2010–2019
ముగింపు మాటలు
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


2:3

ముగింపు మాటలు

దేవునికి మరియు -తెరకు రెండు వైపులా ఉన్న ఆయన పిల్లలకు సేవ చేయుటకు మన జీవితాలను ప్రతిష్ఠించి, పునఃప్రతిష్ఠించెదము గాక.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ చారిత్రక సమావేశము ముగింపునకు వచ్చియుండగా, ఆయన ప్రేరేపణ, రక్షణ కొరకు ప్రభువుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సందేశాలు మనకు ఉపదేశమును, జ్ఞానాభివృద్ధిని కలిగించాయి.

ప్రసంగీకులకు అంశములు ఇవ్వబడలేదు. వారిలో ప్రతి ఒక్కరు తమ సందేశాలు తయారుచేసుకొనుటకు వ్యక్తిగత బయల్పాటుల కొరకు ప్రార్థించారు. ఒకరి ప్రసంగవిషయముతో మరొకరిది చాలా చక్కగా ఇముడినట్లుగా కనిపించడం నాకైతే అసాధారణమైనదిగా అనిపిస్తుంది. వాటిని మీరు పఠించినప్పుడు, ఆయన సేవకుల ద్వారా ప్రభువు మీకు ఏమి బోధించాలని ప్రయత్నిస్తున్నారో దానిని నేర్చుకొనుటకు ప్రయత్నించండి.

సంగీతము మహిమకరముగా ఉండెను. ప్రతి సభలో ప్రభువు యొక్క ఆత్మను తీసుకొనివచ్చుటకు తమ ప్రతిభలను సమ్మేళనముగా చేసిన అనేక వాయిద్యకారులకు మేము చాలా కృతజ్ఞత కలిగియున్నాము. ప్రతి సభలో ప్రార్థనలను, సమూహములను ఆయన దీవించెను. నిజంగా, ఈ సమావేశము మనందరికి మరియొకసారి ఆత్మీయ విందుగా ఉండెను.

ప్రతి సభ్యుని గృహము విశ్వాసమునకు ఆశ్రయముగా మారునని, అక్కడ ప్రభువు ఆత్మ నివసించునని మేము ఆశిస్తున్నాము మరియు ప్రార్థిస్తున్నాము. మన చుట్టూ జగడములు ఉన్నప్పటికి, ఒకరి గృహము పరలోక స్థలముగా మారగలదు, అక్కడ పఠనము, ప్రార్థన, విశ్వాసములు ప్రేమతో కలిసిపోగలవు. మనం ఎక్కడ ఉన్నప్పటికి, ప్రభువు కొరకు నిలబడి, ఆయన కొరకు మాట్లాడుట ద్వారాా మనం నిజంగా ఆయన శిష్యులము కాగలము.

దేవుని ఉద్దేశము మన ఉద్దేశము కాగలదు. ఆయన తన పిల్లలు సిద్ధపడి, అర్హత కలిగి, దేవాలయ దీవెనపొంది, ముద్రింపబడి, ఆయన దేవాలయములో చేసిన నిబంధనలకు నమ్మకముగా ఉండి ఆయన యొద్దకు తిరిగి వెళ్లుటకు ఎంపికచేసుకోవాలని ఆయన కోరిక.

మనకు ఇప్పుడు 162 ప్రతిష్ఠించిన దేవాలయాలు కలవు. అందులో మొట్టమొదటిది మన ప్రియమైన అగ్రగాముల యొక్క విశ్వాసము, ముందుచూపునకు స్మారకచిహ్నముగా ఉన్నది. వారిచేత నిర్మించబడిన ప్రతి దేవాలయము, వారి గొప్ప వ్యక్తిగత త్యాగము మరియు ప్రయత్నమునకు ప్రతిఫలము. అగ్రగాములు సాధించిన కిరీటములో ఆశ్చర్యాన్ని కలిగించే రత్నముగా ప్రతి ఒక్కటి నిలుచును.

వాటిని జాగ్రత్తగా కాపాడుకొను పవిత్ర బాధ్యత మనందరిది. కాబట్టి, ఈ అగ్రగామి దేవాలయాలు త్వరలోనే కొంత కాలము నూతనపరచబడతాయి మరియు నవీకరించబడతాయి, వాటిలో కొన్ని భారీగా పునరుద్దరించబడతాయి. సాధ్యమైన ప్రతి చోటా ప్రతి దేవాలయము యొక్క ప్రత్యేకమైన చరిత్రను భద్రపరచుటకు, దీర్ఘకాలముగా మన వెనుక గతించిన తరముల ప్రేరేపించు సౌందర్యము, ప్రత్యేకమైన పనితనమును కాపాడుటకు ప్రయత్నాలు చేయబడును.

సెయింట్ జార్జ్ యూటా దేవాలయము యొక్క వివరాలు ఇప్పటికే విడుదల చెయ్యబడెను. సాల్ట్ లేక్ దేవాలయము, టెంపుల్ స్కేర్, దానికి ఆనుకొని సంఘ కార్యాలయ భవనమునకు సమీపములో ఉన్న ప్లాజా యొక్క నవీకరణ ప్రణాళికలు శుక్రవారము, ఏప్రిల్ 19, 2019న ప్రకటించబడును.

రాబోవు సంవత్సరాలలో, మాంటి, లోగన్ దేవాలయాలు కూడా నవీకరించబడతాయి ఆ ప్రణాళికలు సిద్ధమైన తరువాత, అవి కూడా ప్రకటించబడతాయి.

ఈ పని చెయ్యడానికి ప్రతి దేవాలయము కొంతకాలము మూయబడుట అవసరము. వాటికి సమీపములో ఉన్న దేవాలయాలలో దేవాలయ ఆరాధనను, సేవను ఆనందించుటను సంఘ సభ్యులు కొనసాగించవచ్చును. ప్రతి ప్రాజెక్టు పూర్తైన తరువాత, ప్రతి చారిత్రాత్మక దేవాలయము తిరిగి ప్రతిష్ఠించబడును.

సహోదర, సహోదరీలారా దేవాలయమును సంఘములో అత్యంత పవిత్రమైన కట్టడముగా మనం భావిస్తాము. ఒక క్రొత్త దేవాలయమును నిర్మించుటకు మన ప్రణాళికలను ప్రకటించినప్పుడు, అది మన పవిత్రమైన చరిత్రలో భాగమౌతుంది. ఇప్పుడు దయచేసి శ్రద్ధగా, భక్తితో కూడిన గౌరవముతో వినండి. మీకు ప్రత్యేకమైన స్థలములో ఒక దేవాలయాన్ని నేను ప్రకటింటినట్లైతే, మీరు మీ హృదయంలో కృతజ్ఞతతో కూడిన మౌన ప్రార్థనతో మీ తలను వంచమని నేను సలహా ఇస్తున్నాను. ఎటువంటి గట్టి స్వరములచేత ఈ సమావేశము మరియు ప్రభువు యొక్క పరిశుద్ధ దేవాలయాల పవిత్ర స్వభావమునుండి పక్కదారి పట్టకుండా ఉండాలని మేము ఆశిస్తున్నాము.

మరిన్ని దేవాలయాలు నిర్మించుటకుగల ప్రణాళికలు, ఇప్పుడు చెప్పబోయే ప్రదేశాలలో కట్టబడునని నేడు ప్రకటించుటకు ఆనందించు చున్నాము.

పాగో పాగో, అమెరికా సమోవా; ఓకినావా సిటీ, ఓకినావా; నేయాఫు, టోంగా; టూయేలి వ్యాలి, యూటా; మోజెస్ లేక్, వాషింగ్టన్; సాన్ పెడ్రో సూల, హోన్డురస్; ఆంటోఫెగెష్టా, చీలి; బుడపెస్ట్, హంగేరి.

నా ప్రియమైన సహోదర, సహోదరీలారా ధన్యవాదాలు.

మన దేవాలయాలలో పాతవాటి గురించి, క్రొత్త వాటి గురించి మాట్లాడినప్పుడు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులమని మన క్రియల ద్వారా ప్రతి ఒక్కరము తెలపుదుము గాక. ఆయనయందు మన విశ్వాసముతో, నమ్మకముతో మన జీవితాలను నూతన పరచుకొందుము గాక. అను దినము మన పశ్చాత్తాపముతో ఆయన ప్రాయశ్చిత్తము యొక్క శక్తిని చేరుకొందుము గాక. దేవునికి మరియు -తెరకు రెండు వైపులా ఉన్న ఆయన పిల్లలకు సేవ చేయుటకు మన జీవితాలను ప్రతిష్ఠించి, పునఃప్రతిష్ఠించెదము గాక.

ప్రభువు సంఘమైన దీనిలో బయల్పాటు కొనసాగునని మీకు అభయమిస్తు, నా ప్రేమను, దీవెనలను మీకు ఇస్తున్నాను. “దేవుని ఉద్దేశములు నెరవేరును మరియు ఘనుడైన యెహోవా ఈ కార్యము ముగిసెను అని చెప్పు వరకు“1 ఇది కొనసాగును.

ఈ విధంగా మిమ్మును దీవించి, దేవుడు సజీవుడని నా సాక్ష్యమును చెప్పుచున్నాను. యేసే క్రీస్తు! ఇది ఆయన సంఘము. మనం ఆయన జనులము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో, ఆమేన్.

వివరణలు

  1. Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 142.