“దేవుని యాజకత్వము, ” యౌవనుల బలము కొరకు, ఆగష్టు 2021, 20–21.
యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, ఆగష్టు 2021
దేవుని యాజకత్వము
యౌవనులు యాజకత్వమును గూర్చి, దానితో వారికి గల సంబంధమును గూర్చి తెలుసుకోవలసినది ఏమిటి.
ఒకే పదాన్ని రెండు విధాలుగా వాడినప్పుడు అది ఎంత గందరగోళాన్ని సృష్టిస్తుందో మీరెప్పుడైనా గమనించారా? ఉదాహరణకు, ఆంగ్లంలో భూమి అనే పదం మనం నివసించే భూగ్రహాన్ని, అలాగే మన పాదాల క్రిందనున్న ధూళిని కూడా సూచిస్తుంది. రెండూ సరైనవే, కానీ ఆ పదాన్ని మీరు వాడిన సమయంలో మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి దాని అర్థం మారుతుంది. మరింత గందరగోళాన్ని సృష్టించడానికి భూమి అంటే మన గ్రహం అని అర్థం, ఇదే ధూళి అనే ఇంకొక ఆలోచనను కూడా కలిగిస్తుంది, ఎందుకంటే ధూళి గ్రహం మీదే ఉంటుంది కదా.
యాజకత్వము అనే పదాన్ని నిర్వచించడం
సంఘంలో రెండు విధాలుగా మనం ఉపయోగించే ఒక పదం యాజకత్వము. ఈ పదం దేవుని యొక్క మొత్తం శక్తిని, అధికారాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ, మనం యాజకత్వమును మరింత పరిమితంగా అనగా, “దేవుని పిల్లల రక్షణకు అవసరమైన అన్ని విషయాలలో పనిచేయడానికి నియమించబడిన యాజకత్వము గలవారికి దేవుడు ఇచ్చే శక్తిని మరియు అధికారాన్ని”1 సూచించడానికి ఉపయోగిస్తాము.
మనుష్యులకు ఇవ్వబడిన యాజకత్వము దేవుని యొక్క శక్తి మొత్తము కాదు. దిగువనివ్వబడిన పటము దీనిని విశదీకరిస్తుంది.
ఈ పటములో మీరు దేవుని శక్తికి కొన్ని ఉదాహరణలను చూస్తారు, అది అనంతమైనది మరియు హద్దులు లేనిది. దానిలో, క్రీస్తు సంఘమందు కార్యనిర్వహణ చేయడానికి అర్హులైన పురుషులపై నిర్ధారించే లేదా వారికిచ్చే దేవుని యాజకత్వపు శక్తి మరియు అధికారం యొక్క ఉదాహరణలను కూడా మీరు చూస్తారు.
మీ జీవితంలో యాజకత్వపు అధికారం యొక్క ఉదాహరణలు
యాజకత్వపు దీవెనలన్నీ పరలోకపు తండ్రి యొక్క ప్రియమైన కుమార్తెలు, కుమారులందరికీ అందుబాటులో ఉన్నాయి. రెండవ జాబితా యాజకత్వపు తాళపుచెవులను కలిగియున్న లేదా యాజకత్వపు అధికారం నిర్ధారించబడిన వ్యక్తి ద్వారా మీకు వచ్చే ఆశీర్వాదాలను సూచిస్తుంది.
భూమిపై తన సంఘం యొక్క సంస్థాపన మరియు పరిపాలన కోసం దేవుడు ఏర్పాటు చేసిన క్రమం ఇదే. పరిచారకులు లేదా బోధకుల కూటమి అధ్యక్షుడు అతని కూటమి యొక్క పనిని నిర్దేశించడానికి కలిగియున్న తాళపుచెవులు, ఇంట్లో ఇవ్వబడే తండ్రి యొక్క దీవెనలు, దేవాలయ విధులు మరియు నిబంధనలు దేవుని యాజకత్వ అధికారం యొక్క ఇతర ఉదాహరణలు.
పురుషులు, స్త్రీలు మరియు యాజకత్వము
యాజకత్వస్థానానికి నియామకం పురుషులకు మాత్రమే ఇవ్వబడినప్పటికీ, ప్రథమ అధ్యక్షత్వంలో మొదటి సలహాదారులైన అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ ఒక ముఖ్యమైన సూత్రాన్ని వివరించారు: “యాజకత్వం అనేది ఒక దైవిక శక్తి మరియు అధికారం, ఇది ఆయన పిల్లలందరి ప్రయోజనం కొరకైన దేవుని పని కోసం నమ్మకంతో ఉపయోగించబడుతుంది. యాజకత్వము అనేది యాజకత్వ స్థానానికి నియమించబడిన వారు లేదా దాని అధికారాన్ని వినియోగించేవారు కాదు. యాజకత్వమును కలిగి ఉన్న పురుషులు యాజకత్వం కాదు. … మనం నియమించబడిన పురుషులను యాజకత్వము2 అని సంబోధించకూడదు.
మహిళలు యాజకత్వానికి నియమించబడనప్పటికీ, అధ్యక్షుడు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా వివరించారు, “యాజకత్వపు తాళపుచెవులను కలిగియున్నవారి నిర్దేశానుసారం ఒక పిలుపులో సేవచేయడానికి మీరు ప్రత్యేకపరచబడినప్పుడు … ఆ పిలుపులో పనిచేయడానికి మీకు యాజకత్వపు అధికారం ఇవ్వబడింది.”3 యువతుల తరగతి అధ్యక్షత్వాలు, సువార్త ప్రకటించే మిషనరీ సహోదరీలు, వార్డులు, స్టేకులలో బోధించడానికి మరియు నడిపించడానికి ప్రత్యేకపరచబడిన నాయకులు మరియు దేవాలయంలోని విధుల పనివారు దీనికి కొన్ని ఉదాహరణలు.
యాజకత్వపు శక్తి ప్రతిఒక్కరినీ దీవిస్తుంది
యువతీ యువకులైన మీరు బాప్తీస్మమప్పుడు చేసిన నిబంధనలు మరియు దేవాలయంలో మీరు చేయబోయే నిబంధనల ద్వారా పొందబోయే దీవెనలన్నీ మీవే. మీ ఇంట్లో యాజకత్వము కలిగిన వ్యక్తి లేకపోయినా, మీరు దేవునితో చేసిన నిబంధనలను పాటించినప్పుడు మీ జీవితంలో ఆయన యాజకత్వపు శక్తితో మీరు దీవించబడతారు (1 నీఫై 14:14చూడండి).
మనం మన నిబంధనలకు అనుగుణంగా జీవించినప్పుడు, మనలను బలపరచి ఆశీర్వదించే దీవెనలను మనం పొందుతాము. మీ జీవితంలో యాజకత్వం యొక్క ఆశీర్వాదాలను, అనగా దేవుని అంతులేని యాజకత్వపు శక్తి వలన వచ్చే దీవెనలు, దేవుని సంఘంలో నిర్ధారించబడిన మరియు అప్పగించబడిన యాజకత్వపు అధికారం ద్వారా ప్రత్యేకంగా వచ్చే ఆశీర్వాదాలను ధ్యానించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
© 2021 by Intellectual Reserve, Inc. All rights reserved. అమెరికాలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, August 2021 యొక్క అనువాదము. Telugu. 17472 421