సర్వసభ్య సమావేశము
క్రీస్తుతో ఏకమైయుండుము
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


క్రీస్తుతో ఏకమైయుండుము

యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం పట్ల మనకున్న ప్రేమ మరియు విశ్వాసం ద్వారా మనం ఐక్యంగా ఉన్నాము. క్రీస్తుతో ఏకమై ఉండడమే నిజంగా చెందియుండడం యొక్క సారాంశం.

నేను చాలా చిన్న వయస్సు నుండి యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం గురించి బలమైన భావాలు కలిగియున్నాను, కాని రక్షకుని ప్రాయశ్చిత్తం యొక్క వాస్తవికత నాకు 25 సంవత్సరాల వయస్సులో తెలిసింది. నేను అప్పుడే స్టాన్‌ఫోర్డ్ లా స్కూల్ నుండి పట్టభద్రుడనయ్యాను మరియు కాలిఫోర్నియా బార్ పరీక్ష కోసం చదువుతున్నాను. యూటాలో నివసించే మా తాతయ్య క్రోజియర్ కింబల్ చనిపోబోతున్నారని మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది. నేను ఆయన్ని చూడాలనుకుంటే, నేను ఇంటికి రావడం మంచిది అని ఆమె చెప్పింది. మా తాతయ్య వయస్సు 86 మరియు చాలా అనారోగ్యంతో ఉన్నారు. నా సందర్శన అద్భుతంగా ఉంది. ఆయన నన్ను చూసి, తన సాక్ష్యాన్ని నాతో పంచుకున్నందుకు చాలా సంతోషించారు.

క్రోజియర్ కేవలం మూడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, ఆయన తండ్రి, డేవిడ్ ప్యాటెన్ కింబల్, 44 సంవత్సరాల వయస్సులో మరణించారు.1 క్రోజియర్ తన తండ్రి మరియు తన తాత, హీబర్ సి. కింబల్, అతని జీవితాన్ని ఆమోదించి, అతను తన వారసత్వానికి కట్టుబడి ఉన్నాడని భావించాలని ఆశించాడు.

విశ్వాసులైన ఈ పూర్వీకుల వల్ల ఎలాంటి హక్కు లేదా విశేషాధికారం ఉండకూడదనేది మా తాతయ్య నాకు ఇచ్చిన ప్రాథమిక సలహా. నా దృష్టి రక్షకునిపై మరియు రక్షకుని ప్రాయశ్చిత్తంపై ఉండాలని ఆయన నాకు చెప్పారు. మనమందరం ప్రేమగల పరలోక తండ్రి యొక్క పిల్లలమని ఆయన చెప్పారు. మన భూసంబంధమైన పూర్వీకులు ఎవరైనప్పటికీ, మనలో ప్రతీ ఒక్కరం రక్షకుని ఆజ్ఞలను ఎంత చక్కగా పాటించామో ఆయనకు తెలియజేస్తాము.

తాతయ్య రక్షకుడిని “ద్వారకాపరి” అని పేర్కొన్నారు, ఇది 2 నీఫై 9:41కి ఒక సంకేతం. రక్షకుని కనికరానికి అర్హత పొందేందుకు తాను తగినంతగా పశ్చాత్తాపపడ్డానని ఆశిస్తున్నట్లు ఆయన నాతో చెప్పారు.2

నేను మానసికంగా ప్రభావితం చేయబడ్డాను. ఆయన నీతిమంతుడని నాకు తెలుసు. ఆయన గోత్రజనకుడు మరియు అనేక మిషన్లలో సేవ చేశారు. రక్షకుని ప్రాయశ్చిత్త ప్రయోజనం లేకుండా కేవలం మంచి పనుల ద్వారా ఎవరూ దేవుని వద్దకు తిరిగి రాలేరని ఆయన నాకు బోధించారు. రక్షకుడు మరియు ఆయన ప్రాయశ్చిత్తం పట్ల తాతయ్యకు ఉన్న గొప్ప ప్రేమ మరియు ప్రశంసలను నేను ఈ రోజు వరకు గుర్తుంచుకోగలను.

