సర్వసభ్య సమావేశము
క్రీస్తు వంటి స్థిరత్వం
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


క్రీస్తు వంటి స్థిరత్వం

“మరియు ఆయన లేచి గాలిని గద్దించి–నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను” (మార్కు 4:39).

నేను గత సర్వసభ్య సమావేశములో మాట్లాడినప్పుడు, నా అల్లుడు రాయన్ నాకు ఒక ట్వీట్ చూపించాడు, “నిజమా? ఆ వ్యక్తి పేరు బ్రాగ్”—అంటే “ప్రగల్భాలు” అని అర్థం—“మరియు అతను వినయం గురించి మాట్లాడలేదా? ఎంత వ్యర్థం!” విచారకరంగా, నిరాశ కొనసాగుతోంది.

చిత్రం
ఒక బాస్కెట్‌ బాల్ ఆటగాడిగా డాన్ బ్రాగ్

నా తండ్రి, ఒక అద్భుతమైన శిక్షకుడైన జాన్ వుడెన్ ఆధ్వర్యంలో UCLA ఆల్-అమెరికా బాస్కెట్‌బాల్ ఆటగాడు. వారు నా తండ్రి జీవితమంతా సన్నిహితంగా ఉన్నారు, అప్పుడప్పుడు శిక్షకుడు మరియు శ్రీమతి వుడెన్ మా ఇంటికి రాత్రి భోజనానికి వచ్చేవారు. బాస్కెట్‌బాల్ గురించి లేదా నా మనస్సులోని మరేదైనా విషయము గురించి మాట్లాడడానికి ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు. ఒకసారి నేను, ఉన్నత పాఠశాలలో నా సీనియర్ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు, ఏదైనా సలహా ఇవ్వమని ఆయన్ని అడిగాను. ఎల్లప్పుడు ఉపాధ్యాయుడుగా ఉన్న ఆయన ఇలా అన్నారు, “నువ్వు యేసు క్రీస్తు సంఘములో చేరావని మీ నాన్న నాతో చెప్పాడు, కాబట్టి నీకు ప్రభువు మీద నమ్మకం ఉందని నాకు తెలుసు. ఆ విశ్వాసంతో ప్రతీ పరిస్థితిలోనూ స్థిరత్వాన్ని కలిగియుండు. తుఫాను వంటి పరిస్థితులలో కూడా మంచి మనిషిగా ఉండు.”

సంవత్సరాలుగా ఆ సంభాషణ నాతో ఉండిపోయింది. అన్ని పరిస్థితులలో, ముఖ్యంగా ప్రతికూలమైన మరియు ఒత్తిడి గల సమయంలో ప్రశాంతంగా, నిబ్బరముగా, నియంత్రణ కలిగి ఉండాలనే ఆ సలహా నాలో ప్రతిధ్వనించింది. శిక్షకుడైన వుడెన్ జట్లు స్థిరత్వంతో ఆడడాన్ని మరియు 10 జాతీయ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్న గొప్ప విజయాలను నేను చూడగలిగాను.

కానీ ఈ రోజుల్లో స్థిరత్వం గురించి ఎక్కువగా మాట్లాడరు మరియు అల్లకల్లోలమైన విభజన సమయాల్లో కూడా దానిని తక్కువ సాధన చేస్తారు. ఇది తరచుగా క్రీడలలో ప్రస్తావించబడుతుంది—స్థిరత్వం ఉన్న ఆటగాడు ఎంతో పోటీ గల ఆటలో కూడా స్వీయ నియంత్రణ పాటిస్తాడు, అలాగే స్థిరత్వం లేని జట్టు నియంత్రణ కోల్పోతుంది. కానీ ఈ అద్భుతమైన గుణం క్రీడలకు మించినది. స్థిరత్వం జీవితానికి చాలా విస్తృతమైన అన్వయాన్ని కలిగియుంది మరియు తల్లిదండ్రులు, నాయకులు, సువార్తికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు జీవితపు తుఫానులను ఎదుర్కొంటున్న ప్రతీఒక్కరినీ ఆశీర్వదించగలదు.

