2010–2019
ప్రార్థనకు సమాధానాలు
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


ప్రార్థనకు సమాధానాలు

మన గురించి తండ్రి ఎరిగియున్నారు, మన అవసరతలను యెరుగును, మరియు మనకు పరిపూర్ణముగా సహాయము చేస్తారు.

యేసు క్రీస్తు యొక్క సువార్తలో ఓదార్పునిచ్చు ఒక ముఖ్యమైన సిద్ధాంతమేదనగా పరలోక తండ్రి తన పిల్లల కొరకు పరిపూర్ణమైన ప్రేమను కలిగియున్నారు. ఆ పరిపూర్ణమైన ప్రేమ వలన, మన కోరికలు, అవసరతలకు అనుగుణంగా మాత్రమే కాకుండా ఆయన అనంత జ్ఞానమునకు అనుగుణంగా ఆయన మనలను దీవించును. ప్రవక్తయైన నీఫై చేత సరళముగా చెప్పబడినట్లుగా, “[దేవుడు] తన పిల్లలను ప్రేమించుచున్నారని నేనెరుగుదును.”1

మనకు తెలియకపోయినా లేదా దానిని అర్థము చేసుకోకపోయినా ఆ పరిపూర్ణమైన ప్రేమకు మన జీవిత వివరాలలో పరలోక తండ్రి యొక్క ప్రమేయము ఒక నిదర్శనము . పరలోక తండ్రి యొక్క దివ్యమైన నడిపింపును హృదయపూర్వకమైన, చిత్తశుద్ధిగల ప్రార్థనల ద్వారా మనం వెదకుతాము. మన నిబంధనలను గౌరవించి, రక్షకునివలె మరింతగా అగుటకు ప్రయత్నించినప్పుడు, మనం దివ్యమైన నడిపింపు యొక్క స్థిరమైన2 ప్రవాహమును పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము మరియు ప్రేరేపణ ద్వారా పొందుటకు అర్హులమౌతాము.

లేఖనములు మనకు ఇలా బోధిస్తున్నవి: “మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును”3, మరియు ఆయన “కళ్ళెదుట సమస్తమును ఉన్నవి గనుక, [ఆయన] సమస్తమును యెరుగును.”4

దీనికి ప్రవక్తయైన మోర్మన్ ఒక ఉదాహరణ. తాను చేసిన కార్యము యొక్క ఫలితాలను చూచుటకు అతడు జీవించియుండలేదు. అయినప్పటికి ప్రభువు తనను జాగ్రత్తగా నడిపిస్తున్నారని అతడు గ్రహించాడు. తన గ్రంథంతో నీఫై చిన్న పలకలను చేర్చాలని ప్రేరేపించబడినట్లు భావించినప్పుడు మోర్మన్ ఇలా వ్రాసెను: “మరియు నేను దీనిని ఒక తెలివైన ఉద్దేశము నిమిత్తము చేయుచున్నాను; ఏలయనగా అది నాయందున్న ప్రభువు ఆత్మ యొక్క కార్యములను బట్టి, అది నన్ను ప్రేరేపించుచున్నది. ఇప్పుడు నేను అన్ని విషయములను ఎరుగను. కానీ, ప్రభువు రాబోవు సంగతులనన్నిటిని ఎరుగును; అందువలన ఆయన చిత్తమును బట్టి, ఆయన నాయందు పనిచేయును.”5 భవిష్యత్తులో కోల్పోబడు 116 చేతివ్రాత ప్రతుల గురించి మోర్మన్‌కు తెలియనప్పటికి, అది జరగక ముందే చాలాకాలం క్రితమే ఆ అడ్డంకును జయించుటకు ప్రభువు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసెను.

తండ్రి మనల్ని ఎరిగియున్నారు, మన అవసరతలను యెరుగును, మరియు పరిపూర్ణముగా మనకు సహాయము చేస్తారు. కొన్నిసార్లు ఆ సహాయము ఆ క్షణమే చేయబడుతుంది లేదా కనీసం మనం దైవిక సహాయము కోరిన వెంటనే చేయబడుతుంది. కొన్నిసార్లు మన అత్యంత గంభీరమైన, యోగ్యమైన కోరికలు మనం ఆశించినట్లుగా సమాధానమివ్వబడవు, కాని దేవుడు ఇంకా గొప్ప దీవెనలను భద్రపరచియున్నాడని మనము కనుగొంటాం. కొన్నిసార్లు మన నీతికరమైన కోరికలు ఈ జీవితములో అనుగ్రహింపబడవు. ఆయనకు మనము చేయు మనఃపూర్వకమైన విన్నపములకు మన పరలోక తండ్రి సమాధానమిచ్చు విధానాలను మూడు వేర్వేరు వృత్తాంతాల ద్వారా నేను వివరిస్తాను.

ఫ్రాన్స్ పారిస్ మిషనులో సువార్త పరిచారకునిగా పనిచేయుటకు మా చిన్నకుమారుడు పిలువబడ్డాడు. సేవ చేయుటకు సిద్ధపాటులో భాగముగా, చొక్కాలు, సూటులు, టైలు, సాక్సులు, పైకోటును కొనడానికి మేము అతనితో వెళ్లాము. దురదృష్టవశాత్తు, తనకు కావలసిన పైకోటు సైజు వెంటనే అక్కడ అందుబాటులో లేదు. అయినప్పటికి, కొన్ని వారాాలలో ఆ కోటు అందుబాటులో ఉంటుందని, మా కుమారుడు ఫ్రాన్స్‌కు వెళ్లేముందు అది ప్రోవోలోని మిషనరీ తర్ఫీదు కేంద్రమునకు అందజేయబడుతుందని ఆ దుకాణాం గుమస్తా సూచించాడు. మేము ఆ కోటుకు వెల చెల్లించి, దాని గురించి ఇక ఆలోచించలేదు.

మా కుమారుడు జూన్‌లో మిషనరీ తర్ఫీదు కేంద్రములో ప్రవేశించాడు, ఆగష్టులో తన నియమిత స్థలానికి బయలుదేరటానికి కొన్ని రోజుల ముందు పైకోటు అందజేయబడింది. అతడు ఆ కోటును వేసుకొని చూడలేదు కాని కంగారుగా తన బట్టలు ఇతర వస్తువులతో కలిపి దానిని తన లగేజిలో సర్దుకున్నాడు.

మా కుమారుడు సేవ చేస్తున్న ప్యారిస్‌లో చలికాలము సమీపించినప్పుడు, అతడు ఆ పైకోటును తీసి, వేసుకోవడానికి ప్రయత్నించాడు కాని అది చాలా చిన్నదిగా ఉందని మాకు వ్రాసాడు. కాబట్టి మేము అతడు ప్యారిస్‌లో మరొక కోటు కొనుక్కోవటానికి తన బ్యాంకు ఖాతాలో అదనపు నిధులను జమచేసాము, అతడు ఆవిధంగా చేసాడు. అతడు ఆ కోటును ఉపయోగించలేడు, కాబట్టి ఆ కోటును ఎవరికైనా ఇచ్చివెయ్యమని తెలుపుతూ కాస్త చిరాకుతో నేను అతనికి వ్రాసాను.

తరువాత మాకు అతడి నుండి ఈ ఈ-మెయిల్ వచ్చింది: “ఇక్కడ చాలా, చాలా చలిగా ఉన్నది. … నా క్రొత్త కోటు చాలా బాగా, బరువుగా ఉన్నప్పటికి, చలిగాలి నాలోపలికి చొచ్చుకొని పోతున్నట్లు ఉంది. … [మా అపార్టుమెంటులో ఉన్న మరొక మిషనరీకి] నా పాతకోటును ఇచ్చాను, మంచి కోటు పొందే కొరకు మార్గము చూపించమని అతడు ప్రార్థిస్తూ ఉన్నానని నాకు చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం అతడు పరివర్తన చెందాడు, అతడు తన తల్లిని మాత్రమే కలిగియున్నాడు. … అతడికి బాప్తీస్మమిచ్చిన సువార్త పరిచారకుడు అతడి సువార్త పరిచర్యలో అతనికి సహాయపడుతున్నాడు. అందువలన తన ప్రార్థనలకు ఆ కోటు సమాధానము, కాబట్టి దానిగురించి నేను చాలా సంతోషించాను.”6

ఇంటినుండి 6,200 మైళ్ళ (10,000 కిలోమీటర్ల) దూరంలో ప్యారిస్‌లో సేవ చేస్తున్న ఈ సువార్త పరిచారకునికి చలిగా ఉన్న శీతాకాలములో ఒక క్రొత్త పైకోటు తక్షణమే కావాలి, కాని ఈ సువార్త పరిచారకుని వద్ద దానిని కొనుక్కోవడానికి డబ్బులు లేవని పరలోక తండ్రికి తెలుసు. మా కుమారుడు ప్రోవో, యూటాలోని దుస్తుల అంగడినుండి చాలా చిన్నదైన పైకోటును అందుకుంటాడని కూడా పరలోక తండ్రికి తెలుసు. ఈ ఇద్దరు సువార్త పరిచారకులు ప్యారిస్‌లో కలిసి సేవ చేస్తారని, తక్షణ అవసరత గల ఒక మిషనరీ యొక్క దీనమైన, చిత్తశుద్ధిగల ప్రార్థనకు సమాధానము ఆ కోటు అవుతుందని ఆయనకు తెలుసు.

రక్షకుడు ఇలా బోధించారు:

“రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైనను నేలను పడదు.

“మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి.

“గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు.”7

ఇతర సందర్భాలలో, మన న్యాయమైన కోరికలు మనం ఆశించిన విధముగా అనుగ్రహించబడనప్పుడు, అది చివరకు మన ప్రయోజనము కొరకై ఉండవచ్చును. ఉదాహరణకు, యాకోబు కుమారుడైన యోసేపు తన సహోదరులచేత ఎంతగా ఈర్ష్యపడి, ద్వేషింపడబడ్డాడంటే, వారు అతడిని చంపుటకు ప్రణాళిక చేసారు. బదులుగా, వారు అతడిని ఐగుప్తీయులకు బానిసగా అమ్మివేసారు.8 ఒక వ్యక్తి తాను ఆశించిన విధంగా తన ప్రార్థనలకు సమాధానాలు రాలేదని ఎవరైనా అనుకొని ఉంటే, అది యోసేపే అయి ఉండవచ్చు. వాస్తవానికి, స్పష్టముగా కనపడు అతని దురదృష్టము తరువాత అతనికి అది గొప్ప దీవెనగా మారి, ఆకలి నుండి అతడి కుటుంబాన్ని కాపాడింది. ఐగుప్తులో ఒక నమ్మకస్తుడైన నాయకుడైన తరువాత గొప్ప విశ్వాసము మరియు జ్ఞానముతో అతడు తన సహోదరులతో ఇలా చెప్పెను:

“అయినను నేనిక్కడికి వచ్చు నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.

“రెండు సంవత్సరముల నుండి కరవు దేశములో నున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును.

“మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.

“కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు.”9

మా పెద్ద కుమారుడు కళాశాలలో ఉన్నప్పుడు, చాలా మంచి పార్ట్-టైం విద్యార్థి ఉద్యోగము వచ్చింది, అది అతడు పట్టభద్రుడు అయిన తరువాత అద్భుతమైన, శాశ్వతమైన ఉద్యోగముగా మారే సామర్థ్యము కలిగియున్నది. ఈ విద్యార్థి ఉద్యోగములో నాలుగు సంవత్సరాలు అతడు చాలా కష్టపడి పనిచేసాడు, ఉన్నతమైన అర్హత సంపాదించాడు, మరియు తన తోటి ఉద్యోగులు, పైఅధికారుల చేత బాగా గౌరవించబడ్డాడు. అతడి విద్యాభ్యాసము యొక్క నాలుగవ సంవత్సరము ముగిసిన తరువాత, పరలోకము రహస్యముగా తన కొరకు ప్రణాళిక చేసినట్లుగా (మా కుమారుని ఆలోచన ప్రకారము), ఆ శాశ్వత ఉద్యోగ స్థానము ఖాళీ అయ్యింది, మరియు దానికతడు ముఖ్యమైన అభ్యర్థి, ప్రతి సూచన, అంచనాల ప్రకారము అతడు ఆ ఉద్యోగాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు.

కాని, అతడికి ఆ ఉద్యోగం రాలేదు. మాలో ఎవరూ దానిని గ్రహించలేదు. అతడు బాగా సిద్ధపడ్డాడు, మౌఖిక పరీక్ష బాగా చేసాడు, మిక్కిలి అర్హతగల అభ్యర్థి, మరియు గొప్ప ఆశతో, ఆకాంక్షతో ప్రార్థించాడు! అతడు నిరుత్సాహపడ్డాడు, నలిగిపోయాడు, మరియు ఈ పూర్తి సంఘటన మా అందర్ని అయోమయంలో పడేసింది. అతని నీతిగల కోరిక తీర్చకుండా దేవుడు ఎందుకు వదిలేసాడు?

చాలా సంవత్సరాల తరువాత కాని ఆ ప్రశ్నకు సమాధానము స్పష్టముగా రాలేదు. పట్టభద్రుడైన తరువాత తాను కలగన్న ఉద్యోగాన్ని పొందియుంటే, ఇప్పుడు తన నిత్య ప్రయోజనమునకు, దీవెనకు సహాయపడునని నిరూపించబడిన, జీవితాన్ని మార్చే గొప్ప అవకాశాన్ని అతడు కోల్పోయి ఉండేవాడు. (ఆయనకు ఎల్లప్పుడు తెలిసిన విధంగా) ఆదినుండి అంతము వరకు దేవుడు ఎరుగును, ఈ విషయంలోనైతే, ఒక మహోన్నతమైన ఫలితమునకు అనుకూలంగా అవును అని చెప్పుట కొరకు, అనేక నీతిగల ప్రార్థనలకు సమాధానము కాదు అని ఇవ్వబడును.

కొన్నిసార్లు మనం చాలా నీతికరముగా, నిర్విరామంగా, మనఃపూర్వకంగా చేయబడిన ప్రార్థనకు ఈ జీవితములో సమాధానము ఇవ్వబడదు.

సహోదరీ ప్యాట్రిషియా పార్కిన్సన్ సాధారణ కంటి చూపుతోనే జన్మించింది, కానీ ఏడవ సంవత్సరములో ఆమె కంటిచూపు క్షీణించడం మొదలు పెట్టింది. ప్యాట్ తొమ్మిదవ సంవత్సరములో, ఆగ్డెన్, యూటాలో ఉన్న చెవిటి, గ్రుడ్డివారి కొరకుగల యూటా పాఠశాలలో హాజరగుట మొదలు పెట్టింది, అది ఇంటినుండి 90 మైళ్లు (145 కి.మీ) దూరంలో ఉండటం వలన, పాఠశాలలోనే నివాసముండుట తప్పనిసరి అయ్యింది--అది ఒక తొమ్మిది సంవత్సరాల వయసుగల వారు అనుభవించే ఇంటిమీద ఉండే బెంగంతంటిని కలిగియున్నది.

11 సంవత్సరాలు వచ్చేసరికి, ఆమె పూర్తిగా తన కంటిచూపును కోల్పోయింది. తన ప్రాంతీయ ఉన్నత పాఠశాలకు హాజరగుటకు 15 సంవత్సరాల వయస్సులో ప్యాట్ శాశ్వతముగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె కాలేజీకి వెళ్లి కమ్యునికేషన్ డిసార్డర్ అండ్ సైకాలజీలో డిగ్రీ పొందింది, తరువాత సందేహిస్తున్న విశ్వవిద్యాలయ ప్రవేశ అధికారులతో వీరోచితముగా పోరాడి, ఆమె విశ్వవిద్యాలయములో స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందింది. ప్యాట్ ఇప్పుడు 53మంది ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులతో పనిచేస్తుంది మరియు తన జిల్లా పాఠశాలలో నలుగురు మాట-భాషా సాంకేతిక నిపుణులను పర్యవేక్షిస్తుంది. ఆమె స్వంత గృహమును, స్వంత కారును కలిగియున్నది, ప్యాట్ ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినప్పుడు ఆ కారును తన స్నేహితులు, కుటుంబ సభ్యులు నడుపుతారు.

చిత్రం
సహోదరి ప్యాట్రిషియా పార్కిన్‌సన్

పదేళ్ల వయస్సులో, క్షీణిస్తున్న తన కంటిచూపును బాగు చేయడానికి, ఇంకొక వైద్య ప్రక్రియ చేయబడుటకు ప్యాట్ నియమించబడింది. ఆమె యొక్క వైద్య సంరక్షణ గురించి ఖచ్చితంగా ఏమి జరుగుతుందో తన తల్లిదండ్రులు ప్యాట్‌కు ఎప్పుడు చెప్పేవారు, కాని ఏ కారణం చేతనో ఈ ప్రత్యేక ప్రకియ గురించి వారు ఆమెకు చెప్పలేదు. ఈ ప్రక్రియకు సమయము నిర్ణయించబడిందని ఆమెతో తన తల్లిదండ్రులు చెప్పినప్పుడు, తన తల్లి మాటలు ప్యాట్‌లో గందరగోళం సృష్టించాయి. ప్యాట్ వేరే గదిలోకి పరుగెత్తింది కాని తరువాత తిరిగి వచ్చి కాస్త కోపంగా తల్లిదండ్రులతో ఇలా అన్నది “విషయమేమిటో నన్ను చెప్పనివ్వండి. అది నాకు తెలుసు, అది దేవునికి తెలుసు, అది మీకు కూడా బాగా తెలిసే ఉంటుంది. మిగిలిన నా జీవితమంతా నేను కంటిచూపు లేకుండా ఉంటాను!”

కొన్ని సంవత్సరాల క్రితం, కాలీఫోర్నియాలో నివసిస్తున్న తన కుటుంబ సభ్యులను దర్శించుటకు ప్యాట్ ప్రయాణం చేసింది. తన మూడు సంవత్సరాల మేనల్లుడితో (సహోదరుని కుమారుడు) బయట ఉండగా, అతడు ఆమెతో, “ప్యాట్ అత్త, క్రొత్త కళ్ళు ఇవ్వమని పరలోక తండ్రిని నీవెందుకు అడుగకూడదు? నీవు పరలోక తండ్రిని అడిగితే, నీకు కావలసినది ఏదైనా ఆయన ఇస్తారు. నీవు కేవలం అడిగితే చాలు.”

ఆ ప్రశ్నకు అవాక్కయ్యానని, అయితే ఇలా సమాధానమిచ్చానని ప్యాట్ చెప్పింది, “అవును, కాని కొన్నిసార్లు పరలోక తండ్రి ఆవిధంగా పనిచెయ్యరు. కొన్నిసార్లు నీవు కొన్నివిషయాలు నేర్చుకోవాలని ఆయన కోరతారు, కనుక నీవు అడిగిన ప్రతిదానిని నీకు ఇవ్వరు. కొన్నిసార్లు నీవు వేచియుండాలి. మనకు ఏది మంచిదో, మనకు ఏది అవసరమో పరలోక తండ్రికి, రక్షకునికి ఉత్తమంగా తెలుసు. అందువలన, నీవు కోరిన ప్రతీది, నీవు అడిగిన క్షణమే వారు నీకు దయ చేయరు.”

చాలా సంవత్సరాలుగా నాకు ప్యాట్ తెలుసు, ఆమె ఎల్లప్పుడు సానుకూలముగా, సంతోషముగా ఉండే వాస్తవమును నేను మెచ్చుకుంటున్నానని ఇటీవల ఆమెతో చెప్పాను. ఆమె ఇలా స్పందించింది, “అవును, మీరు నాతో యింటిలో ఎన్నడూ లేరు, అవును కదా? నాకు కూడా విచారకరమైన గడియలు ఉన్నాయి. నాకు తీవ్రమైన నిరాశగల పోరాటములు కలిగాయి, మరియు నేను చాలా ఏడ్చాను.” అయినప్పటికినీ, ఆమె ఇలా చెప్పింది, “నా చూపును కోల్పోతున్న సమయము నుండి, అది చాలా విచిత్రముగా ఉంది, కాని పరలోక తండ్రి, రక్షకుడు నాతోను, నా కుటుంబముతోను ఉన్నారు. మాకు సాధ్యమైనంత ఉత్తమ విధానములో దానిని మేము నిర్వహించాము, నా అభిప్రాయములో సరైన మార్గములోనే దానిని మేము నిర్వహించాము. చివరకు నేను తగినంత విజయవంతమైన వ్యక్తిగా అయ్యాను, మరియు సాధారణంగా నేను ఆనందంగా ఉండే వ్యక్తిని. ప్రతి విషయములోను ఆయన హస్తము ఉండుటను నాకు జ్ఞాపకమున్నది. నేను గ్రుడ్డిదానిని కాబట్టి నేను కోపముగా ఉంటానా అని అడిగే వారికి నా సమాధానము ఇదే: “నేనెవరిమీద కోపంగా ఉండాలి? పరలోక తండ్రి దీనియంతటిలో నాతో ఉన్నారు; నేను ఒంటరిగా లేను. పరలోక తండ్రి ఎల్లప్పుడు నాతో ఉన్నారు.’”

ఈ సందర్భములో, తన కనుచూపు తిరిగి పొందాలన్న ప్యాట్ కోరిక ఈ జీవితములో అనుగ్రహింపబడదు. కాని తన తండ్రి యొద్దనుండి తాను నేర్చుకొన్న నీతి వాక్యమేమంటే, “ఇది కూడా తొలగిపోతుంది.”10

అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఇలా చెప్పారు, “ఈ క్షణములో తండ్రికి మీ గురించి, మీ భావాల గురించి, మరియు మీ చుట్టూ ఉన్నవారందరి లౌకిక, ఆధ్యాత్మిక అవసరతల గురించి తెలుసు.”11 నేను వర్ణించిన ఈ మూడు అనుభవాలలో ఈ గొప్ప, ఓదార్పునిచ్చు సత్యమును కనుగొనవచ్చును.

సహోదర, సహోదరీలారా, మనం ఆశించిన ఫలితముతో కొన్నిసార్లు మన ప్రార్థనలు వెంటనే సమాధానమివ్వబడతాయి. కొన్నిసార్లు, మనం ఆశించిన విధంగా మన ప్రార్థనలకు సమాధానమివ్వబడదు, అయినప్పటికి మనం మొదట ఆశించిన దానికంటే గొప్ప దీవెనలను పరలోక తండ్రి మనకొరకు సిద్ధపరిచారని కాలాక్రమేణా మనం తెలుసుకొంటాము. కొన్నిసార్లు దేవునితో చేయు మన నీతికరమైన విన్నపములు ఈ జీవితములో అనుగ్రహింపబడవు. 12 ఎల్డర్ నీల్ ఏ. మ్యాక్స్‌వెల్ చెప్పినట్లుగా, “విశ్వాసమనేది దేవుని యొక్క సమయముపైన నమ్మకముంచుటను కూడా కలిగియుంటుంది.“13

ఆయన విధానములో, ఆయన కాలములో పరలోక తండ్రి మనల్ని దీవించి, మన సమస్యలను, అన్యాయాలను, నిరాశలను పరిష్కరించును అనే అభయాన్ని మనం కలిగియున్నాము.

రాజైన బెంజిమెన్‌ను వ్యాఖ్యానించుటకు: “ఇంకను, దేవుని ఆజ్ఞలను గైకొను వారి ఆశీర్వాదకరమైన, సంతోషమైన స్థితిని మీరు తలంచవలెనని నేను కోరుచున్నాను. ఏలయనగా, ఇదిగో వారు ఐహికమైన, ఆత్మసంబంధమైన రెండిటి యందు అన్ని విషయాలలో ఆశీర్వదింపబడి యున్నారు; వారు అంతము వరకు విశ్వాసముతో స్థిరముగా ఉండిన యెడల వారు పరలోకములోనికి చేర్చుకొనబడుదురు, దానిని బట్టి వారు దేవునితో ఎన్నడును అంతము కాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు. జ్ఞాపకముంచుకొనుడి, ఈ వాక్యములు సత్యమని జ్ఞాపకముంచుకొనుడి; ఏలయనగా ప్రభువైన దేవుడు దానిని పలికియున్నాడు.“14

దేవుడు మన ప్రార్థనలను వింటారని నేనెరుగుదును.15 సమస్తమెరిగిన, ప్రేమగల తండ్రిగా, ఆయనకున్న అనంత జ్ఞానమును బట్టి మరియు చివరకు మనకు అంతిమ ప్రయోజనకరముగా, దీవెనకరముగా ఉండే మార్గాలలో మన ప్రార్థనలకు పరిపూర్ణముగా సమాధానమిస్తారని నేనెరుగుదును. ఈ విధంగా యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు