సర్వసభ్య సమావేశము
క్రీస్తు యొక్క సంతోషమందు హరించివేయబడినవి
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


క్రీస్తు యొక్క సంతోషమందు హరించివేయబడినవి

మీ కన్నీళ్ళ ప్రార్థనలను మన పరలోక తండ్రి వింటారని, ఎల్లప్పుడూ పరిపూర్ణమైన జ్ఞానములో స్పందిస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను.

మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, ఎల్డర్ కీరన్. నేను 10 నిమిషాల పాటు ఆ యాసను తీసుకోవచ్చా?

అద్భుతాల కోసం ఆరాటం

క్రొత్త నిబంధనలో మనం గ్రుడ్డివాడైన బర్తిమయి గురించి తెలుసుకుంటాము, యేసు ఒక అద్భుతం చేయాలని కోరుతూ అతను కేకలు వేసాడు. “అందుకు యేసు–నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను.” వెంటనే వాడు చూపుపొంది వెళ్ళెను.”1

మరొక సందర్భంలో, బేత్సయిదాలో ఒక వ్యక్తి స్వస్థత కోసం ఆరాటపడ్డాడు. దీనికి విరుద్ధంగా, ఈ అద్భుతం తక్షణమే రాలేదు. బదులుగా, అతను “కుదుర్చబడుటకు”2 ముందు యేసు రెండుసార్లు అతన్ని ఆశీర్వదించారు.

మూడవ ఉదాహరణలో, అపొస్తలుడైన పౌలు తన బాధలో “ప్రభువును ముమ్మారు వేడుకున్నాడు”,3 అయినా మనకు తెలిసినట్లుగా, అతని హృదయపూర్వక విన్నపం మంజూరు కాలేదు.

ముగ్గురు వేర్వేరు వ్యక్తులు. మూడు ప్రత్యేక అనుభవాలు.

ఆవిధంగా, ఈ ప్రశ్న: కొందరు ప్రభువు కోసం ఎదురుచూస్తూ, ఓపికగా సహిస్తూ ఉండగా, మరికొందరు తమ అద్భుతాలను త్వరగా ఎందుకు పొందుతారు?4 ఎందుకు అనేది మనకు తెలియనప్పటికీ, కృతజ్ఞతాపూర్వకంగా, ఎవరు ​​“[మనల్ని] ప్రేమిస్తారో,”5 “[మన] క్షేమము మరియు సంతోషము నిమిత్తము సమస్త క్రియలను [చేస్తారో]”6 మనకు తెలుసు.

దైవిక ఉద్దేశ్యాలు

ఆది నుండి అంతమును చూసే దేవుడు7 “నీ లేమి, నీ కష్టములు కొంతకాలమే ఉండును”8 మరియు అవి “నీ లాభము కొరకు ప్రతిష్ఠించబడును”9 అని మనకు భరోసా ఇస్తున్నారు.

మన శ్రమలలో మరింత అర్థాన్ని కనుగొనడానికి మనకు సహాయపడుతూ, ఎల్డర్ ఓర్సన్ ఎఫ్. విట్నీ ఇలా బోధించారు: “మనం అనుభవించే ఏ బాధ, మనం అనుభవించే ఏ శ్రమ వృధా కాదు. అది మనకు బోధించడంలో సహాయపడుతుంది. … మనం [ఓపికగా] సహించేవి… అన్నీ … మన స్వభావాలను నిర్మిస్తాయి, మన హృదయాలను శుద్ధి చేస్తాయి, మన ఆత్మలను వృద్ధిచేస్తాయి, మనల్ని మరింత సున్నితంగా మరియు దాతృత్వం గలవారిగా మారుస్తాయి. … దుఃఖం, బాధలు, శ్రమలు మరియు కష్టాల ద్వారా ఏ విద్యను అభ్యసించడానికి మనం ఇక్కడకు వచ్చామో దానిని పొందుతాము మరియు అది మనల్ని మరింతగా మన [పరలోక తల్లిదండ్రుల] వలె చేస్తుంది.”10

అతని బాధలలో “క్రీస్తు శక్తి [అతని] మీద నిలిచియుండునని” అర్థం చేసుకొని, “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను”11 అని అపొస్తలుడైన పౌలు వినయంగా అన్నాడు.

