సర్వసభ్య సమావేశము
ఎప్పుడో చెప్పిన గొప్ప ఈస్టరు కథ
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


ఎప్పుడో చెప్పిన గొప్ప ఈస్టరు కథ

మోర్మన్ గ్రంథము గురించి క్రొత్తగా ఆలోచించండి మరియు పునరుత్థానుడైన క్రీస్తు యొక్క యధార్థత గురించి అది ఇచ్చే లోతైన సాక్ష్యాన్ని పరిగణించండి.

ఈస్టరు గురించి ప్రథమ అధ్యక్షత్వ లేఖ

చాలావారాల క్రితం మీ వార్డు లేదా శాఖలో ప్రథమ అధ్యక్షత్వము నుండి ఒక లేఖ చదవబడడాన్ని వినడం మీకు గుర్తుండే ఉంటుంది. వచ్చే ఆదివారం—ఈస్టరు ఆదివారం—వార్డులు మరియు శాఖలన్నీ సంస్కార సమావేశానికి మాత్రమే కలుసుకుంటాయి, ఆరాధనకు అదనపు సమయాన్ని ఇంటి వద్ద కుటుంబాలుగా ఈ అతిముఖ్యమైన సెలవుదినాన్ని జరుపుకోవడానికి వదిలివేయాలని ఆ లేఖ ప్రకటించింది.1

ప్రథమ అధ్యక్షత్వ లేఖ నా ఆసక్తిని చూరగొంది మరియు సంవత్సరాలుగా మా కుటుంబం ఈస్టరును జరుపుకున్న విధానంపై నేను ప్రతిబింబించేలా చేసింది. మా వేడుకల గురించి నేను ఎక్కువగా ఆలోచించే కొద్దీ, యేసు క్రీస్తును నమ్మే విశ్వాసులందరికీ ఎంతో ముఖ్యమైన ఈ సెలవుదినం యొక్క నిజమైన అర్థాన్ని మేము అనుకోకుండా తక్కువ చేస్తున్నామా అని ఎక్కువగా నేను ఆశ్చర్యపోయాను.

క్రిస్మస్ మరియు ఈస్టరు ఆచారములు

ఆ ఆలోచనలు ఈస్టరును, క్రిస్మస్‌ను మేము జరుపుకున్న విధానానికి మధ్య తేడాను నేను ధ్యానించేలా చేసాయి. డిసెంబరులో, “Jingle Bells (జింగిల్ బెల్స్),” క్రిస్మస్ మేజోళ్ళు, బహుమతులు, వాటితోపాటు—అవసరంలో ఉన్నవారి పట్ల శ్రద్ధ చూపడం, మనకిష్టమైన క్రిస్మస్ పాటలు, కీర్తనలు పాడడం, లేఖనాలు తెరచి లూకా 2 లో ఉన్న క్రిస్మస్ కథను చదవడం వంటి అధిక ఆలోచనాత్మక ఆచారాలను మనం ఏదో ఒకవిధంగా విలీనం చేస్తాము. పాత పెద్ద బైబిలు నుండి ఈ ప్రియమై కథను ప్రతీ సంవత్సరం మేము చదువుతున్నప్పుడు, మా కుటుంబం కూడా బహుశా మీ కుటుంబం చేసేది చేస్తుంది—యోసేపు, మరియ మరియు బాలుడైన యేసును ఆరాధించడానికి వచ్చిన అనేకమందిని సూచించడానికి మా తలలపైన, భుజాలపైన తువ్వాళ్ళను, స్నానపు వస్త్రాలను ధరిస్తాము, రక్షకుని పుట్టుక యొక్క విలువైన క్రిస్మస్ కథను మేము మళ్ళీ అభినయిస్తాము.

అయినప్పటికీ, ఈస్టరు నాడు మా కుటుంబ వేడుకలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఈస్టరు యొక్క అర్థవంతమైన, క్రీస్తు-కేంద్రీకృతమైన భాగాన్ని అందించడానికి మా కుటుంబం ఎక్కువగా “సంఘానికి వెళ్ళడం”పై ఆధారపడిందని నేననుకుంటున్నాను; తర్వాత ఒక కుటుంబంగా, మేము ఇతర ఈస్టరు-సంబంధిత ఆచారాలను పంచుకోవడానికి సమకూడాము. మా పిల్లలు మరియు ఇప్పుడు మా మనవళ్ళు ఈస్టరు గుడ్ల కోసం వేటాడుతూ, వారి ఈస్టరు బుట్టలను వెదకడాన్ని గమనించడం నాకిష్టం.

