సర్వసభ్య సమావేశము
క్రీస్తు యొక్క సిద్ధాంతమును విశ్వసించుట
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


క్రీస్తు యొక్క సిద్ధాంతమును విశ్వసించుట

క్రీస్తుతో నిబంధన అనుబంధము యొక్క పునాదిపై మన గృహాలను కట్టినప్పుడు, మనము క్రీస్తు యొక్క సిద్ధాంతమును విశ్వసిస్తాము.

వృద్ధుడైన ప్రవక్త నీఫై తన బల్ల వద్ద, తన ఎదురుగా బంగారు పలకలు పరచబడి, అతడి చేతిలో కలముతో ఉండడాన్ని నేను ఊహిస్తున్నాను.

నీఫై తన గ్రంథములో చివరగా చెక్కుటను ముగించే ప్రక్రియలో ఉన్నాడు. “ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, నేను నా మాటలను ముగించెదను,”1 అని అతడు వ్రాసాడు. కానీ తర్వాత వెంటనే, ఆత్మ అతడిని తన నివేదికకు తిరిగి వెళ్ళి, ముగింపు సందేశాన్ని వ్రాయమని ప్రేరేపించాడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తివంతమైన ప్రభావము క్రింద, ఆ గొప్ప ప్రవక్త తన చేతిలో కలాన్ని తీసుకొని ఇలా వ్రాసాడు, “కావున క్రీస్తు యొక్క సిద్ధాంతమును గూర్చి నేను పలుకవలసిన కొద్ది మాటలు తప్ప, నేను వ్రాసియున్న విషయములు నాకు చాలును.”2

ఆ “కొద్ది మాటలు”3 కొరకు మరియు వాటిని వ్రాయమని ఆత్మ నీఫైను ఒత్తిడి చేసినందుకు మనము శాశ్వతంగా కృతజ్ఞత కలిగియున్నాము. క్రీస్తు యొక్క సిద్ధాంతముపై నీఫై యొక్క ప్రమాణ గ్రంథం దానిని లోతుగా అధ్యయనం చేసే వారికి అమూల్యమైన నిధి. అది రక్షకుని బాప్తిస్మము4 యొక్క దర్శనమును మరియు ఆయనను అనుసరించమని,5 “[ఆయన] చేయగా [మనము] చూచియున్న క్రియలను చేయమని”6 అందరిని ఆహ్వానిస్తున్న కుమారుని స్వరమును కలిగియున్నది. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసముతో, వారి పాపముల కొరకు మనఃపూర్వకంగా పశ్చాత్తాపపడి, రక్షకుడిని బాప్తిస్మపు నీటిలోనికి అనుసరిస్తారో వారు, “పరిశుద్ధాత్మను పొందెదరు; అవును, అప్పుడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మము వచ్చును” అనే నీఫై యొక్క సాక్ష్యమును అది కలిగియున్నది. నమోదు చేయబడియున్న తండ్రి యొక్క స్వరమును కూడా మనం వింటాము: “నా ప్రియ కుమారుని మాటలు యథార్థమైనవి, నమ్మకమైనవి. అంతము వరకు స్థిరముగానుండు వాడు రక్షించబడును.”8

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ క్రొత్తగా పిలువబడిన మిషను నాయకులతో ప్రసంగిస్తూ క్రీస్తు సిద్ధాంతము యొక్క అసమానమైన ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు: “అన్నిటికంటే ఎక్కువగా, మన సువార్తికులు … క్రీస్తు యొక్క సిద్ధాంతము వారి హృదయాలలో … వారి ఎముకల మూలుగలలో—స్థిరంగా నాటబడి స్థాపించబడాలని మనము కోరుతున్నాము.”9

నా సువార్తను బోధించండి అనేది క్రీస్తు యొక్క సిద్ధాంతంలోని ఐదు ముఖ్యమైన అంశాలను సంక్షిప్తపరుస్తుంది. అది ఇలా బోధిస్తుంది, “యేసు క్రీస్తునందు మరియు ఆయన ప్రాయశ్చిత్తమునందు విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరమును పొందుట మరియు అంతము వరకు సహించుట ద్వారా పునఃస్థాపించబడిన సువార్తను పొందడానికి వారికి సహాయపడుట ద్వారా క్రీస్తునొద్దకు వచ్చుటకు ఇతరులను [మనము] ఆహ్వానిస్తున్నాము.”10

అయితే క్రీస్తు సిద్ధాంతము యొక్క ప్రాముఖ్యత సువార్తికులకు మాత్రమే కాదు! మరియు అది దాని ఐదు కీలకమైన అంశముల సారాంశము పునరావృతం చేయబడుట కంటె మిక్కిలి లోతైనది. అది సువార్త యొక్క సూత్రమును కలిగి ఉంటుంది. అది నిత్య జీవితానికి గొప్ప ప్రణాళిక.

సహోదర సహోదరీలారా, క్రీస్తు యొక్క సిద్ధాంతము మన హృదయాలలో స్థిరంగా నాటబడి స్థాపించబడాలనే అధ్యక్షులు నెల్సన్ గారి ఆహ్వానమును మనము అంగీకరించాలంటే, మనము అధ్యయనం ద్వారా, ప్రార్థన ద్వారా, నమ్మకమైన జీవనం ద్వారా మరియు నిరంతర పశ్చాత్తాపం ద్వారా ప్రభువుకు మన పరివర్తనను మరింత అధికం చేయాలి. బంగారు పలకలమీద నీఫై చేత చెక్కబడినట్లుగా, క్రీస్తు యొక్క సిద్ధాంతము శాశ్వతంగా “[మన] మెత్తని హృదయపు పలకల మీద” చెక్కబడుటకు పరిశుద్ధాత్మను మనము తప్పక ఆహ్వానించాలి.11

గత అక్టోబరులో, అధ్యక్షులు నెల్సన్, “లోకమును జయించుట అనగా అర్థమేమిటి?” అని అడిగారు. మిగిలిన వాటి మధ్య “దానర్థం, మనుష్యుల తత్వాల కంటే ఎక్కువగా క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని విశ్వసించడం” అని ఆయన అన్నారు.12

విశ్వసించుట అనే మాట “ఎవరైనా లేదా ఏదైనా స్వభావము, సామర్థ్యము, బలము లేదా సత్యముపై హామీ ఇవ్వబడిన నమ్మకముగా” 13 నిర్వచించబడింది. ఆ ఎవరైనా అనునది యేసు క్రీస్తు మరియు ఏదైనా అనునది ఆయన సిద్ధాంతం.

అయితే ఉద్దేశ్యపూర్వకంగా క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని విశ్వసించడం మన జీవన విధానమును ఏవిధంగా మారుస్తుంది?

క్రీస్తు యొక్క సిద్ధాంతమును మనము విశ్వసించిన యెడల, ఆయన ప్రతీ మాట ద్వారా జీవించడానికి తగినంతగా మనము క్రీస్తును నమ్ముతాము.14 మనము యేసు క్రీస్తు, ఆయన పరిచర్య, ఆయన బోధనలు మరియు ఆయన మహిమకరమైన పునరుత్థానముతో కలిపి ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తం గురించి జీవితకాలం అధ్యయనం చేస్తాము.15 ఆయన వాగ్దానములను మరియు ఏ షరతులపై ఆ వాగ్దానములు ఇవ్వబడ్డాయో వాటిని మనం అధ్యయనం చేస్తాము.16 మనం చదువుతున్నప్పుడు, ప్రభువు పట్ల ఎక్కువ ప్రేమతో నింపబడతాము.

మనము క్రీస్తు సిద్ధాంతాన్ని విశ్వసిస్తే, ప్రతీరోజు వినయపూర్వకమైన, రహస్య ప్రార్థనలో మన పరలోక తండ్రిని సమీపిస్తాము, అక్కడ మనం ఆయన కుమారుని బహుమానం కొరకు మరియు మన సమస్త దీవెనలకు కృతజ్ఞతలు తెలియజేయవచ్చు.17 మన నిబంధనలపై ప్రతిబింబించడానికి మరియు వాటిని పాటించాలనే మన నిబద్ధతను పునరుద్ధరించడానికి,20 మన సంకల్పాన్ని ఆయనతో సమలేఖనం చేయడానికి,19 పరిశుద్ధాత్మ యొక్క బయల్పరచే సహవాసం కొరకు మనం ప్రార్థించవచ్చు.18 మన ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులను ఆమోదించడానికి, వారి పట్ల ప్రేమను వ్యక్తపరచడానికి ప్రార్థించవచ్చు;21 క్షమాపణ యొక్క శుద్ధి చేసే శక్తి కోసం22 మరియు శోధన‌ను నిరోధించే శక్తి కోసం ప్రార్థించవచ్చు.23 దేవునితో మీ సంభాషణను మెరుగుపరచుకోవడానికి ప్రతీరోజూ మీ జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

మనము క్రీస్తు యొక్క సిద్ధాంతమును విశ్వసించిన యెడల, మనము లోకము యొక్క శోధనలు మరియు ప్రభావాలను ప్రక్కన పెడతాం, ఆవిధంగా మనము లోక విమోచకునిపై దృష్టిసారించగలము.24 మనము సామాజిక మాధ్యమం; ఇంటర్నెట్ ఆటలు; నిరూపయోగమైన, అత్యధికమైన లేదా అనుచితమైన వినోదము; ఈ లోకము యొక్క ప్రలోభపెట్టే నిధులు మరియు వ్యర్థాలు; మనుష్యుల తప్పుడు సంప్రదాయాలు మరియు తప్పుదారి పట్టించే తత్వాలకు చోటు కల్పించే ఏవైనా ఇతర కార్యకలాపాలపై గడిపే సమయాన్ని తగ్గిస్తాము లేదా తొలగిస్తాము. క్రీస్తులో మాత్రమే మనం సత్యాన్ని మరియు శాశ్వతమైన నెరవేర్పును కనుగొంటాము.

మనఃపూర్వకమైన పశ్చాత్తాపము25 పాపము కొరకు క్షమించబడడానికి మరియు క్రీస్తు యొక్క ప్రతిరూపములో మారడానికి-— 26 రెండు విధాలుగా మన జీవితాలలో సంతోషకరమైన భాగమవుతుంది.27 క్రీస్తునందు విశ్వాసంతో కూడిన పశ్చాత్తాపం మనకు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తానికి ప్రవేశాన్ని ఇస్తుంది. రక్షకుడు క్షమించినప్పుడు, ఆయన “పాపము నుండి (మనల్ని) శుద్ధి చేయడాని కంటే ఎక్కువగా చేస్తారు.” ఆయన [మనకు] నూతన బలాన్ని కూడా ఇస్తారు,”28 అని అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ బోధించారు. దేవుని ఆజ్ఞలు పాటించడానికి మరియు మన జీవితాల యొక్క నిత్య ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి మనలో ప్రతీఒక్కరికీ ఈ బలం అవసరం.

యేసునందు మరియు ఆయన సిద్ధాంతంలో, మనం బలాన్ని పొందుతాము. “నిశ్చయముగా, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, ఇదే నా సిద్ధాంతము; దీనిపైన కట్టువారు నా బండ మీద కట్టుదురు మరియు పాతాళలోక ద్వారములు వారి యెదుట నిలువనేరవు,”29 అని ఆయన చెప్పారు.

విశ్వాసులైన ప్రజల జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరడాన్ని మనం చూస్తున్నాం. ఒక సంవత్సరం క్రితం, ట్రావిస్ మరియు కేసీలను కలిసే విశేషావకాశం నాకు కలిగింది. 2007లో వారు చట్ట ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ సమయమందు, ట్రావిస్ సంఘ సభ్యుడు కాదు. కేసీ చురుకైన కడవరి దిన పరిశుద్ధుల ఇంట్లో పెంచబడినప్పటికీ, తన యవ్వనంలో ఆమె తన విశ్వాసం నుండి మళ్ళింది మరియు తాను పెంచబడిన నమ్మకాల ప్రకారం జీవించలేదు.

2018 లో, ట్రావిస్ సువార్తికులను కలిసాడు మరియు 2019 లో అతడు బాప్తిస్మము పొందాడు. ట్రావిస్ కేసీకి సువార్తికునిగా మారాడు, ఆమె కూడా జీవితాన్ని మార్చే పరివర్తనను అనుభవించింది. 2020 సెప్టెంబరులో వారు దేవాలయంలో ముద్రింపబడ్డారు. అతడు బాప్తిస్మము పొందిన రెండు సంవత్సరాల తరువాత, ట్రావిస్ బిషప్రిక్కులో సేవ చేయడానికి పిలువబడ్డాడు.

ట్రావిస్ అరుదైన వ్యాధి కలిగియున్నాడు, అది అతని అంతర్గత అవయవాలలో కణతుల సమూహాలను నిరంతరం ఏర్పరుస్తుంది. పునరావృతమయ్యే కణతులను తొలగించడానికి అతడు చాలా శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు, కానీ వ్యాధి నయం కాలేదు. చాలా సంవత్సరాల క్రితం, ట్రావిస్ జీవించడానికి 10 సంవత్సరాల కంటే తక్కువ కాలం ఇవ్వబడ్డాడు.

కేసీకి రెటినిటిస్ పిగ్మెంటోసా అనే అరుదైన జన్యు వ్యాధి ఉంది, అది పూర్తి అంధత్వం ఏర్పడే వరకు దృష్టి క్షేత్రాన్ని కోలుకోలేని విధంగా సంకుచితం చేస్తుంది.

కేసీ తన భవిష్యత్తు గురించి నాతో మాట్లాడింది. ఆమె వితంతువుగా, అంధురాలిగా, ఆర్థిక సహాయం లేకుండా, ఎదుగుతున్న నలుగురు పిల్లలను పెంచడానికి ఒంటరిగా మిగిలిపోయే సమయం ఎంతో దూరంలో లేదని ఆమె ఊహించింది. ఆటువంటి నిరాశాజనకమైన భవిష్యత్తును ఆమె ఎలా నిర్వహించగలదని నేను కేసీని అడిగాను. ఆమె ప్రశాంతంగా నవ్వి, “నేను నా జీవితంలో ఎన్నడూ సంతోషంగా లేదా ఎక్కువ ఆశాజనకంగా లేను. మేము దేవాలయంలో పొందిన వాగ్దానాలపై మేము ఆధారపడ్డాము” అని చెప్పింది.

ఇప్పుడు ట్రావిస్ బిషప్పుగా ఉన్నాడు. రెండు నెలల క్రితం, అతడికి మరొక పెద్ద శస్త్ర చికిత్స జరిగింది. కానీ అతడు ఆశాజనకంగా, ప్రశాంతంగా ఉన్నాడు. కేసీ యొక్క చూపు మందగించింది. ఆమెను ఇప్పుడు నడిపించడానికి శిక్షణ ఇవ్వబడిన కుక్కను ఆమె కలిగియున్నది, కానీ కారు నడపలేదు. తన పిల్లలను పెంచుతూ, యువతుల అధ్యక్షత్వములో రెండవ సలహాదారిణిగా సేవ చేస్తూ ఆమె సంతృప్తిగా ఉన్నది.

ట్రావిస్ మరియు కేసీ వారి ఇంటిని బండపై నిర్మించుకుంటున్నారు. ట్రావిస్ మరియు కేసీ క్రీస్తు యొక్క సిద్ధాంతమును మరియు దేవుడు “[వారి] బాధలను [వారి] లాభము కొరకు ప్రతిష్ఠించును” 30 అనే వాగ్దానమును విశ్వసించారు. దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళికలో, క్రీస్తునందు విశ్వాసముతో కూడిన బాధలు మనము క్రీస్తులో పరిపూర్ణులుగా ఉండుటతో ముడిపడివున్నాయి.31 బండపై తన ఇంటిని కట్టిన తెలివైన వాని ఉపమానము వలే, 34వానలు కురిసి, వరదలు వచ్చి, గాలులు విసిరి, ట్రావిస్ మరియు కేసీ కట్టిన ఇంటిని కొట్టినప్పుడు, అది పడిపోలేదు, ఏలయనగా అది బండపై కట్టబడింది.33

యేసు మన జీవితాలలో వర్షము, వరద మరియు గాలుల యొక్క సాధ్యత గూర్చి మాట్లాడలేదు; నిశ్చయముగా తుఫానులు వస్తాయని ఆయన మాట్లాడారు. ఉపమానంలోని అస్థిరమైన విషయం, తుఫానులు వస్తాయో లేదో అని కాదు, కానీ ఆయన బోధించినది విని, చేయమని ఆయన ఇచ్చిన ఆహ్వానానికి మనం ఎలా స్పందించాము అనేది.34 జీవించియుండుటకు మరే ఇతర మార్గము లేదు.

క్రీస్తుతో నిబంధన అనుబంధము యొక్క పునాదిపై మన గృహాలను నిర్మించుకున్నప్పుడు, మనము క్రీస్తు యొక్క సిద్ధాంతమును విశ్వసిస్తాము మరియు మనం ఆయన వద్దకు వచ్చినప్పుడు, నిత్యజీవం గురించి ఆయన వాగ్దానం మనకు ఉన్నది. క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని విశ్వసించే జనులు క్రీస్తునందు నిలకడతో ముందుకు త్రోసుకొని వెళ్ళి, అంతము వరకు సహిస్తారు. పరలోక రాజ్యములో రక్షింపబడడానికి వేరే మార్గం లేదు.35

యేసు క్రీస్తు యొక్క సజీవమైన, పునరుత్థానమైన వాస్తవికత గురించి నేను నా వ్యక్తిగత సాక్ష్యాన్నిస్తున్నాను. మన తండ్రియైన దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నారని, పాపము నుండి మనల్ని విడిపించడానికి36 మరియు బాధ నుండి మనల్ని స్వస్థపరచడానికి37 ఆయన తన కుమారుడిని పంపారని నేను సాక్ష్యమిస్తున్నాను. మన కాలములో ఆయన దేవుని యొక్క ప్రవక్తను పిలిచారని, ఆయనే అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ అని, ఆయన ద్వారా మనతో మాట్లాడి, మనల్ని నడిపిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను.

క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని విశ్వసించమని మరియు విమోచకుని బండపై మీ జీవితాలను నిర్మించమని నా పూర్ణ హృదయంతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆయన మనల్ని ఎన్నడూ విఫలం చేయరు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు