“అధ్యాయము 3: యేసు క్రీస్తు యొక్క సువార్తను అధ్యయనం చేయండి మరియు బోధించండి,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)
“యేసు క్రీస్తు యొక్క సువార్తను అధ్యయనం చేయండి మరియు బోధించండి,” నా సువార్తను ప్రకటించండి
అధ్యాయము 3
యేసు క్రీస్తు యొక్క సువార్తను అధ్యయనం చేయండి మరియు బోధించండి
ఈ అధ్యాయములోని పాఠాలు యేసు క్రీస్తు సువార్త యొక్క ఆవశ్యకమైన సిద్ధాంతాన్ని, సూత్రాలను మరియు ఆజ్ఞలను కలిగియున్నాయి. ఇవి మీరు నేర్చుకోవాలని మరియు బోధించాలని జీవించియున్న ప్రవక్తలు మరియు అపొస్తలులు సూచించిన పాఠాలు. క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఇతరులకు మీరు సహాయపడగలిగేలా అవి ఇక్కడ అందించబడ్డాయి.
ఈ అధ్యాయములో మొదటి భాగము బాప్తిస్మపు ఆహ్వానము. మిగతా అధ్యాయము క్రింది నాలుగు పాఠాలను కలిగియుంది:
లేఖనాలను అధ్యయనం చేయండి మరియు ప్రతీ పాఠములోని సిద్ధాంతానికి అధిక విలువనివ్వండి. మీరలా చేసినప్పుడు, మీరు అధ్యయనం చేసే సత్యాలకు ఆత్మ సాక్ష్యమిస్తాడు. సత్యము గురించి సాక్ష్యం పొందడానికి ఇతరులకు సహాయపడేందుకు ఏమి చెప్పాలో మరియు చేయాలో తెలుసుకోవడానికి అతడు మీకు సహాయపడతాడు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:85 చూడండి.)
వారు చేయాలని ఆయన ఆహ్వానించిన వాటిని చేసినప్పుడు జనులు మరింత ఎక్కువగా రక్షకుని గురించి తెలుసుకుంటారు. ప్రతీ పాఠములో ఆహ్వానాలు ఇవ్వండి మరియు జనులు వారి వాగ్దానాలను పాటించేలా సహాయపడండి. జనులు వాగ్దానాలను పాటించినప్పుడు, యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించడాన్ని వారు ప్రారంభిస్తారు మరియు దేవునితో నిబంధనలు చేయడానికి సిద్ధపడతారు.
బాప్తిస్మమునకు ముందు మరియు తరువాత అన్ని పాఠాలను బోధించండి. ఇరు సమయాలలో పాఠాలను బోధించడంలో పూర్తి-కాల సువార్తికులు ముందుంటారు. సాధ్యమైనప్పుడు, వార్డు సువార్తికులు లేదా ఇతర సభ్యులు పాల్గొంటారు. బోధనలో సభ్యులను చేర్చుకోవడం గురించిన సమాచారం కొరకు 10 మరియు 13వ అధ్యాయాలు చూడండి.
బోధించుటకు సిద్ధపడుట
మీరు బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడు, నా సువార్తను ప్రకటించండి యాప్‌లో ప్రతీ వ్యక్తి కొరకు సమాచారాన్ని పునర్వీక్షించండి. వ్యక్తి యొక్క అవసరాలపై ఆధారపడి పాఠ్య ప్రణాళికను తయారుచేయండి. మీ బోధనా సందర్శనలో అతడు లేదా ఆమె ఏమి తెలుసుకోవాలో మరియు భావించాలో ఆలోచించండి. సిద్ధపడేందుకు మరియు ప్రణాళిక చేసేందుకు మీరు సమయం కేటాయించినప్పుడు ఆత్మ మీ ప్రయత్నాలను గొప్పగా చేస్తాడు.
మీరు బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడు, మీరు మరియు మీ సహచరుడు ప్రార్థనాపూర్వకంగా పరిగణించవలసిన కొన్ని ప్రశ్నలు ఇక్కడున్నాయి.
-
క్రీస్తులో విశ్వాసాన్ని పెంపొందించుకొని, పురోగమించడానికి ఒక వ్యక్తికి సహాయపడేందుకు మనం ఏ ఆహ్వానాన్ని ఇస్తాము? జనులు పశ్చాత్తాపపడి, “విమోచకుని శక్తిని” (హీలమన్ 5:11) అనుభవించడానికి మీరు సహాయపడే విధానాలే ఆహ్వానాలు. వ్యక్తి యొక్క అభివృద్ధి, పరిస్థితి మరియు అవసరాలను పరిగణించండి. అప్పుడు మీ పాఠ్య ప్రణాళికలో ఒకటి లేదా ఎక్కువ ఆహ్వానాలను చేర్చండి.
-
అతడిని లేదా ఆమెను చేయమని మనం ఆహ్వానించిన నిబద్ధతను కొనసాగించడానికి ఏ సిద్ధాంతం మరియు సూత్రాలు సహాయపడతాయి? జనులు వారి వాగ్దానాలను నిలబెట్టుకోవడం వారికి మరియు ప్రభువుకు ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవడానికి ఏ సిద్ధాంతం మరియు సూత్రాలు సహాయపడతాయో ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించండి.
-
సిద్ధాంతాన్ని నేర్చుకోవడానికి ఒక వ్యక్తికి మనమెలా సహాయపడతాము? సిద్ధాంతాన్ని బోధించడానికి సిద్ధపడేందుకు, 1–4 పాఠాలను ఉపయోగిస్తూ మీరు బోధించేదానిని క్రమపరచి, సంక్షిప్తం చేయండి. మీరు బోధించే దానిని అర్థం చేసుకోవడానికి వ్యక్తికి సహాయపడే ప్రశ్నలు, లేఖనాలు, ఉదాహరణలు మరియు తగిన మాధ్యమాన్ని గుర్తించండి. మీ బోధనను ఎలా మెరుగుపరచుకోవాలనే దాని గురించి సమాచారం కొరకు 10వ అధ్యాయం చూడండి.
-
నిబద్ధతలను అంగీకరించి, పాటించినందుకు దేవుడు ఏ దీవెనలను వాగ్దానం చేసారు? మీరు సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, దేవుడు వాగ్దానమిచ్చిన దీవెనలను గుర్తించండి. మీరు బోధిస్తున్నప్పుడు, దీవెనలను వాగ్దానం చేయండి మరియు వాటి గురించి సాక్ష్యమివ్వండి.
-
ఏ సభ్యులు పాల్గొనవచ్చు? ఆ వ్యక్తికి బోధించడానికి మరియు సహకారమివ్వడానికి ఏ సభ్యులు మీకు సహాయపడగలరో అని వారానికోసారి సమన్వయ సమావేశంలో నిర్ణయించండి. పాఠానికి ముందు, వారి భాగస్వామ్యం గురించి చర్చించండి. 10వ అధ్యాయం చూడండి.
-
మనం వెళ్ళిపోయిన తర్వాత వారి వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి జనులకు సహాయపడేందుకు మనము ఏమి చేయగలము? వారి వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి జనులకు సహాయపడేందుకు క్లుప్తమైన రోజువారీ సంప్రదింపుల ద్వారా వారిని గమనించండి. మీరు బోధించేవారు తమ వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి సహాయపడడంలో సభ్యులను చేర్చే మార్గాల కొరకు చూడండి. ఈ సంప్రదింపులో మోర్మన్ గ్రంథము లేదా ఇతర లేఖనాల నుండి ఒక అధ్యాయాన్ని చదవడం ఉండవచ్చు. ఎవరైనా మునుపటి వాగ్దానాన్ని నిలబెట్టుకోనట్లయితే, మరొక వాగ్దానం చేసే ముందు మునుపటి దానిని నిలబెట్టుకోవడానికి సహాయపడడం మంచిది. 11వ అధ్యాయం చూడండి.
-
మరొకసారి వారికి మనం ఎలా సహాయపడగలము? ప్రతీ బోధనా సందర్భం తర్వాత, మీరు బోధించే వారి అనుభవాన్ని అంచనా వేయండి. క్రీస్తు నందు వారి విశ్వాసం పెరుగుతోందా? వారు ఆత్మను అనుభవిస్తున్నారా? వారు పశ్చాత్తాపపడి, వాగ్దానాలను చేసి, నిలబెట్టుకుంటున్నారా? వారు ప్రార్థిస్తున్నారా, మోర్మన్ గ్రంథాన్ని చదువుతున్నారా మరియు సంఘానికి హాజరవుతున్నారా? వారికి సహాయపడడానికి ప్రణాళికలు వేయండి.
