“అందరి యొక్క రక్షకుడు, అందరి కొరకు ఒక సువార్త,” లియహోనా, 2024.
లియహోనా నెలవారీ సందేశము, 2024 మార్చి
అందరి రక్షకుడు, అందరి కొరకు ఒక సువార్త
యేసు క్రీస్తు యొక్క సువార్త, ప్రాయశ్చిత్తము మరియు పునరుత్థానము దేవుని పిల్లలందరినీ ఆశీర్వదిస్తాయి.
యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త, మొదటిది, ప్రధానమైనది, మరియు ఎప్పటికీ, ఈ కడవరి దినములలో ప్రతి ఒక్కరికీ శాశ్వతమైన సంతోషం, నిజమైన శాంతి, మరియు ఆనందానికి మూలం. సువార్త మరియు క్రీస్తు యొక్క అపారమైన దయాళుత్వము నుండి ప్రవహించే ఆశీర్వాదాలు పురాతన కాలం లేదా ఆధునిక కాలంలో ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే ఉద్దేశించబడలేదు.
మనల్ని మనం ఎంత అసమర్ధులుగా భావించినా, మరియు కొంత కాలం పాటు మనలను ఆయన నుండి దూరం చేసే పాపాలు ఉన్నప్పటికీ, మన రక్షకుడు “తన చేతులను దినమంతయు [మన] కొరకు చాపి” (జేకబ్ 6:4), మనందరినీ తన వద్దకు చేరి ఆయన ప్రేమను అనుభూతి చెందమని ఆహ్వానిస్తున్నారు.
సర్వలోకమునకు సువార్త దీవెనలు
యేసు క్రీస్తు యొక్క సువార్త “ఈ కడవరి దినములలో భూమిపై ఉన్న ప్రతి జనము, వంశము, భాష, మరియు ప్రజల … అవసరాలను తీర్చడానికి పునఃస్థాపించబడింది.”1 “దేవునికి అందరూ ఒకేరీతిగా ఉన్నారు” (2 నీఫై 26:33) అని బోధించడానికి, సువార్త, అన్ని సాంస్కృతిక హద్దులను దాటుచూ అన్ని జాతీయత మరియు రంగును అధిగమించింది. 2 మోర్మన్ గ్రంథం ఈ సత్యానికి విశేషమైన సాక్షిగా నిలుస్తుంది.
క్రీస్తు సమస్త జనములను జ్ఞాపకము చేసుకొనుననియు (2 నీఫై 29:7 చూడండి) మరియు “ఆయన యందు విశ్వాసముంచు వారందరికీ, … [మరియు] నరుల సంతానము మధ్య గొప్ప అద్భుతములు, సూచక క్రియలు, ఆశ్చర్యకార్యములు చేయుచూ పరిశుద్ధాత్మ శక్తిద్వారా ఆయన తననుతాను ప్రత్యక్షపరచుకొనును” (2 నీఫై 26:13). ఈ గొప్ప అద్భుతములు, సూచక క్రియలు, ఆశ్చర్యకార్యములలో సువార్త వ్యాప్తి ఉంది. కాబట్టి, దాని సువర్తమానములు గురించి సాక్ష్యమివ్వడానికి మనము ప్రపంచవ్యాప్తంగా మిషనరీలను పంపుతాము. మనము కూడా మన చుట్టూ ఉన్న వారితో సువార్తను పంచుకుంటాము. పునఃస్థాపించబడిన యాజకత్వపు తాళపు చెవుల సాధన జీవించియున్న వారికి మరియు మరణించిన వారికి సంపూర్ణ సువార్త అంతిమంగా మన పరలోక తల్లిదండ్రుల ప్రతి కుమారునికి మరియు కుమార్తెకు—గతం, వర్తమానం, లేదా భవిష్యత్తులో అందుబాటులో ఉంటుందని నిశ్చయపరుస్తుంది.
ఈ సువార్త యొక్క ముఖ్యభాగము—ఆయన కార్యము నిమిత్తము పిలువబడిన లేదా పిలువబడే ప్రతి ప్రవక్త మరియు అపొస్తలుల యొక్క ప్రధాన సందేశం—ఏమిటంటే, యేసు క్రీస్తు ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించడానికి వచ్చారు. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా, ఆయన ప్రాయశ్చిత్త త్యాగం ప్రపంచమంతటి కొరకైనదని అని మనము ప్రకటిస్తున్నాము.
అనంతమైన మరియు శాశ్వతమైన ప్రాయశ్చిత్తం యొక్క ఆవశ్యకత
నేను ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తున్నప్పుడు, విస్తృత శ్రేణితో నేను సంఘ సభ్యుల ఇంటర్వ్యూలను జరుపుతాను. వారు భిన్నమైన పాపాన్ని అంగీకరించినప్పుడు వారి జీవితాలలో యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం యొక్క దీవెనలను ఎలా అనుభవిస్తున్నారో వినడానికి నేను ప్రేరణ పొందాను. ఆయన ప్రాయశ్చిత్తం యొక్క శుద్ధి చేసే సౌలభ్యం మనందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం ఎంత అద్భుతమైనది!
“ఒక ప్రాయశ్చిత్తము చేయబడుట ఆవశ్యకమైనది; లేనియెడల సమస్త మానవ జాతి తప్పక నశించవలెను;” అని అమ్యులెక్ ప్రకటించాడు. “ఆవశ్యకమైన ఆ ప్రాయశ్చిత్తము చేయబడని యెడల, … మనమందరము ఎప్పటికీ పతనమై మరియు … తప్పిపోయుంటాము,” అందు కొరకు “ఒక అనంతమైన, నిత్యమైన బలి కావలెను.” కావున “అనంతమైన ప్రాయశ్చిత్తమునకు తక్కువైనదేదియు లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయలేదు” (ఆల్మా 34:9, 10, 12).
“మనుష్యులందరికి మరణము సంభవించెను, గనుక” మనలను దేవుని సన్నిధికి తీసుకురావడానికి “పునరుత్థానము యొక్క శక్తి అవసరమాయెను” అని గొప్ప ప్రవక్త అయిన జేకబ్ కూడా బోధించాడు (2 నీఫై 9:6).
పాపము మరియు మరణము రెండింటినీ జయించాల్సిన అవసరం ఉంది. ఇది రక్షకుని నియమితకార్యము, ఆయన దేవుని పిల్లలందరి కొరకు ఆ కార్యమును ధైర్యంగా నెరవేర్చారు.
మన రక్షకుని యొక్క త్యాగము
యేసు క్రీస్తు తన మర్త్యత్వములో ఉన్న చివరి రాత్రి, గెత్సేమనే తోటలోనికి ప్రవేశించారు. అక్కడ, ఆయన ఒలీవ చెట్ల మధ్య మోకరించారు, మీకు మరియు నాకు ఎప్పటికీ తెలియని వేదన యొక్క లోతులోనికి దిగడం ప్రారంభించారు.
అక్కడ, ఆయన లోక పాపములను తనపైకి తీసుకోవడం ప్రారంభించారు. ఆయన ప్రతి బాధను, హృదయ వేదనను, మరియు దుఃఖాన్ని అనుభవించారు, మీరు, నేను మరియు ఇప్పటివరకు జీవించిన లేదా జీవించబోయే ప్రతి ఆత్మ అనుభవించిన అన్ని వేదనలను మరియు బాధలను ఆయన భరించారు. ఈ గొప్ప మరియు అనంతమైన బాధ, “అందరికంటే గొప్పవాడైన [ఆయనను], … నొప్పి కారణంగా వణకించింది మరియు ప్రతి స్వేద రంధ్రము నుండి రక్తము కారేలా చేసింది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 19:18). ఆయన మాత్రమే దీనిని చేయగలరు.
ఈ పాపానికి మూల్యం చెల్లించడానికి
తగినంత మంచి మరొకటి లేదు.
ఆయన మాత్రమే పరలోకపు తాళం తీయగలడు
మరియు మనల్ని లోపలికి అనుమతించగలడు.3
యేసును అప్పుడు కల్వరికి తీసుకువెళ్లారు, మరియు ఈ ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదకరమైన అన్యాయమైన ఆ క్షణంలో, ఆయన సిలువ వేయబడ్డారు. ఎవరూ ఆయన నుండి ఆయన ప్రాణాన్ని తీసుకోలేరు. దేవుని యొక్క అద్వితీయ కుమారునిగా, భౌతిక మరణంపై ఆయనకు అధికారం ఉంది. ఆయన తన తండ్రికి ప్రార్థించగలడు, మరియు ఆయనను హింసించేవారిని ఓడించడానికి మరియు అన్ని విషయాలపై ఆయన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి దేవదూతల సేనా వ్యూహము వచ్చియుండేది. “నేను వేడుకొనినయెడల–ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని?” యేసు తనను పట్టుకొనవచ్చిన వారిని అడిగెను. (మత్తయి 26:54).
తన తండ్రికి పరిపూర్ణ విధేయతతో—మరియు మనపట్ల పరిపూర్ణమైన ప్రేమతో—యేసు ఇష్టపూర్వకంగా తన ప్రాణమును ఇచ్చారు, తన అనంతమైన మరియు శాశ్వతమైన ప్రాయశ్చిత్త త్యాగాన్ని నెరవేర్చారు, ఇది నిత్యత్వమంతటా ముందుకు సాగుతుంది.
మన రక్షకుని విజయము
యేసు తన మరణానంతరం తన కార్యమును కొనసాగించమని తన అపొస్తలులకు ఆజ్ఞాపించారు. వారు దీనిని ఎలా చేస్తారు? వారిలో చాలామంది సాధారణ మత్స్యకారులు మాత్రమే, మరియు పరిచర్య కోసం సమాజ మందిరాల్లో ఎవరూ శిక్షణ పొందలేదు. ఆ సమయంలో, క్రీస్తు సంఘము అంతరించిపోయేలా కనిపించింది. కానీ అపొస్తలులు వారి పిలుపును భుజానికెత్తుకుని ప్రపంచ చరిత్రను రూపొందించడానికి శక్తిని కనుగొన్నారు.
అటువంటి స్పష్టమైన బలహీనత నుండి శక్తి రావడానికి కారణం ఏమిటి? ఆంగ్లికన్ సంఘ నాయకుడు మరియు పండితుడైన ఫ్రెడరిక్ ఫర్రార్ ఇలా అన్నాడు: “ఒకటి, మరియు ఒకే ఒక్క సాధ్యపరచు సమాధానం—మృతుల నుండి పునరుత్థానం. ఈ విస్తారమైన విప్లవం అంతా క్రీస్తు పునరుత్థానం యొక్క శక్తి కారణంగా జరిగింది.”4 పునరుత్థానుడైన ప్రభువు యొక్క సాక్షులుగా, ఈ కార్యపు పురోగతిని ఏవీ ఆపలేవని అపొస్తలులకు తెలుసు. ప్రారంభ సంఘము అన్ని అసమానతలను అధిగమించినందున వారి సాక్ష్యం నిలకడ శక్తి యొక్క మూలంగా ఉంది.
ఈ ఈస్టర్ కాలములో, ఆయన నియమించిన సాక్షులలో ఒకరిగా, ఒక అందమైన ఆదివారం ఉదయం, ప్రభువైన యేసు క్రీస్తు మనలను బలపరచడానికి మరియు ప్రతి ఒక్కరి మరణ బంధకాలను తెంచడానికి మరణం నుండి లేచాడని నేను ప్రకటిస్తున్నాను. యేసు క్రీస్తు సజీవుడు! ఆయన వల్ల, మరణం మన అంతం కాదు. పునరుత్థానం అనేది క్రీస్తు నుండి అందరికీ ఉచితమైన మరియు విశ్వవ్యాప్త బహుమతి.
క్రీస్తు యొద్దకు రండి
యేసు క్రీస్తు యొక్క సువార్త మరియు ప్రాయశ్చిత్తం అందరికీ—అంటే, ప్రతి ఒక్కరికీ. రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగం యొక్క పూర్తి ఆశీర్వాదాలను మనం అనుభవించే ఏకైక మార్గం: “నా యొద్దకు రండి” (మత్తయి 11:28) అనే ఆయన ఆహ్వానాన్ని వ్యక్తిగతంగా అంగీకరించడం.
మనము క్రీస్తునందు విశ్వాసాన్ని సాధన చేసి మరియు పశ్చాత్తాపపడుట వలన ఆయన యొద్దకు వస్తాము. మనము ఆయన నామములో బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ వరమును పొందినప్పుడు ఆయన యొద్దకు వస్తాము. మనం ఆజ్ఞలను పాటిస్తూ, విధులను స్వీకరించినప్పుడు, నిబంధనలను గౌరవిస్తూ, దేవాలయంలో అనుభవాలను స్వీకరించినప్పుడు మరియు క్రీస్తు శిష్యులు జీవించే విధంగా జీవించినప్పుడు మనం ఆయన యొద్దకు వస్తాము.
కొన్నిసార్లు, మీరు నిరుత్సాహాన్ని మరియు నిరాశను ఎదుర్కొంటారు. మీ హృదయం మీ కోసం లేదా మీరు ప్రేమించేవారి కోసం విరిగిపోవచ్చు. ఇతరుల పాపాలు మీకు భారం కావచ్చు. మీరు చేసిన తప్పులు—బహుశా తీవ్రమైన తప్పుల వలన శాంతి మరియు సంతోషం మిమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టాయని మీరు భయపడవచ్చు. అలాంటి సమయాల్లో, రక్షకుడు పాపభారాన్ని పైకెత్తడం మాత్రమే కాకుండా మీ బాధలతో సహా “ప్రతి విధమైన బాధలు, శ్రమలు మరియు శోధనలు అనుభవించారు” (ఆల్మా 7:11), అని గుర్తుంచుకోండి! ఆయన మీ కోసం ఎదుర్కొన్న దాని కారణంగా, ఆయన జీవితాన్ని మార్చే “నా యొద్దకు రండి” అనే ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు, మీకు వ్యక్తిగతంగా ఎలా సహాయం చేయాలో ఆయనకు తెలుసు.
అందరికీ స్వాగతం
తన సువార్త మరియు ప్రాయశ్చిత్తం యొక్క ఆశీర్వాదాలపై పరలోక తండ్రి పిల్లలందరికీ సమాన హక్కు ఉందని యేసు క్రీస్తు స్పష్టం చేశారు. ఆయన మనకు ఇలా గుర్తు చేస్తున్నారు, “మనుష్యులందరు ఒకే విధమైన హక్కు కలిగియున్నారు మరియు ఎవరును నిషేధించబడలేదు” (2 నీఫై 26:28).
“అందరిని తన వద్దకు రమ్మని, తన మంచితనము నందు పాలుపొందమని ఆయన ఆహ్వానించుచున్నాడు; తన యొద్దకు వచ్చువానిని, నల్లవారైనా తెల్లవారైనా, బందీలైనా స్వతంత్రులైనా, పురుషులైనా స్త్రీలైనా ఎవ్వరిని ఆయన నిరాకరించడు.” (2 నీఫై 26:33).
“ఆయన అందరిని ఆహ్వానించుచున్నాడు”—అంటే మనందరినీ! మనపై లేదా ఇతరులపై మనం అల్పజ్ఞానముగల ముద్రలను మరియు కృత్రిమ వ్యత్యాసాలను ఉంచకూడదు. రక్షకుని ప్రేమకు మనము ఎన్నటికీ ఎలాంటి అడ్డంకులు పెట్టకూడదు లేదా మనము లేదా ఇతరులు ఆయన పరిధిని చేరుకోలేనివారనే ఆలోచనలు చేయకూడదు. నేను ఇదివరకే చెప్పినట్లుగా, “క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం యొక్క అనంతమైన ప్రకాశించే కాంతికి అందనంత దిగువకు మునిగిపోవడం [ఎవరికీ] సాధ్యం కాదు.”5
బదులుగా, సహోదరి హాలండ్ మరియు నేను ఆమె చనిపోయే కొద్ది నెలల ముందు బోధించినట్లుగా, “దాతృత్వము కలిగియుండుడి, ఆ దాతృత్వమే ప్రేమ” (2 నీఫై 26:30) అని మనము ఆజ్ఞాపించబడ్డాము.6 ఇది రక్షకుడు మనకు చూపించే ప్రేమ, ఎందుకంటే “ఆయన లోకమునకు ప్రయోజనకరమైన దానిని తప్ప మరిదేనిని చేయడు; ఏలయనగా ఆయన తన ప్రాణమును పణంగాపెట్టి మనుష్యులందరినీ తన వైపు ఆకర్షించునంతగా లోకమును ప్రేమించెను.” (2 నీఫై 26:24).
యేసు క్రీస్తు యొక్క సువార్త మరియు ప్రాయశ్చిత్తము జనులందరి కొరకు అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన అందించే దీవెనలను మీరు ఆనందంగా స్వీకరించాలని నేను ప్రార్థిస్తున్నాను.
© 2024 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Liahona Message, March 2024 యొక్క అనువాదము. Telugu. 19284 421