మనము మేలు చేయుటకు పిలువబడి యున్నాము” లియహోనా 2024 జూన్.
లియహోనా నెలవారీ సందేశము, 2024 జూన్
మనము మేలు చేయుటకు పిలువబడి యున్నాము
ఇతరులకు సేవ చేయుచు, మనలోని వెలుగును ప్రకాశింపచేయుచు, మత స్వేచ్ఛ కొరకు నిలువబడుట ద్వారా మనము దేవుని రాజ్యమును నిర్మించగలము.
గిద్యోను విన్నప్పుడు అది అసత్య సిద్ధాంతము అని అతడు గ్రహించాడు. అతడు దానిని ముందుగా రాజైన నోవహు మరియు అతని యాజకుల నుండి వినియుండెను—ఆ యాజకులు రాజైన నోవహు తన జనులపై విధించిన పన్నులద్వారా తమ సోమరితనమందు, విగ్రహారాధనయందు జారత్వములందు పోషింపబడిరి” (మోషైయ 11:5–6)
అంతకంటే హీనంగా, రాజైన నోవహు ప్రవక్తయైన అబినడైను చంపించి, అతని ద్వారా పరివర్తన చెందిన వారిని నాశనము చేయుటకు వెదకుచుండెను (మోషైయ 17;18:33–34). అటువంటి దుష్టత్వమును అంతము చేయుటకు, గిద్యోను ఆ రాజును ఆపుటకు, ప్రతిజ్ఞ చేసెను. కాని, లేమనీయుల దాడి కారణంగా అతనిని విడిచిపెట్టెను (మోషైయ 19:4–8 చూడుము)
ఆ తరువాత గిద్యోను ఆ యాజకులు లేమనీయుల కుమార్తెలను ఎత్తుకొని పోయినందుకు వారిపై సరైన విధముగ నేరస్థాపన చేసెను. వారు పశ్చాత్తాపపడుటకు నిరాకరించినందున వారికి వ్యతిరేకంగా అబినడై యొక్క ప్రవచనము నెరవేరినదని అతడు గమనించెను. (మోషైయ 20:17–22 చూడుము.) లేమనీయుల దాస్యములోని లింహై యొక్క జనులను విడిపించుటకు అతడు సహాయము చేసెను (మోషైయ 22:3–9 చూడుము).
ఇప్పుడు వృద్ధుడైన గిద్యోను ప్రజలలో యాజక వంచన ప్రవేశపెట్టిన నీహోర్ ఎదుట నిలిచి మరొక సారి గర్వమును మరియు దుష్టత్వమును రెంటిని ఎదిరించెను. నీహోర్ సంఘమునకు వ్యతిరేకముగ ప్రజలను తప్పుత్రోవలో నడిపించుటకు ప్రయత్నించు చుండెను. (ఆల్మా 1:3, 7, 12 చూడుము; 2 నీఫై 26:29 కూడా చూడుము.)
దేవుని వాక్యమును ఆయుధముగా ఉపయోగించి శూరుడైన గిద్యోను నీహోర్ యొక్క దుష్టత్వమును బట్టి అతనిని మందలించెను. కోపించిన నీహోర్ గిద్యోనుపై దాడిచేసి అతనిని ఖడ్గముతో చంపెను. (ఆల్మా 1:7–9 చూడుము.) “ఈ ప్రజల మధ్య ఎంతో మేలుచేసిన” “ఒక నీతిమంతుని” దినములు ఆ విధముగా ముగిసెను (ఆల్మా 1:13).
మనము జీవించుచున్న కడవరి దినములలో “దేవుని చేతులలో ఒక అయుధముగా” ఆల్మా 1:8 ఇతరులకు “సేవచేయుటకు”మోషైయ 22:4 నీతి కొరకు నిలబడుచు, మరియు మన దేవుని ఆరాధించుటకు గల స్వేచ్చను భంగపరచు బెదిరింపులను తట్టుకొనుచు, గిద్యోను మాదిరిని అనుకరించుటకు ఎన్నో అవకాశములు మనకు అనుగ్రహించబడు చున్నవి. మనము విశ్వాసముగల గిద్యోను యొక్క మాదిరిని అనుసరించినచో మనము కూడ ఎంతో మేలు చేయవచ్చును.
