“23. సువార్తను పంచుకోవడం, క్రొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).
“23. సువార్తను పంచుకోవడం, క్రొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు.
23.
సువార్తను పంచుకోవడం, క్రొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడం
23.0
పరిచయము
సువార్తను స్వీకరించడానికి అందరినీ ఆహ్వానించడం రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో భాగం (ఈ చేతి పుస్తకంలోని 1.2 చూడండి; మత్తయి 28:19–20 చూడండి). ఇది వీటిని కలిగి ఉంటుంది:
-
సువార్త పరిచర్యలో పాల్గొనడం మరియు సువార్తికులుగా సేవ చేయడం.
-
క్రొత్త మరియు తిరిగి వస్తున్న సంఘ సభ్యులకు నిబంధన మార్గములో పురోగమించడానికి సహాయం చేయడం.
23.1
సువార్తను పంచుకోండి
23.1.1
ప్రేమ
దేవుని పట్ల మనకున్న ప్రేమను చూపించడానికి ఒక మార్గం ఏమిటంటే, ఆయన బిడ్డలను ప్రేమించడం మరియు సేవించడం (మత్తయి 22:36–39; 25:40 చూడండి). మనము యేసు క్రీస్తు వలె ప్రేమించి, సేవచేయడానికి కృషి చేస్తాము. ఈ ప్రేమ అన్ని మతాలు, జాతులు మరియు సంస్కృతుల ప్రజలను చేరుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుంది (అపొస్తలుల కార్యములు 10:34; 2 నీఫై 26:33 చూడండి).
23.1.2
పంచుకోవడం
మనము దేవుణ్ణి మరియు ఆయన బిడ్డలను ప్రేమిస్తున్నాము కాబట్టి, ఆయన మనకు ఇచ్చిన దీవెనలను సహజంగానే పంచుకోవాలని (యోహాను 13:34–35 చూడండి) మరియు ఇశ్రాయేలును సమకూర్చుటలో సహాయపడాలని అనుకుంటున్నాము. మనము అనుభూతి చెందే ఆనందాన్ని జనులు అనుభవించేలా సహాయం చేయడానికి మనము ప్రయత్నిస్తాము (ఆల్మా 36:24 చూడండి). మన జీవితాలలో రక్షకుడు మరియు ఆయన ప్రభావం గురించి మనం బహిరంగంగా మాట్లాడతాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 60:2 చూడండి). వ్యక్తిగత, ఆన్లైన్ మరియు ఇతర పరస్పర సంభాషణలలో భాగంగా మనము ఈ విషయాలను సాధారణ మరియు సహజమైన మార్గాల్లో పంచుకుంటాము.
23.1.3
ఆహ్వానించడం
ఇతరులను ఎలా ఆహ్వానించాలనే దానిపై ప్రేరణ మరియు మార్గదర్శకత్వం కోసం మనము ప్రార్థిస్తాము:
-
రండి మరియు యేసు క్రీస్తు, ఆయన సువార్త మరియు ఆయన సంఘము ద్వారా లభించే దీవెనలను చూడండి (యోహాను 1:37–39, 45–46 చూడండి).
-
అవసరంలో ఉన్న జనులకు సేవ చేసేందుకు వచ్చి మాకు సహాయం చేయండి.
-
రండి మరియు పునరుద్ధరించబడిన యేసు క్రీస్తు సంఘమునకు చెందినవారవ్వండి.
తరచుగా, ఆహ్వానించడం అంటే మనం ఇప్పటికే చేస్తున్న పనిలో మన కుటుంబం, స్నేహితులు మరియు పొరుగువారిని చేర్చడం.
23.2
క్రొత్త సభ్యులను బలోపేతం చేయండి
ప్రతి క్రొత్త సభ్యునికి స్నేహం, సేవ చేసే అవకాశాలు మరియు ఆధ్యాత్మిక పోషణ అవసరం. సంఘ సభ్యులుగా, మనము క్రొత్త సభ్యులకు మన ప్రేమ మరియు మద్దతును అందిస్తాము (మోషైయ 18:8–10 చూడండి). సంఘమునకు చెందియున్నారనే భావనను కలిగించడంలో వారికి మనము సహాయం చేస్తాము. నిబంధన మార్గంలో ముందుకు సాగడానికి మరియు మరింత ఎక్కువగా “ప్రభువుకు పరివర్తన చెందడానికి” మనము వారికి సహాయం చేస్తాము (ఆల్మా 23:6).
23.3
తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయండి
కొంతమంది సభ్యులు సంఘములో పాల్గొనడం మానేయాలని ఎంచుకుంటారు. “అట్టి వారికి పరిచర్య చేయుటను మీరు కొనసాగించవలెను; ఏలయనగా వారు తిరిగి వచ్చి పశ్చాత్తాపపడి, హృదయము యొక్క పూర్ణ ఉద్దేశ్యముతో నా యొద్దకు వచ్చెదరేమో, నేను వారిని స్వస్థపరచుదునేమో మరియు వారికి రక్షణ తెచ్చుటకు మీరు సాధనముగా ఉందురేమో మీరెరుగరు” అని రక్షకుడు చెప్పారు (3 నీఫై 18:32).
పూర్తిగా పాల్గొనని సభ్యులు సంఘ సభ్యులతో బలమైన సంబంధాలను కలిగి ఉంటే వారు తిరిగి వచ్చే అవకాశం ఉంది. క్రొత్త సభ్యుల మాదిరిగానే, వారికి స్నేహం, సేవ చేసే అవకాశాలు మరియు ఆధ్యాత్మిక పోషణ అవసరం.
23.4
స్టేకు నాయకులు
23.4.1
స్టేకు అధ్యక్షత్వము
సువార్తను పంచుకోవడానికి, క్రొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడానికి స్టేకు అధ్యక్షుడు స్టేకులో తాళపుచెవులను కలిగి ఉంటారు. అతను మరియు అతని సలహాదారులు ఈ ప్రయత్నాలకు పూర్తి దిశానిర్దేశం చేస్తారు.
సాధారణంగా నెలకోసారి, స్టేకు మరియు వార్డు నాయకులు మరియు పూర్తి-కాల సువార్తికుల మధ్య ప్రయత్నాలను సమన్వయం చేయడానికి స్టేకు అధ్యక్షుడు మిషను అధ్యక్షుడితో సమావేశమవుతారు.
23.4.3
ప్రధాన సలహాదారులు
పెద్దల సమూహ అధ్యక్షత్వములకు మరియు వార్డు మిషను నాయకులకు సూచనలివ్వడానికి మరియు మద్దతు ఇవ్వడానికి స్టేకు అధ్యక్షత్వము ప్రధాన సలహాదారులను నియమించవచ్చు. ఈ ప్రయత్నాలకు నాయకత్వం వహించడానికి ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది ప్రధాన సలహాదారులను నియమించవచ్చు. అయితే, ప్రధాన సలహాదారులందరు వారికి కేటాయించిన వార్డులు మరియు సమూహాల కోసం ఈ బాధ్యతలను కలిగి ఉంటారు.
23.4.4
స్టేకు ఉపశమన సమాజ అధ్యక్షత్వము
స్టేకు అధ్యక్షుని ఆధ్వర్యంలో, సువార్తను పంచుకోవడం, క్రొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడం కోసం వారి బాధ్యతలలో వార్డు ఉపశమన సమాజ అధ్యక్షత్వములకు స్టేకు ఉపశమన సమాజ అధ్యక్షత్వము సూచనలు మరియు మద్దతు ఇస్తుంది.
23.5
వార్డు నాయకులు
23.5.1
బిషప్రిక్కు
సువార్తను పంచుకోవడంలో, క్రొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడంలో వార్డు ప్రయత్నాలకు వారు నాయకత్వం వహిస్తుండగా బిషప్రిక్కు పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములతో సమన్వయం చేసుకుంటారు. ఈ నాయకులు తరచూ కలిసి సలహాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
ఈ ప్రయత్నాలు వార్డు సలహాసభ మరియు వార్డు యువజన సలహాసభ సమావేశాలలో చర్చించబడేలా మరియు సమన్వయం చేయబడేలా బిషప్రిక్కు నిర్ధారిస్తారు.
ప్రాతినిధ్య బాప్తిస్మములు మరియు నిర్ధారణలను నిర్వహించడానికి దేవాలయ సిఫారసు కొరకు తగిన వయస్సు గల క్రొత్త సభ్యులను బిషప్పు మౌఖికం చేస్తారు (26.4.2 చూడండి). అతను అహరోను యాజకత్వాన్ని స్వీకరించడానికి తగిన వయస్సు గల సహోదరులను కూడా మౌఖికం చేస్తాడు. అతను సాధారణంగా ఈ మౌఖికాలను సభ్యుడు నిర్ధారించబడిన వారంలోపు నిర్వహిస్తాడు.
23.5.2
పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములు
పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములు సువార్తను పంచుకోవడానికి, క్రొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడానికి వార్డు యొక్క రోజువారీ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తాయి (8.2.3 మరియు 9.2.3 చూడండి).
ఈ నాయకులకు ఈ క్రింది బాధ్యతలు ఉన్నాయి:
-
దేవుని బిడ్డలను ప్రేమించేందుకు, సువార్తను పంచుకోవడానికి మరియు రక్షకుని యొక్క దీవెనలను పొందేందుకు ఇతరులను ఆహ్వానించడానికి సభ్యులను ప్రేరేపించడంలో సహాయపడడం.
-
క్రొత్త మరియు తిరిగి వచ్చే సభ్యుల కొరకు పరిచర్య చేసే సహోదరులు మరియు సహోదరీలను నియమించడం (21.2.1 చూడండి).
-
వార్డు మిషను నాయకుని పనిని నడిపించడం.
పెద్దల సమూహ అధ్యక్షుడు మరియు ఉపశమన సమాజ అధ్యక్షురాలు ప్రతీఒక్కరు ఈ ప్రయత్నాలకు నాయకత్వం వహించడానికి అధ్యక్షత్వములో ఒక సభ్యుడిని నియమిస్తారు. ఈ ఇద్దరు అధ్యక్షత్వ సభ్యులు కలిసి పని చేస్తారు. వారు వారానికోసారి జరిగే సమన్వయ సమావేశాలకు హాజరవుతారు (23.5.7 చూడండి).
23.5.3
వార్డు మిషను నాయకుడు
వార్డు మిషను నాయకుడిని పిలవాలో లేదో నిర్ణయించడానికి బిషప్రిక్కు స్టేకు అధ్యక్షుడితో సంప్రదింపులు జరుపుతారు. ఈ వ్యక్తి మెల్కీసెదెకు యాజకత్వము కలిగి ఉండాలి. ఈ నాయకుడు పిలువబడకపోతే, పెద్దల సమూహ అధ్యక్షత్వ సభ్యుడొకరు ఈ పాత్రను పోషిస్తారు.
వార్డు మిషను నాయకుడు పెద్దల సమూహ అధ్యక్షత్వము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వానికి వారి మిషనరీ బాధ్యతలలో మద్దతు ఇస్తారు. అతను ఈ క్రింది బాధ్యతలను కూడా కలిగి ఉన్నాడు:
-
వార్డు సభ్యులు మరియు నాయకులు, వార్డు సువార్తికులు మరియు పూర్తి-కాల సువార్తికుల పనిని సమన్వయం చేయడం.
-
వారానికోసారి జరిగే సమన్వయ సమావేశాలకు నాయకత్వం వహించడం (23.5.7 చూడండి).
23.5.4
వార్డు సువార్తికులు
వార్డు సువార్తికులు 23.1 లో వివరించిన విధంగా సువార్తను పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించడంలో వార్డు సభ్యులకు సహాయం చేస్తారు. వారు వార్డు మిషను నాయకుడు లేదా ఈ పాత్రను పూరించే పెద్దల సమూహ అధ్యక్షత్వ సభ్యుని ఆధ్వర్యంలో పనిచేస్తారు.
23.5.5
వార్డు సలహాసభ మరియు వార్డు యువజన సలహాసభ
సువార్తను పంచుకోవడం, క్రొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడం గురించి వార్డు సలహాసభ సమావేశాలలో క్రమం తప్పకుండా చర్చించబడాలి. వార్డు సలహాసభ సమావేశాలకు హాజరు కావడానికి బిషప్పు వార్డు మిషను నాయకుడిని ఆహ్వానించవచ్చు.
ఈ చర్చలలో ఈ క్రింది ఫారంలు సహాయపడతాయి:
-
Missionary Progress Record [సువార్తికుని పురోగతి వృత్తాంతము].
-
New and Returning Member Progress [క్రొత్త మరియు తిరిగి వస్తున్న సభ్యుని పురోగతి]
వార్డులోని యౌవనుల అవసరాలను చర్చించడంలో, వార్డు యువజన సలహాసభ క్రొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులు మరియు సువార్తికులచే బోధించబడుతున్న యువత పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది.
23.5.7
సమన్వయ సమావేశాలు
ప్రతీవారం సువార్తను పంచుకోవడానికి, క్రొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడానికి చేసే ప్రయత్నాలను సమన్వయం చేయడానికి సంక్షిప్త అనధికారిక సమావేశాలు నిర్వహించబడతాయి. వార్డు మిషను నాయకుడు పిలువబడితే, అతను ఈ సమావేశాలు నిర్వహిస్తాడు. లేనిచో, ఈ పాత్రను పూరించే పెద్దల సమూహ అధ్యక్షత్వ సభ్యుడు నిర్వహిస్తాడు.
ఆహ్వానించబడే ఇతరులు:
-
ఉపశమన సమాజ మరియు పెద్దల సమూహ అధ్యక్షత్వములలో నియమించబడిన సభ్యులు.
-
వార్డు సువార్తికులు.
-
యాజకుల సమూహములో ఒక సహాయకుడు (లేదా వార్డులో యాజకులు లేకుంటే బోధకులు లేదా పరిచారకుల సమూహ అధ్యక్షుడు).
-
పెద్ద వయస్సుగల యువతుల తరగతికి చెందిన అధ్యక్షత్వ సభ్యురాలు.
-
పూర్తి-కాల సువార్తికులు.