“జూన్ 14–20. సిద్ధాంతము మరియు నిబంధనలు 64–66: ‘హృదయమును, సిద్ధమైన మనస్సును ప్రభువు కోరును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“జూన్ 14–20. సిద్ధాంతము మరియు నిబంధనలు 64–66,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
జూన్ 14–20
సిద్ధాంతము మరియు నిబంధనలు 64–66
“హృదయమును, సిద్ధమైన మనస్సును ప్రభువు కోరును”
అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ అన్నారు: “తరచు నేను, ‘దేవుడు నన్ను ఏమి చేయమని కోరుతున్నారు?’ లేక ‘నేను ఎలా భావించాలని ఆయన కోరుతున్నారు?’ అనే ప్రశ్నలతో లేఖనాలు చదువుతాను. ప్రతిసారీ ముందెన్నడూ రాని క్రొత్త ఉపాయాలను, ఆలోచనలను నేను కనుగొంటాను” (“How God Speaks to Me through the Scriptures,” Feb. 6, 2019, blog.ChurchofJesusChrist.org).
మీ మనోభావాలను నమోదు చేయండి
1831 ఆగష్టులో, తీక్షణమైన ఎండలో అనేకమంది పెద్దలు ప్రభువు చేత నడిపించబడినట్లుగా మిస్సోరిలో సీయోను భూమిని కొలిచిన తర్వాత కర్ట్‌లాండ్‌కు తిరుగు ప్రయాణం చేస్తున్నారు. అది ఆహ్లాదకరమైన ప్రయాణం కాదు. ప్రయాణికులైన జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీ, సిడ్నీ రిగ్డన్, ఎజ్రా బూత్ మరియు ఇతరులు ఎండ వేడిమితో అలసియుండడంతో త్వరలోనే ఆందోళనలు గొడవలుగా మారాయి. ప్రేమ, ఐక్యత మరియు శాంతితో కూడిన పట్టణమైన సీయోనును నిర్మించడానికి సుదీర్ఘకాలము పడుతుందేమో అనిపించియుండవచ్చు.
అదృష్టవశాత్తూ, సీయోనును నిర్మించడానికి—1831లో మిస్సోరిలో లేక నేడు మన హృదయాలలో మరియు వార్డులలో—మనము పరిపూర్ణంగా ఉండనవసరము లేదు. బదులుగా, “మీరైతే మనుష్యులందరిని క్షమించవలసిన అవసరమున్నది,” అని ప్రభువు చెప్పారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 64:10). “హృదయమును, సిద్ధమైన మనస్సును” ఆయన కోరును (34వ వచనము). మరియు సహనమును, శ్రద్ధను ఆయన కోరును, ఎందుకనగా “మంచి చేయుట యందు విసుగులేకయున్న” వారిచేత సాధించబడిన “చిన్న విషయాల” పునాదిపై సీయోను నిర్మించబడుతుంది (33వ వచనము).
Saints, 1:133–34, 136–37 కూడా చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 64:1–11
నేను ప్రతి ఒక్కరిని క్షమించవలసిన అవసరమున్నది.
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 64:1–11 చదువుతున్నప్పుడు, ప్రభువు మిమ్మల్ని క్షమించిన సమయం గురించి ఆలోచించండి. మీరు క్షమించవలసిన ఒకరి గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. మీ గురించి మరియు ఇతరుల గురించి మీ భావాలను రక్షకుని కనికరము ఏవిధంగా ప్రభావితం చేస్తుంది? “మనుష్యులందరిని క్షమించమని” ప్రభువు మనల్ని ఎందుకు ఆజ్ఞాపించారని మీరనుకుంటున్నారు? (10వ వచనము). మీరు క్షమించడానికి శ్రమపడుతున్నట్లయితే, రక్షకుడు ఏవిధంగా సహాయపడగలరనే దాని గురించి క్రింది వనరులు బోధిస్తున్న దానిని పరిగణించండి: జెఫ్రీ ఆర్. హాలండ్, “సమాధానపరచు పరిచర్య,” ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2018, 77–79; Guide to the Scriptures, “Forgive,” scriptures.ChurchofJesusChrist.org.
