మిషను పిలుపులు
అధ్యాయము 3: పాఠము 2— పరలోక తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక


“అధ్యాయము 3: పాఠము 2— పరలోక తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)

“అధ్యాయము 3: పాఠము 2,” నా సువార్తను ప్రకటించండి

అధ్యాయము 3: పాఠము 2

పరలోక తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక

చిత్రం
క్రైస్టస్ విగ్రహము

జనులు ఆశ్చర్యపోవచ్చు

  • జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి?

  • నేను ఎక్కడి నుండి వచ్చాను?

  • నా గురించి శ్రద్ధ చూపే దేవుడు ఉన్నాడా? ఆయన శ్రద్ధ చూపుతారని నేనెలా భావించగలను?

  • చాలా చెడు విషయాలు జరిగినప్పుడు, నేను దేవుడిని ఎలా నమ్మగలను?

  • ఎందుకు జీవితం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది? ఈ సమయాల్లో నేను బలాన్ని ఎలా కనుగొనగలను?

  • నేను మంచి వ్యక్తిగా ఎలా మారగలను?

  • నేను మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది?

యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త ఆత్మ యొక్క ముఖ్యమైన ప్రశ్నలకు జవాబివ్వడానికి మనకు సహాయపడుతుంది. సువార్త ద్వారా, మనం మన దైవిక గుర్తింపు మరియు దేవుని పిల్లలుగా మన నిత్య సామర్థ్యము గురించి నేర్చుకుంటాము. సువార్త మనకు నిరీక్షణనిస్తుంది మరియు శాంతి, సంతోషము, అర్థము కనుగొనడానికి మనకు సహాయపడుతుంది. మనం జీవితపు సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు సువార్తను జీవించడం మనకు ఎదగడానికి మరియు బలాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది.

దేవుడు తన పిల్లల కొరకు ఉత్తమమైన దానిని కోరుకుంటారు మరియు తన అతిగొప్ప దీవెనలను మనకివ్వాలని కోరుకుంటారు, అవి అమర్త్యత్వము మరియు నిత్యజీవము (మోషే 1:39; సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7 చూడండి). ఆయన మనల్ని ప్రేమిస్తారు కాబట్టి, ఈ దీవెనలు పొందడానికి మన కొరకు ఆయన ఒక ప్రణాళికను అందించారు. లేఖనాలలో, ఈ ప్రణాళికను రక్షణ ప్రణాళిక, సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక మరియు విమోచన ప్రణాళిక అంటారు (ఆల్మా 42:5, 8, 11, 13, 15, 16, 31 చూడండి).

దేవుని ప్రణాళికలో, మనలో ప్రతీఒక్కరం పూర్వమర్త్య జీవితము, జననము, మర్త్య జీవితము, మరణము మరియు మరణం తర్వాత జీవితము గుండా ఒక ప్రయాణం చేస్తాము. ఈ ప్రయాణంలో దేవుడు మనకు అవసరమైన వాటిని అందించాడు, తద్వారా మనం మరణించిన తర్వాత, చివరికి ఆయన సన్నిధికి తిరిగివెళ్ళి, సంపూర్ణమైన ఆనందాన్ని పొందగలము.

యేసు క్రీస్తు దేవుని యొక్క ప్రణాళికకు కేంద్రము. ఆయన ప్రాయశ్చిత్తము మరియు పునరుత్థానము ద్వారా యేసు అమర్త్యత్వమును, నిత్యజీవమును పొందడాన్ని మనలో ప్రతీఒక్కరి కొరకు సాధ్యపరిచారు.

భూమిపై మన జీవితకాలములో, మనం మన పూర్వమర్త్య జీవితాన్ని గుర్తుంచుకోము. లేదా మరణము తర్వాత జీవితాన్ని మనం పూర్తిగా గ్రహించము. అయినప్పటికీ, మన నిత్య ప్రయాణం యొక్క ఈ భాగాల గురించి అనేక సత్యాలను దేవుడు బయల్పరిచారు. జీవితము యొక్క ఉద్దేశాన్ని గ్రహించడానికి, ఆనందాన్ని అనుభవించడానికి మరియు మంచి విషయాలు జరుగుతాయనే నిరీక్షణ కలిగియుండడానికి తగినంత జ్ఞానాన్ని మన కొరకు ఈ సత్యాలు అందిస్తాయి. మనం భూమిపై ఉన్నప్పుడు మనల్ని నడిపించడానికి ఈ జ్ఞానము ఒక పవిత్రమైన నిధి వంటిది.

బోధించుటకు సూచనలు

బోధించడానికి సిద్ధపడేందుకు ఈ విభాగం మీకు నమూనా రూపురేఖలను అందిస్తుంది. ఇందులో మీరు ఉపయోగించగల ప్రశ్నలు మరియు ఆహ్వానాల ఉదాహరణలు కూడా ఉన్నాయి.

మీరు బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడు, ప్రతి వ్యక్తి యొక్క పరిస్థితిని మరియు ఆధ్యాత్మిక అవసరాలను ప్రార్థనాపూర్వకంగా పరిగణించండి. ఏది బోధించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందో నిర్ణయించండి. జనులు అర్థం చేసుకోలేని పదాలను నిర్వచించడానికి సిద్ధపడండి. పాఠాలను క్లుప్తంగా ఉంచాలని గుర్తుంచుకొని, మీకు ఎంత సమయం ఉంటుందో దాని ప్రకారం ప్రణాళిక చేయండి.

మీరు బోధించేటప్పుడు ఉపయోగించడానికి లేఖనాలను ఎంపిక చేయండి. పాఠంలోని “సిద్ధాంతపు పునాది” విభాగంలో చాలా సహాయకరమైన లేఖనాలు ఉన్నాయి.

మీరు బోధించేటప్పుడు ఏ ప్రశ్నలు అడగాలో పరిగణించండి. ప్రతి వ్యక్తిని చర్య తీసుకునేలా ప్రోత్సహించే విధంగా ఆహ్వానాలివ్వడానికి ప్రణాళిక చేయండి.

దేవుడు వాగ్దానం చేసిన దీవెనలను నొక్కి చెప్పండి మరియు మీరు బోధించే దాని గురించి మీ సాక్ష్యాన్ని పంచుకోండి.

చిత్రం
ఒక కుటుంబానికి బోధిస్తున్న సువార్తికులు

15–25 నిమిషాలలో మీరు జనులకు ఏమి బోధించవచ్చు

రక్షణ ప్రణాళిక గురించి బోధించడానికి క్రింది సూత్రాలలో ఒకటి లేదా ఎక్కువ ఎంపిక చేయండి. ప్రతి సూత్రానికి సిద్ధాంతపు పునాది ఈ నమూనా తర్వాత అందించబడుతుంది.

పూర్వమర్త్య జీవితము: మన కొరకు దేవుని ఉద్దేశ్యము మరియు ప్రణాళిక

  • మనమందరము దేవుని యొక్క ఆత్మ పిల్లలమైయున్నాము. తన స్వరూపమందు ఆయన మనల్ని సృష్టించారు.

  • మనం ఈ భూమి మీద జన్మించకముందు మనం దేవునితో నివసించాము. మనము ఆయన కుటుంబ సభ్యులము. ఆయన మనలో ప్రతీఒక్కరినీ ఎరుగుదురు మరియు ప్రేమిస్తున్నారు.

  • ఈ జీవితంలో మరియు నిత్యత్వంలో మన సంతోషము మరియు పురోగతి కోసం దేవుడు ఒక ప్రణాళికను అందించారు.