ఆత్మ చేత నడిపించబడినట్లుగా మీ మనస్సులో నుండి బోధించండి.
ఎల్డర్‌లు మరియు సహోదరీలందరితో మాట్లాడుతూ, ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము ఇలా వ్యాఖ్యానించారు:
“సువార్తికులకు మరియు బోధించబడుతున్నవారికి నిర్దేశించడానికి ఆత్మను అనుమతించే విధంగా పునఃస్థాపించబడిన సువార్త యొక్క సందేశాన్ని బోధించడమే మా ఉద్దేశ్యం. [పాఠాల] యొక్క భావనలను నేర్చుకోవడం ఆవశ్యకం, కానీ వీటిని యాంత్రికంగా బోధించకూడదు. ఆత్మచేత ప్రేరేపించబడినట్లుగా తన స్వంత పదాలను ఉపయోగించడానికి సువార్తికుడు స్వేచ్ఛగా భావించాలి. అతడు కంఠస్థం చేసిన దానిని అప్పగించకూడదు, కానీ తన స్వంత మాటలలో మనస్సులో నుండి మాట్లాడాలి. [వ్యక్తి] యొక్క ఆసక్తి మరియు అవసరాలను బట్టి, అతడు ప్రేరేపించబడినట్లుగా చెప్తూ, అతడు పాఠాల క్రమం నుండి వైదొలగవచ్చు. తన స్వంత దృఢ నిశ్చయంతో మరియు తన స్వంత మాటలలో మాట్లాడుతూ, అతను తన బోధనల సత్యానికి సాక్ష్యమివ్వాలి.”
వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా బోధించండి మరియు ఆహ్వానించండి
జనులు బాప్తిస్మము మరియు నిర్ధారణ కోసం పూర్తిగా సిద్ధం కావడానికి సహాయపడేలా ఏ విధంగా అయినా పాఠాలను బోధించే సౌలభ్యం మీకు ఉంది. మీరు ఏ పాఠాన్ని బోధిస్తారు, ఎప్పుడు బోధిస్తారు మరియు దానికి మీరు ఎంత సమయం ఇస్తారు అనేవి మీరు బోధిస్తున్న వ్యక్తి యొక్క అవసరాలు మరియు ఆత్మ యొక్క నడిపింపు ద్వారా ఉత్తమంగా నిర్ణయించబడతాయి. ఉదాహరణకు, క్రైస్తవ నేపథ్యం లేని వ్యక్తులకు బోధిస్తున్నప్పుడు, పరలోక తండ్రితో గొప్ప అనుబంధాన్ని వృద్ధిచేసుకోవడంలో మరియు ఆయన ప్రణాళికను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడడం ద్వారా మీరు ప్రారంభించవచ్చు (see “Teaching People Who Do Not Have a Christian Background” in chapter 10).
ఏ ఆహ్వానాలను అందించాలి మరియు ఎప్పుడు అందించాలి అనే విషయంలో ఆత్మ మీకు మార్గనిర్దేశం చేయనివ్వండి. సరైన సమయంలో సరైన ఆహ్వానం వారి విశ్వాసాన్ని పెంపొందించే పనులను చేయడానికి జనులను ప్రేరేపించగలదు. ఈ చర్యలు హృదయమందు బలమైన మార్పుకు దారితీయవచ్చు (మోషైయ 5:2; ఆల్మా 5:12–14 చూడండి).
సరళంగా, స్పష్టంగా మరియు క్లుప్తంగా ఉండే పాఠాలు బోధించండి. సాధారణంగా, బోధనా సందర్శన 30 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు మరియు మీరు ఒక వ్యక్తికి 5 నిమిషాల వ్యవధిలో బోధించవచ్చు.
ఒక పాఠంలోని సూత్రాలను బోధించడానికి మీకు సాధారణంగా అనేక సమావేశాలు అవసరం. మీరు చిన్న పాఠాలు బోధించడం, తరచుగా బోధించడం మరియు పాఠ్యాంశంలోని చిన్న భాగాలను బోధించడం వంటివి చేస్తే తరచు జనులు మీ సందేశాన్ని బాగా అర్థం చేసుకుంటారు.