2019లో జెరూసలేములో ఒక పనిమీద ఉన్నప్పుడు,3 నేను ఒక పై గదిని సందర్శించాను, అది రక్షకుడు సిలువ వేయబడడానికి ముందు తన అపొస్తలుల పాదాలను కడిగిన ప్రదేశానికి సమీపంలో ఉండవచ్చు. నేను ఆధ్యాత్మికంగా తాకబడ్డాను మరియు ఒకరినొకరు ప్రేమించమని ఆయన తన అపొస్తలులకు ఎలా ఆజ్ఞాపించారో ఆలోచించాను.

మన తరఫున విన్నవించే రక్షకుని మధ్యవర్తిత్వ ప్రార్థనను నేను గుర్తు చేసుకున్నాను. యోహాను సువార్తలో నమోదు చేయబడినట్లుగా ఈ ప్రార్థన అక్షరాలా ఆయన మర్త్య జీవితం యొక్క ముగింపు సమయంలో సంభవించింది.

ఈ ప్రార్థన మనందరితో సహా క్రీస్తు అనుచరులకు నిర్దేశించబడింది.4 రక్షకుడు తన తండ్రికి చేసిన విన్నపము‌లో ఇలా వేడుకున్నారు, “తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెను.” తర్వాత రక్షకుడు ఇలా కొనసాగించారు, “మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.”5 క్రీస్తు తాను మోసగించబడి, సిలువ వేయబడడానికి ముందు ప్రార్థించినది ఏకత్వం కొరకే. రక్షకుని ప్రాయశ్చిత్తం ద్వారా క్రీస్తుతో మరియు మన పరలోక తండ్రితో ఏకత్వం పొందవచ్చు.

ప్రభువు యొక్క రక్షించే కనికరము వంశం, విద్య, ఆర్థిక స్థితి లేదా జాతిపై ఆధారపడి ఉండదు. ఇది క్రీస్తు మరియు ఆయన ఆజ్ఞలతో ఏకమైయుండడంపై ఆధారపడి ఉంటుంది.

1830లో సంఘం ఏర్పాటు చేయబడిన వెంటనే ప్రవక్త జోసెఫ్ స్మిత్ మరియు ఆలివర్ కౌడరీ సంఘ నిర్మాణం మరియు పాలనపై బయల్పాటు పొందారు. ఇప్పుడు 20వ ప్రకరణముగా ఉన్నదానిని మొదటి సంఘ సమావేశంలో ప్రవక్త జోసెఫ్ చదివారు మరియు అది ఉమ్మడి సమ్మతితో ఆమోదించబడిన మొదటి బయల్పాటు.6

ఈ బయల్పాటులోని విషయము నిజంగా విశేషమైనది. ఇది రక్షకుని ప్రాముఖ్యతను, పాత్రను మరియు ఆయన ప్రాయశ్చిత్త కృప ద్వారా ఆయన శక్తిని మరియు ఆశీర్వాదాలను ఎలా పొందాలో బోధిస్తుంది. ప్రవక్త జోసెఫ్ 24 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు, అప్పటికే అనేక బయల్పాటులు పొందాడు, దేవుని బహుమానము మరియు శక్తి ద్వారా మోర్మన్ గ్రంథము యొక్క అనువాదాన్ని పూర్తి చేశాడు. జోసెఫ్ మరియు ఆలివర్ ఇద్దరూ నియమించబడిన అపొస్తలులుగా గుర్తించబడ్డారు, తద్వారా సంఘానికి అధ్యక్షత్వం వహించే అధికారాన్ని కలిగియున్నారు.

17 నుండి 36 వచనములలో దేవుని వాస్తవికత, మానవాళి యొక్క సృష్టి, పతనం మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా పరలోక తండ్రి యొక్క రక్షణ ప్రణాళికతో సహా ముఖ్యమైన సంఘ సిద్ధాంతం యొక్క సారాంశం ఉంది. 37వ వచనంలో ప్రభువు యొక్క సంఘములో బాప్తిస్మం పొందేందుకు అవసరమైన ఆవశ్యకతలు ఉన్నాయి. 75 నుండి 79 వచనాలు మనం ప్రతి సబ్బాతు‌న ఉపయోగించే సంస్కార ప్రార్థనలను తెలియజేస్తాయి.

పునఃస్థాపన ప్రవక్త అయిన జోసెఫ్ స్మిత్ ద్వారా ప్రభువు స్థాపించిన సిద్ధాంతం, సూత్రాలు, సంస్కారములు మరియు ఆచరణలు నిజంగా ప్రభావశీలమైనవి.7

బాప్తిస్మం యొక్క అవసరాలు లోతైనవి అయినప్పటికీ, ప్రత్యేకంగా సరళమైనవి. వాటిలో ప్రధానంగా దేవుని యెదుట వినయం, విరిగిన హృదయం మరియు నలిగిన ఆత్మ,8 అన్ని పాపాలకు పశ్చాత్తాపపడడం, యేసు క్రీస్తు నామాన్ని మనపైకి తీసుకోవడం, అంతము వరకు సహించడం మరియు మనం క్రీస్తు ఆత్మను పొందినట్లు మన పనుల ద్వారా చూపించడం వంటివి ఉన్నాయి.9

బాప్తిస్మం కోసం అన్ని అర్హతలు ఆధ్యాత్మికం కావడం విశేషమైనది. ఆర్థిక లేదా సామాజిక సంపాదన ఏదీ అవసరం లేదు. పేదలకు మరియు ధనవంతులకు ఒకే విధమైన ఆధ్యాత్మిక అవసరాలు ఉంటాయి.

జాతి, లింగం లేదా స్వజాతీయ అవసరాలు లేవు. ప్రభువు మంచితనంలో పాలుపంచుకోవడానికి అందరు ఆహ్వానించబడ్డారని మోర్మన్ గ్రంథము స్పష్టం చేస్తుంది, “నల్లవారైనా తెల్లవారైనా, బందీలైనా స్వతంత్రులైనా, పురుషులైనా స్త్రీలైనా; … అందరు దేవునికి ఒకే రీతిగా ఉన్నారు.”10 “మనుష్యులందరు ఒకే విధమైన హక్కు కలిగియున్నారు మరియు ఎవరును నిషేధించబడలేదు.”11

దేవుని యెదుట మన “సారూప్యత” దృష్ట్యా, మన వ్యత్యాసాలను నొక్కి చెప్పడం చాలా తక్కువ అర్థాన్నిస్తుంది. “జనులు మన నుండి మరియు ఒకరి నుండి ఒకరు నిజానికి ఉన్నదానికంటే చాలా భిన్నంగా ఉండాలని ఊహించుకోమని కొంతమంది మనల్ని తప్పుగా ప్రోత్సహించారు. [కొందరు] నిజమైనప్పటికీ, చిన్న వ్యత్యాసాలను తీసుకుని, వాటిని అగాధాలుగా పెంచుతారు.”12

అదనంగా, జనులందరూ ఆయన మంచితనాన్ని మరియు నిత్యజీవాన్ని పొందడానికి ఆహ్వానించబడ్డారు కాబట్టి, ప్రవర్తనాపరమైన అవసరాలు లేవని కొందరు తప్పుగా ఊహించారు.13

ఏదేమైనప్పటికీ, జవాబుదారీగా ఉన్న వ్యక్తులందరూ పాపాలకు పశ్చాత్తాపపడాలని మరియు ఆయన ఆజ్ఞలను పాటించాలని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి.14 అందరికీ నైతిక కర్తృత్వం ఉందని మరియు “నరులందరి యొక్క గొప్ప మధ్యవర్తి ద్వారా స్వేచ్ఛను, నిత్యజీవమును కోరుకొనుటకు, … మరియు ఆయన గొప్ప ఆజ్ఞలను ఆలకించుటకు, ఆయన మాటలకు విశ్వాసముగా ఉండుటకు, నిత్యజీవమును కోరుకొనుటకు వారు స్వతంత్రులైయున్నారు”15 అని ప్రభువు స్పష్టం చేస్తున్నారు. రక్షకుని ప్రాయశ్చిత్తం యొక్క ఆశీర్వాదాలను పొందేందుకు, క్రీస్తును ఎన్నుకోవడానికి మరియు ఆయన ఆజ్ఞలను పాటించడానికి మన నైతిక కర్తృత్వాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించాలి.

