సర్వసభ్య సమావేశము
క్రీస్తునందు సహోదర సహోదరీలు
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


క్రీస్తునందు సహోదర సహోదరీలు

మన మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని మనం మరింత ఆనందిద్దాం మరియు మనమందరం కలిగియున్న విభిన్న గుణాలు, వివిధ బహుమానాలకు విలువిద్దాం.

నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనకు అద్భుతమైన సమావేశ సభలు జరిగాయి. మన నాయకులు పంచుకున్న అద్భుతమైన సందేశాల ద్వారా మనమందరం ప్రభువు యొక్క ఆత్మను, ఆయన ప్రేమను అనుభవించాము. ఈ సభలో ముగింపు ప్రసంగీకునిగా ఈ సాయంత్రం మీతో మాట్లాడడాన్ని విశేషాధికారంగా నేను భావిస్తున్నాను. క్రీస్తునందు నిజమైన సహోదర సహోదరీలుగా మనం కలిసి ఆనందిస్తుండగా ప్రభువు యొక్క ఆత్మ మనతో కొనసాగాలని నేను ప్రార్థిస్తున్నాను.

మన ప్రియమైన ప్రవక్త రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా ప్రకటించారు: “వేరు చేయు వైఖరులు మరియు దురభిమానపు చర్యల నుండి బయటకు నడిపించమని ప్రతిచోటనున్న మన సభ్యులకు నేడు నేను పిలుపునిస్తున్నాను. దేవుని పిల్లలందరి పట్ల గౌరవాన్ని ప్రోత్సహించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.”1 ప్రపంచవ్యాప్తమైన మరియు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సంఘముగా, ప్రపంచంలోని ప్రతీ దేశంలో రక్షకుని రాజ్యాన్ని నిర్మించడానికి ముందుగా కావలసింది మన ప్రవక్త నుండి ఈ ఆహ్వానాన్ని అనుసరించడం.

మనమందరం మనల్ని నిజంగా ప్రేమించే పరలోక తల్లిదండ్రుల ఆత్మీయ కుమారులు మరియు కుమార్తెలమని2, ఈ భూమి మీద మనం జన్మించక ముందు దేవుని సన్నిధిలో మనం ఒక కుటుంబంగా జీవించామని యేసు క్రీస్తు సువార్త బోధిస్తుంది. మనమందరం దేవుని స్వరూపంలో మరియు పోలికలో సృష్టించబడ్డామని కూడా సువార్త బోధిస్తుంది.3 కాబట్టి, ఆయన ముందు మనం సమానులం,4 ఎందుకంటే ఆయన “ఒకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించారు.”5 అందువలన మనమందరం దైవిక స్వభావాన్ని, వారసత్వాన్ని, సామర్థ్యాన్ని కలిగియున్నాము, ఎందుకంటే “అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు.”6

క్రీస్తు యొక్క శిష్యులుగా మన అసమానతలతో సంబంధం లేకుండా, ఐక్యతయందును, ప్రేమయందును మన హృదయములు యధార్ధంగా ముడివేయబడుట ద్వారా మన ఆత్మీయ సహోదర సహోదరిత్వముపట్ల మన నమ్మకాన్ని, ప్రేమను పెంచుకోవాలని మనం ఆహ్వానించబడ్డాము, తద్వారా దేవుని కుమారులు మరియు కుమార్తెలందరి మర్యాద కోసం గౌరవాన్ని ప్రోత్సహించే మన సామర్థ్యాన్ని పెంచుకుంటాము.7

క్రీస్తు వారికి పరిచర్య చేసిన తర్వాత దాదాపు రెండు శతాబ్దాల వరకు నీఫై జనులు అనుభవించిన పరిస్థితి సరిగ్గా ఇదే కదా?

“నిశ్చయముగా, దేవుని హస్తము చేత సృష్టించబడిన జనులందరి మధ్య అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు. …

”అక్కడ లేమనీయులు లేరు లేదా ఏ విధమైన -ఈయులు లేరు; కానీ వారు ఒక్కటిగా, క్రీస్తు యొక్క సంతానముగా మరియు దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండిరి.

