పోగుచేయుటకు నీతియు, సత్యమును వరదవలె భూమిని ముంచివేయునట్లు చేయుదును, తద్వారా వారు తమ నడుములకు దట్టీలు కట్టుకొని, నా రాకడ సమయము కొరకు కనిపెట్టుదురు; ఏలయనగా అక్కడ నా మందిరముండును మరియు అది సీయోనుగా, ఒక నూతన యెరూషలేముగా పిలువబడును.
63 దేవుడు హనోకుతో ఈలాగు సెలవిచ్చెను: అప్పుడు నీవును, నీ పట్టణమంతయు అక్కడ వారిని కలుసుకొందురు, వారిని మనము మన కౌగిలిలోనికి తీసుకొందుము, వారు మనలను చూచెదరు; వారి మెడలమీద మనము, మన మెడలమీద వారు పడి ఒకరికొకరు ముద్దు పెట్టుకొందుము;
64 అక్కడ నా నివాసముండును, అది సీయోనుయై యుండును, అది నేను చేసిన సృష్టి అంతటిలోనుండి బయటకు వచ్చును; వెయ్యేండ్ల వరకు భూమి విశ్రమించును.
65 అప్పుడు హనోకు అంత్యదినములలో మనుష్య కుమారుడు వెయ్యేండ్ల వరకు భూమిపై నీతితో జీవించుటకు వచ్చు దినమును చూచెను;
66 కానీ ఆ దినమునకు ముందు దుష్టుల మధ్య గొప్ప శ్రమలను అతడు చూచెను; సముద్రము అలజడిగా ఉండుటను, నరుల హృదయాలు ధైర్యమును కోల్పోయి, దుష్టులపైకి రాబోవు సర్వశక్తిగల దేవుని తీర్పుల కొరకు భయముతో కనిపెట్టుటను కూడా అతడు చూచెను.
67 ప్రభువు లోకము యొక్క అంతమువరకు సమస్తమును హనోకుకు చూపెను; నీతిమంతుల దినమును, విమోచన గడియను అతడు చూచెను మరియు సంపూర్ణ ఆనందమును అతడు పొందెను;
68 హనోకు కాలములో సీయోను దినములన్నియు మూడువందల అరువది ఐదేండ్లు.
69 హనోకు, అతని జనులందరు దేవునితో నడిచిరి, ఆయన సీయోను మధ్య నివసించెను; సీయోను తన సన్నిధిలో నివసించునట్లు దేవుడు దానిని కొనిపోయెను గనుక సీయోను ఇక లేకుండెను. అప్పటినుండి సీయోను వెళ్ళిపోయెను అను మాట బయలువెళ్ళెను.