  • మన పూర్వమర్త్య జీవితంలో, దేవుని ప్రణాళికను అనుసరించాలని మనం ఎంచుకున్నాము. దీనర్థం భూమి మీదకు రావడం, తద్వారా మన నిత్య పురోగతిలో తరువాతి దశను తీసుకోగలము.

  • యేసు క్రీస్తు దేవుని యొక్క ప్రణాళికకు కేంద్రము. అమర్త్యత్వమును, నిత్యజీవమును కలిగియుండడానికి మన కొరకు ఆయన దానిని సాధ్యపరిచారు.

సృష్టి

  • దేవుని మార్గదర్శకత్వంలో యేసు క్రీస్తు భూమిని సృష్టించారు.

ఆదాము, హవ్వల పతనము

  • భూమి మీదకు వచ్చిన దేవుని యొక్క ఆత్మ పిల్లలలో ఆదాము, హవ్వలు మొదటివారు. దేవుడు వారి శరీరాలను సృష్టించి, వారిని ఏదెను తోటలో ఉంచారు.

  • ఆదాము, హవ్వలు అతిక్రమము చేసారు, ఏదెను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు మరియు దేవుని సన్నిధి నుండి వేరుచేయబడ్డారు. ఈ సంఘటనను పతనము అంటారు.

  • పతనము తర్వాత, ఆదాము హవ్వలు మర్త్యులయ్యారు. మర్త్యులుగా, వారు నేర్చుకోగలిగారు, పురోగమించగలిగారు మరియు పిల్లలను కనగలిగారు. వారు బాధ, పాపము మరియు మరణమును కూడా అనుభవించారు.

  • పతనము మానవాళి కొరకు ముందడుగు. పతనం మనం భూమిపై జన్మించడాన్ని మరియు పరలోక తండ్రి ప్రణాళికలో పురోగతి సాధించడాన్ని సాధ్యం చేసింది.

భూమిపై మన జీవితము

  • దేవుని ప్రణాళికలో, భౌతిక శరీరాలను పొందడానికి, నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి మనం భూమిపైకి రావాలి.

  • భూమిపై, మనం విశ్వాసంతో నడవడం నేర్చుకుంటాము. అయినప్పటికీ, పరలోక తండ్రి మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన సన్నిధికి తిరిగి వెళ్ళడానికి ఆయన మనకు అనేక బహుమానాలు మరియు మార్గదర్శకాలను అందించారు.

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము

  • మనలో ప్రతి ఒక్కరూ పాపం చేస్తారు మరియు మనలో ప్రతి ఒక్కరూ మరణిస్తారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, పాపం మరియు మరణం నుండి మనల్ని విమోచించడానికి ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తును భూమిపైకి పంపారు.

  • యేసు యొక్క ప్రాయశ్చిత్త త్యాగం కారణంగా, మన పాపాల కొరకు మనం క్షమించబడవచ్చు మరియు శుద్ధి చేయబడవచ్చు. మనం పశ్చాత్తాపపడినప్పుడు మన హృదయాలు మంచిగా మార్చబడతాయి. దీనివల్ల మనం దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళి, సంపూర్ణ ఆనందాన్ని పొందడం సాధ్యమవుతుంది.

  • యేసు పునరుత్థానం కారణంగా, మనం మరణించిన తర్వాత పునరుత్థానం చెందుతాము. దీని అర్థం ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ మరియు శరీరం తిరిగి ఏకమవుతాయి మరియు మనలో ప్రతీ ఒక్కరం పరిపూర్ణమైన, పునరుత్థానం చేయబడిన శరీరంలో శాశ్వతంగా జీవిస్తాము.

  • యేసు క్రీస్తు ఓదార్పు, నిరీక్షణ మరియు స్వస్థతను అందజేస్తారు. ఆయన ప్రాయశ్చిత్త త్యాగం ఆయన ప్రేమ యొక్క అంతిమ వ్యక్తీకరణ. జీవితంలో అన్యాయమైనవిగా ఉన్నవన్నీ యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా సరిచేయబడతాయి.

ఆత్మ లోకము

  • మన భౌతిక శరీరం మరణించినప్పుడు, ఆత్మ లోకంలో మన ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. ఇది పునరుత్థానానికి ముందు అభ్యాసం మరియు సిద్ధపాటు యొక్క తాత్కాలిక స్థితి.

  • యేసు క్రీస్తు యొక్క సువార్త ఆత్మ లోకంలో బోధించబడింది మరియు మనం ఎదగడాన్ని, పురోగమించడాన్ని కొనసాగించగలము.

పునరుత్థానం, రక్షణ మరియు ఉన్నతస్థితి

  • ఆత్మ లోకంలో మన సమయం తర్వాత, మన నిత్య ప్రయాణంలో పునరుత్థానం తదుపరి దశ.

  • పునరుత్థానం అంటే మన ఆత్మ మరియు శరీరం తిరిగి ఏకమవడం. మనలో ప్రతి ఒక్కరూ పునరుత్థానం చెందుతారు మరియు పరిపూర్ణమైన భౌతిక శరీరాన్ని కలిగి ఉంటారు. మనం ఎప్పటికీ జీవిస్తాం. ఇది రక్షకుని ప్రాయశ్చిత్తం మరియు పునరుత్థానం ద్వారా సాధ్యమైంది.

తీర్పు మరియు మహిమ రాజ్యములు

  • మనం పునరుత్థానం చెందినప్పుడు, యేసు క్రీస్తు మన న్యాయాధిపతిగా ఉంటారు. చాలా తక్కువ మినహాయింపులతో, దేవుని పిల్లలందరూ మహిమ రాజ్యంలో స్థానం పొందుతారు.

  • మనమందరం పునరుత్థానం చెందినప్పటికీ, మనమందరం ఒకే నిత్య మహిమను పొందలేము. మర్త్యత్వంలో మరియు ఆత్మ లోకంలో మన విశ్వాసం, క్రియలు మరియు పశ్చాత్తాపాన్ని బట్టి యేసు మనల్ని తీర్పు తీరుస్తారు. మనం విశ్వాసంగా ఉంటే దేవుని సన్నిధిలో జీవించడానికి తిరిగి వెళ్ళగలము.

మీరు జనులను అడిగే ప్రశ్నలు

క్రింది ప్రశ్నలు మీరు జనులను అడిగే ప్రశ్నలకు ఉదాహరణలు. ఈ ప్రశ్నలు మీకు అర్థవంతమైన సంభాషణలు కలిగియుండడానికి మరియు వ్యక్తి యొక్క అవసరాలను, దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడగలవు.

  • జీవితం యొక్క ఉద్దేశం ఏమిటని మీరు భావిస్తున్నారు?

  • మీకు సంతోషాన్ని తెచ్చేది ఏది?

  • దేవుడు మీకు ఏ సవాళ్ళలో సహాయం చేయాలి?

  • మీరు ఎదుర్కొన్న సవాళ్ళ నుండి మీరేమి నేర్చుకున్నారు?

  • యేసు క్రీస్తు గురించి మీకేమి తెలుసు? ఆయన జీవితం మరియు నియమితకార్యము మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయి?

మీరు ఇచ్చే ఆహ్వానాలు

  • మేము బోధించినది నిజమని మీకు తెలియజేసేందుకు మీరు ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతారా? (1వ పాఠము యొక్క చివరి భాగంలో “బోధనా పరిజ్ఞానములు: ప్రార్థన” చూడండి.)

  • మేము బోధించిన దాని గురించి మరింత తెలుసుకోవడానికి మీరు ఈ ఆదివారం సంఘానికి హాజరవుతారా?

  • మీరు మోర్మన్ గ్రంథాన్ని చదివి, అది దేవుని వాక్యమని తెలుసుకోవడానికి ప్రార్థిస్తారా? (మీరు నిర్దిష్టమైన అధ్యాయాలను లేదా వచనాలను సూచించవచ్చు.)

  • మీరు యేసు మాదిరిని అనుసరించి, బాప్తిస్మం తీసుకుంటారా? (“బాప్తిస్మము పొంది, నిర్ధారించబడడానికి ఆహ్వానము,” చూడండి, ఇది 1వ పాఠానికి ముందు ఉంటుంది.)

  • మేము మా తదుపరి సందర్శన కోసం సమయాన్ని నిర్ణయించవచ్చా?

చిత్రం
రక్షణ ప్రణాళిక యొక్క పటరూపము

సిద్ధాంతపు పునాది

సువార్త గురించి మీ జ్ఞానాన్ని మరియు సాక్ష్యాన్ని బలోపేతం చేయడానికి మరియు బోధించడంలో మీకు సహాయం చేయడానికి ఈ విభాగం మీరు అధ్యయనం చేయడానికి సిద్ధాంతం మరియు లేఖనాలను అందిస్తుంది.

చిత్రం
నక్షత్రమండలాలు

పూర్వమర్త్య జీవితము: మన కొరకు దేవుని ఉద్దేశ్యము మరియు ప్రణాళిక

మనము దేవుని పిల్లలము మరియు మన పుట్టుకకు ముందు మనం ఆయనతో నివసించాము

దేవుడు మన ఆత్మలకు తండ్రి. మనం అక్షరాలా ఆయన పిల్లలు, ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాం. దేవుని బిడ్డగా మనలో ప్రతీ ఒక్కరం దైవిక స్వభావాన్ని కలిగియున్నాం. ఈ జ్ఞానం కష్ట సమయాల్లో మనకు సహాయం చేయగలదు మరియు మనం అత్యుత్తమంగా మారడానికి మనల్ని ప్రేరేపించగలదు.

మనం భూమిపై పుట్టక ముందు దేవునితో ఆయన ఆత్మ పిల్లలుగా జీవించాము. మనము ఆయన కుటుంబ సభ్యులము.

చిత్రం
అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్

“మనమందరం ఇప్పుడు మరియు ఎప్పటికీ పంచుకునే ఒక ముఖ్యమైన గుర్తింపు ఉంది, మనం ఎప్పటికీ దృష్టిని కోల్పోకూడనిది మరియు మనం కృతజ్ఞతతో ఉండవలసినది. అంటే మీరు నిత్యత్వంలో ఆధ్యాత్మిక మూలాలను కలిగియుండి ఎల్లప్పుడూ దేవుని కుమారుడు లేదా కుమార్తెగా ఉన్నారు.

“… ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం—నిజంగా అర్థం చేసుకోవడం మరియు హత్తుకోవడం—జీవితాన్ని మార్చివేస్తుంది. ఇది మీ నుండి ఎవ్వరూ తీసివేయలేని అసాధారణ గుర్తింపును మీకు అందిస్తుంది. కానీ దాని కంటే ఎక్కువగా, ఇది మీకు అపారమైన విలువను మరియు మీ అనంతమైన విలువ యొక్క భావాన్ని ఇస్తుంది. చివరగా, ఇది మీకు జీవితంలో దైవికమైన, గొప్ప మరియు విలువైన ఉద్దేశ్యాన్ని అందిస్తుంది” (M. Russell Ballard, “Children of Heavenly Father” [Brigham Young University devotional, Mar. 3, 2020], 2, speeches.byu.edu).

భూమిపైకి రావడానికి మనం ఎంచుకున్నాము

మన పరలోక తండ్రి మనల్ని ప్రేమిస్తున్నారు మరియు మనం ఆయన వలె మారాలని కోరుతున్నారు. మహిమకరమైన భౌతిక శరీరముతో ఉన్నతమైన వ్యక్తి ఆయన.

మన పూర్వమర్త్య జీవితంలో, దేవుడు ఆయన వలె మారడానికి మన కోసం ఒక ప్రణాళికను కలిగియున్నారని మనం నేర్చుకున్నాము. ఆయన ప్రణాళికలో ఒక భాగమేదనగా మనం భౌతిక శరీరాలను పొందడానికి మన పరలోక గృహాన్ని వదిలి, భూమిపైకి వస్తాము. దేవుని సన్నిధి నుండి దూరంగా ఉన్న సమయంలో మనం అనుభవాన్ని పొందాలి మరియు విశ్వాసాన్ని కూడా వృద్ధిచేయాలి. దేవునితో నివసించినట్లు మనకు జ్ఞాపకముండదు. అయినప్పటికీ, ఆయన మనకు అవసరమైన వాటిని అందజేస్తారు, తద్వారా మనం ఆయనతో జీవించడానికి తిరిగి వెళ్ళగలము.

కర్తృత్వము లేదా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మరియు సామర్థ్యం అనేది ​​మన కోసం దేవుని ప్రణాళికలో ముఖ్యమైన భాగం. మన పూర్వమర్త్య జీవితంలో, మనలో ప్రతీ ఒక్కరం దేవుని ప్రణాళికను అనుసరించి భూమిపైకి రావాలని ఎంచుకున్నాము, తద్వారా మన నిత్య పురోగతిలో మనం తదుపరి దశను తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఉన్నప్పుడు, ఎదగడానికి మరియు ఆనందాన్ని అనుభవించడానికి మనకు చాలా క్రొత్త అవకాశాలు లభిస్తాయని మనం అర్థం చేసుకున్నాము. వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా మనం అర్థం చేసుకున్నాము. మనం శోధన, శ్రమలు, దుఃఖం మరియు మరణాన్ని అనుభవిస్తాము.

భూమిపైకి రావాలని ఎంచుకోవడంలో, మనం దేవుని ప్రేమ మరియు సహాయమందు విశ్వసించాము. మన రక్షణ కొరకు మనం ఆయన ప్రణాళికలో నమ్మకముంచాము.

మనల్ని విమోచించడానికి పరలోక తండ్రి యేసు క్రీస్తును ఎంచుకున్నారు.

యేసు క్రీస్తు దేవుని యొక్క ప్రణాళికకు కేంద్రము. భూమిపైకి రాకముందే, మనం స్వయంగా దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళలేమని మనకు తెలుసు. పరలోక తండ్రి తన ప్రథమ కుమారుడైన యేసు క్రీస్తును ఎన్నుకున్నారు, మనం ఆయన వద్దకు తిరిగి వెళ్ళడానికి మరియు నిత్యజీవాన్ని పొందేందుకు వీలు కల్పించారు.

యేసు ఇష్టపూర్వకంగా అంగీకరించారు. ఆయన భూమిపైకి వచ్చి తన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా మనల్ని విమోచించడానికి అంగీకరించారు. ఆయన ప్రాయశ్చిత్తం మరియు పునరుత్థానం మన కోసం దేవుని ఉద్దేశాలను నెరవేర్చేలా చేస్తుంది.