ఆధ్యాత్మిక సమతుల్యత మనం ప్రశాంతంగా ఉండేలా మరియు అత్యంత ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టేలా దీవిస్తుంది, ముఖ్యంగా మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు. “దేవునిపై విశ్వాసం మరియు సత్యం యొక్క అంతిమ విజయం ఇబ్బందులను ఎదుర్కొనే మానసిక మరియు ఆధ్యాత్మిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది” అని అధ్యక్షులు హ్యూ బి. బ్రౌన్ బోధించారు.1

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఆధ్యాత్మిక స్థిరత్వానికి అద్భుతమైన ఉదాహరణ. ఒకసారి, ఆనాటి-డా. నెల్సన్ క్వాడ్రపుల్ కరోనరీ ఆర్టరీ బైపాస్ చేస్తున్నప్పుడు, రోగి యొక్క రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయింది. డా. నెల్సన్ ప్రశాంతంగా పరిస్థితిని అంచనా వేశారు మరియు బృంద సభ్యుల్లో ఒకరు అనుకోకుండా ఒక బిగింపు తొలగించారని గుర్తించారు. అది వెంటనే భర్తీ చేయబడింది మరియు డా. నెల్సన్ బృంద సభ్యుడిని ఓదారుస్తూ, “నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పారు, ఆపై సరదాగా, “కొన్నిసార్లు నేను నిన్ను ఇతర సమయాల్లో కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను!” అని జోడించారు. అత్యవసర పరిస్థితిని ఎలా నిర్వహించాలో ఆయన చూపించారు—అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని—స్థిరత్వంతో, చాలా ముఖ్యమైన వాటిపై మాత్రమే దృష్టి పెట్టారు. అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు: “ఇది తీవ్రమైన స్వీయ-క్రమశిక్షణకు సంబంధించిన విషయం. ‘నన్ను బయటకు తీసుకెళ్ళండి, కోచ్! నేను ఇంటికి వెళ్ళాలి,’ అనేది మీ సహజ ప్రతిచర్యగా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి మీరు అలా చేయలేరు. ఒక ప్రాణం పూర్తిగా శస్త్రచికిత్స బృందంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పటిలాగే ప్రశాంతంగా, సేదతీరుతూ, చురుకుగా ఉండాలి.”2

వాస్తవానికి, రక్షకుడు స్థిరత్వానికి అంతిమ ఉదాహరణ.

గెత్సేమనే తోటలో, ఊహాతీతమైన వేదనలో, “ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను”,3 ఆయన “అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక” అనే సరళమైన మరియు గంభీరమైన ప్రకటనతో దైవిక స్థిరత్వాన్ని ఉదహరించారు.4 సమస్త మానవజాతికి రక్షణను సాధ్యం చేయాలనే విపరీతమైన ఒత్తిడిలో, యేసు మూడు ముఖ్యమైన పరిస్థితులను ప్రదర్శించారు, అవి ఆయన గొప్ప స్థిరత్వాన్ని అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడతాయి. మొదట, ఆయన ఎవరో ఆయనకు తెలుసు మరియు ఆయన తన దైవిక నియామకానికి యధార్థంగా నిలిచారు. తరువాత, గొప్ప సంతోష ప్రణాళిక ఉందని ఆయనకు తెలుసు. చివరగా, ఈ రోజు ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ బోధించినట్లుగా, యాజకత్వ విధుల ద్వారా పొందిన పవిత్రమైన నిబంధనలను చేసి పాటిస్తూ, విశ్వాసంతో ఆయనను అనుసరించే వారందరూ ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తం ద్వారా రక్షింపబడతారని ఆయనకు తెలుసు.

