లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 83


83వ ప్రకరణము

1832, ఏప్రిల్ 30న ఇండిపెండెన్స్, మిస్సోరిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ కివ్వబడిన బయల్పాటు. ప్రవక్త తన సహోదరులతో సలహామండలిలో కూర్చొనియుండగా ఈ బయల్పాటు పొందబడినది.

1–4, స్త్రీలు, పిల్లలు వారి ఆధారము కొరకు వారి భర్తలపై, తండ్రులపై హక్కును కలిగియున్నారు; 5–6, విధవరాండ్రు, దిక్కులేని పిల్లలు వారి ఆధారము కొరకు సంఘముపై హక్కును కలిగియున్నారు.

1 సంఘమునకు చెందియుండి, తమ భర్తలను లేదా తండ్రులను కోల్పోయిన స్త్రీలు, పిల్లలను గూర్చిన సంఘ చట్టములకు అదనముగా ప్రభువు నిశ్చయముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు;

2 తమ భర్తలు మరణించు వరకు స్త్రీలు వారి పోషణ నిమిత్తము తమ భర్తలపై హక్కును కలిగియున్నారు; వారు అతిక్రమము చేసిన వారిగా కనుగొనబడని యెడల, సంఘములో సంపూర్ణ సహవాసమును కలిగియుందురు.

3 వారు నమ్మకముగానుండని యెడల వారు సంఘములో సహవాసమును కలిగియుండరాదు; అయినప్పటికీ భూచట్టముల ప్రకారము వారు పొందిన స్వాస్థ్యములపై ఆధారపడి జీవించవచ్చును.

4 పిల్లలందరు యుక్తవయస్కులగు వరకు తమ పోషణ నిమిత్తము వారి తల్లిదండ్రులపై హక్కును కలిగియున్నారు.

5 దాని తరువాత, వారి తల్లిదండ్రులు వారికి స్వాస్థ్యములను ఇవ్వజాలని యెడల, వారు సంఘముపై లేదా మరొక మాటలో ప్రభువు గిడ్డంగిపై హక్కును కలిగియున్నారు.

6 సంఘ సమర్పణల చేత గిడ్డంగి నిర్వహించబడవలెను; విధవరాండ్రు, దిక్కులేని పిల్లలు, అదేవిధముగా బీదలు కూడా ఆదరించబడవలెను. ఆమేన్.