సేవలో ఐక్యమవ్వండి
“[రక్షకుని] అనుచరులుగా మనము దేవుని యొక్క, మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన పొరుగువారిని ప్రేమించాలని కోరుకుంటాము,” అని ప్రథమ అధ్యక్షత్వము పేర్కన్నారు. “యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము ఇతరులను దీవించుటకు మరియు అక్కరలోనున్న వారికి సహాయము చేయుటకు ఆతృతపడుచున్నది. ఈ పవిత్రమైన బాధ్యతను చేపట్టుటకు సామర్థ్యము, వనరులు, మరియు ప్రపంచవ్యాప్తంగా పలుకుబడి దైవాశీర్వాదము వలన మనము కలిగియున్నాము.”1
సంఘ సభ్యులు దేవాలయములలోను, మరియు తమ వార్డులలోను, శాఖలలోను మరియు స్టేకులలోను చేయు నిస్వార్ధపరమైన సేవకు మరియు పరిచర్యకు నేను కృతజ్ఞుడను. సంఘ సభ్యులు లెక్కలేనన్ని సామాజిక, విద్యా, ధార్మిక సంస్థలలో సేవచేయుచున్నారు మరియు వేలకొలది మానవ సేవా కార్యక్రమములలో ప్రతి సంవత్సరము స్వఛ్ఛందంగా మిలియన్ల గంటలు వెచ్చించి సుమారు 200 దేశాలు మరియు ప్రాంతాలలో నిమగ్నమై యున్నారు.2
ఒక విధంగా మన సంఘము అనేక దేశాలలో సేవా అవకాశాలను JustServe.org ద్వారా విస్తీర్ణము చేయుచున్నది. ఈ సంఘము చేత పొషింపబడినప్పటికి సేవాతత్పరులైన ఇతరులకు అందుబాటులో ఉంటూ, JustServe.org “సమాజ జీవన నాణ్యతను మెరుగు పరచు స్వచ్చంద సేవకులతో సమాజిక స్వచ్చంద సేవా అవసరతలను అనుసంధానము” చేయును. 3
ఈ సంఘము మరియు అందలి సభ్యులు కూడ ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవా సంస్థలతో అనుబంధము కలిగియున్నారు. “2022 లో రెడ్ క్రాస్ నిర్వహంచిన రక్తదాన కార్యక్రమములో ప్రపంచంలోనే అత్యధికంగా రక్తదానం సేకరించిన ఏకైక సంస్థగా మన సంఘమును నిలబెట్టిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు. దానికి తోడు ఈ సంఘం ఈ మధ్యనే రెడ్ క్రాస్ సంస్థకు $8.7 మిలియన్లు విరాళం ఇవ్వడం జరిగింది. 4
ప్రపంచ వ్యాప్తంగా శుభ్రమైన నీటి సరఫరా, మరియు పారిశుధ్య ప్రాజెక్టులు నడిపించు సంస్థలతో మన సంఘం అనుబంధం కలిగియున్నది. 2022 లో మన సంఘం అటువంటి 156 ప్రాజెక్టులలో పాల్గొన్నది. 5 బాధితులైన దేవుని బాలలకు ఉపశమనం అందించు ఇతర సంస్థలకు సహకారం మరియు విరాళం అందించుచున్నాము 6
“మనము అక్కరలోనున్న ప్రజలకు సేవ చేయువారితో చేతులు కలిపినప్పుడు ప్రభువు మన హృదయములను ఐక్యపరచును అని ప్రధమ అధ్యక్షత్వములో ద్వితీయ సలహాదారుడైన, అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ చెప్పెను. 7
మీ వెలుగును పైకెత్తుడి