జీవితపు శ్రమలు మనల్ని నిరూపిస్తాయి.12 రక్షకుడు కూడా “శ్రమలవలన … విధేయతను నేర్చుకొనెను” మరియు “సంపూర్ణసిద్ధి పొందెను.”13

మరియు ఒకరోజు ఆయన కరుణతో ఇలా ప్రకటిస్తారు, “నేను నిన్ను పుటము వేసితిని … ; నిన్ను శ్రమల కొలిమిలో నేనేర్పరచుకొంటిని.”14

దేవుని యొక్క దైవిక ఉద్దేశ్యాలపై విశ్వాసం ఉంచడం అలసిన ఆత్మలలో నిరీక్షణను కలిగిస్తుంది మరియు వేదనలు, బాధల కాలంలో నిశ్చయతను రేకెత్తిస్తుంది.15

దైవిక దృక్కోణాలు

సంవత్సరాల క్రితం, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ విలువైన అంతర్దృష్టిని పంచుకున్నారు: “మనం అన్ని విషయాలను నిత్య దృక్పథంతో చూస్తున్నప్పుడు, అది మన భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.”16

చిత్రం
హాలీ మరియు ట్రే పోర్టర్

నా భార్య జిల్, నేను ఇటీవల హాలీ మరియు రిక్ పోర్టర్‌ల నమ్మకమైన జీవితాల్లో ఈ సత్యాన్ని చూశాము, వారి 12 ఏళ్ల కుమారుడు ట్రే విషాదకరమైన అగ్నిప్రమాదంలో మరణించాడు. తన ప్రియమైన కుమారుడిని రక్షించడానికి చేసిన వీరోచిత పోరాటంలో తీవ్రంగా కాలిపోయిన చేతులు మరియు కాళ్ళతో, హాలీ వార్డు సంస్కార సమావేశంలో నిలబడి, వారి వేదనలో వారి కుటుంబంపై ప్రభువు కుమ్మరించిన గొప్ప శాంతి మరియు ఆనందం గురించి అద్భుతంగా, నమ్మశక్యం కాని మరియు ఆశ్చర్యకరమైన వంటి పదాలను ఉపయోగించి సాక్ష్యమిచ్చింది!

చిత్రం
స్వస్థపరిచే చేతులు పట్టుకోవడం.

ఈ ఆలోచనతో, ఈ అమూల్యమైన తల్లి యొక్క భరించలేని దుఃఖం వెంటనే అంతకుమించిన శాంతి చేత భర్తీ చేయబడింది: “నా చేతులు రక్షించే చేతులు కాదు; ఆ చేతులు రక్షకునికి చెందినవి! నా మచ్చలను నేను చేయలేకపోయిన దానిని గుర్తుచేసేలా చూసే బదులు, నా రక్షకుడు భరించే మచ్చలను నేను గుర్తుంచుకుంటాను.”

“మీరు సిలెస్టియల్‌గా ఆలోచించినప్పుడు, శ్రమలు మరియు వ్యతిరేకతలను మీరు క్రొత్త కోణంలో చూస్తారు,”17 అనే మన ప్రవక్త యొక్క వాగ్దానాన్ని ఆమె సాక్ష్యం నెరవేరుస్తుంది.

ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ ఇలా పేర్కొన్నారు: “దేవుడు తన విమోచన ప్రణాళికను పూర్వమర్త్య లోకంలో అందించినప్పుడు కష్టాలను అధిగమించడం మరియు ఎదగడం అనే సవాలు మనకు నచ్చిందని నేను నమ్ముతున్నాను. మన పరలోక తండ్రి మనల్ని ఆదుకుంటారని తెలుసుకుని మనం ఇప్పుడు ఆ సవాలును ఎదుర్కోవాలి. అయితే మనం ఆయన వైపు తిరగడం చాలా ముఖ్యం. దేవుడు లేకపోతే, బాధలు మరియు కష్టాల యొక్క చీకటి అనుభవాలు నిస్పృహ, నిరాశ మరియు దుఃఖానికి కూడా గురవుతాయి.”18

దైవిక సూత్రాలు

అసంతృప్తి యొక్క అంధకారాన్ని నివారించడానికి బదులుగా జీవితపు కష్టమైన సవాళ్ళలో అధిక శాంతి, నిరీక్షణ మరియు ఆనందాన్ని పొందడానికి, నేను మూడు దైవిక సూత్రాలను పంచుకుంటాను.

ఒకటి—యేసు క్రీస్తుకు మొదటి స్థానం ఇవ్వడం ద్వారా బలమైన విశ్వాసం కలుగుతుంది.19 “ప్రతి ఆలోచనలో నా వైపు చూడుడి; సందేహించవద్దు, భయపడవద్దు”20 అని ఆయన ప్రకటిస్తున్నారు. అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు:

“[మన] నిత్యజీవము [క్రీస్తు] యందు మరియు ఆయన ప్రాయశ్చిత్తమందు [మన] విశ్వాసంపై ఆధారపడియుంది.”21

