సువార్త పరిచర్య: మీ హృదయములో నున్నది పంచుకొనుట
ఈ భూమి పైన మీరు ఎక్కడ ఉన్నప్పటికి, యేసు క్రీస్తు సువార్త యొక్క శుభవార్తను పంచుకొనుటకు మీకు అనేక అవకాశాలు కలవు.
గత నెల మన ప్రియమైన ప్రవక్త యైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చే రోమ్ ఇటలీ దేవాలయాన్ని ప్రతిష్టించడానికి తనతో ప్రయాణము చేయుటకు పన్నెండు మంది అపొస్తలులు ఆహ్వానించబడ్డారు. ప్రయాణిస్తున్నప్పుడు అపొస్తలుడైన పౌలు యొక్క ప్రయాణాల గురించి నేను ఆలోచించాను. ఆయన కాాలములో, యెరూషలేము నుండి రోమ్ వరకు వెళ్లుటకు నలభై దినాలు పట్టేది. నేడు, నాకిష్టమైన విమానాలలో ఒక దానిలో దానికి మూడు గంటల కంటే తక్కువ సమయం పడుతుంది.
పౌలు తాను వ్రాసిన పత్రికలలో చాలావరకు ఆయన రోమ్‌లో ఉన్నప్పుడు వ్రాసినవేనని, అవి సంఘసభ్యులను బలపరచుటలో నాడు నేడు కీలకమని బైబిల్ పండితులు నమ్ముతారు.
పౌలు మరియు ప్రాచీన సంఘము యొక్క ఇతరు సభ్యులు ఆరంభ-దినాల పరిశుద్ధుల త్యాగముతో మిక్కిలి పరిచయము కలవారు. అనేకులు మరణించే వరకు తీవ్రముగా హింసించబడ్డారు.
గత 200 సంవత్సరాలలో, పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు సంఘ సభ్యులు, కడవరి-దిన పరిశుద్ధులు కూడా అనేక రూపాలలో హింసింపబడ్డారు. ఆ హింస జరిగినప్పటికీ (కొన్ని సార్లు దాని వలన), యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము అభివృద్ధి చెందుతూ, ఇప్పుడు భూగోళమంతా కనుగొనబడుతుంది.
చెయ్యవలసింది చాలా ఉంది
అయినప్పటికి మనం వేడుక చేసుకొనుటకు చర్యలు తీసుకొనక ముందు, ఈ గొప్ప విజయము గురించి మనకు మనం అభినందనలు తెలియజేసుకొనకముందు, ఆ అభివృద్ధిని సరైన దృష్టికోణములో ఆలోచించాలి.
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 16 మిలియన్ల సభ్యులను, ఈ ప్రపంచంలోని సుమారు ఏడువందల యాభై కోట్ల మంది ప్రజలతో పోల్చినట్లైతేే - నిజానికి ఇది చాలా చిన్న మంద.1
ఇది ఇలా ఉండగా, ప్రపంచములోని కొన్ని ప్రాంతాలలో క్రైస్తవ విశ్వాసుల సంఖ్య తగ్గిపోతోంది. 2
ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘములో కూడా-మొత్తం సభ్యత్వము పెరుగుతూ ఉండగా-క్రమముగా సంఘములో పాల్గొనుట ద్వారా కలుగు దీవెనలు అపేక్షించని వారు చాలా మంది ఉన్నారు.
అనగా, ఈ భూమిపైన మీరు ఎక్కడ ఉన్నప్పటికి, యేసు క్రీస్తు సువార్త యొక్క ఈ శుభ వార్తను 3 మీరు కలిసే, చదువుకొనే, కలిసి జీవించే లేదా కలిసి పనిచేసి, సాంఘత్యము చేసే జనులతో పంచుకొనుటకు అనేక అవకాశాలు కలవు.