లేఖన అధ్యయనము

దేవుని పిల్లలు

దేవుని ఉద్దేశము

పూర్వమర్త్య జీవితము

ఈ సూత్రం గురించి మరింత తెలుసుకోండి

  • Guide to the Scriptures: “Premortal Life,” “Plan of Redemption

  • ప్రధాన చేతిపుస్తకము, 1.1: “దేవుని యొక్క సంతోష ప్రణాళిక

  • Gospel Topics: “Premortality [పూర్వమర్త్యత్వము],” “Plan of Salvation [రక్షణ ప్రణాళిక]

చిత్రం
సముద్రంపై సూర్యాస్తమయం

సృష్టి

పరలోక తండ్రి యొక్క ప్రణాళిక భూమి యొక్క సృష్టి కొరకు అందించబడింది, అక్కడ ఆయన ఆత్మ పిల్లలు భౌతిక శరీరాలను పొంది అనుభవాన్ని పొందుతారు. మనం అభివృద్ధి చెందడానికి మరియు దేవునిలా మారడానికి భూమిపై మన జీవితం అవసరం.

పరలోక తండ్రి మార్గదర్శకత్వంలో, యేసు క్రీస్తు భూమిని మరియు సమస్త జీవరాశులను సృష్టించారు. తర్వాత పరలోక తండ్రి తన స్వరూపంలో స్త్రీ పురుషులను సృష్టించారు. సృష్టి అనేది దేవుని ప్రేమ యొక్క వ్యక్తీకరణ మరియు మనం ఎదగడానికి అవకాశం కలిగి ఉండాలనే ఆయన కోరిక.

లేఖన అధ్యయనము

ఈ సూత్రం గురించి మరింత తెలుసుకోండి

  • Guide to the Scriptures: “Create, Creation

  • Gospel Topics: “Creation [సృష్టి]

చిత్రం
Leaving the Garden of Eden [ఏదెను తోటను విడిచిపెట్టుట], జోసెఫ్ బ్రిక్కీ చేత

ఆదాము, హవ్వల పతనము

పతనమునకు ముందు

ఆదాము, హవ్వలు భూమి మీదకు వచ్చిన పరలోక తండ్రి యొక్క ఆత్మ పిల్లలలో మొదటివారు. దేవుడు వారి భౌతిక శరీరాలను తన స్వరూపంలో సృష్టించారు మరియు వారిని ఏదెను తోటలో ఉంచారు. తోటలో వారు అమాయకులు మరియు దేవుడు వారి అవసరాలను తీర్చారు.

ఆదాము హవ్వలు తోటలో ఉన్నప్పుడు, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినవద్దని దేవుడు వారిని ఆజ్ఞాపించారు. వారు ఈ ఆజ్ఞను పాటిస్తే, వారు తోటలోనే ఉండగలరు. అయినప్పటికీ, వారు మర్త్యత్వము యొక్క వ్యతిరేకత మరియు సవాళ్ళ నుండి నేర్చుకుని పురోగతి సాధించలేరు. వారు దుఃఖాన్ని మరియు బాధను అనుభవించలేరు కాబట్టి, వారు ఆనందాన్ని తెలుసుకోలేరు.

నిషేధించబడిన ఫలమును తినమని సాతాను ఆదాము, హవ్వలను శోధించాడు మరియు వారు అలా చేయడానికి ఎంచుకున్నారు. ఈ ఎంపిక కారణంగా, వారు తోట నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు మరియు దేవుని సన్నిధి నుండి వేరు చేయబడ్డారు. ఈ సంఘటనను పతనము అంటారు.

పతనము తర్వాత

పతనము తర్వాత, ఆదాము హవ్వలు మర్త్యులయ్యారు. ఇక వారు అమాయకపు స్థితిలో లేరు, వారు మంచి మరియు చెడు రెండింటినీ అర్థం చేసుకున్నారు మరియు అనుభవించారు. వాటి మధ్య ఎంచుకోవడానికి వారు తమ కర్తృత్వాన్ని ఉపయోగించగలరు. ఆదాము, హవ్వలు వ్యతిరేకతను, సవాళ్ళను ఎదుర్కొన్నందున, వారు నేర్చుకొని అభివృద్ధి చెందగలిగారు. వారు దుఃఖాన్ని అనుభవించినందున, వారు ఆనందాన్ని కూడా అనుభవించగలరు. (2 నీఫై 2:22–25 చూడండి.)

తమకు కష్టాలు ఉన్నప్పటికీ, ఆదాము హవ్వలు మర్త్యులుగా ఉండడాన్ని గొప్ప ఆశీర్వాదంగా భావించారు. ఒక దీవెన ఏమిటంటే వారు పిల్లలను కలిగియుండగలరు. ఇది దేవుని యొక్క ఇతర ఆత్మ పిల్లలు భూమిపైకి వచ్చి భౌతిక శరీరాలను పొందడానికి మార్గాన్ని అందించింది.

పతనం యొక్క దీవెనల గురించి ఆదాము, హవ్వలిద్దరూ సంతోషించారు. హవ్వ ఇట్లనెను, “మనము అపరాధము చేయనియెడల మనమెన్నటికీ [సంతానము] కలిగియుండకపోవుదుము మరియు మంచి చెడులను, మన విమోచనానందమును, విధేయులందరికి దేవుడు అనుగ్రహించు నిత్యజీవమును యెరుగకపోదుము” (మోషే 5:11; 10వ వచనము కూడా చూడండి).

లేఖన అధ్యయనము

తోటలో

పతనము

ఈ సూత్రం గురించి మరింత తెలుసుకోండి

  • Guide to the Scriptures: “Fall of Adam and Eve,” “Agency

  • Gospel Topics: “Fall of Adam and Eve [ఆదాము హవ్వల పతనము],” “Agency and Accountability [కర్తృత్వము మరియు జవాబుదారిత్వము]

భూమిపై మన జీవితము

“నేను భూమిపై ఎందుకు ఉన్నాను?” అని చాలామంది ఆశ్చర్యపోతారు. భూమిపై మన జీవితం మన నిత్య పురోగతి కోసం దేవుని ప్రణాళికలో ముఖ్యమైన భాగం. దేవుని సన్నిధికి తిరిగివెళ్ళి, సంపూర్ణ ఆనందాన్ని పొందేందుకు సిద్ధపడడమే మన అంతిమ ఉద్దేశం. దీని కోసం భూలోక జీవితం మనల్ని సిద్ధం చేసే కొన్ని మార్గాలు క్రింద వివరించబడ్డాయి.

చిత్రం
నవ్వుతున్న బాలుడు

భౌతిక శరీరాన్ని పొందడం

భూమిపైకి రావడానికి ఒక ఉద్దేశ్యం ఏమిటంటే, మన ఆత్మ నివసించగలిగే భౌతిక శరీరాన్ని పొందడం. మన శరీరాలు పవిత్రమైనవి, దేవుని యొక్క అద్భుత సృష్టి. భౌతిక శరీరాలతో, మన ఆత్మలు చేయలేని అనేక విషయాలను మనం చేయగలము, నేర్చుకోగలము మరియు అనుభవించగలము. మనం ఆత్మలుగా చేయలేని మార్గాల్లో పురోగమించవచ్చు.

మన శరీరాలు మర్త్యమైనవి కాబట్టి, మనం నొప్పి, వ్యాధి మరియు ఇతర శ్రమలను అనుభవిస్తాము. ఈ అనుభవాలు మనకు సహనం, కరుణ మరియు ఇతర దైవిక లక్షణాలను నేర్చుకోవడంలో సహాయపడతాయి. అవి ఆనందానికి మన మార్గంలో భాగం కాగలవు. చేయడానికి కష్టంగా ఉన్నప్పుడు సరైనదాన్ని ఎంచుకోవడం మూలంగా తరచు విశ్వాసం, నిరీక్షణ మరియు దాతృత్వం అనేవి మన స్వభావంలో భాగమవుతాయి.

కర్తృత్వాన్ని తెలివిగా ఉపయోగించడం నేర్చుకోండి

మర్త్యత్వం యొక్క మరొక ఉద్దేశ్యం ఏమిటంటే, మన కర్తృత్వాన్ని తెలివిగా ఉపయోగించడాన్ని నేర్చుకోవడం—సరైనదాన్ని ఎంచుకోవడం. దేవునిలా మారడానికి మన కర్తృత్వాన్ని తెలివిగా ఉపయోగించడాన్ని నేర్చుకోవడం చాలా అవసరం.

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మనకు ఏది సరైనదో బోధిస్తారు మరియు ఆనందానికి దారితీసే ఆజ్ఞలను ఇస్తారు. సాతాను మనల్ని తప్పు చేయమని ప్రలోభపెడతాడు, మనం కూడా అతనిలాగే దయనీయంగా ఉండాలని కోరుకుంటాడు. మనం మంచి మరియు చెడుల మధ్య వ్యతిరేకతను ఎదుర్కొంటాము, ఇది మన కర్తృత్వాన్ని ఉపయోగించడాన్ని నేర్చుకోవడంలో అవసరమైనది (2 నీఫై 2:11 చూడండి).

మనం దేవునికి విధేయత చూపినప్పుడు, మనం ఎదుగుతాము మరియు ఆయన వాగ్దానం చేసిన దీవెనలను పొందుతాము. మనము అవిధేయత చూపినప్పుడు, మనము ఆయనకు దూరమై పాపము యొక్క పరిణామాలను పొందుతాము. కొన్నిసార్లు అది వేరేలా కనిపించినప్పటికీ, పాపం చివరికి దుఃఖానికి దారి తీస్తుంది. తరచుగా విధేయత యొక్క దీవెనలు—మరియు పాపం యొక్క ప్రభావాలు—వెంటనే స్పష్టంగా కనిపించవు లేదా బాహ్యంగా కనిపించవు. కానీ అవి ఖచ్చితంగా ఉన్నాయి, ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు.

మనం మన వంతు కృషి చేసినప్పటికీ, మనమందరము పాపము చేసి, “దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నాము” (రోమా 3:23). ఇది తెలిసి, పరలోక తండ్రి మనకు పశ్చాత్తాపపడేందుకు ఒక మార్గాన్ని అందించారు, తద్వారా మనం ఆయన వద్దకు తిరిగి వెళ్ళగలము.

పశ్చాత్తాపం మన విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క శక్తిని మన జీవితాల్లోకి తీసుకువస్తుంది (హీలమన్ 5:11 చూడండి). మనము పశ్చాత్తాపపడినప్పుడు, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగం మరియు పరిశుద్ధాత్మ యొక్క బహుమానం ద్వారా మనం పాపం నుండి శుద్ధి చేయబడతాము (3 నీఫై 27:16–20 చూడండి). పశ్చాత్తాపము ద్వారా మనం ఆనందాన్ని అనుభవిస్తాము. మన పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళే మార్గం మనకు తెరువబడింది, ఎందుకంటే ఆయన దయామయుడు. (3వ పాఠములో “పశ్చాత్తాపము” చూడండి.)

విశ్వాసం చేత నడవడం నేర్చుకోండి

ఈ జీవితం యొక్క మరొక ఉద్దేశ్యం ఏమిటంటే, పరలోక తండ్రి నుండి వేరుచేయబడడం ద్వారా మాత్రమే వచ్చే అనుభవాన్ని పొందడం. మనం ఆయనను చూడనందున, మనం విశ్వాసం చేత నడవడం నేర్చుకోవాలి (2 కొరింథీయులకు 5:6–7 చూడండి).

ఈ ప్రయాణంలో దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. మనల్ని నడిపించడానికి, బలపరచడానికి మరియు పవిత్రపరచడానికి ఆయన పరిశుద్ధాత్మను అందించారు. ఆయన లేఖనాలు, ప్రవక్తలు, ప్రార్థన మరియు యేసు క్రీస్తు సువార్తను కూడా అందించారు.

మన మర్త్య అనుభవంలోని ప్రతి భాగం—సంతోషాలు మరియు దుఃఖాలు, విజయాలు మరియు ఎదురుదెబ్బలు—మనం దేవుని వద్దకు తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతున్నప్పుడు ఎదగడానికి మనకు సహాయపడతాయి.

లేఖన అధ్యయనము

ఎదగడానికి మరియు పురోగమించడానికి సమయం

ఎంపిక

మంచి మరియు చెడు

పాపము

దేవునితో ఉండడానికి మనం తప్పక శుభ్రంగా ఉండాలి

ఈ సూత్రం గురించి మరింత తెలుసుకోండి

  • Guide to the Scriptures: “Mortal, Mortality,” “Adversity

  • Gospel Topics: “Mortality [మర్త్యత్వము],” “Adversity [ప్రతికూలత]

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము

ఆదాము హవ్వల పతనం కారణంగా, మనమందరం పాపం మరియు మరణానికి లోబడియున్నాము. పాపం మరియు మరణం యొక్క ప్రభావాలను మనకైమనం అధిగమించలేము. మన పరలోక తండ్రి యొక్క రక్షణ ప్రణాళికలో, పతనం యొక్క ప్రభావాలను అధిగమించడానికి ఆయన ఒక మార్గాన్ని అందించారు, తద్వారా మనం ఆయన వద్దకు తిరిగి వెళ్ళగలము. లోకము సృష్టించబడక ముందు, ఆయన యేసు క్రీస్తును మన రక్షకునిగా మరియు విమోచకునిగా ఎన్నుకున్నారు.

యేసు క్రీస్తు మాత్రమే పాపం మరియు మరణం నుండి మనల్ని విమోచించగలరు. ఆయన నిజంగా దేవుని కుమారుడు. ఆయన తన తండ్రి పట్ల పూర్తి విధేయతతో పాపరహిత జీవితాన్ని జీవించారు. ఆయన పరలోక తండ్రి చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరియు సమ్మతితో ఉన్నారు.

రక్షకుని ప్రాయశ్చిత్తంలో గెత్సేమనేలో ఆయన బాధ, సిలువపై ఆయన శ్రమ మరియు మరణం మరియు ఆయన పునరుత్థానం ఉన్నాయి. గ్రహింపశక్యము కానంతగా ఆయన బాధపడ్డారు—ఎంతగానంటే ఆయన ప్రతి స్వేద రంధ్రము నుండి రక్తం కారింది (సిద్ధాంతము మరియు నిబంధనలు 19:18 చూడండి).

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం మానవ చరిత్రలో అత్యంత మహిమాన్వితమైన సంఘటన. తన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా, యేసు తండ్రి యొక్క ప్రణాళిక కార్యరూపం దాల్చేలా చేసారు. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం లేకుండా మనం నిస్సహాయులం, ఎందుకంటే పాపం మరియు మరణం నుండి మనల్ని మనం రక్షించుకోలేము (ఆల్మా 22:12–15 చూడండి).

మన రక్షకుని త్యాగము ఆయన తండ్రి పట్ల మరియు మన పట్ల గల ప్రేమ యొక్క అత్యున్నత వ్యక్తీకరణ. క్రీస్తు ప్రేమ యొక్క “వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు” మన గ్రహింపునకు మించినవి (ఎఫెసీయులకు 3:18; 19వ వచనము కూడా చూడండి).

చిత్రం
The Crucifixion [సిలువ శ్రమ], హ్యారీ ఆండర్సన్ చేత

అందరి కొరకు యేసు క్రీస్తు మరణాన్ని జయించారు

యేసు క్రీస్తు సిలువపై మరణించినప్పుడు, ఆయన ఆత్మ ఆయన శరీరం నుండి వేరు చేయబడింది. మూడవ రోజు, ఆయన ఆత్మ మరియు ఆయన శరీరం మరెన్నడూ వేరుచేయబడకుండునట్లు తిరిగి ఏకమయ్యాయి. ఆయన చాలామందికి అగుపించారు, ఆయన మాంసం మరియు ఎముకలతో కూడిన అమర్త్య శరీరాన్ని కలిగియున్నారని వారికి చూపించారు. ఆత్మ మరియు శరీరం యొక్క ఈ కలయికను పునరుత్థానం అంటారు.

మానవులుగా, మనలో ప్రతి ఒక్కరూ మరణిస్తారు. అయితే, యేసు మరణంపై విజయం సాధించినందున, భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి పునరుత్థానం చెందుతాడు. పునరుత్థానం అనేది అందరికీ దైవిక బహుమానము, ఇది రక్షకుని దయ మరియు విమోచన కృప ద్వారా ఇవ్వబడింది. ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ మరియు శరీరం తిరిగి ఏకమవుతుంది మరియు మనలో ప్రతీ ఒక్కరం పరిపూర్ణమైన, పునరుత్థానం చెందిన శరీరంలో శాశ్వతంగా జీవిస్తాము. యేసు క్రీస్తు లేకపోతే, మరణం పరలోక తండ్రితో భవిష్యత్తు ఉనికికి సంబంధించిన అన్ని ఆశలను అంతం చేస్తుంది (2 నీఫై 9:8–12 చూడండి).

మన పాపములనుండి శుద్ధి చేయబడుటను యేసు మన కొరకు సాధ్యం చేసారు

క్రీస్తు ద్వారా మనం పొందగల నిరీక్షణను అర్థం చేసుకోవడానికి, మనం న్యాయం యొక్క చట్టాన్ని అర్థం చేసుకోవాలి. ఇది మన చర్యలకు పర్యవసానాలను తెచ్చే మార్పులేని చట్టం. దేవునికి విధేయత సానుకూల పరిణామాలను తెస్తుంది మరియు అవిధేయత ప్రతికూల పరిణామాలను తెస్తుంది. (ఆల్మా 42:14–18 చూడండి.) మనం పాపం చేసినప్పుడు, మనం ఆత్మీయంగా అపరిశుద్ధులమవుతాము మరియు అపరిశుద్ధమైనదేదియు దేవుని సన్నిధిలో నివసింపజాలదు (3 నీఫై 27:19 చూడండి).

చిత్రం
Jesus Praying in Gethsemane [గెత్సేమనేలో ప్రార్థిస్తున్న యేసు], హ్యారీ ఆండర్సన్ చేత

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగ సమయంలో, ఆయన మన స్థానంలో నిలిచారు, శ్రమపడ్డారు మరియు మన పాపాలకు పరిహారం చెల్లించారు (3 నీఫై 27:16–20 చూడండి). దేవుని ప్రణాళిక యేసు క్రీస్తుకు మన తరఫున మధ్యవర్తిత్వం వహించడానికి—మనకు మరియు న్యాయానికి మధ్య నిలబడడానికి శక్తిని ఇస్తుంది (మోషైయ 15:9 చూడండి). యేసు యొక్క ప్రాయశ్చిత్త త్యాగం కారణంగా, మనం పశ్చాత్తాపం నిమిత్తము విశ్వాసాన్ని సాధన చేసినప్పుడు ఆయన మన తరఫున కనికరము యొక్క తన హక్కులను పొందగలరు (మొరోనై 7:27; సిద్ధాంతము మరియు నిబంధనలు 45:3–5 చూడండి). “ఆ విధముగా కనికరము న్యాయము యొక్క అక్కరలను సంతృప్తిపరచగలదు మరియు భద్రత యొక్క బాహువులందు [మనల్ని] చుట్టగలదు” (ఆల్మా 34:16).

రక్షకుని ప్రాయశ్చిత్తం మరియు మన పశ్చాత్తాపం ద్వారా మాత్రమే మనం దేవునితో జీవించడానికి తిరిగి వెళ్ళగలము. మనము పశ్చాత్తాపపడినప్పుడు, మనము క్షమించబడతాము మరియు ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతాము. మన పాపాల కొరకు అపరాధ భారం నుండి విముక్తి పొందుతాము. గాయపడిన మన ఆత్మలు స్వస్థత పొందుతాయి. మనము ఆనందంతో నింపబడతాము (ఆల్మా 36:24 చూడండి).

మనం అపరిపూర్ణులమైనప్పటికీ, మళ్ళీ మనలో లోపాలున్నప్పటికీ, మనలో ఉన్న వైఫల్యం, లోపం లేదా పాపం కంటే ఎక్కువ కృప, ప్రేమ మరియు దయ యేసు క్రీస్తులో ఉన్నాయి. మనము ఆయన వైపు తిరిగి, పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు మనల్ని హత్తుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా మరియు ఆతృతగా ఉంటారు (లూకా 15:11–32 చూడండి). ఎవరైనను మరియు ఏదైనను “మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవు” (రోమా 8:39).

యేసు మన బాధలు, శ్రమలు మరియు బలహీనతలను తనపై తీసుకున్నారు

ఆయన ప్రాయశ్చిత్త త్యాగములో, యేసు క్రీస్తు మన బాధలు, శ్రమలు మరియు బలహీనతలను తనపై తీసుకున్నారు. ఈ కారణంగా, “వారి యొక్క బలహీనతలను బట్టి తన జనులను ఎట్లు ఆదరించవలెనో శరీరమును బట్టి ఆయన ఎరుగును” (ఆల్మా 7:12; 11వ వచనము కూడా చూడండి). ‘నా యొద్దకు రండి’ అని ఆయన ఆహ్వానిస్తారు మరియు మనం వచ్చినప్పుడు, ఆయన మనకు విశ్రాంతిని, నిరీక్షణను, బలాన్ని, దృక్పథాన్ని మరియు స్వస్థతను ఇస్తారు (మత్తయి 11:28; 29–30 వచనములు కూడా చూడండి).

యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం మీద మనం ఆధారపడినప్పుడు, మన కష్టాలు, అనారోగ్యాలు మరియు బాధలను భరించడంలో ఆయన మనకు సహాయపడగలరు. మనం ఆనందం, శాంతి మరియు ఓదార్పుతో నింపబడగలము. జీవితంలో అన్యాయమైనవిగా ఉన్నవన్నీ యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా సరిచేయబడతాయి.

లేఖన అధ్యయనము

రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము

పునరుత్థానము

ఈ సూత్రం గురించి మరింత తెలుసుకోండి

  • Guide to the Scriptures: “Jesus Christ,” “Atone, Atonement,” “Grace

  • Gospel Topics: “Jesus Christ [యేసు క్రీస్తు],” “Atonement of Jesus Christ [యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము],” “Grace [కృప]

చిత్రం
సమాధిని సందర్శిస్తున్న కుటుంబము

ఆత్మ లోకము

నేను మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది? అని చాలామంది ఆశ్చర్యపోతారు. రక్షణ ప్రణాళిక ఈ ప్రశ్నకు కొన్ని ముఖ్యమైన జవాబులను అందిస్తుంది.