మనము మన నిబంధనలను పాటించుచు మరియు క్రీస్తును పోలి జీవించినయెడల ఆయన యొక్క శిష్యులుగా మనము కూడ మన పొరుగువారిని దీవించుదుము. “ఈ సంఘ జనులు” ప్రభువు తమను కాపాడుచు, వర్ధిల్లచేయ వలెనని కోరిన యెడల, తాము నీతిని కోరుట మాత్రమే కాక తమ నీతి బద్ధమైన స్వరమును వినిపింపచేయవలెను. అని మోర్మన్ గ్రంధము బోధించుచున్నది. (ఆల్మా 2:3–7 చూడుము; మోషైయ 29:27 కూడ చూడుము) మన విశ్వాసమును మరియు మన నమ్మకములను పంచుకొనుచు మన వెలుగును పైకెత్త వలెనని ప్రభువు మనలను కోరుచున్నారు. “ఇదిగో, నేను మీరు పైకెత్త వలసిన వెలుగునైయున్నాను” 3 Nephi 18:24)
“మనము దేవుని కంటే మనుష్యునికి అధికంగా భయపడిన యెడల మనము మన రక్షకుని బాగుగా సేవించ జాలము,” అని ప్రధమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారుడైన అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ చెప్పెను. “మనము ప్రభువు యొక్క ప్రమాణాలను స్థాపించవలెనని పిలువబడి యున్నాము, లోకపు వాటిని అనుసరించుటకు కాదు.” 8
పాఠశాలలోనైనా, పనిలోనైనా, లేక ఆట లోనైనా, విహారము లోనైనా, డేటింగ్ లోనైనా, ఆన్ లైన్ లోనైనా, ప్రభువు శిష్యులు “క్రీస్తు నామమును ధరించుటకు సిగ్గుపడరు” ఆల్మా 46:21 మన మాటలు మరియు మన క్రియల ద్వారా మన దేవుడు సజీవుడనియు, మరియు మనము ఆయన కుమారుని అనుసరించుచున్నామనియు సాక్ష్యమును చెప్పుచున్నాము.
“మన విశ్వాసము వేరు వేరు అరలుగా విడదీయబడ లేదు, అసలు అలా జరుగ రాదు. విశ్వాసము కేవలము సంఘమునకు కాదు, ఇంటింటికీ, [పాఠశాలకీ ]పరిమితం కాదు,”.అని పాల్ లాంబర్ట్, కడవరి-దిన పరిశుద్ధుడు, బహు మతత్వం అధ్యయన నిపుణుడు. “అది మీరు చేసే ప్రతి దానిని గూర్చినది.” 9
మన సాక్ష్యము, మన ఆదర్శము, మరియు మన మంచి కార్యములు ఇతరుల మీద ఎటువంటి ప్రభావమును కలిగించునో మనకు తెలియదు. కాని, మనము సరియైన దాని కొరకు నిలబడి మరియు రక్షకుని వెలుగును పైకెత్తితే మనుషులు మనలను గుర్తిస్తారు మరియు పరలోకము మనకు దన్నుగా నుండును.
మత స్వేఛ్ఛ కొరకు నిలబడదాం.
ఈ రోజులలో అధిక మగుచున్న లౌకిక వాదం తోపాటు యాజక వంచన విశ్వాసులపై కలిగించు ఒత్తిడిలో, మోర్మన్ గ్రంధం నాటి కంటే ఎక్కువ తేడా లేదు. సామాజిక, రాజకీయ రంగాలలో మతము యొక్క ముఖ్య పాత్రను వ్యతిరేకించే వారి ఆర్భాటం ఎక్కువగు చున్నది. లౌకిక వాదం, రాజకీయాలు, విశ్వవిద్యాలయాలు, ప్రవర్తన పై ఒత్తిడి, మతమార్పిడి అవినీతి, నాస్థికత్వం, సాపేక్ష నీతి మొదలైన సిద్ధాంతాలు చోటుచేసుకొంటున్నాయి.
మనము మత హక్కుల కొరకు నిలబడక పోతే స్వేఛ్ఛ మీద దాడులు విజయవంతమౌతాయి. అన్ని విశ్వాసాల, మతాల జనులను మరియు వారి నమ్మకాల గురించి మాట్లాడే హక్కును కాపాడుటకు “ఒక సంఘముగా” “మనము ఇతర మతాలతో కలుద్దాము”.10
నీతి నియమాలను ఎన్నుకొనే స్వేఛ్ఛ కొరకు స్వర్గంలో యుద్ధం జరిగింది—ఎన్నుకొనుటకు మనకు స్వేఛ్ఛ. మన స్వేచ్చను కాపాడుకొనుటకు మనము శ్రద్ధతో మన మత స్వేచ్చను కాపాడుకొనవలెను.
చైతన్యవంతమైన మత విశ్వాసం కుటుంబాలను, సమాజాలను మరియు రాజ్యాలను బలపరచును మరియు కాపాడును. అది చట్టము యెడల విధేయత పుట్టించును, సృష్టిలోని జీవుల యెడల గౌరవము నాటును, దాతృత్వమును, నీతి, నిజాయితీలు—ధర్మం, స్వేచ్చ మరియు పౌర సమాజం చిరకాలం కొనసాగడానికి కావలసిన సద్గుణాలను నేర్పించును. మన విశ్వాసము గురించి సంజాయిషీ చెప్పుకోవలసిన అవసరం మనకు లేదు.
మన మిషనరీ ప్రయత్నాలు, దేవాలయంలో మనం చేసే సేవలు, పరలోక రాజ్యాన్ని నిర్మించడానికి మనం చేసే ప్రయత్నాలు, మన యొక్క సమస్త ఆనందం పొందాలంటే మనం మత విశ్వాసం మరియు స్వేఛ్ఛ కొరకు నిలబడాలి. మనము ఇతర స్వేచ్చలను పొగొట్టుకోకుండా ఆ స్వేచ్చను పోగొట్టుకో జాలము.
“నా ఆత్మను ప్రేరేపించేది స్వేచ్ఛ యెడల నాకు గల మక్కువ, అనగా సమస్త మానవజాతి కొరకు పౌరసత్వ మరియు మతపరమైన స్వేచ్ఛ మీద నాకు గల మక్కువయే.” అని ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ బోధించిరి.” 11 మనం సంఘ నాయకుల సలహా సంప్రదింపులను అనుసరించినప్పుడు మత స్వేఛ్ఛ కూడా మన ఆత్మలను ప్రేరేపించును
-
“ప్రజా ప్రాముఖ్యమైన సమస్యలను గూర్చి సమాచారము తెలుసుకొని అప్పుడు ధైర్యంగా పౌరమర్యాదతో మాట్లాడుము”. 12
-
“మత స్వేచ్చ తరుగుట వలన మనము బలపడుటకు, మరియు సువార్త విజ్ఞానము పవిత్ర విధులచేత ఆశీర్వదించ బడుటకును గల అవకాశములపై గణనీయంగా ప్రభావము చూపును, అని గుర్తించుము. మరియు ఆయన సంఘమును నడిపించుటకు ప్రభువుపై ఆధారపడవలెను.”13
-
దేవుడు ఉన్నాడనియు, మరియు పరిపూర్ణ సత్యములను ఆయన ఆజ్ఞలు స్థాపించుననియు ధృవీకరించుటకు లేచి నిలువబడి మాట్లాడుము.” 14
-
“మన విశ్వాసమును ఆచరించుటకు గల స్వేచ్చను భంగపరచగల చట్టములను సవాలు చేయుము.“ 15
-
“సర్వశక్తిమంతుడైన దేవుని యందు విశ్వాసమును నిర్మించుటకును, మరియు ఇతరులను మరింత సంతోషకరమైన ప్రదేశములోనికి తోడుకొని వచ్చుటకును, మేలు చేయుటకును, ప్రపంచములోనికి వెళ్ళుము.” 16
-
అధ్యన గ్రంధములను క్రింది వెబ్ సైట్లలో చదువ గలరు. religiousfreedom.ChurchofJesusChrist.org మరియు religiousfreedomlibrary.org/documents వద్ద.
దేవుని రాజ్యమును మనము నిర్మించు సేవలో మన వెలుగును పైకెత్తిపట్టుకొని మత స్వేచ్ఛ కొరకు నిలబడవలెను. మన ప్రయత్నములలో “అధిక మేలు” మన కుటుంబములలోను, సమాజములలోను, మరియు దేశములలోను కలుగునట్లు ప్రభువు మనలను ఆశీర్వదించును గాక.
© 2024 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Liahona Message, June 2024 యొక్క అనువాదము. Telugu. 19347 421