2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
మే 31–జూన్ 6. సిద్ధాంతము మరియు నిబంధనలు 60–62: “సర్వశరీరులు నా వశములోనున్నారు”


“మే 31– జూన్ 6. సిద్ధాంతము మరియు నిబంధనలు 60-62: ‘సర్వశరీరులు నా వశములోనున్నారు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“మే 31– జూన్ 6. సిద్ధాంతము మరియు నిబంధనలు 60-62,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

మిస్సోరి నది

మిస్సోరిలో చలిమంట, బ్రయన్ మార్క్ టేలర్ చేత

మే 31–జూన్ 6

సిద్ధాంతము మరియు నిబంధనలు 60–62

“సర్వశరీరులు నా వశములోనున్నారు”

మనము లేఖనాలను అధ్యయనం చేసినప్పుడు, “సాక్ష్యాలు వృద్ధిచెందుతాయి. నిబద్ధత బలపరచబడుతుంది. కుటుంబాలు బలపరచబడతాయి. వ్యక్తిగత బయల్పాటు ప్రవహిస్తుంది,” అని అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ బోధించారు (“The Power of the Word,” Ensign, May 1986, 81).

మీ మనోభావాలను నమోదు చేయండి

1831 జూన్‌లో, కర్ట్‌లాండ్‌లో సంఘ పెద్దలతో జోసెఫ్ స్మిత్ ఒక సమావేశం జరిపారు. అక్కడ ప్రభువు కొద్దిమంది పెద్దలను సహవాసులుగా చేసి, “మార్గము గుండా వారు ప్రకటించవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 52:10) అను బాధ్యతనిచ్చి వారిని మిస్సోరిలోని జాక్సన్ కౌంటీకి పంపారు. చాలామంది పెద్దలు శ్రద్ధగా చేసారు, కానీ ఇతరులు చేయలేదు. కాబట్టి కర్ట్‌లాండ్‌కు తిరిగివెళ్ళే సమయం వచ్చినప్పుడు, ప్రభువు ఇలా అన్నారు, “కానీ కొందరి (పెద్దలు) యెడల నేను ఆనందించుట లేదు, ఏలయనగా వారు తమ నోళ్ళను విప్పరు, కానీ మనుష్యునికి భయపడి నేను వారికి ఇచ్చియున్న ప్రతిభను దాచిపెట్టుదురు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 60:2). మనలో చాలామంది ఈ పెద్దలపట్ల సానుభూతి కలిగియుండవచ్చు—మన నోళ్ళు విప్పి, సువార్తను పంచుకోవడానికి మనం కూడా సందేహిస్తుండవచ్చు. బహుశా మనం కూడా “మనుష్యునికి భయపడి” ఆటంకపరచబడుతున్నాము. బహుశా మనం మన యోగ్యతను లేక సామర్థ్యాలను సందేహిస్తున్నాము. మన కారణాలు ఏవైనప్పటికీ, ప్రభువు “నరుని బలహీనతలను, (మనకు) ఏవిధముగా సహాయము చేయవలెనో యెరిగియున్నాడు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 62:1). ప్రారంభ సువార్తికులకు ఇచ్చిన ఈ బయల్పాటులన్నిటిలో, సువార్తను పంచుకోవడం గురించి మన భయాలు—లేక మనం ఎదుర్కొనే ఇతర భయాలను జయించడానికి మనకు సహాయపడగల అభయాలు విస్తరించబడియున్నాయి: “ప్రభువైన నేను, పైన పరలోకములందు రాజ్యమేలుచున్నాను.” “నేను మిమ్ములను పరిశుద్ధులుగా చేయుటకు శక్తిని కలిగియున్నాను.” “సర్వశరీరులు నా వశములోనున్నారు.” మరియు “చిన్నపిల్లలారా, సంతోషముగా నుండుడి; ఏలయనగా నేను మీ మధ్యనున్నాను.” (సిద్ధాంతము మరియు నిబంధనలు 60:4, 7; 61:6, 36.)

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 60; 62

సువార్తను పంచుకోవడానికి నేను నా నోటిని తెరిచినప్పుడు ప్రభువు సంతోషిస్తారు.