“వారెంత ధన్యులు!”8

అధ్యక్షులు నెల్సన్ ఈవిధంగా చెప్పినప్పుడు మన తోటివారి పట్ల మర్యాదను, గౌరవాన్ని వ్యాప్తిచేయడం యొక్క ప్రాముఖ్యతను ఇంకా నొక్కిచెప్పారు: “దేవుని పిల్లల యొక్క ఏ సమూహానికైనా వ్యతిరేకంగా దురభిమాన వైఖరులను వదిలిపెట్టాలని మనందరి సృష్టికర్త మనలో ప్రతీఒక్కరికి పిలుపునిచ్చారు. మనలో ఎవరికైనా మరొక వర్గం పట్ల దురభిమానం ఉంటే పశ్చాత్తాపపడాలి! … దేవుని యొక్క ప్రతి కుమారుడు మరియు కుమార్తె అర్హులైన మర్యాదను, గౌరవాన్ని కాపాడడానికి మన ప్రభావ పరిధిలో మనం చేయగలిగినదంతా చేయడం మనలో ప్రతీఒక్కరికి తగినది.”9 నిజానికి, మనుషులందరి పట్ల మర్యాద చూపాలంటే ముందుగా మనమందరం భిన్నంగా ఉన్నామనే వాస్తవాన్ని మనం గౌరవించాలి.10

ఆయన పిల్లలుగా దేవునితో మనల్ని ఏకం చేసే పవిత్ర బంధాన్ని పరిగణిస్తూ, అధ్యక్షులు నెల్సన్ చేత ఇవ్వబడిన ఈ ప్రవచనాత్మక మార్గనిర్దేశం మన మధ్య దురభిమానపు అడ్డుగోడలను, విభజనను సృష్టించడానికి బదులుగా అవగాహన వంతెనలను నిర్మించే వైపు ఒక ముందడుగు అనడంలో సందేహం లేదు.11 అయితే, పౌలు ఎఫెసీయులను హెచ్చరించినట్లుగా, ఈ ఉద్దేశ్యాన్ని సాధించడానికి ఒకరిపట్ల ఒకరు దీర్ఘశాంతముతోకూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనేందుకు వ్యక్తిగత మరియు సమిష్టి ప్రయత్నం చేయడం అవసరమని మనం తప్పక గుర్తించాలి.12

ఇద్దరు స్నేహితులతో కలిసి సూర్యోదయాన్ని ఆనందిస్తున్న యూదుల మతగురువు గురించిన ఒక కథ ఉంది. ఆయన వారిని ఇలా అడిగాడు, “ఎప్పుడు రాత్రి ముగిసిందో, నూతన దినము ఆరంభమైనదో నీకెలా తెలుసు?”

వారిలో ఒకడు, “నువ్వు తూర్పువైపు చూసి ఒక గొర్రెకి, మేకకి మధ్య తేడా తెలుసుకోగలిగినప్పుడు” అని జవాబిచ్చాడు.

మరొకడు, “నువ్వు క్షితిజం వైపు చూసి ఒక ఒలీవ చెట్టుకు, అంజూరపు చెట్టుకు మధ్య తేడా తెలుసుకోగలిగినప్పుడు” అని జవాబిచ్చాడు.

తర్వాత వాళ్ళు తెలివైన మతగురువు వైపు తిరిగి, అతన్ని అదే ప్రశ్న అడిగారు. చాలాసేపు ఆలోచించిన తర్వాత అతను, “నువ్వు తూర్పువైపు చూసి, ఒక స్త్రీ ముఖాన్ని లేదా పురుషుని ముఖాన్ని చూసి, ‘ఆమె నా సహోదరి; అతను నా సహోదరుడు అని చెప్పగలిగినప్పుడు’” అని జవాబిచ్చాడు.13

నా ప్రియమైన స్నేహితులారా, మనం మన తోటివారిపట్ల గౌరవంతో, మర్యాదతో వ్యవహరించి, క్రీస్తునందు నిజమైన సహోదర సహోదరీలుగా ఆదరించినప్పుడు మన జీవితాల్లో నూతన దినపు కాంతి బాగా ప్రకాశిస్తుందని నేను మీకు అభయమివ్వగలను.

ఆయన భూలోక పరిచర్యలో, ఆయన జనులందరికి “మంచి చేయుచు సంచరించుచున్నప్పుడు”14, వారి పుట్టుక, సామాజిక స్థాయి లేదా సాంస్కృతిక లక్షణాలతో సంబంధం లేకుండా ఆయన వద్దకు వచ్చి, ఆయన మంచితనములో పాలుపొందమని వారిని ఆహ్వానిస్తున్నప్పుడు యేసు ఈ సూత్రానికి పరిపూర్ణమైన మాదిరినుంచారు. ఆయన పరిచర్య చేసారు, స్వస్థపరిచారు మరియు ప్రతీఒక్కరి అవసరాలపట్ల, ప్రత్యేకించి ఆ సమయంలో భిన్నంగా పరిగణించబడిన, చిన్నచూపు చూడబడిన లేదా మినహాయించబడిన వారిపట్ల ఎల్లప్పుడూ శ్రద్ధ చూపారు. ఆయన ఎవ్వరినీ నిరాకరించలేదు, కానీ వారిని సమానంగా ప్రేమతో ఆదరించారు, ఎందుకంటే ఆయన వారిని తన సహోదర సహోదరీలుగా, అదే తండ్రి యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా చూసారు.15

