సర్వసభ్య సమావేశము
మీ ఆనందము ఎంత గొప్పదగును
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


మీ ఆనందము ఎంత గొప్పదగును

సమయానుకూలమైన మీ సాక్ష్యాలతో పాటు మీ “జ్ఞానము-అనుభవమును” తీసుకొని, సువార్త సేవకు వెళ్ళమని నేనిప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు నా ఆలోచనలు ఇశ్రాయేలు సమకూర్పుపై ఉన్నాయి, అది అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ పిలిచినట్లు, “భూమిపై నేడు జరుగుతున్న అతి ప్రాముఖ్యమైన కార్యం. దాని పరిమాణంతో వేరే ఏదీ పోల్చబడదు, దాని ప్రాముఖ్యతతో ఏదీ పోల్చబడదు, దాని ఘనతకు ఏదీ సరిపోల్చబడదు.”1

“ఆత్మల విలువ దేవుని దృష్టిలో గొప్పది”2 అనడానికి సమకూర్పు అంతిమ గుర్తింపు. అది అంత సులభమైనది. దేవుని పిల్లలు “వారి శిరస్సులపై గొప్ప ఆశీర్వాదములు క్రుమ్మరింపబడియుండాలని”3 మరియు “నిత్యత్వపు ఐశ్వర్యముల”4 వాగ్దానం కలిగియుండాలని ఈ అంత్యదినములలో మనం వారిని సమకూరుస్తున్నాము. ఇశ్రాయేలును సమకూర్చడానికి మనకు సువార్తికులు కావాలి—ఇప్పుడు సేవ చేస్తున్న వారికంటే చాలా ఎక్కువమంది.5 ఈరోజు, సువార్తికులుగా సేవ చేయగల సంఘములోని అనేకమంది అనుభవజ్ఞులైన పెద్దవారితో నేను మాట్లాడుతున్నాను. ప్రభువుకు మీ అవసరముంది. న్యూయార్కు, చికాగో, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, థాయ్‌లాండ్, మెక్సికో మరియు వాటి మధ్య ప్రతీచోట మాకు మీ అవసరముంది.

నేను మిమ్మల్ని 2015 సంవత్సరానికి వెనుకకు తీసుకువెళ్తాను. నేను పన్నెండుమంది అపొస్తలుల సమూహములో క్రొత్తగా పిలువబడిన సభ్యుడిని. అపొస్తలులుగా మాకున్న అద్భుతమైన బాధ్యతలలో ఒకటి సువార్తికులను వారి సేవాప్రాంతాలకు నియమించడం. ఆ ప్రక్రియలో ఒక డెబ్బదిగా నేను పాల్గొన్నాను,6 కానీ ఇప్పుడు, ఒక అపొస్తలునిగా, ఆ నియామకం యొక్క పూర్తి భారాన్ని నేను అనుభవించాను. గొప్ప సంఖ్యలో యువ ఎల్డర్‌లను, సహోదరీలను ఒకరి తర్వాత ఒకరుగా నేను ప్రపంచమంతటా ఉన్న మిషనులలో ప్రార్థనాపూర్వకంగా నియమించడం ప్రారంభించాను. తర్వాత, నేను సీనియర్ జంటలపై పని చేయసాగాను. జాబితాలో పదిమంది ఉన్నారు. చాలామంది కాదు. ఆశ్చర్యంతో నేను, “అభ్యర్థనలను పూరించడానికి ఈ వారం మనకు ఎంతమంది కావాలి?” అని సువార్తికుల విభాగం నుండి నా సహచరుడిని అడిగాను.

“మూడు వందలు” అని అన్నాడతను.

ఆ గంభీరమైన క్షణం నాకింకా గుర్తుంది: 300 అభ్యర్థనలను నెరవేర్చడానికి 10 జంటలు.

“సువార్త సేవ చేయడానికి ఇది సరైన సమయమో కాదోనని మోకరించి, పరలోక తండ్రిని అడగమని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ జంటలను ప్రోత్సహించారు.7 అన్ని అర్హతలలో, “సేవ చేయాలనే కోరికే అత్యంత ముఖ్యమైనది” అని ఆయన అన్నారు.8

లేఖనము చెప్పినట్లుగా, “దేవుని సేవించాలనే కోరిక మీరు కలిగియున్న యెడల మీరు సేవకు పిలువబడెదరు.”9 ఆ పని పూర్తిగా కోత చట్టానికి సంబంధించినది. “విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు”10 అని యోహానులో మనం చదువుతాం.

నా స్వంత కుటుంబంలో కోత చట్టము నెరవేరడాన్ని నేను చూసాను.

కొన్నేళ్ళ క్రితం, సంస్కార సేవలో ముగింపు సందేశమివ్వమని బిషప్పు నన్ను అడిగినప్పుడు, నేనొక కుటుంబాన్ని దర్శిస్తున్నాను.11 నేను వేదిక పైనుండి క్రిందికి దిగుతున్నప్పుడు, ఒక మహిళ తన ఏడుగురు పిల్లలతో నా దగ్గరకొచ్చి, తననుతాను సహోదరి రెబెక్కా గుజ్మాన్‌గా పరిచయం చేసుకుంది.

“ఎల్డర్ రాస్బాండ్, మీకు రూలన్ మరియు వెర్డా రాస్బాండ్ తెలుసా?” అని అడిగింది.

సంతోషంతో నేను చెప్పాను, “వాళ్ళు నా తల్లిదండ్రులు.”

ఇది ఎటు వైపు దారితీస్తున్నదో మీరు చూడగలరు. కుటుంబంతో పాటు ఇక్కడ సమావేశ కేంద్రంలో ఉన్న రెబెక్కా అనుమతితో, నేను ఆమె కుటుంబ కథను పంచుకుంటాను.12

చిత్రం
సహోదరి వెర్డా మరియు ఎల్డర్ రులోన్ రాస్బాండ్.

నా తల్లిదండ్రులు ఎల్డర్ రూలన్ మరియు సహోదరి వెర్డా రాస్బాండ్ ఫ్లోరిడా ఫోర్ట్ లాడర్డేల్ మిషనులో సీనియర్ జంటగా సేవ చేస్తున్నారు.13 వారు సువార్తను ప్రకటిస్తున్నారు మరియు దైవిక నడిపింపు చేత రెబెక్కా ఇంటి తలుపు తట్టారు. ఆమె యుక్తవయస్సులో ఉంది మరియు ఒస్మండ్‌ల సంగీతం వినడాన్ని ఇష్టపడేది, ప్రత్యేకించి మా స్నేహితుడు డానీది—అతను కూడా ఈరోజు ఇక్కడున్నాడు.14 ఆమె వారి మీడియా ఇంటర్వ్యూలను విని, వారు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులని తెలుసుకుంది. వారిలో ఏదో భిన్నంగా ఉందని ఆమె భావించింది, అది వారి మతము కావచ్చని అనుకుంటూ రెబెక్కా పాఠశాల గ్రంథాలయంలో సంఘ విశ్వాసాలను పరిశోధిస్తూ రెండేళ్ళు గడిపింది. కాబట్టి, దయగల ఒక జంట ఆమె తలుపు తట్టి, తమనుతాము కడవరి దిన పరిశుద్ధ సువార్తికులుగా పరిచయం చేసుకున్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది.

“వాళ్ళని వదిలించుకోమని మా అమ్మ చెప్పింది,” “కానీ నా మనస్సు ‘వద్దు’ అంది. నేను వాళ్ళ ముఖాలలోకి చూసినప్పుడు చాలా ఆత్మీయతను, ప్రేమను అనుభవించాను. ఆ జ్ఞాపకం ఇప్పటికీ నా కళ్ళలో నీళ్ళను, నా మనస్సులో తీవ్ర భావోద్వేగాన్ని తెస్తుంది”15 అని రెబెక్కా తరువాత వ్రాసింది.

రెబెక్కా వారిని లోపలికి ఆహ్వానించింది మరియు సువార్తికులైన నా తల్లిదండ్రులు ఆమెతో, ఆమె చెల్లెళ్ళు ఇద్దరితో మరియు ఆమె తల్లికి అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆమెతో కూడా సందేశాన్ని పంచుకున్నారు.

