లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 135


135వ ప్రకరణము

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్, ఆయన సహోదరుడు, గోత్రజనకుడైన హైరం స్మిత్‌లు కార్తేజ్, ఇల్లినాయ్‌లో 1844, జూన్ 27న హతసాక్షులయ్యారని ప్రకటన. ఈ పత్రము సిద్ధాంతము మరియు నిబంధనల 1844వ సంచిక యొక్క చివరి భాగములో చేర్చబడెను, జోసెఫ్, హైరం స్మిత్‌లు చంపబడినప్పుడు అది ప్రచురించబడుటకు దాదాపు సిద్ధముగా ఉండెను.

1–2, కార్తేజ్ చెరసాలలో జోసెఫ్, హైరంలు హతసాక్షులైరి; 3, ప్రవక్త యొక్క ప్రాముఖ్యమైన స్థానము ప్రకటించబడెను; 4–7, ఈ కార్యము సత్యమైనదని, దైవికమైనదని వారి నిరపరాధ రక్తము సాక్ష్యమిచ్చుచున్నది.

1 ఈ గ్రంథము మరియు మోర్మన్ గ్రంథము యొక్క సాక్ష్యమును ముద్రించుటకు, ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్, గోత్రజనకుడైన హైరం స్మిత్‌లు హతసాక్షులైరని మేము ప్రకటించుచున్నాము. వారు 1844, జూన్ 27 సాయంత్రం 5 గంటలకు కార్తేజ్ చెరసాలలో నల్లరంగు వేసుకొనిన 150 నుండి 200 మంది సాయుధులైన అల్లరిమూక చేత కాల్చబడిరి. హైరం మొదట కాల్చబడి, “నేను మృతుడను” అని నిట్టూర్చుచు నిశ్శబ్దముగా నేలకొరిగెను. జోసెఫ్ కిటికీ నుండి దూకి, ఆ ప్రయత్నములో కాల్చిబడి “ఓ ప్రభువా, నా దేవా!” అని నిట్టూర్చుచు మరణించెను. వారు మరణించిన తరువాత ఇరువురు అతి క్రూరముగా కాల్చబడిరి, వారిరువురికి నాలుగు తుపాకిగుండ్లు తగిలెను.

2 ఆ సమయములో పన్నెండుమందిలో ఇద్దరైన జాన్ టేలర్, విల్లార్డ్ రిఛర్డ్స్ మాత్రమే ఆ గదిలోనుండిరి; మొదటివ్యక్తి నాలుగు గుళ్లతో అతి క్రూరముగా గాయపరచబడెను, కానీ తరువాత కోలుకొనెను; రెండవ వ్యక్తి దేవుని కృప వలన తన వస్త్రమునకు ఒక చిల్లుయైనను పడకుండా తప్పించుకొనెను.

3 దేవుని ప్రవక్త, దీర్ఘదర్శియైన జోసెఫ్ స్మిత్, మనుష్యుల రక్షణ కొరకు యేసు క్రీస్తు తప్ప ఈ లోకములో జీవించిన ఏ మనుష్యుడు చేయనంత చేసెను. ఇరువది సంవత్సరాల అతి తక్కువ సమయములో ఆయన మోర్మన్ గ్రంథమును వెలుగులోనికి తెచ్చెను, ఆయన దానిని దేవుని యొక్క బహుమానము మరియు శక్తిచేత అనువదించెను, అది రెండు ఖండములలో ప్రచురించబడుటకు కారకుడాయెను; అది కలిగియున్న నిత్య సువార్త యొక్క సంపూర్ణతను భూమి నలుమూలలకు పంపెను; ఈ సిద్ధాంతము మరియు నిబంధనల గ్రంథమును కూర్పుచేయు బయల్పాటులు, ఆజ్ఞలను, మనుష్యకుమారుల ప్రయోజనము కొరకు జ్ఞానముతోనిండిన అనేక పత్రములను, సూచనలను వెలుగులోనికి తెచ్చెను. వేలకొలది కడవరి దిన పరిశుద్ధులను సమకూర్చెను, గొప్ప పట్టణమును నిర్మించెను, నాశనము చేయజాలని పేరు ప్రఖ్యాతులను వదిలివెళ్లెను. దేవుని మరియు ప్రజల దృష్టిలో అతడు గొప్పగా జీవించెను, గొప్పగా మరణించెను; ప్రాచీన కాలములో ప్రభువు అభిషేకించిన వారిలో అనేకమందివలే ఆయన తన పరిచర్యను, తన కార్యములను తన రక్తముతో ముద్రించెను; అతని సహోదరుడు హైరం కూడా ఆవిధముగానే చేసెను. జీవించినంతవరకు వారు విడిపోలేదు, మరణమందును వారు వేరుచేయబడలేదు!

4 చట్టపు కపట ఆదేశములకు తననుతాను అప్పగించుకొనుటకు జోసెఫ్ కార్తేజ్ చెరసాలకు వెళ్ళినప్పుడు, ఆయన హత్యచేయబడుటకు రెండు మూడు దినములకు ముందు ఈలాగు చెప్పెను: “వధకు తేబడు గొఱ్ఱెవలె నేను వెళ్ళుచున్నాను; కానీ వేసవికాలపు ఉదయమువలే నేను నిశ్శబ్దముగా ఉన్నాను; దేవుని యెడలను మనుష్యులందరి యెడలను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నది. నిరపరాధిగా నేను మరణించెదను, అయినప్పటికీ నన్నుగూర్చి ఈలాగు చెప్పబడును—అతడు ఒక ప్రణాళిక ప్రకారము చంపబడెను.”—ఆ రోజు ఉదయమే హైరం బయలుదేరుటకు సిద్ధపడినప్పుడు—వధకు సిద్ధపడెనని చెప్పవచ్చును? అవును, ఆ విధముగానే జరిగెను—అతడు మోర్మన్ గ్రంథములో ఈథర్ పన్నెండవ అధ్యాయము చివరి భాగములో ఈ పేరాను చదివి, పుట పైభాగమును మడతపెట్టెను:

5 మరియు ఇది జరిగెను, వారు దాతృత్వమును కలిగియుండునట్లు ఆయన అన్యజనులకు కృపనియ్యవలెనని నేను ప్రభువుకు ప్రార్థన చేసితిని. ప్రభువు నాతో చెప్పెను: వారు దాతృత్వమును కలిగియుండని యెడల, అది నీకు ఏమియు కాదు. నీవు విశ్వాసము కలిగియుంటివి; అందువలన నీ వస్త్రములు శుద్ధిచేయబడును. నీవు నీ బలహీనతను చూచియున్నావు, కాబట్టి నా తండ్రి నివాసములందు నేను సిద్ధపరచిన స్థలములో నీవు కూర్చుండునట్లు నీవు బలపరచబడెదవు. ఇప్పుడు నేను … క్రీస్తు న్యాయపీఠము యెదుట మేము కలుసుకొనువరకు అన్యజనులకు, అవును నేను ప్రేమించు నా సహోదరులకు కూడా వీడ్కోలు చెప్పుచున్నాను, మీ రక్తముతో నా వస్త్రములు మలినము కాలేదని అక్కడ మనుష్యులందరు తెలుసుకొందురు. ఆ సాక్షులు ఇప్పుడు మరణించిరి, వారి సాక్ష్యము ప్రభావము గలది.

6 హైరం స్మిత్‌నకు 1844 ఫిబ్రవరికి నలుబది నాలుగేండ్లు, 1843 డిసెంబరుకు జోసెఫ్ స్మిత్‌కు ముప్పది ఎనిమిదేండ్లు; ఈ సమయమునుండి వారి పేర్లు మతము కొరకు హతసాక్షులైన తరగతిలో చేర్చబడును; చెడిపోయిన లోకము యొక్క రక్షణ కొరకు మోర్మన్ గ్రంథము, ఈ సిద్ధాంతము మరియు నిబంధల గ్రంథములను ముందుకు తెచ్చుటకు పందొమ్మిదవ శతాబ్దపు ఉత్తముల రక్తము మూల్యముగా చెల్లించవలసి వచ్చెనని ప్రతి దేశములోనున్న పాఠకునికి జ్ఞాపకము చేయబడును. దేవుని మహిమ కొరకు అగ్ని పచ్చని చెట్టును దహించగలిగినప్పుడు, తెగులుపట్టిన ద్రాక్షతోటను శుద్ధిచేయుటకు అది ఎంతో సులువుగా ఎండిన చెట్లను కాల్చివేయగలదు గదా. మహిమపరచబడుటకు వారు జీవించిరి; మహిమపరచబడుటకు వారు మరణమునొందిరి; వారి మహిమ వారి నిత్య బహుమానమైయున్నది. పవిత్రపరచబడిన వారికొరకు ఇవ్వబడు రత్నములవలే వారి పేర్లు ఒక యుగము నుండి మరొక యుగము వరకు రాబోయే తరములకు వెళ్ళును.

7 గతములో తరచు నిరూపించబడినట్లే వారు ఏ నేరము చేయని నిరపరాధులు, వారు కేవలము మతద్రోహుల, దుష్టుల కుట్రవలన చెరసాలలో బంధించబడిరి; కార్తేజ్ చెరసాల నేలపైన వారి నిరపరాధ రక్తము “మోర్మనిజం” నకు అతికించబడిన పెద్ద ముద్ర, అది ఈ భూమిపైనున్న ఏ న్యాయస్థానముచేత తిరస్కరించబడలేదు, గవర్నరు చేత ప్రతిజ్ఞ చేయబడి, నిలుపుకోని ఆ రాష్ట్రపు వాగ్దానముతో పాటు ఇల్లినాయ్ రాష్ట్రపు చిహ్నముపైన వారి నిరపరాధ రక్తము నిత్య సువార్త యొక్క యథార్థతకు సాక్ష్యము. దానిని సర్వలోకము తప్పుగా నిరూపించలేదు; సంయుక్త రాష్ట్రముల జాతీయ జెండాపైన, రాజ్యాంగముపైన వారి నిరపరాధ రక్తము యేసు క్రీస్తు యొక్క మతమునకు ప్రతినిధిగానుండును, అది జనములన్నింటిలోనున్న నిజాయితీగల మనుష్యుల హృదయాలను తాకును; ఆయన ఆ రక్తమునకు భూనివాసులకు ప్రతిదండన చేయువరకు యోహాను చూచిన బలిపీఠము క్రింద హతసాక్షులందరి నిరపరాధ రక్తముతోపాటు వారి నిరపరాధ రక్తము సైన్యములకధిపతియైన ప్రభువుకు మొరపెట్టును. ఆమేన్.