లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 5


5వ ప్రకరణము

1829 మార్చి, పెన్సిల్వేనియాలోని హార్మొనిలో మార్టిన్ హారిస్ విన్నపమును బట్టి ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కివ్వబడిన బయల్పాటు.

1–10, ఈ తరమువారు ప్రభువు వాక్యమును జోసెఫ్ స్మిత్ ద్వారా పొందెదరు; 11–18, ముగ్గురు సాక్షులు మోర్మన్ గ్రంథమును గూర్చి సాక్ష్యమిచ్చెదరు; 19–20, పూర్వకాలములో వలే ప్రభువు వాక్యము నిరూపించబడును; 21–35, మార్టిన్ హారిస్ పశ్చాత్తాపపడి, సాక్షులలో ఒకరిగా ఉండవచ్చును.

1 ఇదిగో, నేను నీతో చెప్పునదేమనగా, నా సేవకుడవైన జోసెఫ్ స్మిత్ జూ. అను నీవు పలకలను కలిగియున్నట్లు ప్రకటించితివని, నీవు వాటిని నా నుండి పొందినట్లు సాక్ష్యమిచ్చితివని నా సేవకుడు మార్టిన్ హారిస్ నా చేతి నుండి రుజువు కోరెను గనుక;

2 ఇప్పుడు, నీతో మాట్లాడిన వ్యక్తి నీతో ఇట్లు చెప్పెనని నీవు అతనితో చెప్పవలెను: ప్రభువునైన నేను దేవుడను, ఈ పలకలను నా సేవకుడవైన జోసెఫ్ స్మిత్ అను నీకు ఇచ్చియుంటిని, వీటికి ఒక సాక్షిగా నిలవాలని నిన్నాజ్ఞాపించితిని;

3 నీవు నాతో ఒక నిబంధనలో ప్రవేశించులాగున నేను చేసితిని, అదేమనగా నేను చూపమని నీకాజ్ఞాపించిన జనులకు తప్ప మరెవరికి వాటిని చూపకూడదు; నేను నీకు అనుగ్రహించితే తప్ప, వాటిపై నీకు అధికారము లేదు.

4 పలకలను అనువదించు బహుమానమును నీవు కలిగియున్నావు; నీపై నేను క్రుమ్మరించిన మొదటి బహుమానము ఇదే; దీనియందు నా ఉద్దేశ్యము నెరవేరువరకు మరేయితర బహుమానమును నీవు ఆశించకూడదు; ఏలయనగా ఇది పూర్తియగువరకు మరేయితర బహుమానమును నేను నీకివ్వను.

5 నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నా మాటలు ఆలకించని యెడల భూలోక నివాసులందరికి ఆపద కలుగును;

6 ఏలయనగా ఇకమీదట నీవు నియమించబడెదవు మరియు ముందుకు సాగి, నరుల సంతానమునకు నా మాటలను ప్రకటించెదవు.

7 ఇదిగో, వారు నా మాటలను నమ్మని యెడల నా సేవకుడవైన జోసెఫ్ వారు నిన్ను నమ్మరు, సాధ్యమైన యెడల నేను నీకప్పగించిన వీటన్నిటిని నీవు వారికి చూపించినను వారు నమ్మరు.

8 అయ్యో! అవిశ్వాసులైన లోబడనొల్లని ఈ తరముపై నా కోపము రగులుకొన్నది.

9 ఇదిగో నా సేవకుడవైన జోసెఫ్, నాయందొక వివేకవంతమైన ఉద్దేశ్యము నిమిత్తము నీకప్పగించిన పలకలను నేను దాచియుంచితిని, అవి రాబోవు తరములకు తెలియజేయబడునని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;

10 కానీ ఈ తరమువారు నీ ద్వారా నా వాక్యమును పొందెదరు;

11 నీ సాక్ష్యముతో పాటు, నా సేవకులలో ముగ్గురి సాక్ష్యము, అనగా ఎవరినైతే నేను పిలిచి నియమించెదనో, ఎవరికైతే నేను ఈ పలకలను చూపెదనో, వారు నీ ద్వారా ఇవ్వబడిన నా వాక్యములతో ముందుకు సాగెదరు.