స్థిరత్వాన్ని కోల్పోవడం మరియు కొనసాగించడం మధ్య వ్యత్యాసానికి విరుద్ధంగా, క్రీస్తు మరియు ఆయన అపొస్తలులు గెత్సేమనే తోటను విడిచి వెళ్ళిన తరువాత ఏమి జరిగిందో ఆలోచించండి. యేసును బంధించడానికి సైనికులు ఎదురైనప్పుడు, పేతురు యొక్క ప్రతిస్పందన ఏమిటంటే, ప్రధాన యాజకుని దాసుడైన మల్కును కొట్టి, అతని చెవి తెగ నరకడం ద్వారా తన స్థిరత్వాన్ని కోల్పోవడం. మరోవైపు, యేసు క్రీస్తు యొక్క ప్రతిచర్య ఏమిటంటే, మల్కు‌ను స్వస్థపరచడం ద్వారా తన స్థిరత్వాన్ని కాపాడుకోవడం మరియు ఉద్రిక్త పరిస్థితులకు ప్రశాంతతను తీసుకురావడం.5

మనలో మన స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో కష్టపడుతున్నవారు, బహుశా నిరుత్సాహానికి గురైనవారు, పేతురు యొక్క మిగిలిన కథను పరిగణించండి. ఇది జరిగిన కొంత సమయానికి క్రీస్తుతో తన అనుబంధాన్ని తిరస్కరించడం యొక్క హృదయ విదారకమైన సంఘటన తర్వాత,6 రక్షకుడిని ఖండించిన అదే మత పెద్దల ముందు పేతురు నిలబడ్డాడు మరియు తీవ్రమైన ప్రశ్నల క్రింద గొప్ప సంయమనంతో యేసు క్రీస్తు యొక్క దైవత్వం గురించి అతడు అనర్గళంగా సాక్ష్యమిచ్చాడు.7

మీరు ఎవరో తెలుసుకోండి మరియు మీ దైవిక గుర్తింపుకు నిజాయితీగా ఉండండి

క్రీస్తు వంటి స్థిరత్వంలోని అంశాలను పరిశీలిద్దాం. ముందుగా, మనం ఎవరో తెలుసుకోవడం మరియు మన దైవిక గుర్తింపుకు కట్టుబడి ఉండడం సంయమనాన్ని తెస్తుంది. మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం లేదా మనం కానటువంటి వ్యక్తిలా నటించడం మానుకోవడం క్రీస్తు వంటి స్థిరత్వానికి అవసరం.8 “దేవుని స్వభావాన్ని మనుషులు గ్రహించలేనట్లయితే, వారు తమనుతాము గ్రహించలేరు,” అని జోసెఫ్ స్మిత్ బోధించారు.9 మనం ప్రేమగల పరలోక తండ్రి యొక్క దైవిక కుమారులు మరియు కుమార్తెలమని తెలియకుండా దైవిక స్థిరత్వాన్ని కలిగి ఉండడం సాధ్యం కాదు.

“నిత్యత్వము కొరకు ఎంపికలు” అనే తన ప్రసంగంలో, అధ్యక్షులు నెల్సన్ మనము ఎవరమనే దాని గురించి ఈ నిత్య సత్యాలను బోధించారు: మనము దేవుని పిల్లలం, మనము నిబంధన సంతానం మరియు మనము క్రీస్తు యొక్క శిష్యులం. తరువాత, “మీరు ఈ సత్యాలను హత్తుకున్నప్పుడు, ఆయన పరిశుద్ధ సన్నిధిలో శాశ్వతంగా జీవించాలనే మీ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన పరలోక తండ్రి మీకు సహాయం చేస్తారు” అని ఆయన వాగ్దానం చేశారు.10 మనం నిజంగా మర్త్య అనుభవాన్ని కలిగి ఉన్న దైవిక ఆధ్యాత్మిక జీవులం. మనం ఎవరమో తెలుసుకోవడం మరియు ఆ దైవిక గుర్తింపుకు నిజాయితీగా ఉండడం క్రీస్తు వంటి స్థిరత్వం యొక్క అభివృద్ధికి పునాది.

ఒక దైవిక ప్రణాళిక ఉందని తెలుసుకోండి

తరువాత, ఒక గొప్ప ప్రణాళిక ఉందని గుర్తుంచుకోవడం సవాళ్ళతో కూడిన పరిస్థితులలో ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. ప్రేమగల పరలోక తండ్రి యొక్క నిత్య ప్రణాళికను నెరవేర్చడంలో అతడు ఆత్మచేత నడిపించబడతాడని తెలుసు కాబట్టి, తాను చేయవలసిన పనుల గురించి “ముందుగా తెలియకపోయినను,”12 ప్రభువు ఆజ్ఞాపించినట్లు నీఫై “వెళ్ళి, చేయగలిగాడు.”11. మనం విషయాలను నిత్య దృక్పథంతో చూసినప్పుడు స్థిరత్వం వస్తుంది. ప్రభువు తన శిష్యులకు “మీ కన్నులను పైకెత్తుడి”13 మరియు “నిత్యత్వపు పవిత్ర సత్యములను గూర్చి మీ మనస్సులలో ఆలోచన చేయుడి”14 అని సలహా ఇచ్చారు. సవాళ్ళు గల సమయాలను ఒక నిత్య ప్రణాళికలో రూపొందించడం ద్వారా, ఒత్తిడి అనేది ప్రేమించి, సేవ చేసి, బోధించి, ఆశీర్వదించడానికి ఒక విశేషాధికారంగా మారుతుంది. నిత్య దృష్టి క్రీస్తు వంటి స్థిరత్వాన్ని సాధ్యం చేస్తుంది.

యేసు క్రీస్తు యొక్క సాధ్యపరచు శక్తి మరియు ఆయన ప్రాయశ్చిత్తం గురించి తెలుసుకోండి

చివరకు, ఆయన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా సాధ్యం చేయబడిన క్రీస్తు యొక్క సాధ్యపరచు శక్తి, మనకు సహించడానికి మరియు ప్రబలమవ్వడానికి శక్తిని ఇస్తుంది. యేసు క్రీస్తు ద్వారా మనం దేవునితో నిబంధన చేసుకోగలం మరియు ఆ నిబంధనను పాటించడంలో బలపరచబడగలం. మన భౌతిక పరిస్థితులతో సంబంధం లేకుండా మనం ఆనందంతో మరియు ప్రశాంతతతో రక్షకునికి కట్టుబడి ఉండగలము.15 ఆల్మా 7వ అధ్యాయము క్రీస్తు యొక్క సాధ్యపరచు శక్తి గురించి అందంగా బోధిస్తుంది. పాపం నుండి మనల్ని విమోచించడంతో పాటు, ఈ జీవితంలో మన బలహీనతలు, భయాలు మరియు సవాళ్ళలో రక్షకుడు మనల్ని బలపరచగలరు.

మనం క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించినప్పుడు, ఆల్మా యొక్క జనులు హీలమ్‌లో చేసినట్లుగా మన భయాలను మనం నివృత్తి చేసుకోగలము.16 బెదిరించే సైన్యాలు గుమికూడుతుండగా, ఆ విశ్వాసులైన క్రీస్తు శిష్యులు సంయమనాన్ని ప్రదర్శించారు. ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు: “ప్రభువును గుర్తుంచుకోవాలని మరియు ఆయన మాత్రమే ప్రసాదించగల విమోచనను గుర్తుంచుకోవాలని ఆల్మా విశ్వాసులకు ఉపదేశించాడు.(2 నీఫై 2:8 చూడండి). మరియు రక్షకుని సంరక్షణ గురించిన జ్ఞానము జనులు తమ స్వంత భయాలను నివృత్తి చేసుకునేలా చేసింది.”17 ఇది స్థిరత్వాన్ని ఉదహరిస్తుంది.

తుఫానులో గొప్ప వ్యక్తి

తుఫానులో సహనం గురించి నోవహు మనకు చాలా బోధించాడు, కానీ తుఫానును ఎలా తట్టుకోవాలో బోధించింది మన గొప్ప రక్షకుడు. ఆయన తుఫానులో గొప్ప వ్యక్తి. తన అపొస్తలులతో సుధీర్ఘమైన బోధనా దినము తర్వాత, రక్షకునికి కొంత విశ్రాంతి అవసరమైయుండి, వారు పడవలో గలిలయ సముద్రానికి అవతలి వైపు వెళ్ళాలని ఆయన సూచించారు. రక్షకుడు విశ్రాంతి తీసుకుంటుండగా, తీవ్రమైన తుఫాను చెలరేగింది. గాలి మరియు కెరటాలు పడవను ముంచుతాయని బెదిరిపోయి, అపొస్తలులు తమ ప్రాణాల గురించి భయపడడం ప్రారంభించారు. గుర్తుంచుకోండి, ఆ అపొస్తలులలో చాలామంది ఆ సముద్రంలో తుఫానుల గురించి బాగా తెలిసిన మత్స్యకారులు! అయినప్పటికీ, ఆందోళన చెంది,18 వారు ప్రభువును మేల్కొలిపి, “[ప్రభూ], మేము నశించిపోవుచున్నాము; నీకు చింతలేదా?” అని అడిగారు. అప్పుడు, స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ, రక్షకుడు “లేచి గాలిని గద్దించి–నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, “గాలి అణగి, మిక్కిలి నిమ్మళమాయెను.”19

ఆపై అది ఆయన అపొస్తలుల కోసం స్థిరత్వం గురించిన ఒక గొప్ప పాఠం. “అప్పుడాయన–మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మికలేకయున్నారా?” అని వారితో అన్నారు.20 ఆయన లోక రక్షకుడని మరియు దేవుని బిడ్డలకు అమర్త్యత్వాన్ని, నిత్య జీవితాన్ని తీసుకురావడానికి తండ్రి చేత పంపబడ్డారని ఆయన వారికి గుర్తు చేస్తున్నారు. నిశ్చయంగా దేవుని కుమారుడు పడవలో నశించడు. ఆయనకు తన దైవత్వం గురించి తెలుసు, రక్షణ ప్రణాళిక మరియు ఉన్నతస్థితి ఉందని, ఆ ప్రణాళిక యొక్క నిత్య విజయానికి ఆయన ప్రాయశ్చిత్తం అవసరమని ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన దైవిక స్థిరత్వాన్ని ఉదహరించారు.

క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం ద్వారా అన్ని మంచి విషయాలు మన జీవితాల్లోకి వస్తాయి. మనము ఎవరమో గుర్తుంచుకొని, దయ యొక్క దైవిక ప్రణాళిక ఉందని తెలుసుకొని, ప్రభువు యొక్క శక్తిలో ధైర్యాన్ని పొందినప్పుడు, మనం అన్ని పనులను చేయగలము. మనము ప్రశాంతతను పొందుతాము. ఏ తుఫానులోనైనా మనం మంచి స్త్రీ పురుషులుగా ఉంటాము.

కష్ట సమయాల్లో మనకు సహాయం చేయడమే కాకుండా, ఇతరులను ఆశీర్వదించడానికి మరియు వారి జీవితాల్లోని తుఫానుల గుండా వారికి సహాయం చేయడానికి క్రీస్తువంటి స్థిరత్వం యొక్క ఆశీర్వాదాలను మనం కోరుకుందాం. ఈ మట్టల ఆదివారం సందర్భంగా, నేను యేసు క్రీస్తును గురించి ఆనందంగా సాక్ష్యమిస్తున్నాను. ఆయన లేచియున్నాడు! మన జీవితాలకు ఆయన మాత్రమే తీసుకువచ్చే శాంతి, ప్రశాంతత మరియు పరలోకపు స్థిరత్వం గురించి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. Hugh B. Brown, in Conference Report, Oct. 1969, 105.

  2. See Sheri Dew, Insights from a Prophet’s Life: Russell M. Nelson (2019), 66–67.

  3. జోసెఫ్ స్మిత్ అనువాదము, లూకా 22:44 ( లూకా 22:44, పాదవివరణ  లో).

  4. లూకా 22:42.

  5. లూకా 22:50-51; యోహాను 18:10-11 చూడండి.

  6. మత్తయి 26:34-35, 69-75 చూడండి.

  7. అపొస్తలుల కార్యములు 4:8–10; Neal A. Maxwell, “Content with the Things Allotted unto Us,Ensign, May 2000, 74; Liahona, July 2000, 89: “When spiritually aligned, a poise can come, even when we do not know ‘the meaning of all things’ [1 నీఫై 11:17]” చూడండి.

  8. See John R. Wooden, Wooden on Leadership (2005), 50: “స్థిరత్వం అంటే తనకు తానుగా ఉండడం, పరిస్థితులు లేదా సందర్భాలతో సంబంధం లేకుండా గిలగిల కొట్టుకోకుండా, విసిరివేయబడకుండా లేదా అసమతుల్యంగా లేకుండా ఉండడం అని నేను నిర్వచిస్తాను. ఇది తేలికగా అనిపించవచ్చు, కానీ కష్ట సమయాల్లో స్థిరత్వం అనేది అత్యంత అంతుచిక్కని గుణం. స్థిరత్వం లేని నాయకులు ఒత్తిడికి గురైనప్పుడు భయాందోళన చెందుతారు.

    “స్థిరత్వం అంటే పరిస్థితి ఎంత చెడ్డదైనా లేదా మంచిదైనా మీ నమ్మకాలను గట్టిగా పట్టుకోవడం మరియు వాటికి అనుగుణంగా ప్రవర్తించడం. స్థిరత్వం అంటే వేషాలకు దూరంగా ఉండడం, మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకుండా మరియు మీరు కానటువంటి వారిలా ప్రవర్తించకుండా ఉండడం. స్థిరత్వం అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా ధైర్యమైన హృదయాన్ని కలిగి ఉండడం.”

  9. Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 40.

  10. Russell M. Nelson, “Choices for Eternity” (worldwide devotional for young adults, May 15, 2022), broadcasts.ChurchofJesusChrist.org.

  11. 1 నీఫై 3:7.

  12. 1 నీఫై 4:6.

  13. యోహాను 4:35.

  14. సిద్ధాంతము మరియు నిబంధనలు 43:34; see also James E. Faust, “The Dignity of Self,Ensign, May 1981, 10: “పరిశుద్ధత కొరకు వెదకుతూ పైకి చూసినప్పుడు ఆత్మగౌరవం బాగా పెరుగుతుంది. పెద్ద వృక్షాల వలే మనం కూడా వెలుగు కోసం ఎదగాలి. మనం తెలుసుకోగల అత్యంత ముఖ్యమైన వెలుగుకు మూలం పరిశుద్ధాత్మ వరము. ఇది అంతర్గత బలం మరియు శాంతికి మూలాధారము.”

  15. See Russell M. Nelson, “Joy and Spiritual Survival,Liahona, Nov. 2016, 82: “నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మనం పొందే ఆనందం మన జీవితపు పరిస్థితులపైన తక్కువగా ఆధారపడుతుంది, కానీ మన జీవితాల యొక్క దృష్టిసారింపుపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.”

  16. మోషైయ 23:27-28 చూడండి.

  17. David A. Bednar, “Therefore They Hushed Their Fears,” Liahona, May 2015, 46–47.

  18. See Jeffrey R. Holland, Our Day Star Rising: Exploring the New Testament with Jeffrey R. Holland (2022), 61–62: “ఇంకా, ఆయనతో పాటు ఉన్నవారు అనుభవజ్ఞులు—మొదటి పన్నెండుమందిలో పదకొండు మంది గలిలయులు (ఇస్కరియోతు యూదా మాత్రమే యూదుడు). మరియు ఆ పదకొండు మందిలో ఆరుగురు మత్స్యకారులు. వారు ఈ సరస్సుపై నివసించారు. వారు దానిపై చేపలు పట్టి జీవనం సాగించేవారు. వారు చిన్నప్పటి నుండి అక్కడే ఉన్నారు. వారు చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడే వారి తండ్రులు వారిచేత వలలు బాగుచేయడం మరియు పడవలో మరమ్మత్తులు చేయడం చేయించారు. వారికి ఈ సముద్రం తెలుసు; వారికి గాలులు మరియు అలలు తెలుసు. వారు అనుభవజ్ఞులైన పురుషులు—కానీ వారు భయపడ్డారు. మరియు వారు భయపడితే, ఇది చాలా పెద్ద తుఫానే.”

  19. మార్కు 4:35-39 చూడండి.

  20. మార్కు 4:40.

ముద్రించు