గత సంవత్సరములో, సంఘ ప్రపంచ వ్యాప్త సువార్త ప్రచార కార్యక్రమాలలో పూర్తిగా పాల్గొనుటకు నాకు గొప్ప ఉత్సాహకరమైన అవకాశం కలిగింది. నేను తరచు యేసు క్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన ఈ గొప్ప ఆజ్ఞ గురించి లోతుగా ఆలోచించాను: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనములకు సువార్తను బోధించుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములో వారికి బాప్తిస్మమియ్యుడి.“4
“క్రీస్తు యొక్క సభ్యులు మరియు శిష్యులుగా మన అనుదిన జీవితాలలో ఈ గొప్ప ఆజ్ఞను ఉత్తమంగా మనం ఏవిధంగా నెరవేర్చగలము?“
నేడు మీ హృదయాలలో, మనస్సులలో ఈ ప్రశ్నను లోతుగా ఆలోచించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 5
సువార్త పరిచార కార్యము కొరకు ఒక బహమానము
అనేక దశాబ్దాలుగా సంఘ నాయకులు “ప్రతి సభ్యుడు ఒక సువార్త పరిచారకుడు“ అనే పిలుపు గురించి వక్కాణించారు. 6
యేసు క్రీస్తు సంఘసభ్యులు-పూర్వ కాలములో అదే విధంగా మన కాలములో-తమ స్నేహితులతో, పరిచయస్థులతో సువార్తను ఉత్సాహముతో, సంతోషముతో పంచుకొన్నారు. యేసు క్రీస్తు యొక్క సాక్ష్యముతో వారి హృదయాలు మండుచుండెను, రక్షకుని సువార్తలో వారు కనుగొన్న ఆనందాన్ని ఇతరులు కూడా అనుభవించాలని వారు హృదయపూర్వకంగా కోరుచున్నారు.
దీని కొరకు కొంత మంది సంఘ సభ్యులు ఒక వరమును కలిగియున్నారనిపిస్తుంది. సువార్తకు రాయబారులుగా ఉండుటకు వారు ఇష్టపడతారు. సభ్యుల సువార్త పరిచారకులుగా వారు నిబ్బరంగా, సంతోషముతో సేవ చేసి, పనిని ముందుకు నడిపిస్తారు.
అయినప్పటికి, మనలో కొంతమంది చాలా సంశయిస్తున్నారు. సంఘ కూడికలలో సువార్త ప్రచారం గురించి చర్చించబడినప్పుడు, శిరస్సులు నెమ్మదిగా క్రిందకు దింపబడి, కుర్చీల వెనకాల కనబడకుండా మునిగిపోతాయి, ఇతర సభ్యులను నేరుగా చూడకుండా ఉండుటకు లేఖనాలపైన అవి కేంద్రీకృతమౌతాయి లేదా పూర్తిగా ధ్యానముతో అవి మూయబడతాయి.
ఇది ఎందుకు? సువార్తను పంచుటకు ఏమీ చెయ్యడం లేదని మనం అపరాద భావము ఉండడం వలన కావచ్చు. బహశా దానిని ఎలా చెయ్యాలో తెలియక అనిశ్చిత భావముతో ఉండటం వలన కావచ్చు. లేదా మన సౌకర్య పరిధిని దాటి బయటకు వెళ్లుటకు భయపడడం వలన కావచ్చు.
దీనిని నేను అర్థం చేసుకొన్నాను.
కాని ప్రభువు నైపుణ్యము గల, దోషము లేని ప్రచారయత్నాలను ఆశించడని గుర్తుంచుకోండి. దానికి బదులు, “ప్రభువు హృదయాన్ని, సిద్ధమనస్సును ఆశిస్తున్నాడు.“7
మీరు సువార్త ప్రచారాన్ని సంతోషముతో ఇప్పటికే చేస్తూ ఉన్నట్లైతే, దయచేసి దానిని కొనసాగిస్తు, ఇతరులకు మాదిరికరంగా ఉండండి. ప్రభువు మిమ్ములను దీవిస్తారు.
అయినప్పటికి సువార్త సందేశమును పంచుకొను విషయంలో మీరు వాయిదా వేస్తున్నారని భావిస్తున్నట్లైతే, ఇశ్రాయేలును సమకూర్చమని రక్షకుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను నెరవేర్చుటలో పాల్గొనుటకు ఎవరైనా నిందారహితంగా చేయగల్గు ఐదు విషయాలను నేను సూచించనా?
ఐదు సులభమైన సలహాలు
మొదట, దేవునికి దగ్గరవ్వండి. గొప్ప ఆజ్ఞలలో మొదటిది దేవునిని ప్రేమించుట.8 మనం భూమిపై ఉండుటకు గల కారణాలలో ప్రధానకారణము ఇదే. “నేను నిజంగా పరలోక తండ్రిని నమ్ముచున్నానా?“ అని మీకు మీరు ప్రశ్నించుకోండి.
“ఆయనను నేను ప్రేమిస్తూ, నమ్మకముంచుతున్నానా?“
పరలోక తండ్రికి మీరు ఎంత దగ్గరౌతారో, అంత ఎక్కువగా ఆయన వెలుగు, సంతోషము మీలోనుండి ప్రకాశిస్తాయి. మీలో ఏదో అసమానమైనది, ప్రత్యేకమైనది ఉన్నదని ఇతరులు గుర్తిస్తారు. దానిని గురించి వారు అడుగుతారు.
రెండవది, ఇతరుల కొరకు మీ హృదయాలను ప్రేమతో నింపండి. ఇది గొప్ప ఆజ్ఞలలో రెండవది. 9 మీ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరిని దేవుని బిడ్డగా చూచుటకు ప్రయత్నించండి. వారి పేర్లు మీ పరిచర్య చేయు సహోదరి లేక సహోదరుల జాబితాలో లేనప్పటికి-వారికి పరిచర్య చేయండి
వారితో కలిసి నవ్వండి. వారితో ఆనందించండి. వారితో దుఃఖించండి. వారిని గౌరవించండి. వారిని స్వస్థపరచి, లేవనెత్తి, బలపరచండి.
క్రీస్తు యొక్క ప్రేమను అనుకరించుటకు ప్రయత్నించండి, ఇతరుల కొరకు జాలి కలిగియుండండి-మీతో నిర్దయగా, మిమ్మల్ని హేళనచేసి, మీకు హాని కలిగించాలనుకొనేవారితో కూడా జాలి కలిగి ఉండండి. వారిని ప్రేమించండి, పరలోక తండ్రి యొక్క తోటి పిల్లల వలె వారిని భావించండి.
మూడవది, శిష్యరికపు త్రోవలో నడుచుటకు శ్రమించండి. దేవుని కొరకు, ఆయన పిల్లల కొరకు మీ ప్రేమ ఎక్కువైనప్పుడు, యేసు క్రీస్తును అనుసరించాలన్న మీ నిబద్దత ఎక్కువౌతుంది.
ఆయన వాక్యమును విందారగించుట ద్వారా, ఆధునిక ప్రవక్తలు, అపొస్తలుల బోధనలకు చెవియొగ్గి, అన్వయించుకొనుట ద్వారా ఆయన మార్గము గురించి మీరు నేర్చుకుంటారు. బోధింపబడగల హృదయముతో పరలోక తండ్రితో మీరు సంభాషించినప్పుడు ఆయన మార్గమును అనుసరించుటకు నమ్మకమందు, ధైర్యమందు మీరు వృద్ధిచెందుతారు.
శిష్యరికపు త్రోవలో ప్రతిరోజు కొంచెము, కొంచెముగా, “కృప వెంబడి కృపతో“ 10 “వరుస వెంబడి వరుసలో“11 నడచుటకు సాధన అవసరము. కొన్నిసార్లు రెండడుగులు ముందుకు, ఒక అడుగు వెనుకకు వేస్తాము.
ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు వదలేయవద్దు; సరిగ్గా వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. చివరకు మీరు ఉత్తమంగా, సంతోషంగా మరింత యధార్థంగా అవుతారు. మీ విశ్వాసము గురించి ఇతరులతో మాట్లాడుట మీకు సహజముగా, సాధారణముగా జరుగుతుంది. వాస్తవానికి, సువార్త మీ జీవితాలలో ఎంతో ఆవశ్యకం, అమూల్యమైనదిగా అవుతుందంటే, దానిని ఇతరులతో మాట్లాడకుండా ఉన్నప్పుడు అది కృత్రిమంగా అనిపిస్తుంది. అది వెంటనే జరుగక పోవచ్చు ఏలయనగా అది జీవితకాల ప్రయత్నము. కాని అది జరుగుతుంది.
నాల్గవది, మీ హృదయములో నున్నది పంచుకొనుట. మీరు వీధి మూలలో మెగఫోనుతో నిలబడి మోర్మన్ గ్రంథ వచనాలు గట్టిగా చెప్పమని నేను అడగడం లేదు. నేను అడుగుతున్నదేమిటంటే మీరు వ్యక్తిగతముగానైనా, ఆన్‌లైన్‌లోనైనా- జనులతో సాధారణంగా, సహజముగా కలుసుకున్నప్పుడు మీ విశ్వాసాన్ని ప్రస్థావించే అవకాశాల కొరకు మీరు ఎప్పుడు వెతుకుతూ ఉండండి. నేను అన్నివేళలా సువార్త యొక్క శక్తికి “సాక్షిగా నిలబడండి“12- అవసరమైనప్పుడు మాటలను ఉపయోగించండి13
“క్రీస్తు సువార్త. . . రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది“ కాబట్టి, మీరు దానిని పంచుకొనినప్పుడు మీరు ధైర్యముగాను, నమ్మకముగాను, వినయముగా నుండండి. 14 ధైర్యము, నమ్మకము, వినయము ఒకదానికొకటి విభేదించు లక్షణాలవలే కనిపించును కాని అవి కాదు. సువార్త విలువలను, సూత్రములను కుంచము క్రింద పెట్టవద్దని, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి అని రక్షకుడు ఇచ్చిన ఆహ్వానమును అవి ప్రతిబంబిస్తాయి. 15
దయతో కూడిన అనుదిన క్రియల నుండి యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా ట్విట్టర్‌లో మీరు కలుసుకొను వ్యక్తులతో సాధారణ సంభాషణల వరకు దీనిని చెయ్యడానికి అనేక సామాన్యమైన, సహజమైన మార్గాలు కలవు. ఈ సంవత్సరము మన గృహాలలో, ఆదివారపు బడిలో క్రొత్త నిబంధన గూర్చి నేర్చుకొంటున్నాము. మీతో కలిసి రక్షకుని గూర్చి నేర్చుకొవడానికి మీ స్నేహితులను, మీ పొరుగువారిని సంఘానికి, మీ గృహాలకు ఆహ్వానించడం ఎంత అద్భుతమైన అవకాశము. వారితో సువార్త గ్రంథాలయము యాప్‌ను పంచుకొండి, అందులో వారు రండి, నన్ను వెంబడించండి ని కనుగొనవచ్చును. యౌవనస్థులు, వారి కుటుంబాలు మీకు పరిచయమున్నట్లైతే వారికి యౌవనస్థుల బలము కొరకు అను కరపుస్తకమును ఇచ్చి, ఆ సూత్రాలను అనుసరించి జీవించుటకు మన యౌవనస్థులు ఏవిధంగా శ్రమిస్తారో చూచుటకు రమ్మని వారిని ఆహ్వానించండి.
వారాంతము గురించి ఎవరైనా అడిగినట్లైతే, సంఘములో మీరు ఏమి అనుభూతిచెందారో దాని గురించి మాట్లాడుటకు మీరు సందేహించవద్దు. ఒక సభ ముందర చిన్న పిల్లలు నిలబడి వారు యేసు వలె ఉండుటకు ప్రయత్నిస్తున్నారని ఆతృతతో పాడారని దానిగురించి చెప్పండి. వ్యక్తిగత చరిత్రలు సేకరించుటకు వసతి గృహాలలో ఉన్న వృద్దులకు సహాయము చేయుటకు సమయాన్ని గడిపిన యౌవనుల గుంపు గురించి మాట్లాడండి. మన ఆదివారపు కూడిక కాలపట్టీలో ఇటీవల జరిగిన మార్పుల గురించి, అది మీ కుటుంబాన్ని ఏ విధంగా దీవించిందో మాట్లాడండి. లేదా ఇది యేసు క్రీస్తు యొక్క సంఘము అని మనమెందుకు నొక్కి చెప్పుచున్నామో, మనము కడవరి దిన పరిశుద్ధులమని ఏవిధంగా ప్రాచీన సంఘ సభ్యులు పరిశుద్ధులు అని పిలువబడ్డారో అలాగే మనం కూడా పిలువబడతామని వివరించండి.
యేసు క్రీస్తు, ఆయన సంఘము మీకు ఎందుకు అంత ప్రాముఖ్యమో, మీకు సహజముగాను, స్వాభావికముగాను అనిపించే మార్గాలలో ప్రజలతో చెప్పండి. “వచ్చి చూడుము“16 అని వారిని ఆహ్వానించండి. తరువాత వచ్చి సహాయము చేయుము అని వారిని ప్రోత్సాహించండి. మన సంఘములో సహాయము చేయుటకు జనులకు చాలా అవకాశాలు కలవు.
ఎన్నుకోబడిన వారిని కనుగొనాలని సువార్త పరిచారకుల గురించి మాత్రమే ప్రార్థన చెయ్యవద్దు. వచ్చి చూచి మనకు సహాయపడేవారిని, వచ్చి మనతో ఉండేవారిని కనుకొనాలని మీ పూర్ణ హృదయముతో అనుదినము ప్రార్థించండి. పూర్తి-కాల సువార్త పరిచారకులకు ఈ విషయాన్ని తెలపండి. వారు దేవదూతల వంటివారు, సహాయము చేయుటకు సిద్ధముగా ఉంటారు!
శుభవార్తను పంచుకొన్నప్పుడు, దానిని ప్రేమతోను, సహనముతోను చెయ్యండి. మనం ప్రజలతో కలిసినప్పుడు వారు వెంటనే తెల్లని అంగీ ధరించి, దగ్గరలో ఉన్న బాప్తీస్మపు తొట్టె వద్దకు దారి అడుగుతారు అనే ఉద్దేశముతో మాత్రమే వారితో మాట్లాడినట్లైతే, మనం తప్పు చేస్తున్నాము.
వచ్చి చూచిన వారిలో కొందరు బహుశా ఎప్పటికి సంఘములో చేరకపోవచ్చు; కొందరు కొంత కాలము తరువాత చేరవచ్చును. అది వారి ఎంపిక. కాని అది వారిపట్ల మన ప్రేమను మార్చదు. వచ్చి చూడుము, వచ్చి సహాయము చేయుము, వచ్చి ఉండుము అని వ్యక్తులను, కుటుంబాలను ఆహ్వానిస్తూ ఉండే మన ఉత్సాహపూరితమైన ప్రయత్నాలను అది మార్చకూడదు.
ఐదవది, ఆయన ఆద్భుతకార్యములు చేయుటకు ప్రభువు నమ్మండి. జనులను పరివర్తన చేయుట మీ పని కాదని గ్రహించండి. అది పరిశుద్ధాత్మ యొక్క పాత్ర. మీ పాత్ర ఏమిటంటే మీ హృదయములో ఉన్న దానిని పంచుకొని, మీ నమ్మకాలకు అనుగుణంగా మీరు జీవించాలి.
కాబట్టి, ఎవరైనా సువార్త సందేశాన్ని వెంటనే అంగీకరించకపోతే మీరు నిరుత్సాహపడవద్దు. ఇది వ్యక్తిగత వైఫల్యము కాదు.
అది ఒక వ్యక్తికి పరలోక తండ్రికి మధ్య జరిగే విషయము.
మీ పని ఏమనగా దేవునిని, ఆయన పిల్లలైన మీ పొరుగువారిని ప్రేమించుట.
నమ్మండి, ప్రేమించండి, చెయ్యండి.
ఈ మార్గాన్ని వెంబడించండి, దేవుడు ఆయన అమూల్యమైన పిల్లలను దీవించుటకు మీ ద్వారా అద్భుతకార్యాలను చేస్తారు.
ప్రాచీన కాలంలో యేసు క్రీస్తు యొక్క శిష్యులు ఏమి చేసారో అవి చేయుటకు ఈ ఐదు సలహాలు మీకు సహాయపడతాయి. ఆయన సువార్త, ఆయన సంఘము మీ జీవితంలో, మీరెవరో, మీరేమి చేస్తారో అనేవాటి యొక్క ముఖ్యమైన భాగాలు. కాబట్టి, వచ్చి చూడము, వచ్చి సహాయము చేయుము, వచ్చి ఉండుము అని ఇతరులను ఆహ్వానించండి.
కాని అది కష్టంగా ఉంటే ఎలా?
“కాని,“ మీరు ఇలా అడగవచ్చు, “నేను ఇదంతా చేసినప్పటికి, ఒక వేళ జనులు అంతగా స్పందించకపోతే?“ ఒక వేళ వారు సంఘము గురించి సంక్లిష్టముగా భావిస్తే? ఒక వేళ వారు నా స్నేహాన్ని వదిలివేస్తే?“
అవును, అది జరగవచ్చును. ప్రాచీన కాలమునుండి, యేసు క్రీస్తు శిష్యులు తరచు హింసించబడ్డారు.17 “క్రీస్తు శ్రమలలో [మనము] పాలివారై యున్నంతగా . . . సంతోషించుడి“18 అని అపొస్తలుడైన పేతురు చెప్పెను. పూర్వకాల పరిశుద్ధులు “ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందుకు“19 సంతోషించిరి.
ప్రుభువు ఆశ్చర్యకరమైన మార్గాలలో పనిచేయునని గుర్తుంచుకోండి. తిరస్కారమునకు మీరు ఇచ్చే క్రీస్తును పోలిన మీ ప్రతిస్పందన ఒక ఖఠినమైన హృదయాన్ని సున్నితముగా చెయ్యవచ్చును.
యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా, నేను మిమ్మును సువార్త విలువలకు సజీవులైన సాక్షులుగా ఉండుటకు నమ్మకాన్ని, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘసభ్యునిగా ఎల్లప్పుడు గుర్తించబడుటకు ధైర్యాన్ని, పరలోక తండ్రికి, ఆయన పిల్లలకు మీ యొక్క ప్రేమకు భావవ్యక్తీకరణగా ఆయన పనిలో సహాయము చేయుటకు అణకువను మీకు దీవెనగా ఇస్తున్నాను.
నా ప్రియమైన స్నేహితులారా, “మహిమతోను, ప్రభావముతోను పరిశుద్ధ దేవదూతలతో“20 వచ్చు క్రీస్తు రాకడకు సిద్ధపాటుగా చాలాా కాలం క్రితం ముందుగానే చెప్పబడిన ఇశ్రాయేలీయులను సమకూర్చుటలో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తారని యెరిగి మీరు సంతోషిస్తారు.
పరలోక తండ్రి మిమ్ములను యెరిగియున్నారు. ప్రభువు మిమ్మును ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మును దీవించును. ఈ కార్యం ఆయనచేత నియమించబడినది. మీరు దీనిని చేయగలరు! మనందరము కలిసి దీనిని చెయ్యగలము.
దీనిని నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.