లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 118


118వ ప్రకరణము

“పన్నెండుమందిని గూర్చి మీ చిత్తమును మాకు చూపుము ఓ ప్రభువా” అన్న విన్నపమునకు సమాధానముగా 1838, జులై 8న ఫార్‌వెస్ట్, మిస్సోరిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు.

1–3, పన్నెండుమంది కుటుంబములకు ప్రభువు సమకూర్చును; 4–6, పన్నెండుమందిలో ఖాళీలు పూరించబడినవి.

1 నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: వెంటనే ఒక సమావేశము ఏర్పాటు చేయబడవలెను; పన్నెండుమంది ఏర్పరచబడవలెను; పడిపోయిన వారి స్థానములను భర్తీచేయుటకు మనుష్యులు నియమించబడవలెను.

2 నా వాక్యమును ప్రచురించుటకు నా సేవకుడైన థామస్ కొంతకాలము సీయోను ప్రదేశములోనే ఉండవలెను.

3 మిగిలినవారు ఆ గడియనుండి ప్రకటించుటను కొనసాగించవలెను, వారు దీనిని తగ్గింపు హృదయముతో, సాత్వికముతో, దీనమనస్సుతో, దీర్ఘశాంతముతో చేసిన యెడల, ప్రభువైన నేను వారి కుటుంబములకు సమకూర్చెదనని నేను వారికి ఒక వాగ్దానము చేయుచున్నాను; ఇకనుండి వారికి కార్యానుకూలమైన ఒక ద్వారము తెరువబడును.

4 మరుసటి వసంతకాలములో వారు గొప్పజలములపైన ప్రయాణము చేయుటకు బయలుదేరవలెను, అక్కడ నా సువార్తను సంపూర్ణముగా చాటించవలెను, నా నామమునకు సాక్ష్యమియ్యవలెను.

5 మరుసటి ఏప్రిల్ ఇరువది ఆరవ దినమున ఫార్‌వెస్ట్ పట్టణములోని నా మందిర నిర్మాణ స్థలమునందున్న నా పరిశుద్ధుల దగ్గరనుండి వారు బయలుదేరవలెను.

6 నా సేవకుడైన జాన్ టేలర్, నా సేవకుడైన జాన్ ఇ. పేజ్, నా సేవకుడైన విల్ఫర్డ్ ఉడ్రఫ్, నా సేవకుడైన విల్లార్డ్ రిఛర్డ్స్ భ్రష్టులైనవారి స్థానములను భర్తీచేయుటకు నియమించబడవలెను, వారి నియామకము అధికారపూర్వకముగా తెలియజేయబడవలెను.