సర్వసభ్య సమావేశము
వారి కర్తవ్యపు బాటలో
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


వారి కర్తవ్యపు బాటలో

నేడు మీ కర్తవ్యపు బాటలో ముందుకు సాగుతున్న మీరు రక్షకుని యొక్క పునఃస్థాపించబడిన సంఘానికి బలము.

ప్రపంచమంతటా ఉన్న యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యుల కోసం నేనిప్పుడు నా ప్రేమను, ప్రశంసను, కృతజ్ఞతను వ్యక్తపరుస్తుండగా, పరిశుద్ధాత్మ సహాయం కోసం నేను మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

చివరి గుర్రపుబండికి చెందినవారు

1947వ సంవత్సరం మొదటి కడవరి దిన పరిశుద్ధ అగ్రగాములు సాల్ట్ లేక్ లోయకు చేరుకున్న 100వ వార్షికోత్సవం జరుపుకుంది. ఆ సంవత్సరం అనేక జ్ఞాపకార్థ వేడుకలు జరుపబడ్డాయి మరియు బాటలు వేసి, గృహాలను నిర్మించి, బంజరు ఎడారిలో పంటలు పండించి, సమాజాలను స్థిరపరచిన యేసు క్రీస్తు యొక్క అంకితమైన శిష్యుల కోసం లెక్కలేనన్ని కృతజ్ఞతలు వ్యక్తం చేయబడ్డాయి.

1947 అక్టోబరు సర్వసభ్య సమావేశములో ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారులైన అధ్యక్షులు జె. రూబెన్ క్లార్క్ ఈ విశ్వాసులైన అగ్రగాములకు మరపురాని, హత్తుకునే నివాళులర్పించారు.

ఆయన సందేశంలో, పశ్చిమం వైపు వలసను నడిపించిన ప్రఖ్యాత నాయకులైన బ్రిగమ్ యంగ్, హీబర్ సి. కింబల్, విల్ఫర్డ్ వుడ్రఫ్, పార్లీ పి. ప్రాట్ మరియు అనేకమంది ఇతరులకు అధ్యక్షులు క్లార్క్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఈ గుర్తించదగిన వ్యక్తుల విజయాలను వివరించడం ఆయన ప్రధాన ఉద్దేశ్యం కాదు. బదులుగా, గుర్తించబడని లేదా సంఘ చరిత్రలో అధికారికంగా నమోదు చేయబడని దృఢమైన వ్యక్తులపై ఆయన తన వ్యాఖ్యలను కేంద్రీకరించారు. “చివరి గుర్రపుబండికి చెందినవారు”1 అనేది ఆయన సందేశం యొక్క బోధనాత్మక శీర్షిక.

మైదానాలు దాటిన ప్రతి గుర్రపుబండ్ల వరుసలో చివరి గుర్రపుబండిలో ప్రయాణించిన వలసదారులు ఎదుర్కొన్న సవాళ్ళు మరియు వారి స్వభావాల గురించి అధ్యక్షులు క్లార్క్ చాలా వివరంగా చెప్పారు. వారి ముందు వెళ్తున్న గుర్రపుబండ్లన్నిటి చేత పైకి రేగిన దుమ్ములో రోజులు, వారాలు, నెలల తరబడి ఉక్కిరిబిక్కిరి అయిన—మరియు దారిలో ఎదురైన కనికరంలేని అడ్డంకులను అధిగమించిన ఈ అనామకులు మరియు కీర్తించని హీరోలను ఆయన ప్రశంసించారు.

“చివరి గుర్రపుబండికి చెందినవారు దేవుడు వారిని ప్రేమించారని, పునఃస్థాపించబడిన సువార్త నిజమని, ప్రభువు సహోదరులను ముందుండి నడిపించారనే తమ విశ్వాసం చేత అన్నీ భరిస్తూ అరిగిపోయి, అలసిపోయి, పాదాల నొప్పితో, కొన్నిసార్లు దాదాపు నిరుత్సాహానికి గురవుతూ ముందుకు సాగారు”2 అని అధ్యక్షులు క్లార్క్ ప్రకటించారు.