ఎవరితోనైనా సువార్తను పంచుకోగలిగియుండి, ఏదైనా కారణం చేత మనం పంచుకోకుండా ఉన్న అనుభవాలను మనందరం కలిగియున్నాము. “వారి నోళ్ళు విప్పడం”లో విఫలమైన ప్రారంభ సువార్తికులకు ప్రభువు చెప్పిన దానిని మీరు చదువుతున్నప్పుడు, సువార్తను పంచుకోవడానికి మీకు గల అవకాశాల గురించి ఆలోచించండి. సువార్తను గురించి మీ సాక్ష్యము ఏవిధంగా దేవుని నుండి ఒక “ప్రతిభ” లేక నిధి వలె ఉన్నది? కొన్నిసార్లు ఏ విధాలుగా మనం “(మన) ప్రతిభను దాచిపెడతాము”? (సిద్ధాంతము మరియు నిబంధనలు 60:2; మత్తయి 25:14–30 కూడా చూడండి).

ప్రభువు ఈ ప్రారంభ సువార్తికులను సరిదిద్దారు, కానీ ఆయన వారిని ప్రేరేపించడానికి కూడా ప్రయత్నించారు. 60 మరియు 62వ ప్రకరణములలో, ఆయన నుండి ఎటువంటి ప్రోత్సాహకరమైన సందేశాలను మీరు కనుగొంటారు? సువార్తను పంచుకోవడంలో మీ నమ్మకాన్ని ఈ సందేశాలు ఎలా వృద్ధిచేస్తాయి? రాబోయే రోజుల్లో, మీ నోటిని తెరిచి, దేవుడు మీకు అప్పగించిన దానిని పంచుకోవడానికి అవకాశాల కొరకు చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 33:8–10; 103:9–10; డీటర్ ఎఫ్. ఉక్‌డార్ఫ్, “సువార్త పరిచర్య: మీ హృదయములో నున్నది పంచుకొనుట,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2019, 15–18 కూడా చూడండి.

బస్సులో సువార్తికులు

నేను ఇతరులతో సువార్తను పంచుకోవాలని దేవుడు కోరుతున్నాడు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 61:5–6, 14–18

అన్ని జలములు ప్రభువు చేత శపించబడియున్నవా?

సిద్ధాంతము మరియు నిబంధనలు 61లో ప్రభువు హెచ్చరిక, కొంతవరకు మిస్సోరి నదిపై సీయోనుకు ప్రయాణిస్తున్నప్పుడు ఆయన జనులు ఎదుర్కొనగల అపాయాల గురించిన హెచ్చరిక, ఆ సమయంలో అది అపాయకరమైనదిగా తెలుపబడింది. మనము నీటిపై ప్రయాణాన్ని మానివేయాలనేది ఈ హెచ్చరికకు అర్థమని వ్యాఖ్యానించరాదు. నీటిపై శక్తితో కలిపి, ప్రభువు “సర్వశక్తి” కలిగియున్నాడు (1వ వచనము).

సిద్ధాంతము మరియు నిబంధనలు 61–62

ప్రభువు సర్వశక్తిమంతుడు మరియు నన్ను కాపాడగలడు.

కర్ట్‌లాండ్‌కు తిరిగివెళ్ళే మార్గంలో, జోసెఫ్ స్మిత్ మరియు ఇతర సంఘ నాయకులు మిస్సోరి నదిపై ప్రాణాంతకమైన అనుభవాన్ని చవిచూసారు (Saints, 1:133–34 చూడండి). తన సేవకులను హెచ్చరించడానికి, వారికి ఉపదేశించడానికి ఈ అవకాశాన్ని ప్రభువు ఉపయోగించుకున్నారు. మీ స్వంత సవాళ్ళను మీరు ఎదుర్కొన్నప్పుడు, ప్రభువు యందు మీ నమ్మకాన్ని ఉంచేలా మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా సిద్ధాంతము మరియు నిబంధనలు 61లో మీరేమి కనుగొంటారు? ఉదాహరణకు, దేవుడు “నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు” ఉన్నాడని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము? (1వ వచనము).

62 వ ప్రకరణములో ఇదేవిధమైన అంతరార్థములున్నాయి. ఈ బయల్పాటులో ఆయన గురించి మరియు ఆయన శక్తి గురించి ప్రభువు మీకేమి బోధించారు?

ఆత్మీయ లేక భౌతిక దుర్దశను జయించడానికి ప్రభువు మీకు సహాయపడినప్పుడు, విశ్వాసాన్ని నిర్మించేలా మీకు కలిగిన అనుభవాలను ధ్యానించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 62

“(నా) దృష్టికి అనుకూలమైనట్లుగా” నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ప్రభువు కోరుతున్నారు.

కొన్నిసార్లు ప్రభువు మనకు నిర్దిష్టమైన నడిపింపునిస్తారు, మిగిలిన విషయాల నిర్ణయాన్ని ఆయన మనకు వదిలిపెడతారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 62లో ఈ సూత్రము వివరించబడినట్లు మీరెట్లు చూస్తారు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 60:5; 61:22 కూడా చూడండి). మీ జీవితంలో ఈ సూత్రాన్ని మీరెట్లు చూసారు? దేవుని నుండి నిర్దిష్టమైన నడిపింపు లేకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మనకు ఎందుకు మంచిది?

ఈథర్ 2:18–25; సిద్ధాంతము మరియు నిబంధనలు 58:27–28 కూడా చూడండి.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 60:2–3.సువార్తను పంచుకోవడానికి కొంతమంది ప్రారంభ సువార్తికులు ఎందుకు సందేహించారు? కొన్నిసార్లు మనమెందుకు సందేహిస్తాము? విభిన్న పరిస్థితులలో కుటుంబ సభ్యులు సువార్తను ఎలా పంచుకోగలరో నటించి చూపడాన్ని పరిగణించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 61:36–39.“ధైర్యము తెచ్చుకొనుటకు” ఈ వచనాలలో ఏ కారణాలను మనము చూస్తాము? (యోహాను 16:33 కూడా చూడండి). బహుశా మీ కుటుంబము వారికి సంతోషాన్నిచ్చే విషయాలను వ్రాసి లేక బొమ్మలుగా గీసి, వాటిని “ధైర్యము” అనే సీసాలో జమచేయవచ్చు. (రక్షకుని చిత్రాలను, మన కొరకు ఆయన ప్రేమ యొక్క జ్ఞాపకాలను తప్పక జతచేయండి.) వారమంతా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేందుకు కారణాలను గుర్తుచేయడం అవసరమైనప్పుడు, వారు సీసా నుండి ఒకదానిని ఎంచుకోవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 61:36.రక్షకుడు “(మన) మధ్యన” ఉన్నారని మీ కుటుంబ సభ్యులు గుర్తుంచుకొనేలా మీరెలా సహాయపడగలరు? మీ ఇంటిలో ఆయన చిత్రపటాన్ని ప్రముఖంగా ఎక్కడ ప్రదర్శించాలో మీరు కలిసి నిర్ణయించవచ్చు. మన అనుదిన జీవితాల్లోకి రక్షకుడిని మనమెలా ఆహ్వానించగలము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 62:3.బహుశా ఈ వచనం చదివిన తర్వాత, మీరు ఒక కుటుంబ సాక్ష్యపు సమావేశాన్ని కలిగియుండవచ్చు. సాక్ష్యము అంటే ఏమిటో వివరించడానికి, మీరు అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బల్లార్డ్ సందేశం నుండి భాగాలు పంచుకోవచ్చు (“Pure Testimony” (Ensign or Liahona, Nov. 2004, 40–43). మన సాక్ష్యాలను నమోదు చేయడం ఎందుకు మంచిది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 62:5, 8.మన జీవితం యొక్క ప్రతి దశ గురించి ప్రభువు ఎందుకు ఆజ్ఞలనివ్వరు? 8వ వచనము ప్రకారము, మనము నిర్ణయాలను ఎలా తీసుకోవాలి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Testimony,” Hymns, no. 137.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

ఆత్మ మీ అధ్యయనమును నడిపించనివ్వండి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించనివ్వండి. ఒక భిన్నమైన విషయాన్ని మీరు సాధారణంగా చదివే లేక అధ్యయనం చేసే విధంగా లేక వేరేవిధంగా చదవమని ఆయన గుసగుసలు మీకు సూచించినప్పటికీ, ప్రతిరోజు మీరు నేర్చుకోవలసిన విషయాల వైపు ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు, ఆయన గుసగుసలకు స్పందించండి.

గొర్రెపిల్లను ఎత్తుకొనిన యేసు

మంచి కాపరి, డెల్ పార్సన్ చేత