ఇది జరిగిన అత్యంత అద్భుతమైన సందర్భాలలో ఒకటి, గలిలయకు ప్రయాణించినప్పుడు రక్షకుడు కావాలని సమరయ గుండా వెళ్ళే దారిని ఎంచుకోవడం.16 అప్పుడు యేసు విశ్రాంతి తీసుకోవడానికి యాకోబు బావి వద్ద కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఉన్నప్పుడు, ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. తన సర్వజ్ఞతలో యేసు–“నాకు దాహమునకిమ్మని” ఆమెను అడిగారు.17

ఒక యూదుడు సమరయ స్త్రీని సహాయం కోసం అడగడం చూసి ఆశ్చర్యపోయిన ఆ స్త్రీ, “యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావు? అంటూ తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.”18

కానీ యేసు సమరయులకు, యూదులకు మధ్య గల దీర్ఘకాలిక శత్రుత్వాన్ని వదిలివేస్తూ ప్రేమతో ఈ స్త్రీకి పరిచర్య చేసారు, నిజంగా ఆయన ఎవరో గ్రహించడానికి—సమస్తమును తెలియజేయు మెస్సీయ ఆయనేనని, ఆయన కోసమే ఆమె ఎదురు చూస్తున్నదని తెలుసుకోవడానికి ఆమెకు సహాయపడ్డారు.19 ఈ మృదువైన పరిచర్య యొక్క ప్రభావం ఆ స్త్రీ ఊరిలోనికి వెళ్లి, “ఈయన క్రీస్తుకాడా?”20 అంటూ జరిగినదానిని జనులకు ప్రకటించేలా చేసింది.

నిర్దయులు, ఆలోచన లేని వ్యక్తులచేత నిరాదరించబడిన, చిన్నచూపు చూడబడిన లేదా హింసించబడిన వారి కోసం నేను లోతైన కనికరం కలిగియున్నాను, ఎందుకంటే వాళ్ళు భిన్నంగా మాట్లాడడం, కనిపించడం లేదా జీవించడం మూలంగా వాళ్ళు తీర్పుతీర్చబడినందుకు లేదా తొలగించబడినందుకు మంచి వ్యక్తులు పడిన బాధను నా జీవితంలో నేను ప్రత్యక్షంగా చూసాను. తమకంటే భిన్నమైన వారి యొక్క న్యూనతపై నమ్మకంతో చీకటి కమ్మిన మనస్సులు, పరిమితమైన దృష్టి మరియు కఠిన హృదయం గలవారి కోసం కూడా నేను నా హృదయంలో నిజమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఇతరులపట్ల వారి పరిమితమైన దృష్టి నిజానికి దేవుని పిల్లలుగా వారు ఎవరో చూసే తమ సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది.

ప్రవక్తలచేత ముందుగా చెప్పబడినట్లు, రక్షకుని రెండవ రాకడకు దారితీసే ప్రమాదకరమైన రోజులలో మనం జీవిస్తున్నాము.21 ప్రపంచం సాధారణంగా బలమైన విభజనల ద్వారా ధ్రువీకరించబడింది, జాతిపరమైన, రాజకీయ, సామాజిక ఆర్థిక పరిమితుల ద్వారా ఉద్ఘాటించబడింది. అటువంటి విభజనలు చివరకు కొన్నిసార్లు తమ తోటివారితో సంబంధాలలో జనుల ఆలోచనా విధానాన్ని, చర్యలను ప్రభావితం చేస్తాయి. ఈ కారణం చేత, ముందుగా ఊహించినవి, తప్పైనవి మరియు తరచుగా వ్యంగ్య ఆలోచనలను ఉపయోగిస్తూ, వారి పట్ల ధిక్కారము, ఉదాసీనత, అగౌరవం మరియు పక్షపాత వైఖరిని కూడా సృష్టిస్తూ వ్యక్తులు ఇతర సంస్కృతులు, తెగలు, జాతుల గురించి తక్కువచేసి మాట్లాడడం, ఆలోచించడం మరియు చర్య తీసుకునే విధానాన్ని వర్ణించడాన్ని చూడడం అసాధారణం కాదు. అటువంటి వైఖరుల మూలాలు గర్వం, అహంకారం, ఈర్ష్య, అసూయ మరియు శరీర సంబంధమైన స్వభావాలలో ఉంటాయి,22 అవి క్రీస్తువంటి సుగుణాలకు పూర్తిగా విరుద్ధమైనవి. ఆయన నిజమైన శిష్యులుగా మారడానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ ప్రవర్తన సరైనది కాదు.23 నా ప్రియమైన సహోదరి మరియు సహోదరులారా, వాస్తవానికి, పరిశుద్ధుల సమాజంలో పక్షపాత ఆలోచనలకు లేదా చర్యలకు స్థానం లేదు.