కానీ ప్రథమ అధ్యక్షత్వ లేఖ నన్ను మేల్కొల్పింది. ఈ భూమి పైన ఎప్పుడో జరిగిన అతిముఖ్యమైన సంఘటన—యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మరియు పునరుత్థానము—యొక్క మన వేడుకలో ప్రభువుకు చెందవలసిన భక్తిని, గౌరవాన్ని తప్పక చేర్చాలని మాత్రమే వారు మనల్ని ఆహ్వానించలేదు, కానీ ఆ విధంగా చేయడానికి ఈస్టరు ఆదివారంనాడు మన కుటుంబాలతో, స్నేహితులతో ఎక్కువ సమయాన్ని కూడా వారు మనకిచ్చారు.

చిత్రం
లేచిన రక్షకుడు

ప్రవక్త జోసెఫ్ స్మిత్ యొక్క ఈ మాటలు ఈస్టరుకు సంబంధించిన సంఘటనల ప్రాముఖ్యతకు అదనపు సందర్భాలను జతచేస్తాయి: “మన మతం యొక్క ప్రాథమిక సూత్రాలు ఏవనగా, యేసు క్రీస్తు మరణించారని, సమాధి చేయబడ్డారని, మూడవరోజు తిరిగి లేచారని మరియు పరలోకంలోకి ఆరోహణమయ్యారని ఆయనకు సంబంధించి అపొస్తలులు మరియు ప్రవక్తల యొక్క సాక్ష్యము; మన మతానికి సంబంధించిన మిగతావన్నీ దానికి అనుబంధములు మాత్రమే.”2

ఈస్టరు సమయంలో మా కుటుంబం ఇంకా మెరుగ్గా చేయగల విధానాల గురించి నేను, లీసా చర్చించాము. బహుశా మమ్మల్ని మేము అడిగిన ఈ ప్రశ్నను మనమందరం ఆలోచించవచ్చు: మనం యేసు క్రీస్తు పుట్టుక గురించిన క్రిస్మస్ కథను బోధించి, వేడుక చేసుకున్నట్లుగా అంతే ప్రయత్నం, సంతోషం మరియు మతాచారాలతో యేసు క్రీస్తు పునరుత్థానము గురించిన ఈస్టరు కథను మనం ఏవిధంగా బోధించి, వేడుక చేసుకోగలము?

మనమందరం ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది. కడవరి-దిన పరిశుద్ధుల మధ్య ఎక్కువగా క్రీస్తు-కేంద్రీకృత ఈస్టరు వైపు పెరుగుతున్న ప్రయత్నాన్ని నేను గమనిస్తున్నాను. ఇది ఇతర క్రైస్తవులలో కొందరు అభ్యసిస్తున్నట్లుగా, మట్టల ఆదివారాన్ని, గుడ్ ఫ్రై డేను గొప్పగా, మరింత ఆలోచనాపూర్వకంగా గుర్తించడాన్ని కలిపియుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంప్రదాయాలు, అభ్యాసాలలో కనుగొనబడే సరియైన క్రీస్తు-కేంద్రీకృత ఈస్టరు ఆచారాలను కూడా మనం అవలంబించవచ్చు.

క్రొత్త నిబంధన పండితుడు ఎన్. టి. రైట్ ఇలా సూచించారు: “క్రొత్త సృజనాత్మక విధానాలలో ఈస్టరును జరుపుకోవడానికి మనం చర్య తీసుకోవాలి: కళ, సాహిత్యం, పిల్లల ఆటలు, కవిత్వం, సంగీతం, నృత్యం, పండుగలు, గంటలు, ప్రత్యక కచేరీలలో. … ఇది మన సుప్రసిద్ధ పండుగ. క్రిస్మస్‌ను తీసివేస్తే, బైబిలులో మీరు మత్తయి మరియు లూకాకు ముందు రెండు అధ్యాయాలను కోల్పోతారు, ఇంకేమీ కాదు. ఈస్టరును తీసివేస్తే, మీకు క్రొత్త నిబంధన ఉండదు; మీకు క్రైస్తవ మతం ఉండదు.”3

ఈస్టరు, బైబిలు మరియు మోర్మన్ గ్రంథము

యేసు క్రీస్తు యొక్క పుట్టుక, పరిచర్య, సిలువధారణ మరియు పునరుత్థానము గురించి అది బోధించే వాటన్నిటి కోసం మనం బైబిలును ఆదరిస్తాము. “ఆయన లేచియున్నాడు”4 అని తోట సమాధి వద్ద ఈస్టరు ఉదయాన పరలోక దూతచేత పలుకబడిన వాటికంటే ఎక్కువగా మరి ఏ మూడు పదాలు మానవాళియంతటికి మరింత నిరీక్షణను, నిత్య పర్యవసానాన్ని చేర్చవు. ఈస్టరు కథను, యూదయ మరియు గలిలయలో రక్షకుని ఈస్టరు పరిచర్యను భద్రపరచిన క్రొత్త నిబంధన లేఖనము కొరకు మనం చాలా కృతజ్ఞత కలిగియున్నాము.

మా కుటుంబ ఈస్టరు వేడుక మరింతగా క్రీస్తు-కేంద్రీకృతమైనదిగా ఉండేలా విస్తరించడానికి నేను, లీసా మార్గాలను ధ్యానించడం, వెదకడం కొనసాగించినప్పుడు, క్రిస్మస్‌కి లూకా 2 చదివినట్లు—ఈస్టరుకు ఏ లేఖనం చదవడాన్ని మా కుటుంబ ఆచారంగా చేయాలో మేము చర్చించాము.

అప్పుడు మాకు ఈ పరలోక ప్రేరణ వచ్చింది: క్రొత్త నిబంధనలో ఈస్టరు గురించిన ముఖ్యమైన వచనాలకు అదనంగా, కడవరి-దిన పరిశుద్ధులుగా మనం అత్యంత విశేషమైన ఈస్టరు బహుమానంతో దీవించబడ్డాము! ఒక ప్రత్యేక సాక్ష్యము యొక్క బహుమానం, ఈస్టరు అద్భుతానికి మరొక నిబంధన, బహుశా అది క్రైస్తవ మతం అంతటిలో అత్యంత అద్భుతమైన ఈస్టరు లేఖనాలను కలిగియుంది. అవును, నేను మోర్మన్ గ్రంథము గురించి చెప్తున్నాను, మరింత స్పష్టంగా, తన పునరుత్థాన మహిమలో క్రొత్త లోకములోని నివాసితులకు యేసు క్రీస్తు అగుపించిన వృత్తాంతాన్ని సూచిస్తున్నాను.

మోర్మన్ గ్రంథము “గ్రంథములన్నింటిలోకెల్లా మిక్కిలి ఖచ్చితమైనదని,”5 మరియు 3 నీఫై 11 మొదలుకొని, అది పునరుత్థానుడైన క్రీస్తు నీఫైయులను దర్శించడం యొక్క అద్భుతమైన కథను, రక్షకుని ఈస్టరు పరిచర్యను గూర్చి చెప్తుందని ప్రవక్త జోసెఫ్ స్మిత్ వివరించారు. ఈ ఈస్టరు లేఖనాలు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము గూర్చి సాక్ష్యమిస్తాయి.

ఈ అధ్యాయాలలో, క్రీస్తు పన్నెండుమంది అపొస్తలులను పిలుస్తారు, ఆయన కొండమీది ప్రసంగంలో బోధించిన దానిని బోధిస్తారు, ఆయన మోషే ధర్మశాస్త్రమును నెరవేర్చారని ప్రకటిస్తారు మరియు కడవరి-దినాలలో ఇశ్రాయేలీయుల సమకూర్పు గురించి ప్రవచిస్తారు. ఆయన రోగులను స్వస్థపరుస్తారు మరియు జనుల కోసం ఎంత మహిమకరమైన విధంగా ప్రార్థిస్తారంటే, “యేసు మాట్లాడగా మేము చూచిన మరియు వినిన అంత గొప్ప అద్భుతమైన విషయములను ఏ నాలుక పలుకలేదు, ఏ మనుష్యుని చేతనైనను అవి వ్రాయబడలేవు, లేదా మనుష్యుల హృదయములు వాటిని ఊహించలేవు; మా కొరకు తండ్రిని ఆయన ప్రార్థించుటను మేము వినిన సమయమున, మా ఆత్మలను నింపిన ఆనందమును ఎవ్వరూ ఉహించలేరు.”6

చిత్రం
నీఫైయులకు ప్రత్యక్షమయిన యేసు క్రీస్తు

ఈ ఈస్టరునాడు, మా కుటుంబం మీ అందరికి బాగా తెలిసిన 3 నీఫై 11 యొక్క మొదటి 17 వచనాలపై దృష్టిపెట్టబోతున్నది. గొప్ప జనసమూహము సమృద్ధి దేశములోని దేవాలయం చుట్టూ చేరి, తండ్రియైన దేవుని స్వరం విని, అత్యంత అందమైన ఈస్టరు ఆహ్వానాన్ని ఇవ్వడానికి పరలోకం నుండి దిగివస్తున్న యేసు క్రీస్తును చూడడం మీకు గుర్తుందా:

“… నా చేతులు మరియు నా కాళ్ళలోని మేకుల గుర్తులను తడిమి తెలుసుకొనునట్లు, నేను … సమస్త భూమి యొక్క దేవుడనని మరియు లోక పాపముల కొరకు సంహరింపబడితినని మీరు తెలుసుకొనునట్లు లేచి నా యొద్దకు రండి.

“అంతట సమూహము ముందుకు వెళ్ళి, … ఒకని తరువాత ఒకడు … తమ కన్నులతో చూచి, చేతులతో తడిమి తెలుసుకొనిరి మరియు … అది నిశ్చయముగా ఆయనేనని తెలుసుకొని, సాక్ష్యమిచ్చిరి. …

“… వారు ఇట్లు చెప్పుచూ ఒకుమ్మడిగా కేకవేసిరి:

“హోసన్నా! అత్యున్నతుడైన దేవుని నామము ధన్యమగును గాక!” అనుచూ వారు యేసు పాదముల యొద్ద సాష్టాంగపడి, ఆయనను ఆరాధించిరి.”7

ఊహించుకోండి: నీఫైయులు దేవాలయం వద్ద నిజంగా పునరుత్థానుడైన ప్రభువు చేతులు తాకారు! లూకా 2ను మా క్రిస్మస్ ఆచారంలో భాగంగా చేసుకున్నట్లు, 3 నీఫైలోని ఈ అధ్యాయాలను మా ఈస్టరు ఆచారంలో భాగంగా చేసుకోవాలని మేము ఆశిస్తున్నాము. వాస్తవానికి, మోర్మన్ గ్రంథము ఎవ్వరూ చెప్పని గొప్ప ఈస్టరు కథను పంచుకుంటుంది. దానిని ఎన్నడూ చెప్పని గొప్ప ఈస్టరు కథలా కానివ్వకండి.

మోర్మన్ గ్రంథము గురించి క్రొత్తగా ఆలోచించమని మరియు పునరుత్థానుడైన క్రీస్తు యొక్క యధార్థత గురించి అది ఇచ్చే లోతైన సాక్ష్యాన్ని, అదేవిధంగా క్రీస్తు సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని, లోతును పరిగణించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిస్తుంది.

ఈస్టరునాడు మోర్మన్ గ్రంథ లేఖనాలను చదవడం మన జీవితాలను, మనకు ప్రియమైన వారి జీవితాలను అర్థవంతమైన విధంగా ఎలా దీవించగలదు? అని మనం అడగవచ్చు. ఎవరూ గ్రహించలేనంత ఎక్కువగా దీవిస్తుంది. మనం ఎప్పుడు మోర్మన్ గ్రంథము నుండి చదివినా మరియు అధ్యయనం చేసినా, మనం విశేషమైన ఫలితాలను ఆశించగలము.

ఇటీవల నేను, లీసా ఒక ప్రియమైన స్నేహితురాలు చనిపోతే చూడడానికి వెళ్ళాము, ఆమె చాలా విశ్వాసము గలది, అనారోగ్యంతో చనిపోయింది. మేము ఆమె కుటుంబంతో, దగ్గరి స్నేహితులతో సమకూడాము, మా జీవితాలను సుసంపన్నం చేసిన ఈ అద్భుతమైన వ్యక్తి యొక్క మధురమైన జ్ఞాపకాలను పంచుకున్నాము.

ఇతరులతో మాట్లాడుతూ శవపేటిక నుండి కాస్త దూరంగా నిలబడిన నేను, ప్రాథమిక-వయస్సు గల ఇద్దరు పాపలు వారి మునివేళ్ళపై నిలబడి శవపేటికను చూడడాన్ని గమనించాను—వారు లోపలికి చూడగలిగేటంత పొడవుగా లేరు—ప్రియమైన వారి ఆంటీకి అంతిమ వీడ్కోలు పలకడానికి వారు వచ్చారు. దగ్గరలో ఎవరూ లేకపోవడంతో, ఓదార్చడానికి మరియు బోధించడానికి లీసా నెమ్మదిగా వారి ప్రక్కన కూర్చుంది. వారు ఎలా ఉన్నారు మరియు ఇప్పుడు వారి ఆంటీ ఎక్కడున్నదో వారికి తెలుసా అని ఆమె అడిగింది. వారు తమ విచారాన్ని పంచుకున్నారు, కానీ వారి కళ్ళలో నిండైన ఆత్మవిశ్వాసంతో, వారి ఆంటీ ఇప్పుడు సంతోషంగా ఉందని, ఆమె యేసుతో ఉండగలదని వారికి తెలుసునని దేవుని యొక్క ఈ అమూల్యమైన కుమార్తెలు చెప్పారు.

ఈ చిన్న వయస్సులో, వారు సంతోషము యొక్క గొప్ప ప్రణాళికలో శాంతిని కనుగొన్నారు మరియు వారి స్వంత చిన్నపిల్లల విధానంలో, రక్షకుని పునరుత్థానము యొక్క లోతైన వాస్తవాన్ని, సరళమైన అందాన్ని గురించి సాక్ష్యమిచ్చారు. వారి హృదయాల్లో వారికిది తెలుసు, ఎందుకంటే ప్రియమైన తల్లిదండ్రులు, కుటుంబము, ప్రాథమిక నాయకులు యేసు క్రీస్తు మరియు నిత్యజీవములో విశ్వాసమనే విత్తనాన్ని నాటి, ఆలోచనాపూర్వకంగా బోధించారు. వారి వయస్సును మించిన జ్ఞానముతో, ఈ చిన్న పాపలు అర్థం చేసుకున్న సత్యాలలో అనేకము ఈస్టరు సందేశము ద్వారా, పునరుత్థానుడైన రక్షకుని పరిచర్య ద్వారా, మోర్మన్ గ్రంథములో చెప్పబడినట్లు ప్రవక్తల మాటల ద్వారా మన వద్దకు వస్తాయి.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రపంచ నాయకులతో పాటు మన విశ్వాసానికి చెందని వారికి మోర్మన్ గ్రంథమును బహుమానంగా ఇచ్చినప్పుడు, తరచు ఆయన 3 నీఫై తెరచి, పునరుత్థానుడైన క్రీస్తు నీఫైయులకు అగుపించడం గురించి చదువుతారని నేను గమనించాను. ఆవిధంగా చేయడం ద్వారా, జీవముతో నున్న ప్రవక్త సజీవుడైన క్రీస్తు గురించి నిజంగా సాక్ష్యమిస్తున్నారు.

ఆయన గురించి మనం సాక్ష్యము ఇవ్వనంత వరకు మనం యేసు క్రీస్తు యొక్క సాక్షులుగా నిలబడలేము. మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు యొక్క మరొక సాక్ష్యము, ఎందుకంటే పవిత్రమైన దాని పేజీలంతటా, ఒక ప్రవక్త తరువాత మరొకరు క్రీస్తు వస్తారని మాత్రమే కాకుండా, ఆయన వచ్చారని సాక్ష్యమిస్తారు.

ఆయన వలన

మోర్మన్ గ్రంథము యొక్క ప్రథమ సంచిక యొక్క ప్రతిని నేను నా చేతిలో పట్టుకున్నాను. దానిని పట్టుకున్న ప్రతీసారి నేను చాలా భావోద్వేగాలను అనుభవిస్తాను. నా యవ్వనంలో చాలామట్టుకు, లేఖనం యొక్క ఈ పవిత్ర గ్రంథాన్ని అనువదించి, ప్రచురించడానికి యువ జోసెఫ్ స్మిత్ చేసినదానికి నేను ఆకర్షితుడనయ్యాను, పరవశించిపోయాను మరియు ఉత్కంఠకు గురయ్యాను. జరుగవలసిన అద్భుతాలు ఆలోచించడానికి ఆశ్చర్యమేసింది.

కానీ, నేను భావోద్వేగాలను అనుభవించడానికి కారణం అది కాదు. దానికి కారణం, ఈ భూమి మీద ప్రచురించబడిన మరేయితర గ్రంథం కన్నా ఎక్కువగా ఈ గ్రంథము యేసు క్రీస్తు యొక్క జీవితం, పరిచర్య, బోధనలు, ప్రాయశ్చిత్తము మరియు పునరుత్థానము గురించి సాక్ష్యమిస్తుంది. నా ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు గురించి ఈ గ్రంథము నుండి క్రమం తప్పక అధ్యయనం చేయడం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మీ జీవితంలో సాధ్యమయ్యే వాటిని అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఇది మీ నిరీక్షణను పెంచుతుంది మరియు మిమ్మల్ని దాతృత్వముతో నింపుతుంది. అన్నిటిని మించి, ఇది యేసు క్రీస్తునందు మీ విశ్వాసాన్ని పెంపొందించి బలపరుస్తుంది, ఆయన మరియు మన తండ్రి మిమ్మల్ని ఎరుగుదురని, మిమ్మల్ని ప్రేమిస్తున్నారని, మీ పరలోక గృహానికి మీరు దారి కనుక్కోవాలని కోరుతున్నారనే ఖచ్చితమైన జ్ఞానంతో మిమ్మల్ని దీవిస్తుంది.

ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రాచీన ప్రవక్తలచేత ముందుగా చెప్పబడిన సమయం, “రక్షకుని జ్ఞానము ప్రతి జనము, వంశము, భాష మరియు ప్రజలందరి మధ్య వ్యాపించు సమయము వచ్చింది.”8 మోర్మన్ గ్రంథములో కనుగొనబడే యేసు క్రీస్తు యొక్క సాక్ష్యము ద్వారా మన కళ్ళముందు ఈ ప్రవచనం నెరవేరడాన్ని మనం చూస్తున్నాము.

చిత్రం
ప్రభువైన యేసు క్రీస్తు

ఏ పుస్తకం అంతకన్నా ఎక్కువ చూపించదు:

  • ఎందుకంటే, యేసు క్రీస్తు మూలముగా ప్రతిది మారింది.

  • ఎందుకంటే, ఆయన వలన ప్రతిది బాగుంది.

  • ఎందుకంటే, ఆయన వలన జీవితం—ముఖ్యంగా బాధాకరమైన క్షణాలు నిభాయించగలిగేలా ఉన్నాయి.

  • ఎందుకంటే, ఆయన వలన ప్రతిది సాధ్యము.

పునరుత్థానుడైన రక్షకునిగా ఆయన సందర్శించినప్పుడు, తండ్రియైన దేవుని చేత ఆయన పరిచయం చేయబడడం, అత్యంత మహిమకరమైన మరియు విజయోత్సాహముతో కూడిన ఈస్టరు సందేశము. మరణ బంధకములను త్రెంచిన మన రక్షకునిగా, విమోచకునిగా యేసు క్రీస్తు గురించి వ్యక్తిగత సాక్ష్యాన్ని పొందడానికి మన స్వంత కుటుంబ సభ్యులకు ఇది సహాయపడుతుంది.

మోర్మన్ గ్రంథము యొక్క సత్యము గురించి, సజీవుడైన దేవుని కుమారునిగా యేసు క్రీస్తు గురించి నా సాక్ష్యముతో నేను ముగిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. ప్రథమ అధ్యక్షత్వ లేఖ, ఫిబ్ర 15, 2023 చూడండి.

  2. Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 49; వివరణ చేర్చబడినది.

  3. N. T. Wright, Surprised by Hope: Rethinking Heaven, the Resurrection, and the Mission of the Church (2008), 256.

  4. మత్తయి 28:6.

  5. Teachings: Joseph Smith, 64.

  6. 3 నీఫై 17:17.

  7. 3 నీఫై 11:1-17 చూడండి.

  8. మోషైయ 3:20.

ముద్రించు