మరణము మన కొరకు దేవుని యొక్క “కనికరము గల ప్రణాళిక”లో భాగము (2 నీఫై 9:6). మన ఉనికి అంతం కావడానికి బదులుగా, మరణము మన నిత్య పురోగతిలో తదుపరి దశ. దేవునిలా మారడానికి, మనం మరణాన్ని అనుభవించాలి మరియు తరువాత పరిపూర్ణమైన, పునరుత్థానం చెందిన శరీరాలను పొందాలి.

మన భౌతిక శరీరం మరణించినప్పుడు, ఆత్మ లోకంలో మన ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. ఇది పునరుత్థానం మరియు అంతిమ తీర్పుకు ముందు అభ్యాసం మరియు సిద్ధపాటు యొక్క తాత్కాలిక స్థితి. మర్త్య జీవితం నుండి మనకున్న జ్ఞానం మనతోనే ఉంటుంది.

ఆత్మ లోకంలో, యేసు క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించి, జీవించిన వారు “పరదైసు అని పిలువబడిన సంతోషము యొక్క స్థితిలోనికి చేర్చుకోబడతారు” (ఆల్మా 40:12). చిన్న పిల్లలు కూడా వారు మరణించినప్పుడు పరదైసులోనికి చేర్చుకోబడతారు.

పరదైసులోని ఆత్మలు తమ కష్టాలు మరియు దుఃఖాల నుండి శాంతిని పొందుతాయి. వారు దేవుని పనిని చేస్తూ, ఇతరులకు పరిచర్య చేస్తూ తమ ఆధ్యాత్మిక వృద్ధిని కొనసాగిస్తారు. వారు తమ మర్త్య జీవితంలో సువార్తను అందుకోని వారికి దానిని బోధిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:32–37, 57–59 చూడండి).

ఆత్మ లోకంలో, భూమిపై సువార్తను స్వీకరించలేని వ్యక్తులు లేదా ఆజ్ఞలను అనుసరించకూడదని ఎంచుకున్న వ్యక్తులు కొన్ని పరిమితులను అనుభవిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:6–37; ఆల్మా 40:6–14 చూడండి). అయితే, దేవుడు నీతిమంతుడు మరియు దయగలవాడు కాబట్టి, వారు తమకు యేసు క్రీస్తు సువార్త బోధించబడే అవకాశాన్ని కలిగియుంటారు. వారు దానిని అంగీకరించి, పశ్చాత్తాపపడితే, వారు తమ పాపాల నుండి విమోచించబడతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:58 చూడండి; 138:31–35; 128:22 కూడా చూడండి). వారు పరదైసు యొక్క శాంతిలోనికి స్వాగతించబడతారు. మర్త్యత్వంలో మరియు ఆత్మ లోకంలో వారు చేసిన ఎంపికల ఆధారంగా వారు చివరికి మహిమ రాజ్యంలో స్థానాన్ని పొందుతారు.

మనం పునరుత్థానం చెందే వరకు ఆత్మ లోకంలోనే ఉంటాము.

లేఖన అధ్యయనము

ఈ సూత్రం గురించి మరింత తెలుసుకోండి

  • Guide to the Scriptures: “Paradise

పునరుత్థానం, రక్షణ మరియు ఉన్నతస్థితి

పునరుత్థానము

దేవుని ప్రణాళిక మనం ఎదగడాన్ని మరియు నిత్య జీవాన్ని పొందడాన్ని సాధ్యం చేస్తుంది. ఆత్మ లోకంలో మన సమయం తర్వాత, పునరుత్థానం ఆ వృద్ధిలో మన తదుపరి దశ.

పునరుత్థానం అంటే మన శరీరం మరియు ఆత్మ తిరిగి ఏకమవడం. మనలో ప్రతి ఒక్కరూ పునరుత్థానం చెందుతారు. ఇది రక్షకుని ప్రాయశ్చిత్తం మరియు పునరుత్థానం ద్వారా సాధ్యమైంది. (ఆల్మా 11:42–44 చూడండి.)

మనం పునరుత్థానం చెందినప్పుడు, మనలో ప్రతీ ఒక్కరం పరిపూర్ణమైన భౌతిక శరీరాన్ని కలిగియుండి, బాధ మరియు అనారోగ్యం లేకుండా ఉంటాము. మనం అమర్త్యులమై, శాశ్వతంగా జీవిస్తాము.

రక్షణ

మనమందరం పునరుత్థానం చెందుతాము కాబట్టి, మనమందరం భౌతిక మరణం నుండి రక్షించబడతాము లేదా రక్షణ పొందుతాము. ఈ బహుమానం యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా మనకు ఇవ్వబడింది.

మన పాపాలకు న్యాయ చట్టం కోరే పర్యవసానాల నుండి కూడా మనం రక్షించబడవచ్చు లేదా రక్షణను పొందవచ్చు. మనం పశ్చాత్తాపపడినప్పుడు యేసు క్రీస్తు యొక్క యోగ్యతలు మరియు కనికరము ద్వారా ఈ బహుమానం కూడా సాధ్యం చేయబడింది. (ఆల్మా 42:13–15, 21-25 చూడండి.)

ఉన్నతస్థితి

ఉన్నతస్థితి లేదా నిత్యజీము అనేది సిలెస్టియల్ రాజ్యంలో సంతోషం మరియు మహిమ యొక్క అత్యున్నత స్థితి. ఉన్నతస్థితి అనేది షరతులతో కూడిన బహుమానము. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “ఆ అర్హతనిచ్చే షరతులలో ప్రభువుపై విశ్వాసం, పశ్చాత్తాపం, బాప్తిస్మము, పరిశుద్ధాత్మను పొందడం మరియు దేవాలయ విధులు, నిబంధనల పట్ల విశ్వాసంగా ఉండడం వంటివి ఉన్నాయి” (“Salvation and Exaltation,” Liahona, May 2008, 9).

ఉన్నతస్థితి అంటే నిత్య కుటుంబాలలో దేవునితో శాశ్వతంగా జీవించడం. దేవుణ్ణి మరియు యేసు క్రీస్తును తెలుసుకోవడం, వారిలా మారడం మరియు వారు ఆనందించే జీవితాన్ని అనుభవించడం.

లేఖన అధ్యయనము

ఈ సూత్రం గురించి మరింత తెలుసుకోండి

  • Guide to the Scriptures: “Resurrection

  • Gospel Topics: “Resurrection [పునరుత్థానము],” “Salvation [రక్షణ]

చిత్రం
మబ్బుల గుండా ప్రకాశిస్తున్న సూర్య కిరణాలు

తీర్పు మరియు మహిమ రాజ్యములు

గమనిక: మహిమ రాజ్యముల గురించి మొదటిసారి బోధిస్తున్నప్పుడు, వ్యక్తి యొక్క అవసరాలు మరియు గ్రహింపును బట్టి ప్రాథమిక స్థాయిలో బోధించండి.

మనం పునరుత్థానం చెందినప్పుడు, యేసు క్రీస్తు మనకు న్యాయమైన మరియు దయగల న్యాయాధిపతిగా ఉంటారు. చాలా తక్కువ మినహాయింపులతో, మనలో ప్రతీ ఒక్కరం మహిమ రాజ్యంలో స్థానం పొందుతాము. మనమందరం పునరుత్థానం చెందినప్పటికీ, మనమందరం ఒకే నిత్య మహిమను పొందము (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:22–24, 29–34; 130:20–21; 132:5 చూడండి).

తమ మర్త్య జీవితంలో దేవుని చట్టాలను పూర్తిగా అర్థం చేసుకొని, వాటిని పాటించే అవకాశం లేని వ్యక్తులకు ఆత్మ లోకంలో ఆ అవకాశం ఇవ్వబడుతుంది. యేసు ప్రతి వ్యక్తిని అతని లేదా ఆమె విశ్వాసం, పనులు, కోరికలు మరియు మర్త్యత్వములో, ఆత్మలోకంలో పశ్చాత్తాపాన్ని బట్టి తీర్పుతీరుస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:32–34, 57–59 చూడండి).

సిలెస్టియల్, టెర్రెస్ట్రియల్ మరియు టిలెస్టియల్ మహిమ రాజ్యాల గురించి లేఖనాలు బోధిస్తాయి. వాటిలో ప్రతీ ఒక్కటి దేవుని ప్రేమ, న్యాయము మరియు కనికరము యొక్క ప్రత్యక్షత.

క్రీస్తునందు విశ్వాసాన్ని సాధన చేసేవారు, తమ పాపములను గూర్చి పశ్చాత్తాపపడి, సువార్త యొక్క విధులను పొంది, తమ నిబంధనలను పాటిస్తూ, పరిశుద్ధాత్మను పొంది, అంతము వరకు సహించువారు సిలెస్టియల్ రాజ్యములో రక్షింపబడతారు. ఈ రాజ్యంలో వారి మర్త్య జీవితంలో సువార్తను స్వీకరించే అవకాశం లేని వ్యక్తులు కూడా ఉంటారు, కానీ వారు “తమ పూర్ణ హృదయాలతో దానిని స్వీకరించియుండెడివారు” మరియు ఆత్మ లోకంలో అలా చేసారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 137:8; 7వ వచనము కూడా చూడండి). జవాబుదారిత్వ వయస్సు (ఎనిమిదేళ్ళ వయస్సు) కంటే ముందే మరణించిన పిల్లలు కూడా సిలెస్టియల్ రాజ్యంలో రక్షింపబడతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 137:10 చూడండి).

లేఖనాలలో, సిలెస్టియల్ రాజ్యము సూర్యుని మహిమ లేదా కాంతితో పోల్చబడింది. (సిద్ధాంతము మరియు నిబంధనలు 76:50–70 చూడండి.)

గౌరవమైన జీవితాలను జీవించిన జనులు “ఎవరైతే యేసు యొక్క సాక్ష్యమును శరీరమందు పొందలేదు కానీ, తరువాత దానిని పొందారో” వారు టెర్రెస్ట్రియల్ రాజ్యములో స్థానం పొందుతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 76:74). యేసు గురించి తమ సాక్ష్యమందు శూరులుగా ఉండనివారికి ఇదే వర్తిస్తుంది. ఈ రాజ్యము చంద్రుని మహిమతో పోల్చబడింది. (సిద్ధాంతము మరియు నిబంధనలు 76:71–80 చూడండి.)

తమ పాపాలలో కొనసాగి, ఈ జీవితంలో పశ్చాత్తాపపడని లేదా ఆత్మ లోకంలో యేసు క్రీస్తు సువార్తను అంగీకరించని వారు టిలెస్టియల్ రాజ్యంలో వారి ప్రతిఫలాన్ని పొందుతారు. ఈ రాజ్యము నక్షత్రాల మహిమతో పోల్చబడింది. (సిద్ధాంతము మరియు నిబంధనలు 76:81–86 చూడండి.)

లేఖన అధ్యయనము

ఈ సూత్రం గురించి మరింత తెలుసుకోండి

చిన్న నుండి మధ్యస్థ పాఠ్య నమూనా

క్రింది రూపురేఖలు మీకు క్లుప్త సమయం ఉంటే మీరు ఎవరికైనా ఏమి బోధించవచ్చు అనే దాని నమూనా. ఈ నమూనాలను ఉపయోగిస్తున్నప్పుడు, బోధించడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సూత్రాలను ఎంచుకోండి. ప్రతి సూత్రానికి సిద్ధాంతపు పునాది పాఠంలో ముందుగా అందించబడింది.

మీరు బోధిస్తున్నప్పుడు, ప్రశ్నలు అడగండి మరియు వినండి. దేవునికి ఎలా దగ్గరవ్వాలో తెలుసుకోవడానికి జనులకు సహాయపడే ఆహ్వానాలను ఇవ్వండి. ఒక వ్యక్తి మిమ్మల్ని మళ్ళీ కలవడానికి ఒక ముఖ్యమైన ఆహ్వానం ఇవ్వండి. పాఠం యొక్క నిడివి మీరు అడిగే ప్రశ్నలు మరియు మీరు వినడంపై ఆధారపడి ఉంటుంది.

మీరు 3 10 నిమిషాల్లో జనులకు ఏమి బోధించవచ్చు

  • మనమందరము దేవుని యొక్క ఆత్మ పిల్లలమైయున్నాము. మనము ఆయన కుటుంబ సభ్యులము. ఆయన మనలో ప్రతీఒక్కరినీ ఎరుగుదురు మరియు ప్రేమిస్తున్నారు.

  • ఈ జీవితంలో మరియు నిత్యత్వంలో మన సంతోషము మరియు పురోగతి కోసం దేవుడు ఒక ప్రణాళికను అందించారు.

  • దేవుని ప్రణాళికలో, భౌతిక శరీరాలను పొందడానికి, నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి మనం భూమిపైకి రావాలి.

  • యేసు క్రీస్తు దేవుని యొక్క ప్రణాళికకు కేంద్రము. మనం నిత్యజీవాన్ని కలిగియుండడాన్ని ఆయన సాధ్యం చేస్తారు.

  • దేవుని మార్గనిర్దేశకత్వం క్రింద, యేసు భూమిని సృష్టించారు.

  • భూమిపై మన అనుభవాలు దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడేందుకు మనకు సహాయం చేయడానికి ఉద్దేశించబడ్డాయి.

  • మనలో ప్రతి ఒక్కరూ పాపం చేస్తారు మరియు మనలో ప్రతి ఒక్కరూ మరణిస్తారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, పాపం మరియు మరణం నుండి మనల్ని విమోచించడానికి ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తును భూమిపైకి పంపారు.

  • జీవితంలో అన్యాయమైనవిగా ఉన్నవన్నీ యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా సరిచేయబడతాయి.

  • మన భౌతిక శరీరం మరణించినప్పుడు, మన ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. చివరికి మనమందరం పునరుత్థానం చెందుతాము. దీని అర్థం ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ మరియు శరీరం తిరిగి ఏకమవుతాయి మరియు మనలో ప్రతీ ఒక్కరం పరిపూర్ణమైన, పునరుత్థానం చేయబడిన శరీరంలో శాశ్వతంగా జీవిస్తాము.

  • మనం పునరుత్థానం చెందినప్పుడు, యేసు క్రీస్తు మన న్యాయాధిపతిగా ఉంటారు. చాలా తక్కువ మినహాయింపులతో, దేవుని పిల్లలందరూ మహిమ రాజ్యంలో స్థానం పొందుతారు. మనం విశ్వాసంగా ఉంటే దేవుని సన్నిధిలో జీవించడానికి తిరిగి వెళ్ళగలము.

ముద్రించు