అతను ఈ ఉత్తేజకరమైన ప్రశంసలతో తన సందేశాన్ని ముగించాడు: “విశ్వాసంలో గొప్పవారు, పనిలో గొప్పవారు, నీతివంతమైన జీవనంలో గొప్పవారు, మన అమూల్యమైన వారసత్వాన్ని తీర్చిదిద్దడంలో గొప్పవారైన ఈ వినయపూర్వకమైన ఆత్మలకు నేను వినయంగా నా ప్రేమను, నా గౌరవాన్ని, నా గౌరవప్రదమైన నివాళులను అర్పిస్తున్నాను.”3

తక్కువ సేవ చేసిన వారేమీ కాదు

1990లో, శ్రద్ధగా నమ్మకంగా సేవ చేసినవారు మరియు తక్కువ లేదా ఎటువంటి బహిరంగ గుర్తింపు లేదా ప్రశంసలు పొందని అసంఖ్యాక సంఘ సభ్యుల అనివార్యమైన సహాయాల గురించి ఆనాటి పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క అధ్యక్షులైన, అధ్యక్షుడు హావర్డ్ డబ్ల్యు. హంటర్ ఒక సందేశాన్నిచ్చారు.

అధ్యక్షులు హంటర్ ఇలా వివరించారు:

“యౌవనుడు మరియు ధైర్యవంతుడైన సైన్యాధిపతి మొరోనై గురించి ఇలా చెప్పబడింది:

“‘నిశ్చయముగా మనుష్యులందరు మొరోనైవలే ఉన్న యెడల మరియు ఉండబోయిన యెడల, నరకపు శక్తులు నిరంతరము వణికించబడును; అపవాది నరుల సంతానము యొక్క హృదయములపై ఎన్నడూ శక్తి కలిగియుండడు’ (ఆల్మా 48:17).

“ప్రసిద్ధ మరియు శక్తివంతమైన వ్యక్తికి ఎంత గొప్ప అభినందన. … రెండు వచనాల తర్వాత, మొరోనై కంటే తక్కువ ప్రస్ఫుటమైన పాత్ర పోషించిన హీలమన్ మరియు అతని సహోదరుల గురించి ఇలా వ్యాఖ్యానించబడింది:

“‘ఇప్పుడు హీలమన్‌ మరియు అతని సహోదరులు కూడా జనులకు మొరోనై కంటే ఏమియు తక్కువ సేవ చేసిన వారు కాదు.’(ఆల్మా 48:19).”

“మరొక మాటలో, మొరోనై వలె హీలమన్ గుర్తించదగిన లేదా ప్రస్ఫుటమైనవాడు కానప్పటికీ, అతను సేవ చేయదగినవాడు; అంటే, అతను మొరోనై వలె సహాయకారిగా లేదా ఉపయోగకరంగా ఉన్నాడు”4 అని అధ్యక్షులు హంటర్ కొనసాగించారు.

తర్వాత, సేవ చేయదగిన వారిగా ఉండమని మనందరికి అధ్యక్షులు హంటర్ ఉపదేశించారు. ఆయన ఇలా అన్నారు, “మీరు ఈ సంవత్సరం లేదా రాబోయే సంవత్సరాలలో చేసేదానిలో ఎక్కువమట్టుకు మిమ్మల్ని ప్రసిద్ధుల్ని చేయడం లేదని మీరు భావిస్తే, ధైర్యంగా ఉండండి. ఇప్పటివరకు జీవించిన చాలామంది ఉత్తమ వ్యక్తులు కూడా చాలా ప్రసిద్ధి చెందలేదు. నమ్మకంగా, నిశ్శబ్దంగా సేవ చేయండి మరియు ఎదగండి.”5

వారి కర్తవ్యపు బాటలో

నేడు రక్షకుని వద్దకు వస్తున్న వారు6 మరియు మన సమకాలీన గుర్రపుబండ్ల వరుసలో చివరి బండ్లలో నిబంధన మార్గంలో ముందుకు సాగుతున్న మిలియన్లమంది సంఘ సభ్యుల కొరకు నేను కృతజ్ఞత కలిగియున్నాను—వారు నిజంగా తక్కువ సేవ చేసిన వారేమీ కాదు. పరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తు నందు మీ బలమైన విశ్వాసము మరియు అణకువగల, పవిత్రమైన మీ జీవితాలు నన్ను మంచి మనిషిగా, శిష్యునిగా ఉండడానికి ప్రేరేపిస్తాయి.

నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను. నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను.

మోర్మన్ గ్రంథములో లేమనీయుడైన సమూయేలు చేసిన వ్యాఖ్యానము మీ కోసం నా మనోభావాలను బాగా సంక్షిప్తం చేస్తుంది.

“వారిలో అధికభాగము వారి కర్తవ్యపు బాటలో ఉన్నారు, దేవుని యెదుట జాగ్రత్తగా నడుచుచున్నారు మరియు ఆయన ఆజ్ఞలు, కట్టడలు పాటించుచున్నారు. …

“వారిలో అధికభాగము దీనిని చేయుచున్నారు మరియు వారి సహోదరులలో మిగిలిన వారిని సత్యము యొక్క జ్ఞానమునకు తేగలుగునట్లు అలసిపోకుండా శ్రద్ధతో వారు పాటుపడుచున్నారని నేను మీతో చెప్పుచున్నాను.”7

“వారి కర్తవ్యపు బాటలో” అనే వాక్యభాగము వివేకం గల సహోదర సహోదరీలను వర్ణిస్తుందని నేను నమ్ముతున్నాను, వారు సంఘ సమావేశాల్లో మరియు వివిధ ఇతర సందర్భాల్లో ఒంటరిగా ఉన్నవారి కోసం చూస్తూ, వారి ప్రక్కన కూర్చుంటారు. అంగీకారం లేదా ప్రశంసల అంచనాలు లేకుండా, ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరించుటకు8 వారు నిరంతరం ప్రయత్నిస్తారు.

“వారి కర్తవ్యపు బాటలో” అనే వాక్యభాగము ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘములో నాయకత్వ స్థానంలో సేవచేస్తున్న సహవాసి, తల్లి లేదా తండ్రి లేదా బిడ్డకు మద్దతిచ్చే భాగస్వాములను, పిల్లలను వర్ణిస్తుంది. వారి స్థిరమైన, నిశ్శబ్దమైన, సాధారణంగా గుర్తించబడని నిరంతర ప్రభావం కేవలం నిత్యత్వంలో పూర్తిగా తెలియజేయబడే మార్గాలలో అనేకమంది వ్యక్తులను, కుటుంబాలను దీవించడాన్ని సాధ్యం చేస్తుంది.

“వారి కర్తవ్యపు బాటలో” అనే వాక్యభాగము దేవుని నుండి దూరమైపోయి, తమ పాపాల కోసం పశ్చాత్తాపపడి, రక్షకుని ప్రాయశ్చిత్తము యొక్క శుద్ధిచేసే మరియు స్వస్థపరిచే శక్తిని కోరుతూ, వినయంతో మరలా ఆయన వద్దకు తిరిగివచ్చే 9 వ్యక్తులను వర్ణిస్తుంది. “నిషేధింపబడిన దారుల”11 లోనికి పాపపు మళ్ళింపుల నుండి నిబంధన మార్గానికి తిరిగి రావడం ద్వారా క్రీస్తు నొద్దకు రావడం10 ఆత్మీయంగా ఆవశ్యకమైనది మరియు ధర్మబద్ధంగా కఠినమైనది. వారు విశ్వాసంతో ముందుకు సాగి, మేలుచేయుట యందు విసుకక ఉన్నప్పుడు, వారి వ్యక్తిగత జీవితాల్లో,12 అన్ని తరములకు మరియు నిత్యత్వమునకు వారు ఒక గొప్ప కార్యానికి పునాది వేస్తున్నారు.13

“వారి కర్తవ్యపు బాటలో” అనే వాక్యభాగము ఆయన సువార్త యొక్క అధికారిక నిబంధనలు మరియు విధుల ద్వారా తమపై రక్షకుని కాడి ఎత్తుకోవాలని ఆకాంక్షించే నీతిమంతులను వర్ణిస్తుంది—కానీ తమ నియంత్రణలో లేని అంశాల చేత వారు ఆవిధంగా చేయడం నుండి నిషేధింపబడవచ్చు. మీ వ్యక్తిగత వేదన తొలగిపోతుందని, ఓపికగా మీ చిత్తాన్ని దేవునికి సమర్పించడంలో మీ విధేయత మరియు విశ్వసనీయత “ప్రభువు యొక్క స్వయుక్త కాలమున”14 బహుమానమివ్వబడుతుందని నేను వాగ్దానమిస్తున్నాను. “సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.”15

“వారి కర్తవ్యపు బాటలో” అనే వాక్యభాగము స్నేహితులు మరియు సభ్యులు “సువార్త యొక్క సంపూర్ణతను [వారి] మాతృభాషలో, [వారి] స్వంత భాషలో వినడానికి”16 సహాయపడడం ద్వారా ప్రపంచమంతటా ప్రభువుకు సేవ చేస్తున్న ప్రేరేపిత అనువాదకులను, వ్యాఖ్యాతలను వర్ణిస్తుంది. వారి స్వరాలు, సంకేతభాష, మరియు అనువదించబడిన పత్రాలు నిత్య సత్యాలను తెలియజేస్తాయి, అయినప్పటికీ మనలో చాలా తక్కువమందికి వారి పేర్లు తెలుసు లేదా ఎప్పుడూ వారిని అభినందించము. భాషలు మాట్లాడు వరము చేత దీవించబడిన అనువాదకులు మరియు వ్యాఖ్యాతలు దేవుని వాక్యాన్ని చదవడం మరియు వినడం ద్వారా విశ్వాసమనే ఆత్మీయ బహుమానాన్ని పొందడానికి జనులకు సహాయం చేయడానికి శ్రద్ధగా, నిస్వార్థంగా, చాలా తరచుగా, అనామకంగా సేవ చేస్తారు.17

“వారి కర్తవ్యపు బాటలో” అనే వాక్యభాగము ఫలించి, వృద్ధిచెంది భూమిని నింపమనే తమ నిబంధన బాధ్యతను గౌరవించేవారు మరియు సంస్కార సమావేశాలలో తమ పిల్లలతో పెనుగులాడే బలము, సామర్థ్యంతో దీవించబడిన విశ్వాసులైన వివాహిత స్త్రీ పురుషులను వర్ణిస్తుంది. విపత్తులు మరియు తప్పుడు ప్రాధాన్యతలతో చుట్టుముట్టబడిన పెరుగుతున్న గందరగోళ ప్రపంచంలో, ధైర్యము గల ఈ వ్యక్తులు స్వీయ-కేంద్రీకృతతను గొప్పగా చెప్పుకునే లౌకిక స్వరాలను పట్టించుకోరు; వారు ఆయన పిల్లల కోసం పరలోక తండ్రి యొక్క సంతోష ప్రణాళికలో జీవితపు పవిత్రతను, ప్రాముఖ్యతను గౌరవిస్తారు.

వారు ఆశించిన మరియు కలలుగన్న వారి హృదయాలలోని న్యాయమైన కోరికలు నెరవేరనప్పుడు కూడా అనేకమంది వివాహిత జంటలు దేవుడిని నమ్ముతారు. వారు “ప్రభువు కొరకు ఎదురుచూస్తారు”18 మరియు ఆయన వారి మర్త్య గడువులను చేరుకోవాలని గట్టిగా అడగరు. “ఓ దేవా, నీ కొరకు కనిపెట్టు [వారి] విషయమై ఎంత గొప్ప సంగతులు నీవు సిద్ధపరచియున్నావో అనునది నీవు తప్ప లోకారంభము నుండి ఏ మనుష్యుడు వినియుండలేదు, ఏ చెవికి తెలియలేదు, ఏ కంటికి కనబడలేదు.”19

“వారి కర్తవ్యపు బాటలో” అనే వాక్యభాగము ప్రతీ విశ్రాంతి దినమున సంఘములోని పిల్లలను ప్రేమించి, వారికి బోధించే వేవేలమంది నర్సరీ నాయకులను, ప్రాథమిక బోధకులను వర్ణిస్తుంది.

ఈ అంకితభావం కలిగిన శిష్యులు చేసిన సేవ యొక్క నిత్య ప్రభావాన్ని—పిల్లలకు పరిచర్య చేసేవారికి వాగ్దానం చేయబడిన అద్భుతమైన దీవెనలను పరిగణించండి.

“[యేసు] ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగిలించుకొని–

“ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చుకొనునని వారితో చెప్పెను.”20

“వారి కర్తవ్యపు బాటలో” అనే వాక్యభాగము వృద్ధులైన తల్లిదండ్రులను సున్నితంగా చూసుకునే అంకితమైన పిల్లలు, తన ఇంటి “ద్వారము వద్ద సింహము” వలె కాపలాగా నిలబడి భయపడిన బిడ్డను ఓదార్చే నిద్రలేని తల్లి,21 త్వరగా వచ్చి కుర్చీలు సర్ది, చాలాసేపు వేచియుండి వాటిని మడిచిపెట్టే సంఘ సభ్యులు మరియు వచ్చి చూడండి, వచ్చి సహాయం చేయండి, వచ్చి ఉండండి అని కుటుంబాన్ని, స్నేహితులను, సహచరులను ఆహ్వానించే స్ఫూర్తిదాయక వ్యక్తులను వర్ణిస్తుంది.22

“[మీ] కర్తవ్యపు బాటలో” ముందుకు సాగుతున్న మీలాంటి నిబంధనలు పాటించే వ్యక్తులు మరియు యేసు క్రీస్తు యొక్క భక్తిగల శిష్యుల నుండి ఎంపిక చేసిన కొన్ని ఉదాహరణలు మాత్రమే నేను వివరించాను. తమ “పూర్ణాత్మలను”23 దేవునికి అర్పించే కడవరి దిన పరిశుద్ధుల యొక్క లక్షల కొలది అదనపు మాదిరులు క్రీస్తు-కేంద్రీకృత గృహాలలో మరియు ప్రపంచమంతట ఉన్న సంఘ విభాగాలలో కనుగొనబడతాయి.

పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు ప్రేమిస్తారు, సేవ చేస్తారు, వింటారు, నేర్చుకుంటారు, శ్రద్ధ చూపుతారు, ఓదారుస్తారు, బోధిస్తారు మరియు సాక్ష్యమిస్తారు. “సంతోషము మరియు ఓదార్పుతో [మీ] ఆత్మలు నింపబడు వరకు, అలాగే దేవునికి [మీ] హృదయములను … లోబరచుటను బట్టి వచ్చిన శుద్ధి [మీ] హృదయములను పవిత్రపరచి, శుద్ధి చేయువరకు” కూడా మీరు తరచుగా ఉపవాసముండి ప్రార్థిస్తారు; తగ్గింపునందు బలముగా మరింత బలముగా మరియు క్రీస్తు యొక్క విశ్వాసమందు ధృఢముగా మరింత దృఢముగా అవుతారు.24

వాగ్దానము మరియు సాక్ష్యము

చివరి గుర్రపుబండికి చెందిన వారందరు తక్కువ సేవ చేసిన వారేమీ కాదు మరియు ఈనాడు మీ కర్తవ్యపు బాటలో ముందుకు సాగుతున్న మీరు పునఃస్థాపించబడిన రక్షకుని సంఘము యొక్క బలమైయున్నారు. మరియు ప్రభువు వాగ్దానమిచ్చినట్లుగా, “సమస్త సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు బయలుపరచబడి, యేసు క్రీస్తు సువార్త కొరకు పరాక్రమముతో అంతము వరకు సహించు వారందరిపైన ప్రోక్షించబడును.”25

పరలోక తండ్రి మరియు ఆయన ప్రియ కుమారుడు జీవిస్తున్నారని, వారి వాగ్దానాలు నిశ్చయమైనవని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో ఆనందంగా నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు