87వ ప్రకరణము
1832, డిసెంబరు 25న కర్ట్‌లాండ్, ఒహైయో వద్ద లేదా సమీపములో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా యుద్ధమును గూర్చి ఇవ్వబడిన బయల్పాటు మరియు ప్రవచనము. ఈ సమయములో సంయుక్త రాష్ట్రాలలో బానిసత్వము మరియు ప్రభుత్వము చేత అడగబడిన పన్నును వసూలు చేయుట లేదా చెల్లించుటకు దక్షిణ కెరోలిన నిరాకరించుట వంటి వివాదములు ప్రభలి ఉండెను. అరణ్యమునుండి బయటకు సంఘము తన ప్రయాణమును మొదలుపెట్టినప్పటినుండి ఉన్నవాటి కంటే సంయుక్త రాష్ట్రాల మధ్య “అలజడి యొక్క ప్రత్యక్షతలు” ప్రవక్తకు మరింత “ఎక్కువగా కనబడెను” అని జోసెఫ్ స్మిత్ చరిత్ర వివరించుచున్నది.
1–4, ఉత్తర రాష్ట్రాలకు, దక్షిణ రాష్ట్రాలకు మధ్య యుద్ధము ముందుగా చెప్పబడినది; 5–8, భూలోక నివాసులందరి మీద గొప్ప ఉపద్రవములు కలుగును.
1 దక్షిణ కెరోలినా తిరుగుబాటుతో మొదలుకొని త్వరలో కలుగబోవు యుద్ధములు, వాటి పర్యవసానముగా వచ్చు అనేకమంది మరణము, వేదనను గూర్చి నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు;
2 ఈ ప్రదేశము నుండి మొదలుకొని సమస్త జనముల మీద యుద్ధము వ్యాపించు సమయము వచ్చును.
3 ఏలయనగా ఇదిగో, దక్షిణ రాష్ట్రములు ఉత్తర రాష్ట్రములకు విరోధముగా చీలిపోవును, దక్షిణ రాష్ట్రములు ఇతర రాష్ట్రములను అనగా గ్రేట్ బ్రిటన్‌ను కూడా పిలుచును, ఇతర దేశములనుండి తమనుతాము కాపాడుకొనుటకు వారు ఇతర దేశములను పిలిచెదరు; అప్పుడు అన్నిదేశములలో యుద్ధము వ్యాపించును.
4 అనేక దినముల తరువాత, బానిసలు యుద్ధము కొరకు పోరాడుటను నేర్చుకొని, శిక్షణను పొంది, తమ యజమానులకు విరోధముగా లేచెదరు.
5 దేశములో మిగిలిన శేషము తమకుతాముగా పోరాడుటను నేర్చుకొని, మిక్కిలి కోపముగలవారిగా మారి, అన్యజనులను గొప్ప హింసతో హింసించుదురు.
6 కాబట్టి కత్తివలన, రక్తపాతము వలన భూలోక నివాసులు దుఃఖించెదరు; చెప్పబడినట్లుగా కరువు, తెగులు, భూకంపము, ఆకాశమునుండి ఉరుము, తీవ్రమైన మరియు కాంతివంతమైన మెరుపు వలన అన్ని దేశాలు పూర్తిగా మ్రింగివేయబడేవరకు భూలోక నివాసులు సర్వశక్తిమంతుడైన దేవుని ఉగ్రత, కోపము మరియు శిక్షను అనుభవించునట్లు చేయబడుదురు.
7 భూమిపైనుండి పరిశుద్ధుల మొర, పరిశుద్ధుల రక్తము, వారి శత్రువులమీద పగతీర్చుకొనుటకు సైన్యములకధిపతియగు ప్రభువు చెవులలోనికి వచ్చుట ఆగిపోవును.
8 కాబట్టి, ప్రభువు దినము వచ్చువరకు పరిశుద్ధ స్థలములలో మీరు కదలక నిలిచియుండుడి; ఏలయనగా, అది త్వరగా వచ్చునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్.