“పరివర్తనే మన లక్ష్యం,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)
“పరివర్తనే మన లక్ష్యం,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024
పరివర్తనే మన లక్ష్యం
మన పరివర్తనను అధికం చేసి, మరింతగా యేసు క్రీస్తు వలె మారడానికి మనకు సహాయపడడమే సువార్తను అభ్యసించడం మరియు బోధించడం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ కారణంగా, మనం సువార్తను అధ్యయనం చేసినప్పుడు, మనం క్రొత్త సమాచారం కోసం మాత్రమే చూడడం లేదు; మనం “నూతన సృష్టిగా” మారాలనుకుంటున్నాము (2 కొరిథీయులకు 5:17). దీని అర్థము మన హృదయాలు, మన అభిప్రాయాలు, మన చర్యలు మరియు మన స్వభావాలను మార్చుకోవడంలో మనకు సహాయపడేందుకు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై ఆధారపడడం.
కానీ మన విశ్వాసాన్ని బలపరచి, పరివర్తన అనే అద్భుతానికి నడిపించే అటువంటి సువార్త అభ్యాసమంతా ఒకేసారి జరుగదు. ఇది తరగతి గదులు దాటి వ్యక్తి యొక్క హృదయానికి మరియు గృహానికి వ్యాపిస్తుంది. సువార్తను అర్థం చేసుకొని, జీవించడానికి నిలకడయైన, అనుదిన ప్రయత్నాలు అవసరము. నిజమైన పరివర్తనకు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము అవసరము.
పరిశుద్ధాత్మ మనల్ని సత్యమునకు నడిపించి, ఆ సత్యం గురించి సాక్ష్యమిస్తాడు (యోహాను 16:13 చూడండి). ఆయన మన మనస్సులను వెలుగుతో నింపును, మన అవగాహనను వేగవంతము చేయును మరియు సమస్త సత్యమునకు మూలాధారమైన దేవుని నుండి బయల్పాటుతో మన హృదయాలను తాకును. పరిశుద్ధాత్మ మన హృదయాలను శుద్ధి చేయును. సత్యమును బట్టి జీవించాలనే కోరికను ఆయన మనలో ప్రేరేపించును మరియు దానిని చేసే విధానాలను గుసగుసలాడుట ద్వారా మనకు తెలియజేయును. నిజముగా, “పరిశుద్ధాత్మ … సమస్తమును (మనకు) బోధించును” (యోహాను 14:26).
ఈ కారణాల వలన, సువార్తను జీవించి, అభ్యసించి, బోధించేందుకు మన ప్రయత్నాల్లో మనము అన్నిటికంటే ముందుగా ఆత్మ యొక్క సహవాసాన్ని వెదకాలి. ఈ లక్ష్యము మన ఎంపికలను ప్రభావితం చేయాలి, మన ఆలోచనలను మరియు క్రియలను నడిపించాలి. ఆత్మ యొక్క ప్రభావాన్ని ఆహ్వానించే ప్రతీదానిని మనం కోరుకోవాలి మరియు ఆ ప్రభావాన్ని పారద్రోలే ప్రతీదానిని తిరస్కరించాలి—ఎందుకనగా, పరిశుద్ధాత్మ సమక్షంలో మనము యోగ్యులుగా ఉండగలిగినట్లయితే, పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు సమక్షంలో జీవించడానికి కూడా మనము యోగ్యులము కాగలము.