రెబెక్కా నాకిలా వివరించింది, “మాకున్న ప్రశ్నలన్నిటికి మీ తల్లిదండ్రులిద్దరూ అద్భుతంగా జవాబిచ్చేవారు. వారి చుట్టూ వెలుగు ఆవరించినట్లు నేనిప్పటికీ వారి ముఖాలు చూడగలను. మేము ఎప్పుడూ మీ అమ్మ వెళ్ళేటప్పుడు ఆమెను హత్తుకొనేవాళ్ళం. ఆమె ఎప్పుడూ మా అమ్మను సౌకర్యంగా, గౌరవంగా భావించేలా చేయమని చెప్పేది. యేసు క్రీస్తు గురించి బోధించేటప్పుడు మీ నాన్న ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. చర్చలలో మా నాన్నను కలుపుకోవడానికి ఆయన ప్రయత్నించారు మరియు క్రమంగా ఆయన మనసు గెలుచుకున్నారు. మా నాన్న స్థానిక కంట్రీ క్లబ్‌లో వంటమనిషి మరియు మీ నాన్నకి ఇష్టమైన కీ లైమ్ పైతో సహా మీ తల్లిదండ్రుల కోసం భోజనం వండడం ప్రారంభించారు.”16

మోర్మన్ గ్రంథము చదవమని ఎల్డర్ మరియు సహోదరి రాస్బాండ్ రెబెక్కాను, ఆమె కుటుంబాన్ని అడిగినప్పుడు, రెబెక్కా ఐదు రోజులలో చదివింది. ఆమె వెంటనే బాప్తిస్మము పొందాలని కోరుకుంది, కానీ ఆమె మిగతా కుటుంబ సభ్యులు సిద్ధంగా లేరు. నాలుగు నెలల తర్వాత, బాప్తిస్మము పొందాలని మరియు నిజమైన సంఘములో చేరాలని రెబెక్కా పట్టుబట్టింది. “నిస్సందేహంగా ఇది నిజమని నాకు పూర్తిగా అర్థమైంది” అని ఆమె గుర్తుచేసుకుంది.17 1979, ఏప్రిల్ 5న సువార్తికులు 19 ఏళ్ళ రెబెక్కాకు, ఆమె తల్లికి మరియు ఇద్దరు చెల్లెళ్ళకి బాప్తిస్మమిచ్చారు. బాప్తిస్మము వద్ద మా నాన్న సాక్షిగా ఉన్నారు.

సంఘములో నేను రెబెక్కాను, ఆమె కుటుంబాన్ని కలిసినప్పుడు, నాతో పాటు ఆమె కుటుంబాన్ని మేము ఫోటో తీసుకున్నాము. నేను దానిని వయస్సైన మా అమ్మ దగ్గరకి తీసుకెళ్ళాను, ఆమె దానిని తన హృదయానికి హత్తుకుంది. “రోన్నీ, ఇది నా జీవితంలో అతి సంతోకరమైన రోజులలో ఒకటి,” అని ఆమె నాతో చెప్పింది.

చిత్రం
గుజ్మాన్లు, రాస్బాండ్లు మరియు ఓస్మాండ్లు.

మా అమ్మ స్పందన, “మీ జీవితంలోని ఈ దశలో మీరు ఏమి చేస్తున్నారు?” అని మన పెద్దవారిని ప్రశ్నిస్తుంది. ఎన్నో విధాలుగా సీనియర్ సువార్తికులు వేరెవ్వరూ చేయలేని దానిని చేయగలరు. మంచి కోసం మీరు అద్భుతమైన శక్తి, సంఘములో అనుభవం గడించినవారు మరియు దేవుని పిల్లలను ప్రోత్సహించడానికి, కాపాడడానికి సిద్ధమయ్యారు.

మీలో కొందరు ఇలా అనుకోవచ్చు: “మనవళ్ళను వదిలి ఎలా వెళ్ళాలి? కుటుంబంలో ముఖ్య సంఘటనలు, పుట్టినరోజులు, స్నేహితులు, మన పెంపుడు జంతువులను మనము కోల్పోతాము.” ఆమె మరియు నాన్న సువార్త సేవకు ఎందుకు వెళ్లారని నేను మా అమ్మను అడిగితే, ఆమె ఇలా చెబుతుందని నాకు తెలుసు: “నాకు మనవళ్ళు ఉన్నారు. మీ నాన్న, నేను సువార్త సేవ చేసామని వాళ్ళు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను, మా సంతానానికి మేము ఒక ఉదాహరణగా నిలవాలనుకుంటున్నాము మరియు మేము దీవించబడ్డాము, చాలా దీవించబడ్డాము” అని ఆమె చెప్తుందని నాకు తెలుసు.

