54వ ప్రకరణము
1831 జూన్ 10న, ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా న్యూయెల్ నైట్‌కివ్వబడిన బయల్పాటు. ఒహైయోలోని థాంప్సన్‌లో నివసించుచున్న సంఘ సభ్యులు ఆస్తుల సమర్పణను గూర్చి ఏమి చేయవలెనను ప్రశ్నల వలన విడిపోయిరి. స్వార్థము, లోభము ప్రత్యక్షపరచబడెను. షేకర్స్‌కి సువార్త పరిచర్య చేసిన తరువాత (49వ ప్రకరణ శీర్షిక చూడుము), న్యూయార్క్‌లోని కోల్స్‌విల్ నుండి వచ్చుచున్న పరిశుద్ధుల కొరకు స్వాస్థ్యపు భూమిగా విస్తారమైన తన పొలమును సమర్పించాలను నిబంధనను లేమన్ కోప్లీ ఉల్లంఘించెను. పర్యవసానముగా, న్యూయెల్ నైట్ (థాంప్సన్‌లో జీవించుచున్న సభ్యుల అధ్యక్షుడు) మరియు ఇతర పెద్దలు ఏవిధముగా ముందుకు సాగాలో అడుగుటకు ప్రవక్త యొద్దకు వచ్చిరి. ప్రవక్త ప్రభువును విచారించి ఈ బయల్పాటును పొందెను, అది లేమన్ కోప్లీ పొలమును వదిలి మిస్సోరికి ప్రయాణము చేయవలెనని థాంప్సన్‌లో ఉన్న సభ్యులను ఆజ్ఞాపించును.
1–6, కృపను పొందుటకు పరిశుద్ధులు సువార్త నిబంధనను పాటించవలెను; 7–10, కష్టాలలో వారు సహనము కలిగియుండవలెను.
1 ఇదిగో, అల్ఫాయు ఓమెగయు, ఆదియు అంతమునైయుండి, లోక పాపముల కొరకు సిలువ వేయబడిన ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—
2 నా సేవకుడవైన న్యూయెల్ నైట్, నేను నియమించిన స్థానములో నీవు స్థిరముగా నిలిచియుండవలెనని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
3 నీ సహోదరులు వారి శత్రువులనుండి తప్పించుకొనవలెనని కోరుచున్న యెడల, వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి, యథార్థముగా నా యెదుట తగ్గించుకొని, నలిగినవారిగా ఉండవలెను.
4 నాతో చేసుకొనిన నిబంధనను వారు అతిక్రమించిరి గనుక, అది నిరర్థకమయ్యెను మరియు ఎటువంటి ప్రభావమును కలిగియుండదు.
5 ఈ అభ్యంతరము ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ, ఏలయనగా అతడు సముద్రపు అగాధములలో మునిగిపోయిన అది వానికి మేలు.
6 కానీ నిబంధనలను పాటించి, ఆజ్ఞలను గైకొను వారు ధన్యులు, ఏలయనగా వారు కృపను పొందుదురు.
7 కాబట్టి మీరు పారిపోవుడి, లేనియెడల మీ శత్రువులు మీ మీదకు వచ్చెదరు; మీరు ప్రయాణము చేయుడి మరియు మీ నాయకునిగా, మీకు ధనము చెల్లించువానిగా ఉండుటకు మీ ఇష్టప్రకారము ఎవరినైనా నియమించుడి.
8 ఆలాగున పశ్చిమ ప్రాంతములలోని మిస్సోరి ప్రదేశమునకు, లేమనీయుల సరిహద్దులకు మీరు ప్రయాణము చేయవలెను.
9 మీరు ప్రయాణము చేయుట ముగించిన తరువాత, నేను మీకు స్థలమును సిద్ధపరచువరకు ఇతర మనుష్యుల వలే మిమ్ములను మీరు పోషించుకొనుడి.
10 మరలా, నేను వచ్చువరకు మీ శ్రమలలో సహనము కలిగియుండుడి; ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేనిచ్చు బహుమానము నా యొద్దనే ఉన్నది మరియు నన్ను మొదట వెదకువారు తమ ప్రాణములకు విశ్రాంతిని కనుగొందురు. అలాగే జరుగును గాక. ఆమేన్.