నా జీవితకాలంలో, “కర్తృత్వం” మరియు “స్వతంత్రచిత్తము” యొక్క అర్థం విభజించబడింది మరియు చర్చించబడింది. ఈ అంశాలపై అనేక మేధోపరమైన వాదనలు జరిగాయి మరియు కొనసాగుతున్నాయి.

ఇటీవల ఒక ప్రముఖ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల ప్రచురణ యొక్క ముఖచిత్రంపై, ఒక ప్రముఖ జీవశాస్త్ర ప్రొఫెసర్, “స్వతంత్రచిత్తము ఉందని భావించడం సహేతుకమైనది కాదు”16 అని నొక్కిచెప్పారు. ఆ కథనంలో ప్రొఫెసర్ ఇలా వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యం లేదు, “దేవుడు అనేవాడు లేడు, … స్వతంత్రచిత్తము లేదు మరియు ఇది విస్తారమైన, ఉదాసీనమైన, ఖాళీ విశ్వం.”17 నేను ఇంతకంటే గట్టిగా విభేదించలేను.

మన విశ్వాసం యొక్క ప్రాథమిక సిద్ధాంతం ఏమిటంటే, మనకు నైతిక కర్తృత్వం18 ఉంది, అందులో స్వతంత్రచిత్తము ఉంటుంది.19 కర్తృత్వం అంటే ఎంచుకుని, చర్య తీసుకొనే సామర్థ్యం. రక్షణ ప్రణాళికకు ఇది చాలా అవసరం. నైతిక కర్తృత్వం లేకుండా, మనం నేర్చుకోలేము, పురోగతి సాధించలేము లేదా క్రీస్తుతో ఏకమైయుండడాన్ని ఎంచుకోలేము. నైతిక కర్తృత్వం కారణంగా, మనం “స్వేచ్ఛను మరియు నిత్యజీవాన్ని ఎంచుకోవడానికి స్వతంత్రులమైయున్నాము.”20 పరలోకంలోని పూర్వమర్త్య సలహాసభలో, తండ్రి ప్రణాళికలో కర్తృత్వాన్ని ముఖ్యమైన అంశంగా చేర్చారు. లూసిఫర్ తిరుగుబాటు చేసి “నరునికిచ్చిన స్వతంత్రతను నాశనము చేయుటకు చూసాడు.”21 తదనుగుణంగా, సాతానుకు మరియు అతనిని అనుసరించేవారికి మర్త్య శరీరాన్ని కలిగి ఉండే అవకాశం నిరాకరించబడింది.

ఇతర పూర్వమర్త్య ఆత్మలు పరలోక తండ్రి ప్రణాళికను అనుసరించడంలో తమ కర్తృత్వాన్ని ఉపయోగించాయి. ఈ మర్త్య జీవితానికి పుట్టుకతో ఆశీర్వదించబడిన ఆత్మలు కర్తృత్వాన్ని కలిగి ఉంటాయి. మనం ఎంచుకోవడానికి, చర్య తీసుకోవడానికి స్వతంత్రులమై ఉన్నాము, కానీ మనం పర్యవసానాలను నియంత్రించలేము. “మంచి మరియు నీతివంతమైన ఎంపికలు సంతోషం, శాంతి మరియు నిత్యజీవానికి దారితీస్తాయి, అయితే పాపం మరియు చెడు ఎంపికలు చివరికి హృదయ వేదనకు, దుఃఖానికి దారితీస్తాయి.”22 ఆల్మా చెప్పినట్లుగా, “దుష్టత్వము ఎన్నడూ సంతోషం కాదు.”23

ఈ విపరీతమైన పోటీ ప్రపంచంలో రాణించేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. మనం ఉత్తమంగా ఉండేందుకు ప్రయత్నించడం ధర్మబద్ధమైన మరియు విలువైన ప్రయత్నం. ఇది ప్రభువు సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది. ఇతరులను తగ్గించడానికి లేదా తిరస్కరించడానికి లేదా వారి విజయానికి అడ్డంకులు సృష్టించడానికి చేసే ప్రయత్నాలు ప్రభువు సిద్ధాంతానికి విరుద్ధం. దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తించే నిర్ణయానికి మనం పరిస్థితులను లేదా ఇతరులను నిందించలేము.