నేను ప్రపంచమంతటా ఉన్న మిషనులను సందర్శించినప్పుడు, మన సీనియర్ సువార్తికుల దళం యొక్క విశేషమైన సేవను చూసాను. వాళ్ళు “ప్రభువు చిత్తమును” చేయడంలో మరియు “ప్రభువు పనిలో”18 ఉండడంలో సంతోషంగా ఉన్నారనేది స్పష్టము.

మీలో కొందరికి మరియు వేలమందికి పూర్తి-కాల సువార్త సేవ ఇంటి నుండి చాలా దూరంలో ఉండడం సరైనది అనిపిస్తుందని మేము ఆశిస్తున్నాము.19 ఇతరులకు, ఇంటివద్ద సంఘ-సేవా మిషనులో సేవ చేయడం నచ్చవచ్చు. ఆరోగ్య సమస్యలు మరియు ఇతర పరిస్థితుల కారణంగా కొందరు సేవ చేయలేకపోవచ్చు. ఆ పరిస్థితులను మేము అర్థం చేసుకుంటాము, సేవ చేస్తున్న వారికి సహకరించడానికి మీరు మార్గాలను కనుగొనాలనేది నా ఆశ. ప్రవక్త సలహాను అనుసరించండి మరియు మీరు ఏమి చేయాలని ప్రభువు కోరుతున్నారో తెలుసుకోవడానికి ప్రార్థించండి.

మీ సహాయం కోసం ప్రపంచమంతటా మిషను క్షేత్రాలు అభ్యర్థిస్తున్నాయి. అధ్యక్షులు నెల్సన్ మన సీనియర్ సువార్తికుల గురించి ఇలా అన్నారు, “వారు ఆత్మీయంగా యౌవనులైయున్నారు, తెలివైనవారు మరియు పని చేయడానికి ఇష్టపడుతున్నారు.”20

మిషను క్షేత్రంలో మీకు అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి: మీరు మిషను కార్యాలయాల్లో లేదా దేవాలయాల్లో సేవ చేయవచ్చు, యువ సువార్తికులను బలపరచవచ్చు, చిన్న శాఖలకు సహాయపడవచ్చు, కుటుంబ చరిత్ర కేంద్రాలు లేదా చారిత్రక స్థలాల్లో పని చేయవచ్చు, ఇన్స్టిట్యూట్ బోధించవచ్చు, మానవతా సేవను అందించవచ్చు, యువ వయోజనులతో పని చేయవచ్చు, ఉద్యోగ కేంద్రాలు లేదా సంఘ తోటల్లో సహాయపడవచ్చు. సేవచేసే విధానాల వివరాలు, మీకు ఏది బాగా నప్పుతుంది, మీ అవసరం ఎక్కడ ఉంది మరియు వెళ్ళడానికి మీరెలా సిద్ధపడగలరు వంటివి “సీనియర్ సువార్తికుడు” అనే వెబ్‌సైటులో వివరించబడ్డాయి. 21 మీరు మీ బిషప్పు లేదా మీ శాఖాధ్యక్షునితో కూడా మాట్లాడవచ్చు.

నేను అనేక జంటలను సేవచేయడానికి పిలిచాను మరియు వారి ముఖాలు క్రీస్తు వెలుగుతో నింపబడడాన్ని గమనించాను.22 వాళ్ళు తిరిగివచ్చినప్పుడు, ప్రభువుకు మరియు ఒకరికి ఒకరు దగ్గరయ్యామని, తమపై ప్రభువు యొక్క ఆత్మ క్రుమ్మరింపబడడాన్ని అనుభవించామని, తాము మార్పును కలుగజేస్తున్నట్లు తెలుసుకున్నామని వివరించారు.23 ఎవరు దానిని కోరుకోరు?

మిషను ఒక జంట జీవితంలో గొప్ప అధ్యాయం కావచ్చు. “నా ప్రభువుకు నా అవసరముంది” 24 అనేది మంచి శీర్షిక కావచ్చు. మీకు తెలియని ప్రదేశంలో మీరు ఉండవచ్చు; అయినప్పటికీ, ఆత్మ యొక్క శక్తి మిమ్మల్ని ఇంటివద్ద ఉన్నట్లే భావింపజేస్తుంది.

నా తల్లిదండ్రులు మరియు తిరిగివచ్చిన పదుల వేలమంది సువార్తికుల జంటలు సువార్త పరిచర్యలో తాము కనుగొన్న ఆనందం గురించి సాక్ష్యమిచ్చారు. “మీరు మీ దినములన్నియూ పశ్చాత్తాపమును ప్రకటించుటకై పనిచేసి, నా యొద్దకు కేవలము ఒక్క ఆత్మను తెచ్చిన యెడల, అతనితో నా తండ్రి రాజ్యములో మీ ఆనందము ఎంత గొప్పదగును!”25 అని ప్రభువు కడవరి దిన లేఖనములో చెప్పారు.

మిషను “క్షేత్రము”లో సేవ చేయడమంటే అర్థమేమిటని యెషయా ఒక కవితాత్మక వర్ణననిచ్చాడు. “పొలము లోకము”26 అని లేఖనము మనకు చెప్తుంది. “మీరు సంతోషముగా బయలువెళ్లుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు, మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును”27 అని ఈ గొప్ప ప్రాచీన ప్రవక్త వ్రాసాడు. పర్వతాలు, కొండలు, పొలములు, చెట్లు మిషను అధ్యక్షులు, బిషప్పులు, జిల్లా నాయకులు, సభ్యులతో పోల్చబడవచ్చు మరియు సత్యమును వెదుకుతూ దానిని “అది ఎక్కడ కనుగొనవలెనో వారికి తెలియదు”28 సీనియర్ మిషనరీలు మన రక్షకుడు మరియు విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క సాక్ష్యంతో ప్రదేశమును మారుస్తారని వారు సాక్ష్యమిస్తారు.

ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలునిగా, ఇశ్రాయేలు సమకూర్పులో ఒక సువార్తికునిగా సేవ చేయమని, బహుశా మళ్ళీ సేవ చేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మాకు మీ అవసరముంది—మాకు మీ అవసరముంది. పెద్దలు—మీరు జీవించిన జీవితాల కొరకు, మీ ఇళ్ళు, వార్డులు మరియు స్టేకులలో మీరు చూపిన మాదిరుల కొరకు మేము కృతజ్ఞత కలిగియున్నాము. సమయానుకూలమైన మీ సాక్ష్యాలతో పాటు మీ “జ్ఞానము-అనుభవమును” తీసుకొని, సువార్త సేవకు వెళ్ళమని నేనిప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరొకసారి సీనియర్ జంటలను నియమించడానికి నేను కూర్చున్నప్పుడు, మీలో వందలమంది మీ పిలుపు కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.

మీరు సేవ చేసినప్పుడు, మీ జీవితంలో మీరు ప్రభువు యొక్క ప్రేమను అనుభవిస్తారని, ఆయన గురించి మీరు తెలుసుకుంటారని, ఆయన మీ గురించి తెలుసుకుంటారని మరియు “మీ ఆనందము ఎంతో గొప్పదగును”29 అని కూడా నేను వాగ్దానమిస్తున్నాను. యేసు క్రీస్తుకు ప్రతిష్ఠించబడిన మీ సేవ మీ కుటుంబాన్ని, మీ మనవళ్ళను, ముని-మనవళ్ళను ప్రేరేపించి, దీవిస్తుంది. రాబోయే సంవత్సరాలలో వారి జీవితాలలో “సమాధానమును, ప్రేమయు విస్తరించును.”30 నేను వాగ్దానము చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Hope of Israel” (worldwide youth devotional, June 3, 2018), Gospel Library.

  2. సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10.

  3. 3 నీఫై 10:18.

  4. సిద్ధాంతము మరియు నిబంధనలు 78:18.

  5. ఉత్తర మరియు దక్షిణ అమెరికా నుండి యూరోపుకు, ఆఫ్రికా, ఆసియా మరియు ఆస్ట్రేలియా/ఓషియానియాకు ప్రపంచమంతటా సంఘము 414 పూర్తి కాల మిషనులలో 71,000 మంది సువార్తికులను కలిగియుంది. 34,000 మంది సీనియర్ సంఘ-సేవా సువార్తికులు ఉన్నారు. (Missionary Department data, Sept. 2023.)

  6. రోనాల్డ్ ఎ. రాస్బాండ్, ”The Divine Call of a Missionary,” లియహోనా, May 2010, 52–53.చూడండి

  7. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Senior Missionary Moments,” లియహోనా, Apr. 2016, 27.

  8. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Senior Missionaries and the Gospel,” లియహోనా, నవం. 2004, 81.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 4:3.

  10. యోహాను 4:36.

  11. నా మనవరాలు బ్రూక్లిన్ బాప్తిస్మము మరియు మనవరాలు ఎల్లా యొక్క దీవెనకు హాజరవడానికి 2006, ఏప్రిల్‌లో నేను అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్నాను.

  12. ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్బాండ్‌కు రెబెక్కా గుజ్మాన్ నుండి లేఖ, సెప్టె. 8, 2009.

  13. నా తల్లిదండ్రులు 1979లో ఫ్లోరిడా ఫోర్ట్ లాడర్డేల్ మిషనులో సేవచేసారు.

  14. ఒస్మండ్ కుటుంబము వారి పాప్ గీతాలకు పేరొందిన ఒక ప్రఖ్యాత అమెరికన్ సంగీత సమూహము. వివిధ టెలివిజన్ కార్యక్రమాల్లో ప్రదర్శనలిస్తూ, 1970 మధ్యలో ఆ సమూహము అత్యున్నత ఖ్యాతి సంపాదించింది. డానీ మరియు మారీ స్టేజి ప్రదర్శనలతో టెలివిజన్‌లో కొనసాగగా, సహోదరులు బ్రాన్సన్, మిస్సోరిలో దేశ కళాకారులుగా దశాబ్దాలపాటు ప్రదర్శనలిచ్చారు.

  15. రెబెక్కా గుజ్మాన్ నుండి లేఖ, సెప్టె. 8, 2009.

  16. రెబెక్కా గుజ్మాన్ నుండి లేఖ, సెప్టె. 8, 2009.

  17. రెబెక్కా గుజ్మాన్ నుండి లేఖ, సెప్టె. 8, 2009.

  18. సిద్ధాంతము మరియు నిబంధనలు 64:29.

  19. సీనియర్ సువార్తికుల అవకాశాలు అనేకరకాలుగా వస్తాయి మరియు దంపతులు లేదా సీనియర్ సహోదరీలు పూర్తి-కాల లేదా సంఘ-సేవా నియామకాలతో పాటు ప్రాధాన్యతలను పేర్కొనవచ్చు. చివరకు, సంఘ ప్రవక్త పూర్తి-కాల సేవకు పిలుపును జారీచేస్తారు. స్టేకు అధ్యక్షులు సంఘ-సేవా నియామకాలను జారీచేస్తారు. సేవ 6 నెలల నుండి 23 నెలల వరకు ఉండవచ్చు మరియు సీనియర్ సువార్తికులకు మరింత వెసులుబాటు ఉంటుంది, యువ సువార్తికుల కంటే తక్కువ కఠినమైన పని ఉంటుంది. seniormissionary.ChurchofJesusChrist.org చూడండి.

  20. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Senior Missionaries and the Gospel,” లియహోనా, నవం. 2004, 79.

  21. seniormissionary.ChurchofJesusChrist.org చూడండి.

  22. ఆల్మా 5:14 చూడండి. “ముఖము” ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక వైఖరిని, మానసిక స్థితిని ప్రతిబింబించే దానిగా వర్ణించబడవచ్చు.

  23. యూదా 1:22; మోషైయ 4:20 చూడండి.

  24. See “I’ll Go Where You Want Me to Go,” Hymns, no. 270.

  25. సిద్ధాంతము మరియు నిబంధనలు 18:15.

  26. “పొలము లోకము; … కోత యుగసమాప్తి” (మత్తయి 13:38–39) అని ప్రభువు వివరించారు.

  27. యెషయా 55:12.

  28. సిద్ధాంతము మరియు నిబంధనలు 123:12.

  29. సిద్ధాంతము మరియు నిబంధనలు 18:15.

  30. యూదా 1:2.

ముద్రించు