నిబంధన యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా, మన మధ్య ఉన్న స్పష్టమైన తేడాలను రక్షకుని దృష్టితో24, మనలో ఉమ్మడిగా ఉన్న మన దైవిక గుర్తింపు మరియు బంధుత్వంపై ఆధారపడి చూడడం ద్వారా ఈ విధమైన ప్రవర్తనను తొలగించడానికి మనం సహాయం చేయవచ్చు. ఇంకా, మనం మన పొరుగువారి కలలు, ఆశలు, దుఃఖాలు మరియు బాధలలో మనల్ని మనం ప్రతిబింబించుకునేలా చూడడానికి ప్రయత్నించవచ్చు. దేవుని పిల్లలుగా మనమందరం సహ ప్రయాణీకులం, మన అపరిపూర్ణ స్థితిలో మరియు ఎదగడానికి మన సామర్థ్యంలో సమానులం. దేవునిపట్ల మరియు మనుషులందరి పట్ల ప్రేమతో నింపబడిన హృదయాలతో శాంతియుతంగా కలిసి నడవాలని—లేదా అబ్రహాం లింకన్ గమనించినట్లుగా, “ఎవరి పట్ల ద్వేషంతో నుండక, అందరిపట్ల దాతృత్వం కలిగియుండాలి”25 అని మనం ఆహ్వానించబడ్డాము.

మానవ మర్యాదకు, సమానత్వానికి గౌరవమివ్వాలనే సూత్రం ప్రభువు యొక్క మందిరంలో మనం దుస్తులు ధరించే సాధారణ విధానం ద్వారా ఎలా రుజువు చేయబడిందనే దాని గురించి మీరెప్పుడైనా ధ్యానించారా? ఒక ఉద్దేశ్యంలో ఏకమై, ఆయన పరిశుద్ధ సన్నిధిలో స్వచ్ఛంగా, పరిశుద్ధంగా ఉండాలనే కోరికతో నింపబడి మనమందరం దేవాలయానికి వస్తాము. తెల్లని దుస్తులు ధరించి, మనమందరం ఆయన ప్రియమైన పిల్లలుగా, దేవుని యొక్క స్త్రీ పురుషులుగా, క్రీస్తు యొక్క సంతానంగా ప్రభువు చేత స్వయంగా స్వీకరించబడతాము.26 ఒకే విధమైన విధులను నిర్వహించడానికి, నిబంధనలు చేయడానికి, ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి మనల్ని మనం నిబద్ధులుగా చేసుకోవడానికి, ఒకే విధమైన నిత్య వాగ్దానాలు పొందడానికి మనం విశేషాధికారం కలిగియున్నాము. ఉద్దేశ్యంలో ఏకమై, మనం ఒకరినొకరం నూతన దృష్టితో చూస్తాము మరియు మన ఏకత్వంలో, మనం దేవుని యొక్క దైవిక సంతానంగా మన వ్యత్యాసాలను కొనియాడతాము.

ఇటీవల నేను బ్రెసిలియా బ్రెజిల్ దేవాలయ బహిరంగ సందర్శనలో ప్రముఖులకు, ప్రభుత్వ అధికారులకు మార్గనిర్దేశం చేయడానికి సహాయం చేసాను. బ్రెజిల్ యొక్క ఉపాధ్యక్షుడితో నేను దుస్తులు మార్చుకునే ప్రాంతంలో ఆగాను మరియు మేము దేవాలయం లోపల ప్రతీఒక్కరు ధరించే తెల్లని దుస్తుల గురించి చర్చించాము. మనమందరం దేవుని దృష్టిలో సమానమని మరియు దేవాలయంలో మన గుర్తింపు ఒక దేశపు ఉపాధ్యక్షునిగా లేదా సంఘ నాయకునిగా కాకుండా, ప్రియమైన పరలోక తండ్రి కుమారులుగా మన నిత్య గుర్తింపు ఉంటుందనడానికి ప్రతీకగా తెల్లని దుస్తుల యొక్క సార్వత్రిక ఉపయోగం ఉందని నేను ఆయనకు వివరించాను.

