లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 106


106వ ప్రకరణము

1834, నవంబరు 25న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటు ఆలీవర్ కౌడరీ అన్నయైన వారెన్ ఏ. కౌడరీకి నిర్దేశింపబడినది.

1–3, అధ్యక్షత్వమువహించు స్థానిక అధికారిగా వారెన్ ఎ. కౌడరీ పిలువబడెను; 4–5, వెలుగు సంబంధులకు క్రీస్తు రెండవ రాకడ దొంగవలె ఆశ్చర్యమును కలిగించదు; 6–8, సంఘములో నమ్మకమైన సేవ, గొప్ప దీవెనలను తెచ్చును.

1 నా సేవకుడైన వారెన్ ఎ. కౌడరీ, ఫ్రీడం మరియు దాని చుట్టూ ఉన్న ప్రదేశాలందున్న నా సంఘముపైన అధ్యక్షత్వమువహించు ఒక ప్రధాన యాజకునిగా నియమించబడుట నా చిత్తమైయున్నది;

2 అతడు నా నిత్య సువార్తను ప్రకటించవలెను, తన స్వరమెత్తి తన స్వస్థలమునందే కాక చుట్టూ ఉన్న కౌంటీలలోని జనులను హెచ్చరించవలెను;

3 మరియు పరలోక రాజ్యమును, దాని నీతిని శ్రద్ధతో వెదకుచు నేనిప్పుడు ఇచ్చియున్న ఈ ఉన్నతమైన, పరిశుద్ధమైన పిలుపునకు తన సమయమునంతటిని సమర్పించవలెను, మరియు అవసరమైనవన్నియు వారికి అనుగ్రహింపబడును; ఏలయనగా పనివాడు తన జీతమునకు పాత్రుడు.

4 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ప్రభువు రాకడ సమీపములోనున్నది మరియు రాత్రివేళ వచ్చు దొంగవలే అది లోకమును ఆశ్యర్యపరచును—

5 కాబట్టి, వెలుగు సంబంధులుగా ఉండుటకు మరియు ఆ దినము మిమ్ములను దొంగవలే ఆశ్చర్యపరచకుండునట్లు మీ నడుములకు దట్టీలను కట్టుకొనుడి.

6 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుడైన వారెన్ నా రాజదండమునకు సాగిలపడి, మనుష్యుల మాయోపాయముల నుండి తననుతాను వేరుపరచుకొనినప్పుడు పరలోకములో సంతోషము కలిగెను;

7 కాబట్టి, నా సేవకుడైన వారెన్ ధన్యుడు, ఏలయనగా అతని యెడల నేను కరుణ కలిగియుందును; తన హృదయములో వ్యర్థమైన ఆలోచనలు ఉన్నప్పటికీ, అతడు నా యెదుట తననుతాను తగ్గించుకొనిన యెడల నేనతనిని పైకిలేపెదను.

8 అతడు నిలువబడునట్లు కృపను, ధైర్యమును నేనతనికిచ్చెదను; అతడు నమ్మకమైన సాక్షిగా కొనసాగి, సంఘమునకు వెలుగుగా ఉన్న యెడల, నా తండ్రి నివాసములలో నేనతనికి ఒక కిరీటమును సిద్ధపరచితిని. అలాగే జరుగును గాక. ఆమేన్.