“ఇటీవల తగిలిన గాయం చేత తీవ్రమైన నొప్పితో నేను పోరాడుతున్నప్పుడు, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము యొక్క అగోచరమైన బహుమానం కొరకు నేను మరింత ఎక్కువ ప్రశంసను అనుభవించాను. దాని గురించి ఆలోచించండి! రక్షకుడు ‘ప్రతి విధమైన బాధలు, శ్రమలు మరియు శోధనలు’ అనుభవించారు, తద్వారా అవసరమైన సమయాల్లో ఆయన మనల్ని ఓదార్చగలరు, స్వస్థపరచగలరు, [మరియు] కాపాడగలరు.”22

ఆయన ఇలా కొనసాగించారు: “నా గాయం మళ్ళీ మళ్ళీ నేను ‘ఇశ్రాయేలు పరిశుద్ధుని గొప్పతనము’ పై ప్రతిబింబించేలా చేసింది. నేను స్వస్థపడుతున్న సమయంలో, ప్రభువు తన దైవిక శక్తిని శాంతియుతమైన, స్పష్టమైన మార్గాల్లో ప్రత్యక్షపరిచారు.”23

“లోకములో మీకు శ్రమ కలుగును: అయినను ధైర్యము తెచ్చుకొనుడి; నేను లోకమును జయించియున్నాను”24 అని రక్షకుడు ప్రోత్సహిస్తున్నారు.

రెండు—మన నిత్య గమ్యాన్ని ఊహించడం ద్వారా ప్రకాశవంతమైన నిరీక్షణ వస్తుంది.25 “మన తండ్రి యొక్క అపురూపమైన వాగ్దాన దీవెనల దర్శనాన్ని ప్రతిరోజూ మన కళ్ళ ముందు” ఉంచుకోవడంలో అంతర్లీనంగా ఉన్న శక్తి గురించి మాట్లాడుతూ, సహోదరి లిండా రీవ్స్ ఇలా సాక్ష్యమిచ్చారు: “మనకు అనేక శ్రమలు ఎందుకున్నాయో నాకు తెలియదు, కానీ నా వ్యక్తిగత భావన ఏమిటంటే, బహుమానము చాలా గొప్పది, … ఎంత సంతోషకరమైనది, ఎంతగా మన జ్ఞానమును మించినది అంటే, ఆ బహుమానమిచ్చు దినములో, మనము కనికరముగల, ప్రేమగల మన తండ్రితో, ‘అవసరమైనది అంతా ఇదేనా?’ అని చెప్పాలని భావిస్తాము. … చివరికి, మనము ఇక్కడ అనుభవించిన ఆ శ్రమలే … దేవుని రాజ్యములో … నిత్యజీవానికి మనల్ని అర్హులుగా చేసేవి అయితే … ఏది ముఖ్యము?”26

అధ్యక్షులు నెల్సన్ ఈ అంతర్దృష్టిని పంచుకున్నారు: “లిబర్టీ చెరసాలలో ఉపశమనం కోసం ప్రార్థించినప్పుడు జోసెఫ్ స్మిత్‌కు ప్రభువు ఇచ్చిన జవాబును పరిగణించండి. అతనిపట్ల అమానుషంగా వ్యవహరించడం అతనికి అనుభవమునిస్తుందని, అతని మేలుకొరకేనని ప్రభువు ప్రవక్తకు బోధించారు. ‘దానిని నీవు సహించిన యెడల, దేవుడు నిన్ను ఉన్నతమునకు హెచ్చించును’ అని ప్రభువు వాగ్దానమిచ్చారు. ప్రభువు సిలెస్టియల్‌గా ఆలోచించమని మరియు రోజూ పడే బాధాకరమైన ఇబ్బందులపై దృష్టి పెట్టడానికి బదులు నిత్య బహుమానాన్ని ఊహించమని జోసెఫ్‌కు బోధిస్తున్నారు.”27

ఒక స్నేహితునికి వ్రాసిన ఈ లేఖలో ప్రతిబింబించినట్లుగా, జోసెఫ్‌ దృక్పథంలో మార్పు లోతైన శుద్ధిని తెచ్చిపెట్టింది: “ఐదు నెలలపాటు జైలు గోడల మధ్య బంధించబడిన తర్వాత, ఇకపై నా హృదయం మునుపెన్నడూ లేనంత సున్నితంగా ఉంటుందని నాకనిపిస్తోంది. … నేను అనుభవించిన కష్టాలను నేను అనుభవించి ఉండకపోతే ఇప్పుడు నేను భావిస్తున్నట్లు నేను ఎప్పటికీ భావించలేను.”28

మూడు—ఆనందంపై దృష్టి పెట్టడం ద్వారా గొప్ప శక్తి వస్తుంది.29 నిత్యత్వపు అత్యంత కీలకమైన, వేదన కలిగించే సమయాల్లో, మన రక్షకుడు వెనుదిరిగిపోలేదు, కానీ చేదు పాత్రను త్రాగారు.30 ఆయన దానిని ఎలా చేసారు? “ఆయన యెదుట ఉంచబడిన ఆనందముకొరకై [క్రీస్తు] సిలువను సహించారని,”31 ఆయన చిత్తం “తండ్రి చిత్తమందు ఉపసంహరించబడింది”32 అని మనం నేర్చుకుంటాం.

చిత్రం
గెత్సేమనేలో క్రీస్తు

“ఉపసంహరించబడింది” అనే ఈ వాక్యభాగం నన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. స్పానిష్‌లో “ఉపసంహరించబడింది” అనేది “అయిపోయినది” అని; జర్మన్‌లో, “తినివేయబడింది” అని మరియు చైనీస్‌లో, “మింగివేయబడింది” అని అనువదించబడిందని తెలుసుకున్నప్పుడు దానిపై నా ఆసక్తి పెరిగింది. ఆవిధంగా, జీవితపు సవాళ్ళు అత్యంత బాధాకరంగా, అధికంగా ఉన్నప్పుడు, ప్రభువు యొక్క వాగ్దానాన్ని నేను గుర్తుంచుకుంటాను—మనం “క్రీస్తు యొక్క సంతోషమందు హరించివేయబడినవి [అయిపోయినవి, తినివేయబడినవి, మింగివేయబడినవి] తప్ప, ఏ విధమైన శ్రమలను అనుభవించరాదు.”33

మీ చేదు పాత్రలు ఇంకా తీసివేయబడనప్పటికీ, “మర్త్య గ్రహణశక్తిని … [ధిక్కరించే]”34 ఈ ఆనందాన్ని మీలో చాలామందిలో నేను చూస్తున్నాను. మీ నిబంధనలను పాటిస్తున్నందుకు మరియు దేవునికి సాక్షులుగా నిలిచినందుకు ధన్యవాదాలు.35 “[మీ] నిశ్శబ్ద హృదయములో కంటికి కనిపించని దుఃఖము దాగియున్నప్పటికీ,”36 మా అందరినీ దీవించడానికి సమీపించినందుకు మీకు ధన్యవాదాలు. రక్షకుని ఉపశమనాన్ని మీరు ఇతరులకు అందించినప్పుడు, మీకైమీరు దానిని కనుగొంటారని అధ్యక్షురాలు కెమిలి జాన్సన్ బోధించారు.37

దైవిక వాగ్దానాలు

ఇప్పుడు, హాలీ పోర్టర్ కుటుంబానికి ప్రభువు సహాయం చేసిన అద్భుతాన్ని మనం చూసిన సంస్కార సమావేశానికి నాతో పాటు తిరిగి రండి.38 ఈ నమ్మకమైన కుటుంబానికి మరియు వారి ప్రియమైన స్నేహితులకు ఓదార్పునిచ్చేందుకు నేను ఏమి చెప్పగలనని ఆలోచిస్తూ వేదిక మీద కూర్చున్నప్పుడు, ఈ మనోభావన వచ్చింది: “రక్షకుని మాటలను ఉపయోగించు.”39 కాబట్టి, “గాయపడిన మనసును స్వస్థపరచు”40 ఆయన మాటలతో నేను ఆ సబ్బాతునాడు చేసినట్లుగానే ఈరోజు కూడా ముగిస్తాను.

“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.”41

“మీ భుజములపై నున్న భారములను నేను సడలించెదను, అందువలన మీరు దాస్యములో ఉన్నప్పుడు కూడా వాటిని మీ వీపులపైన అనుభవించరు; … నేను ప్రభువైన దేవుడనని, నా జనులను వారి శ్రమలలో దర్శించుదునని మీరు నిశ్చయముగా తెలుసుకొందురు.”42

“మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును.”43

నా సాక్ష్యము

సంతోషకరమైన భక్తితో, మన రక్షకుడు సజీవుడని, “ఆయన వాగ్దానాలు నిశ్చయమైనవని” నేను సాక్ష్యమిస్తున్నాను.44 కష్టాల్లో ఉన్న లేదా “ఏ విధంగానైనా శ్రమపడే” మీ కోసం,45 మన పరలోక తండ్రి మీ కన్నీటి ప్రార్థనలను వింటారని46 మరియు ఎల్లప్పుడూ పరిపూర్ణ జ్ఞానంతో స్పందిస్తారని47 నేను సాక్ష్యమిస్తున్నాను. గొప్ప అవసరత గల సమయాల్లో ఆయన మా కుటుంబానికి చేసినట్లుగానే, “మీ భారములు తేలికగునట్లు,”48 “క్రీస్తు యొక్క సంతోషమందు హరించివేయబడునట్లు,”49 “దేవుడు మీకు దయచేయును గాక.” యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్.

ముద్రించు