చిత్రం
ఇగువాజు జలపాతం.

ఇగువాజు నది దక్షిణ బ్రెజిల్ గుండా ప్రవహిస్తుంది మరియు ఇగువాజు జలపాతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జలపాతాల వ్యవస్థను రూపొందించే పీఠభూమిలోకి ప్రవహిస్తుంది—అది అత్యంత అందమైన మరియు భూమిపై దేవుని సృష్టిలో ఆకట్టుకునే వాటిలో ఒకటి, ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా యెంచబడింది. భారీ నీటి పరిమాణం ఒకే నదిలోకి ప్రవహిస్తుంది, తర్వాత అసమానమైన వందలాది జలపాతాలను ఏర్పరుస్తూ వేరుపడుతుంది. చిహ్నరూపకంగా చెప్పాలంటే, జలపాతాల యొక్క ఈ అసాధారణ వ్యవస్థ భూమిపై దేవుని కుటుంబం యొక్క ప్రతిబింబం, ఎందుకంటే మన దైవిక వారసత్వం మరియు బంధుత్వం నుండి వచ్చిన ఒకే ఆత్మీయ మూలాన్ని, సారాన్ని మనం పంచుకుంటున్నాము. అయితే, మనలో ప్రతీఒక్కరం భిన్నమైన అభిప్రాయాలు, అనుభవాలు, మనోభావాలతో భిన్నమైన సంప్రదాయాలు, జాతులు మరియు జాతీయతలలో జీవిస్తున్నాము. అయినప్పటికీ, మనల్ని ప్రత్యేకమైన జనులుగా, ప్రియమైన సమాజంగా చేసే మన దైవిక సంబంధాన్ని కోల్పోకుండా మనం దేవుని పిల్లలుగా, క్రీస్తునందు సహోదర సహోదరీలుగా ముందుకు సాగుతున్నాము.27

నా ప్రియమైన సహోదరి మరియు సహోదరులారా, దేవుని ముందు మనమందరం సమానమని, ఒకే నిత్య సామర్థ్యము మరియు వారసత్వంతో మనమందరం పూర్తిగా వరమివ్వబడ్డామనే జ్ఞానము మరియు సాక్ష్యంతో మన హృదయాలను, మనస్సులను సమలేఖనం చేద్దాం. మన మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని మనం మరింత ఆనందిద్దాం మరియు మనమందరం కలిగియున్న విభిన్న గుణాలు, వివిధ బహుమానాలకు విలువిద్దాం. మనం ఆవిధంగా చేసినట్లయితే, మనల్ని ప్రత్యేక జనులుగా, “క్రీస్తు యొక్క సంతానముగా మరియు దేవుని రాజ్యమునకు వారసులుగా”28 గుర్తించే మన దైవిక సంబంధాన్ని కోల్పోకుండా మనం మన స్వంత మార్గంలో ఇగువాజు జలపాతపు నీటిలా ప్రవహిస్తామని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను.

మన మర్త్య జీవితంలో ఈ విధంగా మనం ప్రవహించడాన్ని కొనసాగించినప్పుడు, ఒక క్రొత్త కాంతితో క్రొత్త దినము ఆరంభమవుతుందని, అది మన జీవితాలను ప్రకాశవంతం చేస్తుందని మరియు దేవుని పిల్లల మధ్య ఆయన సృష్టించిన భిన్నత్వం చేత మరింత పూర్తిగా దీవించబడడానికి, దానికి మరింత విలువివ్వడానికి గల అద్భుతమైన అవకాశాలను విశదం చేస్తుందని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను.29 ఆయన కుమారులు మరియు కుమార్తెలందరి మధ్య మర్యాదను, గౌరవాన్ని ప్రోత్సహించడానికి మనం నిశ్చయంగా ఆయన చేతులలో సాధనాలమవుతాము. దేవుడు జీవిస్తున్నాడు. యేసు లోక రక్షకుడు. అధ్యక్షులు నెల్సన్ మన కాలంలో దేవుని ప్రవక్త. ఈ సత్యముల గురించి యేసు క్రీస్తు పవిత్ర నామంలో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు