53వ ప్రకరణము
1831 జూన్ 8న, ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఆల్గర్నాన్ సిడ్నీ గిల్బర్ట్‌కివ్వబడిన బయల్పాటు. సిడ్నీ గిల్బర్ట్ విన్నపమును బట్టి, సహోదరుడు గిల్బర్ట్ పని మరియు నియామకములను గూర్చి ప్రవక్త ప్రభువును విచారించెను.
1–3, ఒక పెద్దగా నియమించబడుటయే సంఘములో సిడ్నీ గిల్బర్ట్ పిలుపు మరియు ఎన్నిక; 4–7, బిషప్పుకు ప్రతినిధిగా కూడా అతడు సేవ చేయవలెను.
1 ఇదిగో, నా సేవకుడవైన సిడ్నీ గిల్బర్ట్, నేను నీకు చెప్పునదేమనగా, నేను నీ ప్రార్థనలను వినియున్నాను; ప్రభువైన నేను ఈ అంత్యదినములలో స్థాపించిన సంఘములో నీ పిలుపు, ఎన్నికను గూర్చి నీ దేవుడైన ప్రభువు ద్వారా నీకు తెలుపబడవలెనని నీవు నాకు మొరపెట్టితివి.
2 లోక పాపముల కొరకు సిలువ వేయబడిన ప్రభువైన నేను, నీవు లోకమును విడిచిపెట్టవలెనని నీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను.
3 నా వాక్యప్రకారము విశ్వాసము, పశ్చాత్తాపము, పాప క్షమాపణ, హస్తనిక్షేపణము ద్వారా పరిశుద్ధాత్మను పొందుటను ప్రకటించుటకు ఒక పెద్దగా నా నియామకమును నీ మీద తీసుకొనుము.
4 ఇకమీదట అనుగ్రహించబడు ఆజ్ఞల ప్రకారము, బిషప్పుచేత నియమించబడు స్థానములో ఈ సంఘమునకు ప్రతినిధిగానుండుము.
5 మరలా నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకులైన జోసెఫ్ స్మిత్ జూ., సిడ్నీ రిగ్డన్‌లతో నీవు ప్రయాణము చేయవలెను.
6 నీవు పొందబోవు మొదటి విధులు ఇవే; నా ద్రాక్షతోటలో నీవు చేయు పనిని బట్టి మిగిలినవి రాబోవు కాలములో తెలుపబడును.
7 మరలా, అంతము వరకు సహించువాడు మాత్రమే రక్షించబడునని నీవు నేర్చుకొనవలెనని నేను కోరుచున్నాను. అలాగే జరుగును గాక. ఆమేన్.