సిద్ధాంతము మరియు నిబంధనలు 64:31–34
నా హృదయమును, సిద్ధమైన మనస్సును దేవుడు కోరును.
మీరు సాధించాలని ప్రయత్నిస్తున్న “మంచినంతటిని చేయడం”లో మీరెప్పుడైనా “విసుగు” చెందారా? సిద్ధాంతము మరియు నిబంధనలు 64:31–34 లో మీ కోసం ప్రభువు సందేశము కొరకై చూడండి. మీ “హృదయమును, సిద్ధమైన మనస్సును” దేవునికి ఇవ్వడమంటే అర్థమేమిటి? (34వ వచనము).
సిద్ధాంతము మరియు నిబంధనలు 64:41–43
సీయోను “ప్రజలకు ఒక ధ్వజముగా నుండును.”
ధ్వజము అనగా “ఒక జెండా లేక పతాకము, ఒక ఉద్దేశము లేక గుర్తింపు కొరకు జనులు ఐక్యతతో దాని చుట్టూ సమకూడుతారు” (Guide to the Scriptures, “Ensign,” scriptures.ChurchofJesusChrist.org). సీయోను—లేక ప్రభువు యొక్క సంఘము— మీ కొరకు ఒక ధ్వజము వలె ఎట్లున్నది? జనులను దీవించడానికి ఒక ధ్వజము వలె నిలబెట్టబడిన వాటి యొక్క ఈ ఇతర మాదిరులను పరిగణించండి: సంఖ్యాకాండము 21:6–9; మత్తయి 5:14–16; ఆల్మా 46:11–20. మీరు నివసించే చోట సంఘము ఒక ధ్వజముగా ఉండునట్లు మీరు ఏవిధంగా సహాయపడగలరనే దాని గురించి ఈ వచనాలు మీకేమి బోధిస్తాయి? సిద్ధాంతము మరియు నిబంధనలు 64:41–43లో ప్రభువు సీయోనును వర్ణించు ఇతర విధాల కొరకు చూడండి.
“ప్రభువు మార్గము సిద్ధపరచుడి.”
“ప్రభువు మార్గము సిద్ధపరచుడి” అని కేకవేసిన వానిగా బాప్తీస్మమిచ్చు యోహానును మత్తయి వర్ణించాడు (మత్తయి 3:3; యెషయా 40:3 కూడా చూడండి). సిద్ధాంతము మరియు నిబంధనలు 65లో, తన కడవరి-దిన కార్యమును వర్ణించడానికి ప్రభువు అటువంటి భాషనే ఉపయోగించును. బాప్తీస్మమిచ్చు యోహాను చేసినది (మత్తయి 3:1–12) మరియు నేడు మనం చేయాలని ప్రభువు కోరుతున్న దాని మధ్య మీరు చూస్తున్న పోలికలేవి? ఇందులో ఉన్న ప్రవచనాలను నెరవేర్చడంలో సహాయపడేందుకు మిమ్మల్ని ప్రేరేపించేలా ఈ బయల్పాటులో మీరేమి కనుగొంటారు? మీరు “ఆయన అద్భుత కార్యములను ప్రజలకు తెలియజేయగల” విధానాలను ధ్యానించండి (4వ వచనము).
నా హృదయ తలంపులను ప్రభువు ఎరుగును.
సంఘములో చేరిన కొంతకాలానికి విలియం ఈ. మెక్‌లెలిన్ తన కొరకు దేవుని చిత్తాన్ని బయల్పరచమని జోసెఫ్ స్మిత్‌ను అడిగాడు. జోసెఫ్ దానిని ఎరుగలేదు, కానీ విలియం ఐదు వ్యక్తిగత ప్రశ్నలు కలిగియున్నాడు, ప్రభువు తన ప్రవక్త ద్వారా వాటికి జవాబిస్తారని అతడు ఆశించాడు. విలియం కలిగియున్న ప్రశ్నలు మనకు తెలియదు, కానీ అతనికి ఉద్దేశించబడిన బయల్పాటైన ఇప్పటి సిద్ధాంతము మరియు నిబంధనలు 66, విలియం “పూర్తిగా తృప్తి చెందేలా” ప్రతి ప్రశ్నకు జవాబిచ్చిందని మనకు తెలుసు (“William McLellin’s Five Questions,” Revelations in Context, 138).
మీరు 66వ ప్రకరణము చదువుతున్నప్పుడు, విలియం మెక్‌లెలిన్ మరియు అతని చింతలు, హృదయ భావాల గురించి ప్రభువుకు ఏమి తెలుసో ఆలోచించండి. ఆయన మిమ్మల్ని ఎరుగునని ప్రభువు ఎలా బయల్పరిచారు? మీరు గోత్రజనకుని దీవెనను కలిగియున్నట్లయితే, దానిని చదవడాన్ని పరిగణించండి. మీరు చదివినప్పుడు, మీ కొరకు దేవుని చిత్తం గురించి మీరేమి గ్రహించేలా పరిశుద్ధాత్మ సహాయపడ్డాడు?
Saints, 1:138–40; Gospel Topics, “Patriarchal Blessings,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 64:8–10.క్షమించడాన్ని నేర్చుకోవడానికి కుటుంబ సంబంధాలు అనేక అవకాశాలను అందిస్తాయి. ఒకరినొకరు క్షమించడం మీ కుటుంబాన్ని ఏవిధంగా దీవించిందనే దాని గురించి కుటుంబ సభ్యులు మాట్లాడవచ్చు. ఒకరినొకరు క్షమించడానికి రక్షకుడు మనకే విధంగా సహాయపడ్డారు? మనము ఇతరులను క్షమించనప్పుడు, మనమెలా “శ్రమనొందెదము” (8వ వచనము)?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 64:33.ఆయన “గొప్ప కార్యమును” జరిగించడానికి మీ కుటుంబము ఏమి చేయాలని పరలోక తండ్రి కోరుతున్నారు? అది దేవాలయానికి వెళ్ళడం, పొరుగువారితో సువార్తను పంచుకోవడం లేక వివాదాన్ని జయించడం కావచ్చు. బహుశా ప్రతి కుటుంబ సభ్యుడు రాళ్ళు, గుండీలు లేక పజిల్ ముక్కలు వంటి చిన్న వస్తువులను సేకరించి, దేవుని యొక్క గొప్ప కార్యము కొరకు “పునాది (వేయడానికి)” మనము ప్రతిరోజు చేయగల “చిన్న విషయాలను” సూచించడానికి వాటిని ఉపయోగించవచ్చు. ఒక కుటుంబముగా, ఈ వారం పనిచేయడానికి ఈ చిన్న విషయాలలో ఒకదానిని ఎంచుకోండి.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 66:3.పశ్చాత్తాపము యొక్క ప్రాముఖ్యతను మీరెలా బోధిస్తారు? పూర్తి శుభ్రంగా లేని ఒక పళ్ళెంలో మీరు కొంత ఆహారాన్ని వడ్డించి, “నీవు పవిత్రుడవే కాని సంపూర్ణముగా కాదు” అని విలియం మెక్‌లెలిన్‌తో ప్రభువు చెప్పిన మాటలు చదువవచ్చు. తర్వాత మీరు పళ్ళెమును శుభ్రం చేసి, ఆత్మీయంగా శుద్ధముగా ఉండడాన్ని యేసు క్రీస్తు మన కొరకు ఎలా సాధ్యం చేస్తారని చర్చిస్తూ ఆహారాన్ని పంచుకోవచ్చు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 66:10.చేయవలసిన అనేక విషయాల భారమును వహించుటకు లేక “భారమును మోయుటకు ప్రయత్నించకుము,” అనే ప్రభువు ఉపదేశాన్ని మీ కుటుంబము ఎలా అనుసరించగలదు? మరియ మరియు మార్త కథ (లూకా 10:38–42 చూడండి) గురించి మీరు మాట్లాడవచ్చు మరియు నిత్య విలువ లేని విషయాల భారమును మోయుట నుండి మీ కుటుంబము ఎలా తప్పించుకోగలదో చర్చించవచ్చు.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.
సూచించబడిన పాట: “Help Me, Dear Father,” Children’s Songbook, 99.