లేఖనములు
పీఠిక


పీఠిక

సిద్ధాంతము మరియు నిబంధనలు అంత్యదినములలో ఈ భూమిపైన దేవుని రాజ్యస్థాపనకు, క్రమబద్దీకరణకు ఇవ్వబడిన దైవిక బయల్పాటులు మరియు ప్రేరేపిత బహిరంగ ప్రకటనల సమకూర్పు. ప్రకరణాలలో అధికము యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులకు నిర్దేశించబడినప్పటికీ, ఈ సందేశములు, హెచ్చరికలు, ఉపదేశములు సర్వమానవాళి ప్రయోజనము కొరకు, వారి లౌకిక శ్రేయోభివృద్ధి మరియు వారి నిత్య రక్షణ కొరకు ప్రతిచోట ఉన్న జనులందరితో మాట్లాడుచున్న ప్రభువైన యేసు క్రీస్తు యొక్క స్వరము వినుటకు ఒక ఆహ్వానాన్ని కలిగియున్నవి.

ఈ సంగ్రహణములోని బయల్పాటులలో అధికము యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క మొదటి ప్రవక్త మరియు అధ్యక్షుడైన జోసెఫ్ స్మిత్ జూ. ద్వారా పొందబడినవి. మిగిలినవి అతని తరువాత అధ్యక్షత్వములోకి వచ్చిన కొందరి ద్వారా ఇవ్వబడెను (ప్రకరణములు 135, 136 మరియు 138, అధికారిక ప్రకటన 1 మరియు 2 శీర్షికలు చూడుము).

పరిశుద్ధ గ్రంథము, మోర్మన్ గ్రంథము, అమూల్యమైన ముత్యములతో పాటు సిద్ధాంతము మరియు నిబంధనల గ్రంథము సంఘము యొక్క అధికారిక లేఖనములలో ఒకటి. అయినప్పటికీ సిద్ధాంతము మరియు నిబంధనలు ప్రత్యేకమైనది, ఎందుకనగా ఇది ప్రాచీన పత్రము యొక్క అనువాదము కాదు, కానీ ఆధునిక కాలములో ఆరంభమైనది మరియు ఈ దినములలో దేవుని రాజ్యస్థాపనకు, ఆయన పరిశుద్ధ కార్యపు పునఃస్థాపనకు దేవుని చేత ఆయన ఎన్నుకొనిన ప్రవక్తలద్వారా ఇవ్వబడినది. ఈ బయల్పాటులందు కాలముల సంపూర్ణ యుగములో నూతనముగా మాట్లాడుచున్న యేసు క్రీస్తు యొక్క మృదువైన, స్థిరమైన స్వరమును ఒకరు వినగలరు; ఇక్కడ ప్రారంభమైన కార్యము లోకారంభమునుండి పరిశుద్ధ ప్రవక్తలందరి మాటలకు అనుగుణముగా, నెరవేర్పుగా, ఆయన రెండవ రాకడకు సిద్ధపాటుగా ఉన్నది.

జోసెఫ్ స్మిత్ జూ., 1805 డిసెంబరు 23న వెర్మౌంట్ రాష్ట్రములోని విన్డ్సర్ కౌంటీలోనున్న షారోన్‌లో జన్మించెను. అతని బాల్యములో, తన కుటుంబముతో పశ్చిమ న్యూయార్క్‌లోని మాంచెస్టర్‌కు వెళ్ళెను. మాంచెస్టర్‌కు సమీపములో అతడు జీవించుచుండగా 1820 వసంతకాలములో అతనికి పధ్నాలుగేండ్ల వయస్సు ఉన్నప్పుడు తన మొదటి దర్శన అనుభవమును పొందెను, దానిలో అతడు నిత్య తండ్రియైన దేవుడు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు చేత దర్శింపబడెను. ఈ దర్శనములో క్రొత్త నిబంధన కాలములో స్థాపించబడి, సంపూర్ణ సువార్తను నిర్వహించిన యేసు క్రీస్తు యొక్క సత్య సంఘము ఇప్పుడు భూమిపై లేదని అతనికి చెప్పబడెను. ఇతర దైవిక ప్రత్యక్షతలు తరువాత కలిగెను, వాటిలో అతడు అనేకమంది దేవదూతల చేత బోధింపబడెను; భూమిమీద అతడు చేయుటకు దేవుడు ఒక కార్యమును కలిగియున్నాడని, అతని ద్వారా యేసు క్రీస్తు యొక్క సంఘము భూమిమీద పునఃస్థాపించబడునని అతనికి చూపబడెను.

కొంతకాలమైన తరువాత, జోసెఫ్ స్మిత్ దైవిక సహాయముతో మోర్మన్ గ్రంథమును అనువదించి, ప్రచురించగలిగెను. ఈ సమయములో అతడు మరియు ఆలీవర్ కౌడరీ 1829 మే లో బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా అహరోను యాజకత్వమునకు నియమింపబడిరి (సి మరియు ని 13 చూడుము), దాని తరువాత త్వరలోనే ప్రాచీన అపొస్తలులైన పేతురు, యాకోబు, యోహానుల ద్వారా మెల్కీసెదెకు యాజకత్వమునకు కూడా వారు నియమింపబడిరి (సి మరియు ని 27:12 చూడుము). తరువాత ఇతర నియామకములు జరిగినవి, వాటి ద్వారా మోషే, ఏలీయా, ఎలీషా మరియు అనేక ఇతర ప్రాచీన ప్రవక్తల ద్వారా వారికి యాజకత్వపు తాళపుచెవులు అనుగ్రహించబడినవి (సి మరియు ని 110; 128:18, 21 చూడుము). వాస్తవానికి ఈ నియామకములు భూమిమీద మనుష్యునికి ఇవ్వబడిన దైవిక అధికారము యొక్క పునఃస్థాపన. 1830 ఏప్రిల్ 6న, పరలోక దర్శకత్వములో, ప్రవక్త జోసెఫ్ స్మిత్ సంఘమును ఏర్పాటుచేసెను, మరియు ఆవిధముగా యేసు క్రీస్తు యొక్క సత్య సంఘము సువార్తను ప్రకటించుటకు మరియు రక్షణ విధులను నిర్వహించుటకు మరియొక సారి మనుష్యుల మధ్య ఒక సంస్థగా పనిచేయుచున్నది. (సి మరియు ని 20, అమూల్యమైన ముత్యము, జోసెఫ్ స్మిత్—చరిత్ర 1 చూడుము.)

ఈ పరిశుద్ధ బయల్పాటులు అవసరతలో ఉన్నప్పుడు ప్రార్థనకు జవాబుగా పొందబడినవి మరియు యథార్థ జనుల నిజ జీవిత పరిస్థితులనుండి వచ్చినవి. ప్రవక్త మరియు అతని సహచరులు దైవిక నడిపింపును కోరగా, దానిని వారు పొందిరని ఈ బయల్పాటులు ధృవీకరించుచున్నవి. ఈ బయల్పాటులలో యేసు క్రీస్తు యొక్క సువార్త పునఃస్థాపించబడుట మరియు బయలుపరచబడుటను, కాలముల సంపూర్ణ యుగము ఉనికిలోనికి వచ్చుటను ఒకరు చూడగలరు. న్యూయార్క్ మరియు పెన్సిల్వేనియా నుండి ఒహైయోకు, మిస్సోరికి, ఇల్లినాయ్‌కు, చివరిగా పశ్చిమ అమెరికా యొక్క గొప్ప పర్వతప్రాంతమునకు సంఘము పశ్చిమదిశగా ప్రయాణము చేయుట మరియు ఆధునిక కాలములో భూమిమీద సీయోనును నిర్మించుటకు ప్రయత్నము చేసినప్పుడు పరిశుద్ధులకు కలిగిన గొప్ప కష్టములు ఈ బయల్పాటులలో చూపబడినవి.

మొదటి ప్రకరణములలో అనేకము మోర్మన్ గ్రంథము యొక్క అనువాదము, ప్రచురణకు సంబంధించిన అంశములను కలిగియున్నవి (3, 5, 10, 17 మరియు 19 ప్రకరణములు చూడుము). తరువాయి ప్రకరణములలో కొన్ని బైబిలు యొక్క ప్రేరేపిత అనువాదములో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ చేసిన పనిని తెలుపును, ఆ సమయములో గొప్ప సిద్ధాంతపరమైన ప్రకరణములలో అనేకము పొందబడినవి (ఉదాహరణకు, 37, 45, 73, 76, 77, 86, 91, మరియు 132 ప్రకరణములు చూడుము, వీటిలో ప్రతి ఒక్కటి బైబిలు అనువాదముతో ప్రత్యక్ష సంబంధమును కలిగియున్నది).

దైవత్వము యొక్క స్వభావము, మనుష్యుని పుట్టుక, సాతాను యొక్క నిజస్వరూపము, మర్త్యత్వము యొక్క ఉద్దేశ్యము, విధేయత యొక్క ఆవశ్యకత, పశ్చాత్తాపపడు అవసరము, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు, రక్షణకు సంబంధించిన విధులు మరియు నిర్వహణ, భూమి యొక్క గమ్యము, పునరుత్థానము మరియు తీర్పు తరువాత నరుని యొక్క భవిష్యత్తు పరిస్థితులు, వివాహ బంధము యొక్క నిత్యత్వము, కుటుంబము యొక్క నిత్యస్వభావము మొదలగు ప్రాథమిక అంశములను గూర్చి వివరణతో బయల్పాటులలో సువార్త సిద్ధాంతములు ఇవ్వబడినవి. అదేవిధముగా సంఘము యొక్క నిర్వహణారూపము క్రమముగా బయలుపరచబడుట అనేది బిషప్పులు, ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది సలహామండలి, డెబ్బదిమందిని పిలుచుట మరియు ఇతర అధ్యక్షత్వము వహించు అధికారులు మరియు సమూహముల స్థాపనతో చూపబడినది. చివరిగా, యేసు క్రీస్తును గూర్చి—ఆయన దైవత్వము, ఘనత, పరిపూర్ణత, ప్రేమ, విమోచన శక్తిని గూర్చి ఇవ్వబడిన సాక్ష్యము ఈ గ్రంథమును మనుష్య కుటుంబమునకు అమూల్యమైనదిగా, “సంఘమునకు ఈ సమస్త భూలోక ఐశ్వర్యముల కంటే మిక్కిలి విలువైనదిగా చేయును.” (సి మరియు ని 70 శీర్షికను చూడుము).

జోసెఫ్ స్మిత్ లేఖకులచేత బయల్పాటులు మొదట నమోదు చేయబడెను మరియు సంఘ సభ్యులు ఉత్సాహంగా ఒకరితోనొకరు చేతివ్రాత ప్రతులను పంచుకున్నారు. మరింత స్థిరమైన గ్రంథాన్ని సృష్టించుటకు లేఖకులు త్వరలోనే ఈ బయల్పాటులను చేతివ్రాత గ్రంథాలలో నకలుచేసారు, ముద్రణ కొరకు బయల్పాటులను సిద్ధపరచుటలో సంఘనాయకులు వాటిని ఉపయోగించారు. జోసెఫ్ మరియు తొలి పరిశుద్ధులు సంఘమును చూచినట్లే ఈ బయల్పాటులను: సజీవమైనవిగా, క్రియాశీలమైనవిగా, అదనపు బయల్పాటులతో సంస్కరింపదగినవిగా చూసారు. బయల్పాటులను నకలు చేసి, వాటిని ప్రచురించుటకు సిద్ధపరచుటలో ఉద్దేశ్యరహిత దోషములు సంభవించి ఉండవచ్చని కూడా వారు గుర్తించారు. ఆవిధంగా, “పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కనుగొను దోషములను సరిచేయమని” సంఘ సమావేశము 1831లో జోసెఫ్ స్మిత్‌ను కోరింది.

బయల్పాటులు సమీక్షించబడి, సవరించబడిన తరువాత, మిస్సొరిలో ఉన్న సంఘ సభ్యులు A Book of Commandments for the Government of the Church of Christ (క్రీస్తు సంఘ పరిపాలన కొరకు ఆజ్ఞల గ్రంథము) అనే శీర్షికతో ఒక గ్రంథాన్ని ప్రచురించడం మొదలుపెట్టారు, అది ప్రవక్త యొక్క తొలి బయల్పాటులలో అనేకము కలిగియున్నది. కానీ 1833 జూలై 20న జాక్సన్ కౌంటీలో ఒక అల్లరిమూక పరిశుద్ధుల ముద్రణాలయమును ధ్వంసం చేసినప్పుడు, ఈ బయల్పాటులను ప్రచురించు మొదటి ప్రయత్నము ముగిసింది.

మిస్సోరి ముద్రణ కార్యాలయము ధ్వంసము చేయబడెనని వినినప్పుడు, జోసెఫ్ స్మిత్ మరియు ఇతర సంఘ నాయకులు కర్ట్‌లాండ్, ఒహైయోలో బయల్పాటులను ప్రచురించుటకు సిద్ధపడసాగిరి. మరలా దోషాలను సవరించి, పదాలకూర్పును స్పష్టం చేసి, సంఘ సిద్ధాంతము, ఏర్పాటులోని అభివృద్ధిని గుర్తించుటకు, వాటిని 1835లో Doctrine and Covenants of the Church of the Latter Day Saints (కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సిద్ధాంతము మరియు నిబంధనలు) గా ప్రచురించుటకు జోసెఫ్ స్మిత్ కొన్ని బయల్పాటుల మూలగ్రంథ సంపాదకత్వమును పర్యవేక్షించెను. జోసెఫ్ స్మిత్ సిద్ధాంతము మరియు నిబంధనల యొక్క మరొక సంచికకు అనుమతించెను, అది 1844లో ప్రవక్త హతసాక్షియైన కొన్ని నెలల్లోనే ప్రచురించబడెను.

ప్రారంభ కడవరి దిన పరిశుద్ధులు బయల్పాటులను విలువైనవిగా ఎంచి, అవి దేవుని యొద్దనుండి వచ్చిన సందేశములుగా చూచిరి. 1831 చివరిలో ఒక సందర్భములో, చాలామంది సంఘ పెద్దలు బయల్పాటుల సత్యము గురించి ప్రభువు వారి ఆత్మలకు ప్రకటించెనని హృదయపూర్వక సాక్ష్యమునిచ్చారు. ఈ సాక్ష్యము పన్నెండుమంది అపొస్తలుల వ్రాతపూర్వక సాక్ష్యముగా సిద్ధాంతము మరియు నిబంధనలు 1835వ సంచికలో ప్రచురించబడినది:

సిద్ధాంతము మరియు నిబంధనల గ్రంథము
యొక్క యథార్థతకు పన్నెండుమంది అపొస్తలుల
సాక్ష్యము

ప్రభువు యొక్క ఆజ్ఞల గ్రంథమునకు సాక్షుల యొక్క సాక్ష్యము, ఆ ఆజ్ఞలను ఆయన జోసెఫ్ స్మిత్ జూ. ద్వారా తన సంఘమునకిచ్చెను, సంఘ స్వరముచేత ఆయన ఈ ఉద్దేశ్యమునకు నియమించబడెను:

కాబట్టి, ఈ బయల్పాటులు దేవుని ప్రేరేపణ వలన ఇవ్వబడినవని, సమస్త మానవులకు ప్రయోజనకరమైనవని, అవి నిశ్చయముగా సత్యమని మాపైకి దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు మా ఆత్మలకు సాక్ష్యమిచ్చెనని మేము ప్రపంచ మానవాళికి, భూమిమీదనున్న ప్రతి ప్రాణికి సాక్ష్యము చెప్పుటకు సమ్మతించుచున్నాము.

ప్రభువు మాకు సహాయకునిగా ఉండగా, మేము ఈ సాక్ష్యమును లోకమునకు చెప్పుచున్నాము; తండ్రియైన దేవుని యొక్క, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపనుబట్టి లోకమునకు ఈ సాక్ష్యమును చెప్పు విశేషాధికారమును కలిగియుండుటకు మేము అనుమతించబడితిమి, దానియందు మేము మిక్కిలి ఆనందించుచున్నాము, వాటి వలన నరుల సంతానము ప్రయోజనము పొందవలెనని ప్రభువును ఎల్లప్పుడు ప్రార్థించుచున్నాము.

పన్నెండుమంది పేర్లు ఏవనగా:

  • థామస్ బి. మార్ష్

  • డేవిడ్ డబ్ల్యు. ప్యాటన్

  • బ్రిగం యంగ్

  • హీబర్ సి. కింబల్

  • ఓర్సన్ హైడ్

  • విలియమ్ ఇ. మెక్‌లెలిన్

  • పార్లీ పి. ప్రాట్

  • లూక్ ఎస్. జాన్సన్

  • విలియమ్ స్మిత్

  • ఓర్సన్ ప్రాట్

  • జాన్ ఎఫ్. బోయన్టన్

  • లైమన్ ఇ. జాన్సన్

సిద్ధాంతము మరియు నిబంధనల తరువాయి సంచికలలో అదనపు బయల్పాటులు, నమోదుచేయబడిన ముఖ్యవిషయాలు సంఘము యొక్క సాధికార సభలు లేదా సమావేశాలలో పొందబడి, అంగీకరించబడినప్పుడు చేర్చబడినవి. బ్రిగం యంగ్ ఆధ్వర్యంలో ఎల్డర్ ఓర్సన్ ప్రాట్ చేత సిద్ధపరచబడిన 1876 సంచికలో బయల్పాటులు సంవత్సర క్రమములో అమర్చబడినవి మరియు చారిత్రాత్మక పీఠికలతో క్రొత్త శీర్షికలు సమకూర్చబడినవి.

1835వ సంచికతో మొదలుకొని, ఏడు మతసంబంధమైన పాఠాల పరంపర కూడా చేర్చబడినది; వీటికి Lectures on Faith (విశ్వాసము గురించి ఉపన్యాసములు) అనే శీర్షిక ఇవ్వబడెను. ఇవి 1834 నుండి 1835 వరకు ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తల పాఠశాలలో ఉపయోగించుటకు సిద్ధపరచబడినవి. సిద్ధాంతమునకు, ఉపదేశమునకు ప్రయోజనకరమైనప్పటికీ, ఈ ఉపన్యాసాలు మొత్తం సంఘమంతటికి బయల్పాటులుగా ఇవ్వబడలేదు లేదా సమర్పించబడలేదు, కాబట్టి అవి 1921వ సంచిక నుండి తొలగించబడినవి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 1981వ ఆంగ్ల సంచికలో, మొట్టమొదటిసారిగా మూడు పత్రాలు చేర్చబడినవి. అవి మృతుల రక్షణ కొరకు మూలసిద్ధాంతములను వర్ణించుచున్న ప్రకరణాలు 137 మరియు 138; జాతి, వర్ణ బేధాలు లేకుండా సంఘము యొక్క యోగ్యుడైన ప్రతి పురుష సభ్యుడు యాజకత్వమునకు నియమించబడవచ్చునని ప్రకటించుచున్న అధికారిక ప్రకటన 2.

సిద్ధాంతము మరియు నిబంధనల యొక్క ప్రతి క్రొత్త సంచికలో పూర్వపు దోషములు సరిచేయబడి, క్రొత్త సమాచారము ముఖ్యముగా ప్రకరణ శీర్షికలలోని చరిత్ర భాగములలో చేర్చబడెను. ప్రస్తుత సంచిక తేదీలను, స్థలముల పేర్లను మరింత సంస్కరించి, ఇతర సవరణలను చేయును. గ్రంథము ఖచ్చితమైన చారిత్రాత్మక సమాచారమునకు అనుగుణంగా ఉండుటకు ఈ మార్పులు చేయబడినవి. ఈ నూతన సంచిక యొక్క ఇతర విశేషాలలో బయల్పాటులు పొందబడిన ప్రధాన భూగోళ ప్రాంతములను చూపు సవరించబడిన పటములు మరియు సంఘ చారిత్రాత్మక ప్రాంతాల యొక్క మెరుగుపరచబడిన ఛాయాచిత్రాలు, పదబంధాలు, ప్రకరణ శీర్షికలు, ప్రధానాంశ సారాంశాలు కలవు, ఇవన్నీ సిద్ధాంతము మరియు నిబంధనలలో ప్రభువు ఇచ్చిన సందేశమును అవగాహన చేసుకొని, ఆనందించుటలో పాఠకులకు సహాయము చేయుటకు రూపకల్పన చేయబడినవి. ప్రకరణ శీర్షికల కొరకు సమాచారము సంఘ చేతివ్రాతల చరిత్రనుండి, ప్రచురించబడిన History of the Church (శీర్షికలలో సంయుక్తంగా జోసెఫ్ స్మిత్ చరిత్రగా పేర్కొనబడినది) Joseph Smith Papers నుండి తీసుకొనబడినది.