లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 61


61వ ప్రకరణము

1831 ఆగష్టు 12న, మిస్సోరి నది ఒడ్డున మెకిల్వేన్స్ బెండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. కర్ట్లాండ్‌కు వారి తిరుగు ప్రయాణములో ప్రవక్త మరియు పదిమంది పెద్దలు దోనెలలో మిస్సోరి నది గుండా ప్రయాణము చేసిరి. ప్రయాణములో మూడవ దినమున, చాలా ప్రమాదములు సంభవించినవి. పెద్దయైన విలియం డబ్ల్యు. ఫెల్ప్స్ పగటి దర్శనములో నాశనకారుడు జలములపైన శక్తితో తిరుగుటను చూచెను.

1–12, జలములపైన అనేక నాశనములను ప్రభువు ప్రకటించెను; 13–22, జలములు యోహాను చేత శపించబడెను మరియు నాశనకారుడు వాటి ఉపరితలములపై తిరుగులాడును; 23–29, జలములను ఆజ్ఞాపించుటకు కొందరికి శక్తి కలదు; 30–35, పెద్దలు ఇద్దరిద్దరుగా ప్రయాణము చేసి, సువార్తను ప్రకటించవలెను; 36–39, మనుష్య కుమారుని రాకడకు వారు సిద్ధపడియుండవలెను.

1 ఇదిగో, సర్వశక్తిగల ఆయన స్వరమును ఆలకించుడి, ఆయన నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు అల్ఫాయు ఓమెగయు, ఆదియు అంతమునైయున్నాడు.

2 తమ పాపములు ఇప్పుడు క్షమించబడి ఈ స్థలములో సమావేశమైన ఓ నా సంఘ పెద్దలారా, ప్రభువైన నేను పాపములను క్షమించెదనని, దీన హృదయములతో తమ పాపములను ఒప్పుకొను వారి యెడల కరుణ కలిగియుందునని ప్రభువు మీతో నిశ్చయముగా సెలవిచ్చుచున్నాడు;

3 ఐతే నదికి ఇరుప్రక్కలనున్న నివాసులు అపనమ్మకముతో నశించిపోవుచుండగా, నా పెద్దల సమూహమంతా నీటిపై వేగముగా ప్రయాణించనవసరము లేదు.

4 అయినప్పటికీ, మీరు సాక్ష్యము చెప్పుటకు దీనిని నేను అనుమతించితిని; ఇదిగో, జలములపైన అనేక ప్రమాదములు పొంచియున్నవి మరియు ఇకమీదట మరిన్ని రాగలవు;

5 ఏలయనగా ప్రభువైన నేను, నా కోపమునందు జలములపై, అనగా ప్రత్యేకించి ఈ జలములపై అనేక నాశనములను ప్రకటించితిని;

6 అయినప్పటికీ, సర్వశరీరులు నా వశములోనున్నారు మరియు మీలో విశ్వాసముగా ఉన్నవాడు జలముల వలన నశించడు.

7 కాబట్టి, నా సేవకుడైన సిడ్నీ గిల్బర్ట్, నా సేవకుడైన విలియం డబ్ల్యు. ఫెల్ప్స్ వారికి అప్పగించిన పని మరియు నియమితకార్యము మొదలుపెట్టుటకు త్వరపడుట యుక్తమైయున్నది.

8 అయినప్పటికీ, మీరు ఒకటిగానుండి, దుష్టత్వమునందు నశింపక, మీ పాపములన్నింటి నిమిత్తము మీరు గద్దింపబడు వరకు నేను మిమ్ములను వెళ్ళనియ్యను;

9 కానీ ఇప్పుడు, మీరు వెళ్ళుట నాకు తగినదైయున్నదని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి నా సేవకులైన సిడ్నీ గిల్బర్ట్ మరియు విలియం డబ్ల్యు. ఫెల్ప్స్ తమ పూర్వ సహచరులను తీసుకొని, వారి నియమితకార్యమును నెరవేర్చుటకు త్వరితముగా ప్రయాణము చేయవలెను మరియు విశ్వాసము ద్వారా వారు విజయము పొందుదురు;

10 వారు విశ్వాసముగా ఉన్నంతవరకు వారు రక్షించబడుదురు మరియు ప్రభువైన నేను వారితోనుందును.

11 మిగిలినవారు వస్త్రములకొరకు అవసరమైన దానిని తీసుకొనవలెను.

12 మీ అంగీకారమును బట్టి ఇతర పెద్దలకు అవసరము లేనిదానిని నా సేవకుడైన సిడ్నీ గిల్బర్ట్ తీసుకొనవలెను.

13 ఇదిగో, ఇప్పుడు మీ మేలు కొరకు ఈ సంగతులను గూర్చి మీకొక ఆజ్ఞనిచ్చితిని; ప్రాచీన దినములందున్న మనుష్యులతో చేసినట్లుగా ప్రభువైన నేను మీతో తర్కించెదను.

14 ప్రభువైన నేను, ఆదియందు జలములను దీవించితిని; కానీ అంత్యదినములందు, నా సేవకుడైన యోహాను నోటి ద్వారా నేను జలములను శపించితిని.

15 కాబట్టి, ఏ మనుష్యుడును జలములమీద క్షేమముగానుండని దినములు వచ్చును.

16 హృదయమందు యథార్థముగా ఉండువాడు తప్ప, ఎవడును జలముల ద్వారా సీయోను ప్రదేశమునకు వెళ్ళలేడని రాబోవు దినములలో చెప్పబడును.

17 ప్రభువైన నేను, ఆదియందు నేలను శపించితిని గనుక, అంత్యదినములలో దాని సారమును తినునట్లు నా పరిశుద్ధుల వినియోగము కొరకు సరైన సమయములో దానిని నేను దీవించితిని;

18 ఇప్పుడు నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా నేను ఒకనితో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను, వారు వాటిమీద ప్రయాణము చేసి రాకుండునట్లు ఈ జలములను గూర్చి మీ సహోదరులను మీరు ముందుగానే హెచ్చరించవలెను, లేనియెడల వారి నమ్మిక తప్పిపోయి, వారు ఉచ్చులలో చిక్కుకొందురు;

19 నాశనకారుడు వాటిమీద తిరుగులాడుచున్నాడని ప్రభువైన నేను ప్రకటించితిని; ఆ ప్రకటనను నేను రద్దుచేయను.

20 ప్రభువైన నేను, నిన్న మీ యెడల కోపముగా నుంటిని, కానీ నేడు నా కోపము చల్లారెను.

21 కాబట్టి, నేను ఎవరిని గూర్చి సెలవిచ్చితినో, వారు త్వరితముగా తమ ప్రయాణమును చేయవలెను—మరలా నేను చెప్పుచున్నాను, వారు త్వరితముగా తమ ప్రయాణమును చేయవలెను.

22 కొద్దికాలము తరువాత వారు తమ నియమితకార్యములను ప్రారంభించినచో, నీటిద్వారా లేదా నేలమీద వారు ఏవిధముగా ప్రయాణము చేసినను అది నాకు ముఖ్యము కాదు; వారి నిర్ణయాలను బట్టి ఇకముందు ఇది వారికి తెలియజేయబడును.

23 ఇప్పడు నా సేవకులైన సిడ్నీ రిగ్డన్, జోసెఫ్ స్మిత్ జూ., ఆలీవర్ కౌడరీలు తమ గృహములకు ప్రయాణము చేయుచున్నప్పుడు కాలువపైన తప్ప, సముద్రములపైన వారు మరలా ప్రయాణించరాదు; లేదా మరియొక మాటలో వారు కాలువపైన తప్ప, సముద్రములపైన ప్రయాణము చేయరాదు.

24 ఇదిగో, ప్రభువైన నేను నా పరిశుద్ధుల ప్రయాణము కొరకు ఒక మార్గమును నియమించితిని; ఆ మార్గము ఇదే—వారు ప్రయాణము చేసి సీయోను ప్రదేశమునకు ఎక్కిపోవలెనని ఆజ్ఞాపించబడిన యెడల, వారు కాలువను విడిచిన తరువాత నేలమీద ప్రయాణము చేయవలెను;

25 ఇశ్రాయేలు సంతానము చేసినట్లుగా వారును చేయవలెను; మార్గము మధ్యలో తమ గుడారములను పాతవలెను.

26 ఇదిగో, ఈ ఆజ్ఞను మీరు మీ సహోదరులందరికి ఇవ్వవలెను.

27 అయినప్పటికీ, ఎవనికైతే జలములను ఆజ్ఞాపించుటకు శక్తి ఇవ్వబడునో, వానికి ఆత్మద్వారా ఆయన మార్గములన్నిటిని తెలుసుకొనులాగున అనుగ్రహించబడును;

28 కాబట్టి, ఇకనుండి చేయవలసినది నా వశమైయున్నది గనుక, నేలమీదయైనను లేదా జలములపైన అయినను సజీవుడగు దేవుని ఆత్మ ఆజ్ఞాపించినట్లుగా అతడు చేయవలెను.

29 ప్రయాణము చేయుటకు ప్రభువు యొక్క సమూహమునకు చెందిన పరిశుద్ధుల కొరకు మార్గము లేదా పరిశుద్ధుల కొరకు దారి మీకు అనుగ్రహించబడును.

30 మరలా నా సేవకులైన సిడ్నీ రిగ్డన్, జోసెఫ్ స్మిత్ జూ., ఆలీవర్ కౌడరీలు సిన్సినాటికి చేరుకొను వరకు దుష్ట జనసమూహములలో తమ నోళ్ళను విప్పకూడదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;

31 నాశనమునకు పరిపక్వమైన ఆ ప్రజలకు విరోధముగా దేవునికి, అనగా వారి దుష్టత్వమునకు విరోధముగా ఎవని కోపము రగులుకొనెనో ఆయనకు ఆ ప్రదేశములో వారు తమ స్వరములెత్తవలెను.

32 అక్కడి నుండి వారు వారి సహోదరుల సమూహములకు ప్రయాణము చేయవలెను, ఏలయనగా ఇప్పుడు వారి సేవలు దుష్ట జనసమూహముల మధ్య కంటే వారి మధ్యే ఎక్కువగా అవసరము.

33 ఇప్పుడు మిగిలిన వారు ప్రయాణము చేసి, వారికి అనుగ్రహించబడునంత వరకు దుష్ట జనసమూహము మధ్య ప్రకటించవలెను;

34 వారు దీనిని చేసిన యెడల వారు తమ వస్త్రములను శుద్ధిచేసుకొని, నా యెదుట మచ్చలేకయుందురు.

35 వారి దృష్టికి అనుకూలమైనట్లుగా వారు కలిసి లేదా ఇద్దరిద్దరుగా ప్రయాణము చేయవలెను; నా సేవకుడైన రేనాల్డ్స్ కహూన్, నా సేవకుడైన సామ్యూల్ హెచ్. స్మిత్‌లయందు నేను ఆనందించుచున్నాను, తమ గృహములకు తిరిగి వెళ్ళువరకు వారు మాత్రము వేరుపడకూడదు; ఇది నా యందు జ్ఞానముతో కూడిన ఒక ఉద్దేశ్యము కొరకు ఇవ్వబడెను.

36 ఇప్పుడు నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నేను ఒకనితో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను, చిన్నపిల్లలారా, సంతోషముగా నుండుడి; ఏలయనగా నేను మీ మధ్యనున్నాను, నేను మిమ్ములను విడిచిపెట్టలేదు;

37 మీరు నా యెదుట దీనమనస్సు కలిగియుండిన యెడల, పరలోకరాజ్య దీవెనలు మీవగును.

38 మీ నడుములకు దట్టీలను కట్టుకొని కనిపెట్టుకొనియుండుడి, మనుష్యకుమారుని రాకడ కొరకు ఎదురుచూచుచు గంభీరముగా నుండుడి, ఏలయనగా మీరు ఊహించని గడియలో ఆయన వచ్చును.

39 మీరు శోధనలలో ప్రవేశింపకుండునట్లు ఎల్లప్పుడు ప్రార్థించుడి, తద్వారా జీవములోనైనను, మరణములోనైనను ఆయన రాకడ దినమును మీరు సహింపగలుగుదురు. అలాగే జరుగును గాక. ఆమేన్.