12 అవును, ఈ సంగతులు సత్యమని వారు నిశ్చయముగా తెలుసుకొందురు, ఏలయనగా నేను దానిని పరలోకము నుండి వారికి ప్రకటించెదను.

13 అవి ఉన్నవిధముగా వాటిని చూచి, వీక్షించునట్లు వారికి నేను శక్తిననుగ్రహించెదను;

14 మరియు ఈ సమయములో అరణ్యములోనుండి నా సంఘము—చంద్రుని వలే స్పష్టముగా, సూర్యుని వలే కాంతివంతముగా, ధ్వజములతో వచ్చు సైన్యము వలే భయంకరముగా—లేపబడి, ముందుకు వచ్చుటకు మొదలుపెట్టుచుండగా ఈ విధమైన సాక్ష్యమును పొందుటకు ఈ తరములో మరెవరికి నేను ఈ శక్తిని ప్రసాదించను.

15 నా వాక్యమును గూర్చి ముగ్గురు సాక్షుల సాక్ష్యమును నేను ముందుకు పంపెదను.

16 ఇదిగో, ఎవరైతే నా మాటలయందు నమ్మికయుంచెదరో, వారిని నా ఆత్మ ప్రత్యక్షత ద్వారా నేను దర్శించెదను; వారు నా మూలముగా, అనగా నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను—జన్మించెదరు.

17 ఇంకొంతకాలము మీరు వేచియుండవలెను, ఏలయనగా మీరింకను నియమింపబడలేదు—

18 ఈ తరము వారు నా వాక్యమునకు విరోధముగా తమ హృదయాలను కఠినపరచుకొనిన యెడల, వీరి సాక్ష్యము కూడా వారిని ఖండించుటకు బయలువెళ్ళును;

19 ఏలయనగా వారు పశ్చాత్తాపపడని యెడల, నాశనకరమైన ఉపద్రవము భూలోక నివాసుల మధ్యకు వెళ్ళి, దానిలో నివశించు వారందరు నా రాకడ తేజస్సు వలన దహనమై, భూమి నిర్మానుష్యమై, పూర్తిగా నాశనమయ్యే వరకు నిర్ణీత సమయములలో సంభవించుట కొనసాగును.

20 ఇదిగో, యెరూషలేము యొక్క నాశనమును గూర్చి నేను ప్రజలకు చెప్పిన విధముగా, ఈ సంగతులను నీకు చెప్పుచున్నాను; ఇంతవరకు నెరవేరిన విధముగా ఈ సమయములో కూడా నా వాక్యము నెరవేరును.

21 ఇప్పుడు నా సేవకుడవైన జోసెఫ్, పశ్చాత్తాపపడి నా యెదుట మరింత నిజాయితీగా నడుచుకొమ్మని, మనుష్యుల యొక్క ఒప్పింపులకు ఇంకెన్నడూ లోబడవద్దని నేను నిన్నాజ్ఞాపించుచున్నాను;

22 నేను నీకాజ్ఞాపించిన ఆజ్ఞలు పాటించుటలో స్థిరముగానుండుము; నీవు దీనిని చేసిన యెడల నీవు చంపబడిననూ, నేను నీకు నిత్యజీవమును అనుగ్రహించెదను.

23 ఇప్పుడు, నా సేవకుడవైన జోసెఫ్, సాక్ష్యమును కోరే మనుష్యుని గూర్చి నేను మరలా నీతో మాట్లాడుచున్నాను—

24 ఇదిగో నేను అతనితో చెప్పుచున్నాను, అతడు తననుతాను హెచ్చించుకొనుచున్నాడు, నా యెదుట తగినంతగా తననుతాను తగ్గించుకొనుట లేదు; కానీ నా యెదుట సాష్టాంగపడి, బలమైన ప్రార్థన, విశ్వాసములతో తన హృదయము యొక్క యథార్థతతో తననుతాను తగ్గించుకొనిన యెడల, అప్పుడు తాను చూడగోరు విషయములను చూచుటకు నేను అతడిని అనుమతించెదను.

25 అప్పుడతడు ఈ తరము యొక్క జనులతో చెప్పును: ఇదిగో, జోసెఫ్ స్మిత్ జూ. కు ప్రభువు చూపిన సంగతులను నేను చూచితిని, అవి సత్యమని నేను నిశ్చయముగా యెరుగుదును, ఏలయనగా నేను వాటిని చూచితిని, అవి దేవుని శక్తిచేత నాకు చూపబడినవి, కానీ మనుష్యుని శక్తిచేత కాదు.

26 ప్రభువైన నేను నా సేవకుడైన మార్టిన్ హారిస్‌కు ఆజ్ఞాపించినదేమనగా, ఈ సంగతులను గూర్చి ఇవి కాక ఇంకేమియు అతడు వారికి చెప్పకూడదు. అతడిలాగే చెప్పవలెను: నేను వాటిని చూచితిని, అవి నాకు దేవుని శక్తిచేత చూపబడినవి; ఈ మాటలనే అతడు చెప్పవలెను.

27 కానీ దీనినతడు తిరస్కరించిన యెడల, మునుపతడు నాతో చేసిన నిబంధనను అతిక్రమించును మరియు అతడు నిందించబడును.

28 ఇప్పుడు, తననుతాను తగ్గించుకొని, తాను చేసిన తప్పిదములను నా యొద్ద ఒప్పుకొని, నా ఆజ్ఞలు పాటించెదనని నాతో నిబంధన చేసుకొని, నా యందు విశ్వాసమును సాధన చేయని యెడల, ఇదిగో నేను అతనితో చెప్పునదేమనగా, అతనికేవిధమైన వీక్షణలు కలుగవు, ఏలయనగా నేను చెప్పిన సంగతులను వీక్షించుటకు నేనతడిని అనుమతించను.

29 అట్లైనయెడల నా సేవకుడవైన జోసెఫ్, నీవతనికి చెప్పవలెనని నేను నీకాజ్ఞాపించునదేమనగా, అతడు ఇంకేమియు చేయకూడదు, లేదా ఈ విషయమును గూర్చి ఇకమీదట నన్ను ఇబ్బందిపెట్టకూడదు.

30 అట్లైనయెడల, ఇదిగో జోసెఫ్ నేను నీకు చెప్పునదేమనగా, మరికొన్ని పేజీలు అనువాదము చేసిన తరువాత, తిరిగి నేను నిన్నాజ్ఞాపించే వరకు కొంతకాలము నీవు ఆగవలెను; తరువాత నీవు మరలా అనువాదము చేయవచ్చును.

31 నీవు దీనిని చేయనియెడల, ఇదిగో నీకిక ఏ బహుమానము ఉండదు, నేను నీకప్పగించిన వాటిని తీసివేయుదును.

32 ఇప్పుడు, నిన్ను నాశనము చేయుటకు వేచియుండుటను నేను ముందుగా చూచితిని గనుక, నా సేవకుడు మార్టిన్ హారిస్ తననుతాను తగ్గించుకొని, నా నుండి ఒక సాక్ష్యమును పొందని యెడల అతడు పాపములో పడిపోవునని నేను ముందుగా చూచితిని;

33 ఈ భూమిపై నుండి నిన్ను పూర్తిగా నాశనము చేయుటకు అనేకులు వేచియున్నారు; ఈ కారణము చేతనే, నీ దినములు అధికమగునట్లు నేను నీకు ఈ ఆజ్ఞలనిచ్చితిని.

34 అవును, ఈ కారణము చేతనే నేను చెప్పితిని: ఆగుము, నేను నిన్నాజ్ఞాపించునంత వరకు కదలక నిలిచియుండుము, నీకాజ్ఞాపించిన కార్యమును నీవు నెరవేర్చునట్లు నీకొక మార్గమును నేను సిద్ధపరిచెదను.

35 నా ఆజ్ఞలు పాటించుటలో నీవు విశ్వాసముగా ఉండిన యెడల, అంత్యదినమున నీవు పైకి లేపబడుదువు. ఆమేన్.