2010–2019
క్రీస్తు: అంధకారములో ప్రకాశించు వెలుగు
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


2:3

క్రీస్తు: అంధకారములో ప్రకాశించు వెలుగు

మీ సాక్ష్యానికి దారిచూపే చుక్కాని విఫలమైనట్లు, అంధకారము చుట్టుముట్టినట్లు మీరు భావించినట్లయితే, ధైర్యం తెచ్చుకోండి. దేవునితో మీరు చేసిన వాగ్దానాలను పాటించండి.

ఉపశమన సమాజ భవనంలో నా కార్యాలయము నుండి సాల్ట్ లేక్ దేవాలయము స్పష్టంగా కనిపిస్తుంది. గడియారం క్రమం తప్పనట్లు, ప్రతి రాత్రి దేవాలయము బయటి దీపాలు చీకటిపడగానే వెలుగుతాయి. దేవాలయము నా కిటికీ బయటనున్న స్థిరమైన, తిరిగి హామీనిచ్చు చుక్కాని.

సాయంకాలము చీకటిపడే సమయములో సాల్ట్‌లేక్ దేవాలయము

గత ఫిబ్రవరిలో ఒక రాత్రి, సూర్యుడు అస్తమించగానే నా కార్యాలయము చాలా చీకటిగా మారింది. కిటికీ నుండి బయటికి చూసినప్పుడు, దేవాలయము చీకటిగా ఉంది. దీపాలు వెలగలేదు. అకస్మాత్తుగా నేను నిరుత్సాహపడ్డాను. సంవత్సరాల తరబడి ప్రతి సాయంత్రం నేను చూసిన దేవాలయ శిఖరాలను నేను చూడలేకపోయాను.

వెలిగించని స్తంభాలతో సాల్ట్‌లేక్ దేవాలయము.

వెలుగును చూడాలని నేనాశించిన చోట చీకటిని చూడడం--- ఎదగడానికి మనకున్న ప్రధాన అవసరాలలో ఒకటి మన వెలుగుకు మూలాధారమైన యేసు క్రీస్తుతో-- అనుసంధానింపబడి యుండటమని నాకు గుర్తుచేసింది. ఆయనే మన శక్తికి మూలము, లోకమునకు వెలుగు, జీవము. ఆయనతో బలమైన సంబంధం లేకపోతే, మనం ఆత్మీయంగా మరణించడం మొదలవుతుంది. అది ఎరిగిన సాతాను, మనమందరం ఎదుర్కొనే లోక ఒత్తిడులను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు. మన వెలుగును తగ్గించి, సంబంధాన్ని బలహీనపరచి, శక్తి అందకుండా ఆపివేసి, అంధకారంలో మనల్ని ఒంటరిగా వదిలివేయడానికి అతడు పనిచేస్తాడు. ఈ ఒత్తిడులు మర్త్యత్వంలో చాలా సహజమైనవి, కానీ మనల్ని ఒంటరిగా చేసి, మనం మాత్రమే వాటిని అనుభవిస్తున్నామని చెప్పడానికి సాతాను కష్టపడి పనిచేస్తాడు.

మనలో కొందరు వేదనతో అచేతనులయ్యారు.

విషాదాలు మనల్ని ఓడించినప్పుడు, మనకు ఊపిరాడనంతగా జీవితం బాధించినప్పుడు, యెరికో మార్గంలో దెబ్బలు తిని, చచ్చినట్లు పడియున్న వ్యక్తిలా దెబ్బతిన్నప్పుడు, యేసు ఆ దారిన వచ్చి, మన గాయాలకు మందు పూసి, సున్నితంగా మనల్ని పైకెత్తి, సత్రంలోనికి తీసుకువెళ్ళి, మన బాగోగులు చూస్తారు.1 మనలో వేదనతో ఉన్న వారితో ఆయనిలా అన్నారు, మీ భుజములపై నున్న భారములను నేను సడలించెదను, అందువలన … వాటిని మీ వీపులపైన అనుభవించరు, … నేను ప్రభువైన దేవుడనని నా జనులను వారి శ్రమలలో దర్శించుదునని మీరు నిశ్చయముగా తెలుసుకొందురు. 2 క్రీస్తు గాయాలను మాన్పును.

మనలో కొందరు బాగా అలసిపోయారు.

ఎల్డర్ హాలండ్ ఇలా అన్నారు, “మన శక్తికి మించి మనం పరుగెత్తాలని ఆశించబడలేదు. … కాని (అయినప్పటికీ), మీలో అనేకమంది (చాలా) చాలా వేగంగా, శక్తి మరియు భావోద్వేగ సరఫరా ఖాళీ కావస్తున్నదని తెలిసేవరకు పరిగెత్తుతారని … నాకు తెలుసు.”3 అంచనాలు మనల్ని ముంచెత్తినప్పుడు, మనం ఒక అడుగు వెనక్కి వేసి, దేనిని వదిలేయాలని పరలోకతండ్రిని అడగవచ్చు. మన జీవితానుభవంలో భాగమేదనగా, ఏది చేయకూడదో తెలుసుకోవడం. అయినప్పటికీ, కొన్నిసార్లు జీవితం నిర్వీర్యం కాగలదు. “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును,” అని యేసు మనకు హామీ ఇస్తున్నారు.4

కాడినెత్తుకొనుటలో మనతో చేరడానికి, మన భారములను తేలికచేసేలా దానిని లాగడానికి క్రీస్తు సిద్ధంగా ఉన్నారు. క్రీస్తే విశ్రాంతి.

సాంప్రదాయ అచ్చులో మనం సరిపోమని మనలో కొందరు భావిస్తారు.

మనం ఆమోద యోగ్యంగా లేక అంగీకరింపబడినట్లుగా భావించకపోవడానికి అనేక కారణాలుండవచ్చు. క్రొత్త నిబంధన కుష్టురోగులు, సుంకరులు, పిల్లలు, గలిలయులు, వేశ్యలు, స్త్రీలు, పరిసయ్యులు, పాపులు, సమరయులు, విధవరాండ్రు, రోమా సైనికులు, వ్యభిచారులు, అంటరానివారు, అన్ని రకాల జనులను చేరుకోవడానికి యేసు చేసిన గొప్ప ప్రయత్నాలను చూపుతుంది. దాదాపు ప్రతి వృత్తాంతములో, ఆచార ప్రకారం సమాజంలో అంగీకరించబడని ఎవరో ఒకరిని ఆయన చేరుకున్నారు.

లూకా 19 లో యెరికోలో ఉన్న జక్కయ్య అను పేరుగల సుంకపు గుత్తదారుని కథ చెప్పబడింది. యేసు రావడం చూడటానికి బదులుగా అతడు చెట్టు ఎక్కాడు. జక్కయ్య, రోమా ప్రభుత్వం చేత నియమించబడి, అవినీతిపరునిగా, పాపిగా యెంచబడ్డాడు. చెట్టుపైనున్న అతడిని చూసి యేసు, “జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని” చెప్పెను.5 యేసు జక్కయ్య హృదయములోని మంచితనాన్ని, ఇతరులకు అతడు చేసిన సహాయాన్ని చూసినప్పుడు, “ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నదని”6 చెప్తూ అతని అర్పణను ఆయన అంగీకరించారు.

“మీలో ఎవడును వెళ్ళిపోరాదని నేను ఆజ్ఞాపించియున్నానని,”7 క్రీస్తు సున్నితంగా నీఫైయులకు చెప్పారు. అపొస్తలుల కార్యములు10 లో ఎపిఫానియాలో పేతురుకు శక్తివంతమైన దర్శనము కలిగెను, “ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడనియైనను అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు,” అని ప్రకటించాడు. 8 ఒకరిపట్ల ఒకరు నిజమైన ప్రేమ చూపడానికి క్రైస్తవ శిష్యులకు, కడవరి-దిన పరిశుద్ధులకు సందేహించని అర్హత ఇదియే.9 జక్కయ్యకు ఇచ్చినట్లుగా అదేవిధమైన ఆహ్వానాన్ని యేసు మనకిస్తున్నారు: “ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.”10 మన చెట్టుమీద క్రీస్తు మనల్ని చూస్తున్నారు.

మనలో కొందరు ప్రశ్నలతో సతమతమవుతున్నారు.

కొంతకాలం క్రితం నేను, జవాబులు కనుక్కోలేని ప్రశ్నలతో నేను కృంగియుండి, విసుగుచెందాను. ఒక శనివారం తెల్లవారుజామున, నాకొక చిన్న కల వచ్చింది. కలలో నేనొక మంటపాన్ని చూసాను, వెళ్ళి దానిలోపల నిలబడాలని నాకు అర్థమైంది. దానిచుట్టూ ఐదు కమానులున్నాయి, కానీ కిటికీలు రాతితో చేయబడ్డాయి. అది చాలా ఇరుకుగా ఉన్నందున, దానిలోపలికి వెళ్ళడం ఇష్టం లేక నేను ఫిర్యాదు చేసాను. అప్పుడు జెరెడ్ యొక్క సహోదరుడు ఎంతో ఓపికతో రాళ్ళను స్పష్టమైన గాజుగా మలచడం గురించి ఒక ఆలోచన వచ్చింది నాకు. గాజు, మొదట రాయిగా ఉండి, మార్పుచెందింది. జెరెడ్ యొక్క సహోదరుని రాళ్ళను ప్రభువు తాకినప్పుడు, చీకటిగానున్న ఓడలలో అవి ప్రకాశించాయి.11 అకస్మాత్తుగా, మరేచోట కన్నా ఎక్కువగా ఆ మంటపంలో ఉండాలనే కోరికతో నింపబడ్డాను నేను. ఈ ప్రదేశము—నిజంగా “గ్రహించేందుకు” నాకు గల ఒకేఒక్క ప్రదేశము. నన్ను వేధించే ప్రశ్నలు విడిచివెళ్లిపోలేదు, కానీ నిద్ర లేచాక, “నీ రాళ్ళు ప్రకాశించునట్లు జెరెడ్ యొక్క సహోదరునిలా నీ విశ్వాసాన్ని నీవెలా పెంచుకుంటావు?” 12 అనే ప్రశ్న గురించి నేను ఎక్కువగా ఆలోచించాను.

అర్థాన్ని కొద్దికొద్దిగా గ్రహించే విధంగా మన మర్త్య మెదడులు తయారు చేయబడ్డాయి. మర్త్యత్వం పైనున్న తెర ఎందుకంత మందంగా ఉందో నాకు తెలియదు. అది మన నిత్య వృద్ధిలో మనము అన్ని జవాబులను కలిగియుండే సమయం కాదు. అది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునందు మన నమ్మకాన్ని (లేక కొన్నిసార్లు మన నిరీక్షణను) వృద్ధి చేసుకొనే సమయము. నమ్మకమనేది ఎల్లప్పుడూ సులువుగా విశ్లేషించలేని విధానములలో వస్తుంది, కానీ మన అంధకారములో చీకటి ఉన్నది. “నేను లోకము యొక్క వెలుగును, జీవమును, సత్యమునైయున్నానని” 13 యేసు చెప్పారు. సత్యమును వెదికే వారికి, ముందుగా అది రాతితో చేయబడిన కిటికీలున్న అవివేకమైన ఇరుకు గదిలా తోచవచ్చు. కానీ ఓపికతో, విశ్వాసం గల ప్రశ్నలతో యేసు మన రాతి కిటికీలను గాజుగాను, వెలుగుగాను మార్చగలరు.క్రీస్తే మనం గ్రహించగల వెలుగు.

మనం ఎప్పటికీ తగినంతగా కాలేమని మనలో కొందరు భావిస్తారు.

పాతనిబంధనలో చెప్పబడిన ఎరుపు రంగు అందమైనదే కాక మన్నికైనది కూడా, అనగా దాని స్పష్టమైన రంగు దారానికి పట్టడమే కాకుండా ఎన్నిసార్లు ఉతికినా వెలసిపోదు.14 ఎరుపు రంగు అంటిన తెల్లదారం ఎప్పటికీ తెలుపు కాలేదని చెప్తూ సాతాను, మనం క్షమార్హులం కాలేమని భావించేలా చేస్తాడు. కానీ, “మీ మార్గముల కంటే నా మార్గములు యెత్తుగా ఉన్నవని” 15 యేసు ప్రకటించారు, మరియు మన పాపముల నిమిత్తము మనము పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన ఎఱ్ఱని రక్తము మనల్ని శుద్ధిచేయడమనేది ఆయన కృప యొక్క అద్భుతము. ఇది తార్కికమైనది కానప్పటికీ, అది నిజమైనది.

ఎరుపురంగులో ముంచుబడిన ఊలు.

iStock.com/iinwibisono నుండి ఛాయాచిత్రము

“మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును. కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లనివగును.”16 అతడు లేక ఆమె “ఎవరైతే తన పాపములకు పశ్చాత్తాపపడతారో, వారు క్షమించబడుదురు, ప్రభువైన నేను వాటిని ఇక జ్ఞాపకముంచుకొనను,”17 అని ప్రభువు దృఢంగా చెప్తున్నారు. సారాంశము: రండి, మన వివాదము తీర్చుకొందము.18 మీరు తప్పులు చేసారు; ప్రతి ఒక్కరు విఫలమవుతారు.19 నా యొద్దకు రండి, పశ్చాత్తాపపడండి.20 నేను ఆ పాపమును ఇక జ్ఞాపకముంచుకొనను.21 నీవు మరలా స్వస్థపరచబడగలవు.22 నీవు చేయవలసిన ఒక కార్యమును నేను కలిగియున్నాను.23 క్రీస్తు దారమును తెల్లగా చేయును.

కానీ ఆచరణాత్మక విధానాలేవి? మనం మినుకుమినుకుమంటున్నప్పుడు, యేసు క్రీస్తు శక్తితో మళ్ళీ జతచేయబడేందుకు ముఖ్యమైనదేది? అధ్యక్షులు నెల్సన్ గారు చాలా సరళంగా చెప్పారు: “ముఖ్యమైనది ఏమనగా పరిశుద్ధ నిబంధనలను చేసి, పాటించుట. … ఇది క్లిష్టమైన విధానం కాదు.”24 క్రీస్తును మీ జీవితానికి కేంద్రంగా చేసుకోండి.25

మీ సాక్ష్యానికి దారిచూపే చుక్కాని విఫలమైనట్లు, అంధకారము చుట్టుముట్టినట్లు మీరు భావించినట్లయితే, ధైర్యం తెచ్చుకోండి. దేవునితో మీరు చేసిన వాగ్దానాలను పాటించండి. మీ ప్రశ్నలను అడగండి. ఓపికతో రాయిని గాజుగా మలచండి. మిమ్మల్ని ఇంకా ప్రేమించే యేసు క్రీస్తు వైపు, తిరగండి.

“చీకటియందు ప్రకాశించు వెలుగును నేనే, చీకటి దానిని గ్రహింపకుండెనని,”26 యేసు చెప్పారు. దాని అర్థము, అది ఎంతగా ప్రయత్నించినప్పటికీ చీకటి వెలుగును ఆర్పివేయలేదు. ఎన్నటికీ. ఆయన వెలుగు మీ కొరకు ఉంటుందని మీరు నమ్మవచ్చు.

తిరిగి వెలిగింపబడిన సాల్ట్‌లేక్ దేవాలయము

మనం, లేక మనం ప్రేమించేవారు తాత్కాలికంగా అంధకారంలో పడవచ్చు. సాల్ట్ లేక్ దేవాలయం విషయంలో, భవన నిర్వాహకుడైన సహోదరుడు వాల్ వైట్ గారికి, దాదాపు వెంటనే తెలియజేయబడింది. జనులు గమనించారు. దేవాలయ దీపాలకు ఏమైంది? ముందుగా, సిబ్బంది దేవాలయంలోనున్న ప్రతి విద్యుత్తు పానెల్ వద్దకు వ్యక్తిగతంగా వెళ్ళి, చేతితో దీపాలను తిరిగి వెలిగించారు. తరువాత వారు స్వయంచాలిత విద్యుత్ సరఫరాలో బ్యాటరీలను మార్చి, ఏమి విఫలమైనదో కనుక్కోవడానికి వాటిని పరీక్షించారు.

మీకైమీరు దీపాలను తిరిగి వెలిగించడం కష్టము. మనకు స్నేహితులు కావాలి. మనరు ఒకరికొకరం అవసరము. దేవాలయ నిర్వహణ సిబ్బందిలా మనము వ్యక్తిగతంగా కనిపించడం, మన ఆత్మీయ బ్యాటరీలలో శక్తిని నింపడం, జరిగిన తప్పును సరిదిద్దడం ద్వారా ఒకరికొకరం సహాయపడగలము.

క్రిస్టమస్ సమయంలో సాల్ట్‌లేక్ దేవాలయము

మన వ్యక్తిగత వెలుగు ఒక చెట్టుపైన ఉన్న ఒకేఒక దీపమువలే మాత్రమే ఉండవచ్చు. కానీ మనమింకను మన చిన్న వెలుగును ప్రకాశింపజేసి, అందరం కలిసి క్రిస్టమస్ సమయములో టెంపుల్ స్క్వేర్ వలే లక్షలమంది జనులను ప్రభువు మందిరం వైపు ఆకర్షిస్తాము. అన్నిటికంటే ఉత్తమమైనది, అధ్యక్షులు నెల్సన్ గారు ప్రోత్సహించినట్లుగా, మన నిబంధనలను పాటించుట అనే సులువైన పని ద్వారా మనకు, మనకు ముఖ్యమైన వారి కొరకు రక్షకుని వెలుగును మనం తీసుకొనిరాగలము. వివిధ విధానాలలో, ఆ విశ్వసనీయమైన క్రియకు, శక్తి మరియు ఆనందంతో ప్రభువు బహుమానమిస్తారు.27

మీరు ప్రియమైన వారని నేను సాక్ష్యమిస్తున్నాను. మీరెంతగా ప్రయత్నిస్తున్నారో ప్రభువుకు తెలుసు. మీరు పురోగతి సాధిస్తున్నారు. ముందుకు సాగండి. పైకి కనిపించని మీ త్యాగాలను ఆయన చూస్తున్నారు మరియు మీ మేలు కొరకు, మీరు ప్రేమించేవారి మేలు కొరకు వాటిని లెక్కిస్తారు. మీ పని వృధా కాదు. మీరు ఒంటరివారు కాదు. ఇమ్మానుయేలు అను ఆయన పేరుకు అర్థము, “దేవుడు మనకు తోడైయున్నాడు.”28 నిశ్చయంగా ఆయన మీతో ఉన్నారు.

చాలాదూరం చూడడానికి చీకటిగా ఉన్నప్పటికీ, నిబంధన బాట మీద మరికొన్ని అడుగులు వేయండి. దీపాలు తిరిగి వెలుగుతాయి. యేసు మాటలలో సత్యమును గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను, అవి వెలుగుతో నింపబడియున్నాయి: “నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వచ్చెదను; శ్రద్ధగా నన్ను వెదకుడి, మీరు నన్ను కనుగొందురు; అడుగుడి, మీకు ఇవ్వబడును; తట్టుడి, మీకది తెరువబడును.”29 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.