నేటి ప్రపంచంలో, వస్తుపరమైన మరియు వృత్తిపరమైన విజయంపై దృష్టి పెట్టడం సులభం. కొందరు నిత్య సూత్రాలు మరియు నిత్య ప్రాముఖ్యత కలిగిన ఎంపికలపై దృష్టిని కోల్పోతారు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి “సిలెస్టియల్‌గా ఆలోచించండి” అనే సలహాను పాటించడం మనం చేసే తెలివైన పని.24

ప్రతిభ, సామర్థ్యాలు, అవకాశాలు లేదా ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా దాదాపు ప్రతి ఒక్కరూ అత్యంత ముఖ్యమైన ఎంపికలను చేయవచ్చు. కుటుంబ ఎంపికలకు మొదటి స్థానం ఇవ్వడం చాలా అవసరం. ఇది లేఖనాలంతటా స్పష్టంగా ఉంది. 1 నీఫైలో లీహై “అరణ్యానికి వెళ్ళిన వృత్తాంతం గురించి ఆలోచించండి. తనతోపాటు ఏమియు తీసుకొనకుండా అతడు తన ఇంటిని, తన స్వాస్థ్యమైన భూమిని, బంగారమును, వెండిని, ప్రశస్థ వస్తువులను వదిలివేసి, తన కుటుంబమును మాత్రమే తీసుకొని వెళ్ళిపోయాడు.”25

మనం జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పుడు, మనకు వాటిపై తక్కువ లేదా ఏమాత్రం నియంత్రణ లేని అనేక సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్య సవాళ్లు మరియు ప్రమాదాలు స్పష్టంగా మన నియంత్రణలో ఉండవు. ఇటీవలి COVID-19 మహమ్మారి ప్రతిదీ సరిగ్గా చేసే వ్యక్తులను తీవ్రంగా ప్రభావితం చేసింది. అత్యంత ముఖ్యమైన ఎంపికలపై మనకు నియంత్రణ ఉంటుంది. నా సువార్త పరిచర్య రోజులకు తిరిగి వెళితే, మా మిషను అధ్యక్షుడు ఎల్డర్ మారియన్ డి. హాంక్స్, ఎల్లా వీలర్ విల్కాక్స్ రాసిన కవితలోని కొంతభాగాన్ని మా అందరితో కంఠస్థం చేయించారు:

నిశ్చయించుకున్న ఆత్మ యొక్క దృఢ సంకల్పాన్ని

తప్పించుకొనే, అడ్డుకొనే లేదా నియంత్రించగలిగే

ఏ అవకాశం లేదు, తలరాత లేదు, విధి లేదు.26

సూత్రం, ప్రవర్తన, మతపరమైన ఆచారం మరియు ధర్మబద్ధమైన జీవన విషయాలపై మనం నియంత్రణలో ఉన్నాము. తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుపై మన విశ్వాసం మరియు ఆరాధన అనేది మనం చేసే ఎంపిక.27

నేను విద్య లేదా వృత్తి పట్ల తక్కువ ఆసక్తిని సూచించడం లేదని దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పేదేమిటంటే, విద్య మరియు వృత్తికి సంబంధించిన ప్రయత్నాలు కుటుంబం లేదా క్రీస్తుతో ఏకమైయుండడం కంటే ఎక్కువ ముఖ్యమైనప్పుడు, అనుకోని పరిణామాలు గణనీయంగా ప్రతికూలంగా ఉంటాయి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 20లో నిర్దేశించబడిన స్పష్టమైన మరియు సరళమైన సిద్ధాంతం పవిత్రమైన ఆధ్యాత్మిక భావనలను విస్తరింపజేసి, స్పష్టం చేస్తున్నందున అది హత్తుకుంటుంది మరియు నిర్బంధిస్తుంది. రక్షకుని కృప కారణంగా పశ్చాత్తాపపడిన ఆత్మలను యేసు క్రీస్తు సమర్థించడం మరియు పవిత్రపరచడం వల్ల రక్షణ వస్తుందని ఇది బోధిస్తుంది.28 ఇది ఆయన ప్రాయశ్చిత్తం యొక్క ప్రముఖ పాత్రకు వేదికను నిర్దేశిస్తుంది.

మన ఏకత్వం యొక్క వలయం‌లో ఇతరులను చేర్చడానికి మనం ప్రయత్నించాలి. తెరకు ఇరువైపులా చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను సమకూర్చడానికి అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి ఉపదేశాన్ని మనం పాటించాలంటే, మన ఏకత్వం యొక్క వలయం‌లో మనం ఇతరులను చేర్చాలి. అధ్యక్షులు నెల్సన్ చాలా అందంగా బోధించినట్లుగా: “ప్రతి ఖండంలోనూ మరియు సముద్ర దీవుల మీదుగా, విశ్వాసులైన జనులు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము‌లో చేరుతున్నారు. విశ్వాసులు నిబంధన మార్గములో ప్రవేశించి, మన ప్రియ విమోచకుని వద్దకు వచ్చినప్పుడు, సంస్కృతి, భాష, లింగము, జాతి మరియు జాతీయతల్లో తేడాలు నిరర్థకమైపోతాయి.”29

యేసు క్రీస్తుపై మనకున్న ప్రేమ మరియు విశ్వాసంచేత మరియు ప్రేమగల పరలోక తండ్రి పిల్లలుగా మనం ఐక్యంగా ఉన్నాము. క్రీస్తుతో ఏకమై ఉండడమే నిజంగా చెందియుండడం యొక్క సారాంశం. మన దేవాలయ నిబంధనలతో పాటు, సిద్ధాంతము మరియు నిబంధనలు 20లో నిర్దేశించబడిన బాప్తిస్మం మరియు సంస్కారం యొక్క విధులు మనల్ని ప్రత్యేక మార్గాల్లో ఏకం చేస్తాయి మరియు శాశ్వతంగా ముఖ్యమైన ప్రతి మార్గంలో ఒకటిగా ఉండడానికి, శాంతి, సామరస్యాలతో జీవించడానికి మనల్ని అనుమతిస్తాయి.

యేసు క్రీస్తు జీవిస్తున్నారని మరియు ఆయన ప్రాయశ్చిత్తం కారణంగా, మనం క్రీస్తుతో ఏకమై ఉండగలమని నేను ఖచ్చితంగా మరియు నిశ్చయంగా సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.

వివరణలు

  1. డేవిడ్, 17 సంవత్సరాల వయస్సులో, వ్యోమింగ్ యొక్క ఎత్తైన మైదానాలలో చిక్కుకున్నప్పుడు, మంచుతో నిండిన స్వీట్‌వాటర్ నది మీదుగా కొంతమంది పరిశుద్ధుల‌ను తీసుకువెళ్లడంలో సహాయం చేశాడు (see Saints: The Story of the Church of Jesus Christ in the Latter Days, volume 2, No Unhallowed Hand, 1846–1893 [2020], 237).

  2. మొరోనై 7:27–28 చూడండి.

  3. 2019, జూన్ 5న ఇజ్రాయెల్‌లోని BYU జెరూసలేం సెంటర్‌లో జరిగిన జ్యూయిష్-లాటర్-డే సెయింట్ స్కాలర్స్ డైలాగ్‌లో నార్వే చీఫ్ రాబ్బై, రాబ్బై మైఖేల్ మెల్చియోర్ మరియు నేను ముఖ్య వక్తలుగా ఉన్నాము.

  4. యోహాను 17:20 చూడండి.

  5. యోహాను 17:21–22.

  6. See “The Conference Minutes and Record Book of Christ’s Church of Latter Day Saints, 1838–1839, 1844” (commonly known as the Far West Record), June 9, 1830, Church History Library, Salt Lake City; Steven C. Harper, Making Sense of the Doctrine and Covenants (2008), 75.

  7. సిద్ధాంతము మరియు నిబంధనలు 20 సంఘ వార్తాపత్రికలో ప్రచురించబడిన మొదటి బయల్పాటు, ఇది సిద్ధాంతం మరియు బాప్తిస్మము, సంస్కారము యొక్క విధుల నిర్వహణ రెండింటికి సంబంధించి సువార్తికులచే ఉపయోగించబడింది (see Harper, Making Sense of the Doctrine and Covenants, 75).

  8. 2 నీఫై 2:7 చూడండి.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37 చూడండి.

  10. 2 నీఫై 26:33.

  11. 2 నీఫై 26:28.

  12. Peter Wood, Diversity: The Invention of a Concept (2003), 20.

  13. నీహోర్ ఈ స్థానాన్ని తీసుకున్నాడు (ఆల్మా 1:4 చూడండి).

  14. సిద్ధాంతము మరియు నిబంధనలు 29:49–50 చూడండి.

  15. 2 నీఫై 2:27–28.

  16. Stanford (publication of the Stanford Alumni Association), Dec. 2023, cover.

  17. In Sam Scott, “As If You Had a Choice,” Stanford, Dec. 2023, 44. వ్యాసం ప్రొఫెసర్‌ను రాబర్ట్ సపోల్స్కీగా గుర్తిస్తుంది, జీవశాస్త్రం, న్యూరాలజీ మరియు న్యూరోసర్జరీ యొక్క స్టాన్‌ఫోర్డ్ ప్రొఫెసర్ మరియు అత్యధికంగా అమ్ముడైన సైన్స్ పుస్తకాల యొక్క రచయిత. ఈ కథనంలో ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్ అయిన ఆల్ఫ్రెడ్ మెలే వాటితో సహా వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయి, అతను స్వతంత్రచిత్తముతో పెద్ద జాన్ టెంపుల్టన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించాడు. అతను చెప్పాడు, “స్వతంత్రచిత్తము—ప్రతిష్టాత్మకమైన స్వతంత్రచిత్తము—కూడా ఒక భ్రమ అని శాస్త్రవేత్తలు ఖచ్చితంగా నిరూపించలేదు” (in Scott, “As If You Had a Choice,” 46).

  18. See D. Todd Christofferson, “Moral Agency” (Brigham Young University devotional, Jan. 31, 2006), speeches.byu.edu.

  19. సిద్ధాంతము మరియు నిబంధనలు 58:27 చూడండి.

  20. 2 నీఫై 2:27.

  21. మోషే 4:3

  22. True to the Faith: A Gospel Reference (2004), 12.

  23. ఆల్మా 41:10.

  24. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సిలెస్టియల్‌గా ఆలోచించండి!,” లియహోనా, నవ. 2023, 117–20 చూడండి.

  25. 1 నీఫై 2:4.

  26. Poetical works of Ella Wheeler Wilcox (1917), 129.

  27. ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ చేత పంచుకోబడిన వ్యాఖ్యానాన్ని నేను ఎప్పుడూ ఇష్టపడతాను, అది దీనిని చాలా క్లుప్తమైన పద్ధతిలో ఇలా పేర్కొంది: “మీరు మొదట దేవుని రాజ్యాన్ని ఎన్నుకోకపోతే, దానికి బదులుగా మీరు ఏది ఎంచుకున్నా చివరలో పెద్దగా తేడా ఉండదు” (18వ శతాబ్దపు ఆంగ్ల మతాచార్యుడైన విలియం లాకు ఆపాదించబడింది; quoted in Neal A. Maxwell, “Response to a Call,” Ensign, May 1974, 112).

  28. సిద్ధాంతము మరియు నిబంధనలు 20:29-31 చూడండి. కాల్వినిస్ట్ వేదాంతశాస్త్రం యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా పతనమైన ఆత్మల సమర్థన మరియు పవిత్రీకరణను నొక్కి చెప్పింది. ఒకసారి దేవుడు రక్షణ కోసం ఒక ఆత్మను ముందుగా నిర్ణయించిన తర్వాత, దాని ఫలితాన్ని ఏదీ మార్చలేదని అది బోధించింది. సిద్ధాంతము మరియు నిబంధనలు 20 కాల్వినిజంతో పూర్తిగా విరామాన్ని కలిగిస్తుంది. “మనుష్యుడు కృపనుండి తొలగిపోయి, జీవముగల దేవుడిని విడిచిపోవు అవకాశము కలదు” అని అది చదువబడుతుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:32–34 చూడండి; Harper, Making Sense of the Doctrine and Covenants, 74).

  29. Russell M. Nelson, “Building Bridges,” Liahona, Dec. 2018, 51.

ముద్రించు